ఎవరూ ఎవర్నీ ప్రేమించరు, తమని తాము ప్రేమించుకుంటారు. తమ అవసరాలను తీర్చే, తమకు ఆనందాన్నిచ్చే వాటిని ప్రేమిస్తారు. అవి వస్తువులు కావొచ్చు, మనుషులు కావొచ్చు, ఆలోచనలు కూడా కావొచ్చు. వాటిని మాత్రమే ప్రేమిస్తారు. కాని ఇవాళ ఆమాట సత్యంగా కనిపించడంలేదు.
గత మూడు నాలుగు నెలలుగా ప్రపంచం మొత్తం కోవిడ్-19 వల్ల విపత్కరస్థితిని ఎదుర్కొంటోంది. మానవ జీవితం అన్ని విధాలుగా అన్ని రంగాలలో అల్లకల్లోల మవుతోంది. మనిషి తనను తాను నిజంగా ప్రేమించుకో గలిగితే తమ ఉనికికి, అవసరాలకీ, ఆనందాలకీ కారణమైన వాటిని ప్రేమించాలి. మనిషి అవసరాలను తీర్చే ప్రతిదీ ఈ ప్రకృతి నుంచే తీసుకుంటున్నాం. ప్రకృతిని ప్రేమించగలిగితే, దానిని కాపాడుకోగలితే, ఋతువుల వారీగా ప్రకృతిలో సంభవించే సమతుల్యతను కాపాడుకోగలిగితే యిటువంటి విపత్కరస్థితులకి చోటుండదు. ఈ భూమి ఒక్క మనిషిదే కాదు సకల జీవరాశులన్నిటిదీ అన్న జ్ఞానాన్ని కోల్పోయాం. ఆనందానికీ సుఖానికీ తేడా తెలియని మనం మన భౌతిక సుఖాల కోసం, ఆడంబరమైన, విలాసవంతమైన జీవితంకోసం, దానికవసరమమైన లాభాల కోసం ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాం. మన కార్యకలాపాలతో కార్బన్ ఉత్పాదనను పెంచి వాతావరణంలో పెను మార్పులకు కారణమవుతున్నాం. పర్యావరణమనే పదాన్నే మరిచి పోయాం. ఈ విపరీత ధోరణులే ఈవిపత్తుకి కారణం. ఈ స్థితి నుంచి ఎప్పుడు, ఎలా బయట పడతామో తెలియదు. నిపుణుల అంచనా ప్రకారం ఈ స్థితి రెండు మూడు సంవత్సరాలు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. టీకా కోసం పలుదేశాలు పలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అది వచ్చే వరకు మనం చేయవలసింది మనల్ని మనం రక్షించుకోవడమే. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర వైద్య, ఆరోగ్య సంస్థలు అనేక చర్యలు చేపట్టాయి. సూచనలూ చేస్తున్నాయి. వీటిని మనం గమనంలోకి తీసుకుని మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. భౌతిక దూరాన్ని పాటించడం, అనవసరంగా బయటకు రాకపోవడం, ఆహార జాగ్రత్తలు పాటించి తీరాలి.
లాక్‍డౌన్ వల్ల మనకు ఒక అనివార్యమైన క్రమశిక్షణ, జీవన విధానం ఏర్పడ్డాయి. అనవసరమైన కార్యకలాపాలకి సంకెళ్లు పడ్డాయి. ఇవి కాలుష్య రహిత వాతావరణానికీ, సామాజిక సంబంధాల్లో మంచి మార్పుకీ దోహదపడ్డాయి. వలస కార్మికులను, జీవనభృతి కోల్పోయిన పేదవారిని ఆదుకోవడంలో సహజమైన మానవీయ స్వభావం నిరూపితమైంది.
లాక్‍డౌన్ సడలింపులతోనూ, ఎత్తివేతతోనూ, కరోనా నిర్మూలనతోనూ సంబంధం లేకుండా ఈ జీవన విధానాన్ని కొనసాగించాలి. మనల్ని మనం ప్రేమించుకోగలిగినప్పుడు యివన్నీ చేయగలుగుతాం.
ఈ సుదీర్ఘ కాలపు విపత్తు వల్ల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో పెను మార్పులు వస్తాయి. పారిశ్రామిక, వ్యవసాయ, ఉద్యోగ, ఉపాధి, విద్యారంగాల్లో వచ్చే మార్పులు భావితరాలపై విపరీత ప్రభావాల్ని చూపుతాయి. ఇవి విధానరంగ సమస్యలు. మన సామాజిక వాస్తవిక స్థితి ఆధారంగా సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరగాలి. నిర్ణయాలు జరగాలి. దీనికవసరమైన కొత్తకొత్త ఆలోచనలూ, ప్రత్యమ్నాయాలను అన్వేషించగల మేధోసంపదకి కొదవలేదు. అయితే వీటికి మానవీయ స్పర్శ ఉండాలి. నిర్జీవమైన కాలం గడపకుండా అడ్డుంకులు లేని సంతోషం పొందాలి.
ఇప్పటికైనా…
మనల్ని మనం ప్రేమించుకుందాం!
మనల్ని మనం బ్రతికించుకుందాం!!
(మణికొండ వేదకుమార్)
ఎడిటర్