‘చావు’ ఆకలితోనో లేక కరోనాతోనో…

తేల్చుకునేందుకు పయనమైన మన పట్టణ అతిథి శ్రామికులు

రోజుకు ఒకటే పూట తింటున్నాం.. హోటల్లో పని చేసేది.. హోటల్‍ బంద్‍ పెట్టినారు… అని ఒక మహిళ చెబితే.. నేను గర్భిణీని.. నేను కూడా ఒక పూటనే తిని నీళ్ళు తాగి పడుకుంటున్నాను, మా ఇంట్లో ఇద్దరు ముసలోల్లు ఉన్నారు వాళ్ళది కూడా ఇదే పరిస్థితి. మేము బతికి ఏం లాభం.. కరోనాతో చస్తే ఏంది ఆకలితో చస్తే ఏంది. ఈ బతుకు ఎందుకు బతుకుతున్నమో అర్ధం కావడం లేదు. ఇదీ ఆ గర్భవతి వేదన. ఇది లాక్‍ డౌన్‍ మొదటి సారి విధించినప్పుడు కొందరి వేదన. నిన్న అంటే ఏప్రిల్‍ 14వ తేదీన హైదరాబాద్‍ నుండి కాలి నడకన తమ స్వంత జిల్లా అయినా శ్రీకాకుళం వెళ్లిపోవడానికి బయలుదేరిన 500 మంది వలస కార్మికులతో ఫోన్లో మాట్లాడితే వాళ్లలో ఒకరు చెప్పిన మాటలు వింటే హృదయం ద్రవించుకు పోయింది. కాంతారావు అని ఒక వలసకార్మికునితో మాట్లాడి వాళ్లను ఆపడానికి ప్రయత్నం చేస్తే అయన అన్నమాటలు యధాతధంగా: అలాగే ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‍కు వేలాదిగా వలస కార్మికులు తమ గ్రామాలకు వెళ్లడానికి తరలి వచ్చి పోలీసులతో దెబ్బలు తిన్న కార్మికులు. వందల కిలోమీటర్లు నడిచి కాళ్ళు బొబ్బలు ఎక్కిన మరికొంత మంది కూలీలు. ఇలా ప్రతి రోజు వలస కార్మికులు తమ చిధ్రమైన జీవితాలను ప్రభుత్వ సమాజ దృష్టికి తెస్తూనే ఉన్నారు.


అక్కడ మా అమ్మ, అయ్యలు అందరూ భయపడుతూ బతుకుతున్నారు. మేము ఇప్పుడు కూలి చేసి ఇంటికి డబ్బులు పంపగలిగే పరిస్థితి లేదు. పోనీ మాకు ఇక్కడ ఉండడానికి అద్దె కట్టాలి, ఎక్కడనించి డబ్బులు తేవాలి. ప్రభుత్వం నుంచి మాకు కనీసం ఒక కిలో బియ్యం కూడా అందలేదు. మేము చచ్చామో బతికున్నామో చూసినవారు లేరు. అందుకే చావుకి కూడా తెగించి ఇంత ఎండల్లో కూడా పిల్లలని తీసుకుని బయలు దేరాము అన్నారు. ముంబాయి బాంద్రా స్టేషన్‍లో జరిగింది కూడా ఇలాంటిదే.


భారతదేశ విభజన సమయంలో (1947) జరిగిన వలసలు ప్రపంచంలో ఇంతవరకు చోటు చేసుకున్న వలసలలో అతిపెద్దవిగా చరిత్రకెక్కాయి ఇప్పటి వరకు. కానీ ఈ రోజు జరుగుతున్న వలసలు అప్పటి వలసలని మించిపోయాయని ఒక అంచనా. ఆనాటి వలసలలో అనేకమంది హింసకు బలైపోగా, నేడు కేవలం ఆకలికి, ఎండ వేడిమికి బలైపోయేలా ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి స్వంత గ్రామాలకు తరలిపోతున్న లక్షలాది కార్మికులను చూస్తుంటేనే అర్దమవుతొంది – లాక్‍ డౌన్‍ లక్ష్యం నెరవేరడం లేదని. కరోనా కట్టడికి ఇదే సరియైన వ్యూహం అని భావిస్తున్న పెద్దలు వీళ్ళ గురించి అసలు ఆలోచించకపోవడం ఘోరం. వ్యవసాయ రంగానికి కూలీల అవసరం ఎంత ఉందో, పారిశ్రామిక సేవా రంగాలకు ఈ వలస కార్మికుల అవసరం అంతే ఉంది. కేవలం వీళ్ళ కష్టం ఫలితం జిడిపిలో 50% అని గణాంకాలు ఘోషిస్తున్నా ప్రభుత్వాలు వీళ్ళకి చేస్తున్నదేమీ లేదని తేటతెల్లమైంది. అసలు లాక్‍ డౌన్‍ విధించే పక్రియలో జరిగిన చర్చలలో ఏ దశలో కూడా ఈ అసంఘటిత రంగాలలో ఉన్న కార్మికుల గురించి పట్టించుకోలేదని అర్ధమవుతూనే ఉంది.


ఒక లెక్క ప్రకారం దేశంలోని అసంఘటిత రంగాల్లో జీవనబృతి వెతుక్కుంటున్న కార్మికుల సంఖ్య 44 కోట్లు. వీరిలో దాదాపు మూడు కోట్లమంది పనికోసం నిరంతరం ఒక ప్రాంతం నుండి వివిధ ప్రాంతాలకు వలసలు పోతుంటారు. అదే విధంగా దాదాపు అయిదు కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులు, 15 కోట్ల మంది చిన్న చిన్న స్వంత పనులు చేసుకుంటున్న వాళ్ళు. కాగా, వీరికి అదనంగా కొన్ని దశాబ్దాలుగా కుదేలైపోయిన వ్యవసాయ రంగం కారణంగా ఈ రంగంపై ఆధారపడిన 24 కోట్ల మందిలో కనీసం 6 కోట్ల మంది జీవనం కోసం సంవత్సరంలో సుమారు 6 నుండి 8 నెలలు (వ్యవసాయం పనులు లేని కాలంలో) నగరాలకు వలస వచ్చి వివిధరకాల పనులు (అపార్టుమెంట్లలో వాచ్మెన్లుగా, ఇళ్లలో పని వారుగా, బేబీ సెంటర్లుగా) చేసుకుంటున్నారు. వీరందరిని కలుపుకుంటే మొత్తం 30 కోట్ల మంది ప్రజానీకం తమ వర్తమానాన్ని కోల్పోయారు. ప్రభుత్వ కఠిన ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా పల్లెకు పోయి కలోగంజో అక్కడే తాగుదామని, కరోనా చావైనా ఆకలి చావైనా అక్కడే చద్దామనే తెగింపుతో కదిలిన కార్మిక జనం వాళ్ళు. కానీ ఒక్కటి మాత్రం నిజం. బతుకు మీద ఆశ పల్లె మాత్రమే ఇవ్వగలదు, తమ చమట, రక్తాన్ని ధారపోసి పెంచిన ఈనగరాలు తాము ఇటివంటి దయనీయమైన పరిస్థితులలో ఉన్నపుడు గుక్కెడు నీళ్లు కూడా పొయ్యవు అని వారిలో నిశ్చితమైన అవగాహన కలిగింది.
లాక్‍ డౌన్‍ కాలం సరే తరువాత తమ బతుకులు ఎలా ఉంటాయి? అసలు పనులు ఉంటాయా? ఉన్నా అందరికీ ఉంటాయా? ఈ విధమైన ప్రశ్నలతో ఈ ఆలోచనా రహిత, ప్రణాళికా రహిత లాక్‍ డౌన్‍ను ఈ బడుగుజీవులు నిరసిస్తున్నారు. కరోనా కంటే ఎక్కువగా తిండి లేమి, మంచినీటి లేమి, గూడు లేమి వంటి తక్షణ సమస్యలు నడి వేసవిలో వీళ్ళని నిస్సహాయులని చేస్తుంటే గతిలేక వీళ్ళు తమ స్వంత ఊళ్ళకి పయనమైన సంగతిని ఈ మేధావులు పట్టించుకోక పోవడం విచారకరం.


లాక్‍ డౌన్‍ ప్రకటించిన సమయం చూడండి:

ప్రభుత్వం ప్రకటించిన విపత్తు సహాయం పొందాలంటే కావలసిన డాక్యుమెంట్లు లేని జనం, చిన్న చిన్న ఫాక్టరీలలో పని చేసే కార్మికుల యజమానులు నివాస స్థలాలను వెంటనే ఖాళీ చేయాలని హుకుం జారీ చేయడంతో తలదాచుకోవడానికి గూడు లేని జనం వీళ్ళు. కొందరు 100 కిలో మీటర్లు నడిచిపోవడానికి సిద్ధపడితే. మరి కొందరు 500 కిలోమీటర్లు నడవడానికి సిద్ధపడ్డారు. నగరమేదైతే నేమి, వలసకార్మికుల వ్యధార్ధ దృశ్యం మాత్రం అదే. అన్ని ప్రాంతాల నుండి అన్ని ప్రాంతాల ప్రజలు వీరిలో ఉన్నారు. వ్యవసాయ రంగంలో నెలకొని ఉన్న సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు పట్టణ బాట పట్టిన ఈ పేద వలస కూలీల జీవన చిత్రం చిధ్రమై పోయింది ఈనాడు.
సంఘటిత రంగ కార్మికులకు ఉన్న ఉద్యోగ భద్రత, పని భద్రత, మొదలైనవి లేని కోట్లాది మంది గుండెల్లో కరోనా గునపాలు పొడిచింది. ఈ కష్టాలను ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరని చూస్తే. సమాధానం అంత కష్టమేమీ కాదు. తరతరాల పాటు వెనుక బాటుతనం లోనే, పేదరికపు విషవలయం నుండి బయటపడడానికి అనునిత్యం పోరాటం చేస్తున్న దళిత గిరిజన బిడ్డలే. జీవించే హక్కు కల్పించి, తాము గౌరవంగా బతకడానికి రాజ్యాంగబద్ధమైన అనేక వెసులుబాటులు కలిగి కూడా వీళ్ళు ఇటువంటి పరిస్థితులలో చిక్కుకుపోవడం రాజ్యాంగపరమైన విషాదం.
1979 నాటి అంతరాష్ట్ర వలసకార్మికులు (నియంత్రణ & ఉపాధి షరతులు) చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ, మండలంలోనూ వీరి వివరాలు సంబంధిత అధికారుల వద్ద ఉండాలి. అసలు ఈ చట్టం గురించి చాలా మందికి తెలియదు. అంతేగాక, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం- 2008 ఎంతవరకూ అమలుకు నోచుకుందో అందరికీ తెలుసు. వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర ఉత్పాదక రంగాలలో దినసరి కూలీలుగా బ్రతుకుతున్న కోట్లాది అధోజగత్‍ సహోదరుల సంక్షేమాన్ని లక్షించి రూపు దిద్దుకున్న ఈ చట్టాలు సరిగా అమలై ఉంటే ఈ రోజు వీళ్ళకి ఇన్ని కష్టాలు వచ్చేవి కావు. ఇంత విపత్కర పరిస్థితులలో కోట్లమంది కార్మికుల జీవితాలు ఆందోళనకు గురి అవుతుంటే కేంద్ర రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిత్వ విభాగాలు ఎక్కడ కనిపించక పోవడం విచారకరం. వలస కార్మికుల హక్కులను కాపాడే కార్మిక శాఖలు పూర్తి బాధ్యత వహించాలి.
ఇప్పుడు దేశ వ్యాప్తంగా వలస కార్మికులు, దినసరి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవ సాయ కూలీలకు తమ జీవితాలు ఒక్క సారిగా ప్రమాదం అంచులలోకి జారిపోయాయన్న భావన కలిగి నందుకే ఈ తిరోగమన వలసలను లక్షలలో చూస్తున్నాం. నడుస్తున్న ఒక వలస కార్మికుని దారిలో కలిసి ఎందుకు వెనక్కి వెళిపోతున్నావు అని అడిగితే ఇక్కడ ఉంటే నా శవం కూడా మా వాళ్ళు చూసుకోలేరని, ఊర్లో ఉంటే కనీసం మా వాళ్ళు అయినా నా శవం చూస్తారని నిర్వేదంగా చెప్పాడు. అతడు 300 కిలోమీటర్లు దూరం నడిస్తే గానీ తన గ్రామం చేరుకోలేడు.
మోడీ గారు కర్ఫ్యూ అని ప్రకటించారు. స్వీయ నిర్బంధం వేరు, కర్ఫ్యూ వేరు. కర్ఫ్యూ అనగానే పోలీసు వ్యవస్థ యొక్క మానసిక స్థితిని అర్ధం చేసుకోవచ్చు. కొన్ని నిత్యావసర వస్తువుల దుకాణాలు తెరిచి ఉంటాయని ప్రకటించారు. ఆ నిబంధనలు పాటించిన కొద్ది మంది కార్మికులు అయా దుకాణాలలో పని చేయడానికి అవకాశం ఉండేది. కానీ కర్ఫ్యూ పదంతోనే పోలీసులకు ఎక్కడ లేని అధికారాలు ఇచ్చినట్లు అయ్యింది. దుకాణాలను తెరువనీయకుండ చేయడం, పనివాళ్లు బయట కనిపిస్తే గొడ్లను బాదినట్లు బాదడం, ఇవన్నీ టీవీలలో ప్రసారం కావడంతో షాప్‍ యజమానులు బెంబేలెత్తి షాపులు మూయడంతో చాలామంది కార్మికులు రోడ్డు మీద పడ్డారు.


ఇక్కడ ఒక విషయం గమనించాలి:
కరోనాని మించిన భయం ఇప్పుడు సర్వరంగాలలోనూ వ్యాపించి ఉంది. కరోనా తరువాత పరిస్థితి ఏమిటి. ఆర్ధిక వ్యవస్థ ఏ రకమైన మలుపులు తీసుకోబోతోంది? కొత్తగా పెట్టుబడులు ఎక్కడ నుంచి వస్తాయి? వినియోగదారుల మనస్తత్వం ఏరకంగా ప్రభావితం కాబోతొంది? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానాలు దొరకని ప్రశ్నలే గానీ, ప్రతీ రంగాన్నీ కుదిపేస్తున్న ప్రశ్నలు. వీళ్ళందరికీ ఇంకో సవాల్‍ ఎదురు కాబోతొంది. ఇప్పుడు ఊళ్ళకి వెళ్ళిపోయిన కార్మికులు తిరిగి వస్తారా? రాకుంటే ఏమి చేయాలి? జిడిపి లో 50% సాధించే ఈ కార్మికులు ఒక వేళ తిరిగి వెనక్కి రాకుంటే పరిస్థితి ఏమిటి. ఇది కేవలం పారిశ్రామిక రంగానికే పరిమితమయిన సవాల్‍ కాదు, వ్యవసాయ రంగాన్ని కూడా దెబ్బ తీసే విషయం.
మరో వైపు ప్రజల నుండి వివిధ రాజకీయ పక్షాల నుండి కేంద్ర ప్రభుత్వం కరోనా విపత్తు సందర్భంగా ఏదైనా రాయితీ ప్రకటించాలని ఒత్తిడి రావటంతో దేశ ఆర్ధిక మంత్రిగారు రూ. 1.70 లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటించారు. ఈ ప్రయోజనాలు అందుకోవాలంటే ఈ నిరక్షరాస్య అభాగ్యజీవుల వద్ద సరియైన పత్రాలు ఉండాలి. భవన నిర్మాణ కార్మికులయితే కార్మిక శాఖ వద్ద రిజిస్టర్‍ చేయించుకుని ఉండాలి, రైతు కైతే ఉన్న దాంట్లోనే సర్దుబాటు చేసి సహాయాన్ని ముందుగా చెల్లించడం, ఈపీఎఫ్‍… లను 100 లోపు కార్మికులు ఉండి 15 వేల జీతాలు 90 శాతం మందికి ఉంటే వర్తిస్తాయని, ఉచిత గ్యాస్‍ సిలిండర్‍, ఇంటి కిరాయిలపై మారటోరియం… ఇలా ఎన్ని ప్రకటించినప్పటికీ దాదాపు 30 కోట్ల మంది అరకొరగా ఏదైనా ఒక స్కీంకు అర్హుడైతే దానికి కావలసిన పత్రాలు సమర్పించాలి, అది మరో యుద్ధం. ఇన్ని కోట్ల మందికి పని దొరకక తమ బిడ్డలకు ఉన్న దాంట్లోనే కొంత పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్న వారి జీవితాలలో ఆకలి ఆర్త నాదాలు, ఆకలి మరణాలు వినే రోజులు ఎంతో దూరం.లేవు. పెద్ద పెద్ద నగరాలను నిర్మించి రాష్ట్రాలను అభివృద్ధి వైపు నడిపించిన ఈ పేద శ్రామికులు ఈపట్టణాలు మావి కావు అని తమ పల్లెపై, పల్లెప్రజలపై విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం తోనే వందల కిలోమీటర్లు నడిచి చేరుకు నేందుకు సిద్ధపడ్డారు. ఈ నడిచే క్రమంలో వాళ్ళలో మెదిలిన భావాలను గమనిస్తే కోపం, నిస్సహాయత, జాలి, ఆకలి, దాహం అన్నీ కనబడతాయి మనం చూడగలిగితే. ఈ బాధలన్నీ కలగలసి కరోనాని మించిన మరొక ప్రమాదం తీసుకు రావచ్చు.
విపత్తుల వలెనే కరోనలో కూడా శ్రామికులతో బాటు వెంటనే ప్రభావితం అయ్యేది వీళ్ళ పిల్లలు, బడులకు వెలుతున్న వారు మాని వేయడం. చిన్న చితకా పనులలో చేరి బాల కార్మికులుగా మారడం. పౌష్టిక ఆహారం అందక పోవడంతో ఎదుగుదల మీద ప్రభావం చూపడం ఆడ పిల్లలు పనులకు ఇంటి పనులకు చిన్న పిల్లల రక్షణ కోసం పని చేయడం బడులకు దూరంగా ఉంటారు కాబట్టి పిల్లలు లైంగిక హింసలకు గురి కావడం ఇలా వలస కార్మికుల మీదనే కాకుండా భవిష్యత్తు తరాల మీద కూడా ఎంతో ప్రభావం చూప బోతుంది.
దేశంలో ఉన్న కార్మిక వర్గంలో 93 శాతం అసంఘటిత రంగంలోనే ఉన్నారు. వీరికి పని భద్రత ఉండదు సీజన్‍ను బట్టి పనులు ఉంటాయి. యజమానితో సరియైన ఒప్పంద పత్రాలు ఉండవు. అసంఘటిత రంగ కార్మికులు అతి ఎక్కువ దోపిడికి గురి అవుతుంటారు. వీరి పట్ల కార్మిక సంఘాలు కూడా అంతా ఆసక్తి చూపరు.
ప్రభుత్వాలు వీర్కి ఉద్దేశించిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. పని లేని దినాలను పని దినాలుగ లెక్క కట్టి వారి వేతనాలు ఇవ్వాలి. కరోన వ్యాధి వల్ల కొంత మంది చనిపోతుండ వచ్చు కానీ ప్రభుత్వాల అనాలోచిత చర్య వల్ల ఆకలి మరణాలతో మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది దేశంలో ఆరోగ్య అత్యవర పరిస్థితి. మన ప్రభుత్వ యంత్రాంగ ప్రవర్తన అనాలోచిత నిర్ణయాలు ఆకలి దాడులకు దారి తీయకుండా చూసుకోవాలంటే వీళ్ళ పట్ల చిత్తశుద్ధితో ప్రభుత్వం పని చేయకపోతే వీళ్లకు ప్రభుత్వాలు పట్ల నమ్మకం పూర్తిగా సడలి పోతుంది. ఆ నమ్మక రాహిత్యం కరోనా అనంతర పరిస్థితులలో కుదేలైపోయిన ఆర్ధిక వ్యవస్థకు మరింత ప్రమాదకరం. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరచి బాధ్యతగా మెలగాలని ఒక పౌరునిగా నా విన్నపం.


-ఆర్‍.వెంకట్‍ రెడ్డి
సామాజిక కార్యకర్త

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *