వరహాల భీమయ్య

పుణ్యదంపుతులు శ్రీ వరహాల రాజన్న, శ్రీమతి అంబక్కగార్ల ఏకైక పుత్రుడు వరహాల భీమయ్యగారు. 1911, అక్టోబర్‍లో ఆయన జన్మించారు. మంథనిలో 7వ తరగతి వరకు విద్యాభ్యాసము చేసి, 8వ తరగతి కరీంనగర్‍లో, 9,10 తరగతులు హన్మకొండలో పూర్తి చేసారు. హైద్రాబాదులోని సిటీ కళాశాల నుండి ఇంటర్‍ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
ఉస్మానియా యూనివర్శిటీ నుండి బి.ఎస్సీ తర్వాత రసాయనశాస్త్రంలో ఎం.ఎస్సీ, పట్టా సంపాదించారు. ఉస్మానియా యూనివర్శిటీ నుండి ఫస్టుర్యాంకు సంపాదించి గోల్డ్మెడల్‍ స్వంతం చేసుకొన్నారు. వీరు కరీంనగర్‍ హైస్కూల్లో టీచరుగా కొద్దిరోజులు ఉద్యోగం చేసి ఆ తర్వాత హన్మకొండలోని హైస్కూలుకు బదిలీ అయినారు.
తెలంగాణలని ఒక మారుమూల అగ్రహారంలో, సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన బాల్యం, విద్యాభ్యాసం అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది.
1949-50 ప్రాంతంలో హైద్రాబాదు లోని సుల్తాన్‍ బజార్‍ విఠల్‍ మారుతిగల్లీలో నివాసముండే గట్టు పురుషోత్తం గారింటికి సాయంత్రం వేళల్లో మంథని విద్యార్థులు,
ఉద్యోగులు చేరుకునేవారు, అక్కడ ఆనాటి వివిధ రాజకీయ, విద్యారంగ విషయాల గురించి ఆసక్తికర చర్చలు జరిగేవి. ముఖ్యంగా శ్రీ భీమయ్యగారు ఆ సందర్భంలో చెప్పే విశేషాలతో చాలామంది ప్రభావిమయ్యేవారు. గ్రామాల నుండి విద్యార్థనకు వచ్చే విద్యార్థులకు ఉచితవసతి కల్పించాలని గౌలిగూడ అక్బర్‍బాగ్‍లోని శంకర్‍సేఠ్‍ హోటలు వద్ద నరసిన బుచ్చయ్య అనే షావుకారు ఒక ధర్మశాలను ఉచితంగా యిచ్చారు. ఇప్పటికి దాన్ని మంథని గ్రామస్థులు ఉపయోగించుకుంటున్నారు.
పోలీస్‍ యాక్షన్‍ తర్వాత నిజాం నవాబు భారతసేనలకు లొంగిపోయి, అప్పటి కేంద్ర ప్రభుత్వంలని పెద్దలతో ముఖ్యంగా   ఉక్కుమనిషి సర్దారు వల్లభ్‍భాయి పటేల్‍ గారితో ఒప్పందం చేసుకొని తన అధికారాలను మిలటరీ అధికారి జె.ఎస్‍. చౌదరికి అప్పజెప్పిన రోజులవి.


ఆ మిలటరీ ప్రభుత్వంలో అప్పటి హైద్రాబాదు రాష్ట్రంలో కర్ణాటక, మరాఠ్వాడా మరియు తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంతమంది కాంగ్రెస్‍ నాయకులను గవర్నింగ్‍ కౌన్సిల్‍లోకి తీసుకోవటం జరిగింది. అలా అధికారం చేపట్టిన వ్యక్తుల్లో శ్రీ థోండేరాజ్‍ బహదూర్‍గారు, శ్రీ డి.జి.బిందు, శ్రీరామాచారి, శ్రీ వి.బి.రాజు వంటి ప్రముఖులుండిరి. శ్రీ ధోండేరాజ్‍ మహారాజ్‍గారు తన పి.ఏ.గా శ్రీ వరహాల భీమయ్యగారిని నియమించుకున్నారు. కొద్ది రోజులకే ఈ మిలటరీ ప్రభుత్వంపైన అనేక ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో అప్పటి భారత ప్రధాని శ్రీ జవహర్‍లాల్‍ నెహ్రూ గారు సివిల్‍ ప్రభుత్వం ఏర్పాటు చేసి సి.యం. వెల్లోడిగారికి అధికారాలప్పజెప్పారు. శ్రీ ధోండేరాజ్‍ బహదూర్‍, శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు వంటి ప్రముఖులు అధికారపగ్గాలు చేపట్టారు.
విద్యాశాఖ నిర్వహించిన శ్రీ ధోండేరాజ్‍ నమ్మకస్తుడు నీతిమంతుడైన వరహాల భీమయ్యగారిని పి.ఏ.గా నియమించు కున్నారు. ఆ తర్వాత శ్రీ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడే ఏర్పడిన కాంగ్రెస్‍ ప్రజా ప్రభుత్వంలో నిజాయితీ, ముక్కుసూటిగా వ్యవహరించే తత్త్వం వంటి సద్గుణాలు నచ్చినందున ముఖ్యమంత్రిగారికి మంచి సలహాదారుగా భీమయ్యగారిని నియ మించారు. మంచి పనిచేసి, ప్రశంసలం దుకున్నారు.
1950-51లో అప్పటి ప్రభుత్వం విద్యా సంస్కరణలకు నాంది పలికింది. పాఠశాలల్లో ఉర్దూమీడియంలో విద్యాబోధన జరిగే రోజులవి. తెలుగులో విద్యాబోధన జరగాలనే చారిత్రక నిర్ణయం తీసుకోబడినది. దీనికి శ్రీ వరహాల భీమయ్యగారి అంకుఠిత కృషి, దూరదృష్టి ఎన్నటికీ మరువరానిది.
మంధనిలో మొట్టమొదటి మిడిల్‍ స్కూలును హైస్కూలుగా అఫ్‍గ్రేడ్‍ చేయించిన ఘనత శ్రీ భీమయ్యగారిదే. హైస్కూల్‍ హెడ్‍మాస్టరుగా శ్రీ వేంకటాచారి తర్వాత శ్రీ గోవిందాచారి హెచ్‍. ఎమ్‍గా ఉండిరి.
1954లో శ్రీ లోకే కిషన్‍రావుగారు మంథని హైస్కూల్లో గణితం బోధించేవారు. ఆయన హైద్రాబాదుకు బదిలీ అయినారు. అప్పుడు, గణితం బోధించటానికి శ్రీ డి. రాజన్నగారిని, ఇంగ్లీషు బోధించటానికి శ్రీ రంగయ్య నాయుడుగారిని శ్రీ భీమయ్యగారు బదిలీ చేయించినారు.
శ్రీ రంగయ్యనాయుడు హెచ్‍.ఎం.గా ఉన్న సమయంలో ఓల్డ్ బాయిస్‍ మీటింగ్‍ వారు 3 రోజులు ఒక పెద్ద ఉత్సవం జరుపు కున్నారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసి అందరిని ప్రోత్సహించి, ఆశీస్సులందించారు.
శ్రీ భీమయ్యగారు హై క్వాలిఫయిడ్‍ మరియు జీనియస్‍. యువకులెందరో ఆయన రోల్‍మోడల్‍గా నిలిచారు. ఎందరో ఆయనను ఆరాధ్య భావంతో గౌరవించేవారు. వారి మాటలనెంతో శ్రద్ధగా విని ఉన్నత స్థానాలకు చేరుకోగలిగారు.
ఆ రోజుల్లో కరీంనగర్‍ జిల్లా మొత్తంలో రెండే పాఠశాలలుండేవి. ఒకటి కరీంనగర్‍లో, మరొకటి మంథని. ఎక్కడెక్కడో సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసేవారిని, కుటుంబాలకు దగ్గరగా రప్పించారు. పాఠశాల అభివృద్ధికి వారు తోడ్పడేలా చేసారు. మిలట్రీ గవర్నమెంట్‍లో మెంబర్‍ ఆఫ్‍ ఎడ్యుకేషన్‍గా ఉన్నప్పుడు నూతన విధానలనెన్నిటినో ప్రవేశపెట్టారు. రీజనల్‍ లాంగ్వేజ్‍ ప్రాంతీయ భాష ఉర్దూ నుండి తెలుగుకు మార్పించారు.
ఆడపిల్లలకు చదువులు చెప్పించటం శుద్ధ దండగ అని భావించే ఆ రోజుల్లో, వీరు ప్రభుత్వ బాలుర హైస్కూలు శ్రీ వేంకటరాజన్న అవధాని కూతురు ప్రేమలతాదేవి శ్రీలోకేలక్ష్మణ శర్మ కూతురు క్రాంతికుమారి ఉన్నతపాఠశాలలో ధరఖాస్తు పెట్టుకుంటే ఆడపిల్లలకు అడ్మిషన్స్ ఇవ్వటానికి రూల్సు ఒప్పుకోవన్నారు. రాజన్న అవధాని హైద్రాబాద్‍ వచ్చి శ్రీ భీమయ్యగారిని కలిసి విషయం వివరించారు. వెంటనే ఒక ప్రభుత్వ ఉత్తర్వు జి.ఓ. ద్వారా బాలుర హైస్కూల్లో బాలికలకు విద్యాభ్యాసానికి అనుమతి ప్రసాదిం చారు. ఆ తర్వాత ఎంతో మంది ఆడపిల్లలు చదువుకొని ఉన్నతస్థానాల్లో రాణించారు. భీమయ్యగారు స్వయంగా తన కూతుర్లు రాధ, కమలలని మాడపాటి హన్మంతరావు స్కూల్లో ఆ రోజుల్లో చదివించారు.
శిఖాం (పర్దా బండ్లలో) ఆడపిల్లలు వచ్చి చదువు కునేవారట. భీమయ్యగారా పద్ధతిని మార్పించి, స్వేచ్ఛగా స్త్రీలు చదువుకునేటట్లు చేశారు. ఇలా శ్రీ భీమయ్యగారు స్త్రీ విద్యావ్యాప్తికి ఎనలేని కృషి చేసిన మహనీయులు. హైద్రాబాద్‍ స్టేట్‍ ప్రజలందరికి ప్రాతఃస్మరణీయుడు.


1938లో ఆయన సిటీ కాలేజీలో లెక్చరర్‍గా ఉన్నప్పుడు అనేకమంది విద్యార్థుల కాయన యింట్లో ఆశ్రయమిచ్చి అన్నంపెట్టి ఆదుకున్నారు. ఆ సమయంలో ఆయన మార్గదర్శకత్వంలో, ప్రోత్సాహంతో ఎదిగిన వారెందరో. భీమయ్యగారి మాతృమూర్తి అంబక్క అర్ధరాత్రి అతిథులు వచ్చినా వండి వార్చి ఆరుసుకునే మంచిగుణమున్న మనిషి. భీమయ్యగారికి జన్మనిచ్చిన తల్లి అన్న, జన్మభూమి మంతని అన్నా ఎనలేని గౌరవం.
ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుగారి పర్సనల్‍ సెక్రటరీగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రిని మంథని దర్శింప తీసుకొని వచ్చారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల షెడ్లను, చదువుకుంటున్న విద్యార్థుల స్థితిగతులను తెలియజేశారు. ఆయన ద్వారా ప్రాథమిక స్థాయి నుండి హైస్కూలు వరకు అభివృద్ధి చేసారు. బూర్గుల వారు వెంటనే లారీలలో వందలాది రేకులను పంపగా, తిరిగి షెడ్లను వేయించి స్కూలు నడిపించారు. ఇప్పటికి ఆ షెడ్లు చెక్కు చెదరకుండా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. వాటి నీడన చదువుకున్న వెయ్యిమంది విద్యార్థులీనాడు దేశ, విదేశాల్లో ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారంటే అది భీమయ్యగారి భిక్షే.
ఉద్యమకాలంలో రఘునాత్‍ కాబే, పనకంటి గణపతిరావు అవథానుల (హకీం) కిష్టయ్య వంటి స్వాతంత్య్ర సమరయోధులను ఔరంగాబాద్‍, నిజామాబాద్‍ జైళ్ళకు వెళ్ళి పరామర్శించి వచ్చిన ధైర్యశాలి. విద్యావంతులు, వివేక వంతులైన మంథని వారికెందరికో జీవనాధారం కల్పించిన కల్పతరువాయన. ఆనాడు హైస్కూలే లేకుంటే పొరుగు ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే స్థోమత ఎందరికుండేది? అక్కడ చదువుకున్నవారంతా ఇంజనీర్లు, డాక్టరై పిల్లపిల్లతరం వాడున్నారంటే దాని వెనుక త్యాగశీలి భీమయ్యగారి హస్తమే అనటం నిర్వివాదాంశము. కోఠిలోని వై.యం. ఐ.ఎస్‍.లో ప్రతి సాయంత్రం ఉండేవారని, విద్యావిషయాల్లో గ్రామీణ పరిస్థితులను మెరుగు పరచాలనే తపన ఆయన మాటల్లో ఉండేదని సమకాలి కులంటుంటారిప్పటికి. ఆయన నిస్వార్థ సేవను తలచుకొని కృతజ్ఞత లర్పిస్తున్నారంటే ఆయనెంత గొప్ప వ్యక్తో ఇప్పటి తరానికి తెలుస్తున్నది. హైదరా బాదుకు పరీక్ష రాయటానికి వచ్చే బంధుమిత్రులెందరో వారింట్లో నెలలుండే వారట.
1934లో ఉస్మానియా యూనివర్శిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్‍ నుండి బంగారు పతకాన్ని పొందారు. అనేక కార్యక్రమాలు అతి చిన్న వయసులో ముగించి, 6.1.1956లో అకస్మాత్తుగా మరణించారు. అప్పటికే 6 గురు పిల్లలు, భార్య 6 నెలల గర్భవతి. ఆయన జ్ఞాపకార్థం మంథనిలో వరహాల భీమయ్య టోర్నమెంట్సుని డిసెంబర్‍ నెలలో విద్యార్థులచే ఆడించి, జనవరి 26కు బహుమతులందిస్తున్నారు. ఇంతకుముందీ ఆటలు తాలూకా లెవల్‍ నుండి జిల్లా స్థాయివరకుండేవి. వరహాల భీమయ్య మెమోరియల్‍ గోల్డ్ మెడల్‍ వారి కుటుంబ సభ్యులిప్పటికి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్‍కి స్తున్నారు. 1973లో ఆ పతకం అందుకున్న వారిలో వైస్‍ ఛాన్సలర్‍ శ్రీ జె. అనంతస్వామి ఉన్నారు. ఇన్ని ప్రశంసలందుకొని, ఎంతో మందికి నిస్వార్థంగా సహాయపడిన మహామనీషి శ్రీ వరహాల భీమయ్యగారు.
(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)


-డా।। రంగి కమల

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *