టీఎస్‍పిఎస్‍సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణితో కోవిడ్-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితికి కారణం ఏమనిపిస్తుంది?
ఇది ప్రకృతిలో సహజంగా సంభవిస్తున్నటువంటి పరిణామం. మనం ప్రకృతిని ఏ రకంగా బ్యాలెన్స్లో ఉంచుతున్నామన్న దాన్ని బట్టి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది తెలుస్తుంది. దీన్ని న్యూ కోవిడ్, న్యూ కరోనా వైరస్ అంటున్నారు. సృష్టిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే భూగోళాన్ని లేదా సమస్త విశ్వాన్ని, సమస్త సృష్టిని చూసినట్లైతే అందరూ అన్ని జీవరాశులతో పాటుగా మనం కూడా సహజీవనం చేసేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ అన్ని జీవరాశులను అంతం చేసి మనం మాత్రమే బతకాలనే స్థితికి మనిషి చేరుకున్నాడు. దీన్నే మనిషిలో ఉండేటువంటి స్వార్థం, దురాశ లేదా విస్తారణ ఆకాంక్ష అంటారు. ఇది మనిషిని సృష్టికి దూరంగా చేసింది. అలా చేయడం వల్ల మనిషి చాలా సమస్యలని కొని తెచ్చుకున్నాడు. మనిషి సృష్టిలో ఎలా పుట్టాడో వైరస్ కూడా అలానే పుడుతుంది. మనిషికి ఎంత హక్కు ఉందో వైరస్‍కూ అంతే హక్కు ఉంది. ఈ వైరస్ నుంచి నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలి. దాంతో ఎలా సహజీవనం చేయాలి అనేది ఒక ఛాలెంజ్.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాల అభివృద్ధే కారణామా?
అభివృద్ధిలో ఉన్నటువంటి అసమతుల్యత కారణం. చాలా కాలంగా సుస్థిర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. సుస్థిర పద్ధతుల్లో అభివృద్ధి అంటే నేడు ఉన్న వనరుల్ని వాడుకుంటూ భవిష్యత్ తరాలకు కూడా వాటిని కాపాడడం. ఈ మధ్య ప్రపంచ పర్యావరణానికి సంబంధించిన చాలా పెద్ద చర్చ జరిగింది. ఈ చర్చలో పన్నెండేళ్ళ అమ్మాయి ప్రపంచ అధినేతలందర్ని ప్రశ్నించింది. ఈ ప్రపంచంలో మాకు ఏం మిగిలిస్తున్నారు? ఇది చాలా ప్రధానమైన ప్రశ్న. సృష్టి పుట్టినప్పుడు ఎవరికీ అధికారం లేదు. 80 శాతం నీళ్ళతో ఉన్నటువంటి సృష్టిలో జీవాలదే రాజ్యం. ఈ సృష్టిలో ఉన్న ప్రకృతి సంపద అంతా సమస్త జీవరాసులది. అదే పద్ధతిలో బతకాలి, సహజీవనం, సహచర్యం చేయాలి. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఫలాలను అందరూ పంచుకోవాలి. ఎవరికి దక్కాల్సింది వారికి దక్కకుండా చేయడం వల్ల నేడు ఇటువంటి పరిస్థితి దాపురించింది.
మనిషిని మనిషి ప్రేమించడం అనేది కరోనా నేర్పించింది అని అంటారా?
మనిషి తనను తాను ప్రేమించుకోలేని స్థితికి కరోనా తీసుకెళ్ళింది. మనిషి ఇతరులను ప్రేమించాలనుకోవట్లే. దూరమవాలనే అనుకుంటున్నాడు. అది భౌతికంగానైనా, సామాజికంగానైనా. జింబో అనే కవి తన శరీరాన్ని తాను తాకలేని స్థితి గురించి రాశాడు. మనిషి తన ముఖాన్ని తాకలేని పరిస్థితి. తన పెదవులని, నాలుకను, ముక్కును తాను తాకలేడు. తన కళ్ళను తను తుడుచుకోలేడు. అంటే మనిషికి మనిషి ఒక అస్పృశ్యుడు అయిపోయాడు. ఇది చాలా పెద్ద విషాదం. ఈ కరోనా తీసుకొచ్చిన మహా విషాదాలలో మనిషి తన నుంచి తాను దూరం కావడం మొదట భౌతికంగా జరిగింది. రెండోది సామాజికంగా దూరమయ్యారు. నీ కుటుంబంతో నీవు ఉండలేవు. నీ పిల్లలతో ఆడుకోలేవు. ముసలి తల్లిదండ్రులను ప్రేమించి వాళ్ళ దగ్గర ఉండలేవు.
ప్రభుత్వాలు వైద్య రంగంలోను, శాస్త్ర సాంకేతిక రంగంలోను అనుసరించవలసిన ప్రణాళికలు ఏమిటి?
కరోనాను, ఏ సంక్షోభమైనా సరే మనిషి జీవితంలో ఒక కొత్త అవకాశంగా భావించ వచ్చును. కొత్త అవకాశాలు చాలా సందర్భాలలో ఇప్పుడు మొత్తం ఎంటైర్ హ్యూమన్ డెవలఫ్‍మెంట్ తీసుకుంటే సంక్షోభం లేకపోతే ఆవిష్కరణలు అనేవి ఉండవు. మీకు సమస్య రాకపోతే ఆలోచన రాదు. మొత్తం విజ్ఞాన శాస్త్రం, వైద్య శాస్త్రం మొత్తం అభివృద్ధి చెందింది కూడా నీ అవసరాలను బట్టే. దీనినే నీడ్ ఈజ్ ఏ మదర్ ఆఫ్ ఇన్వెన్సన్ అంటారు. నీవు ఒకటి కనిపెట్టాలంటే దాని అవసరం ప్రజలకు ఉండాలి. అవసరం లేనిది కనిపెట్టవు. కరోనా కూడా వైద్యశాస్త్రానికి లేదా సాంకేతిక రంగాలకి, సామాజిక శాస్త్రాలకు గానీ ఒక కనువిప్పు అనుకోవాలి.
వ్యవసాయ రంగం ఎలా ఉంటుంది?
భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది. వ్యవసాయ రంగంలో మనం వరి ధాన్యానికి ఇవ్వాల్సిన విలువలు ఇవ్వకుండా వెస్ట్రన్ కల్చర్ ఆహారం మీద ఎందుకు ఆసక్తి పెంచుతున్నారు? ఇమ్యూనిటీ పవర్ లేదని చెబుతున్నారు? దానిపైన ఎక్కువ ప్రాముఖ్యత ఎందుకు చూపిస్తున్నారు? మన రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవసాయ రంగం కోసమే పనిచేస్తున్నట్లు ఉంది. రైతు రుణమాఫీ, పెట్టుబడి రుణ సహాయం, కరెంట్, సాగునీరు అందించడం లాంటి అనేక పథకాలు. ఎక్కడి పంటను అక్కడే మార్కెట్ చేయడం. శ్రీరామ్‍సాగర్ వచ్చిన తరువాత కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న పంట అదృశ్యం అయింది. ధాన్యగారంగా ఉండే ఆ రెండు జిల్లాలు నేడు వరి పంటకు క్యాపిటల్స్గా మారిపోయినాయి. కూరగాయాలు రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి లేక నల్లగొండ నుంచి కొంతవరకు వచ్చేవి. ప్రస్తుతమున్న వ్యవస్థతో కోవిడ్ సమయంలో కొన్ని లక్షల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని నేరుగా పొలం దగ్గరకు పోయి కొంటున్నారు. ప్రభుత్వం అన్ని రకాల ధాన్యాలని, వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసింది రైతు నుండి. కావున తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల స్టేట్ యూనిట్ కావాలి. తెలంగాణలో ఉన్న పంటల్ని తెలంగాణలోనే అమ్ముకోలేం. ఇక్కడ పండే వరిని నేడు కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతి బాగుంది అదే పద్ధతిలో కొనసాగడంలో నష్టం లేదు.
గోడౌన్లు, కోల్డ్ స్టోర్స్ ఏర్పాటు చేసి ధాన్యాలు, కూరగాయాలు సేకరించి అక్కడి నుంచి వేరే వేరే గ్రామాలకు సప్లై జరుగుతుంటాయి. ఎక్కడ తక్కువైతే అక్కడ దళారీ వ్యవస్థ ఏర్పాటు అవుతుంది. దాన్ని ప్రభుత్వం నిర్మూలించవచ్చు కదా?
మీరు ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఉన్న వ్యవస్థ కంటే మెరుగు పడిందని ఒప్పుకుంటారు. అప్పటి గౌడోన్లు ప్రైవేట్ ఆధీనంలో ఉండేవి. మీరు ఉత్పత్తి చేసిన వాటిని తొందరగా మార్కెట్‍లోకి తీసుకెళ్ళాలి. లేకపోతే ఊరంతా గౌడోన్లు ఏర్పాటు చేయాల్సి వస్తది. తెలంగాణలో అంత ధాన్య ఉత్పత్తి ఉంది. వీటన్నిటిని ప్రభుత్వం నిర్వహించడం సాధ్యం కాదు. ప్రభుత్వమే మొత్తం ధాన్యం సేకరించి ప్రభుత్వమే రైస్ మిల్లులు పెట్టాలి అంటారు. రైస్ మిల్లర్ పెట్టి మనమే తౌడు, బియ్యం అమ్ముకొనే పరిస్థితి ప్రభు త్వాల చేతుల్లో లేదు. ప్రైవేటు రైస్ మిల్లర్ ఉంటాడు, అప్పుడు దళారీ కూడా ఉంటాడు. ఆ రైస్ మిల్లర్ మీకు కనీస మద్ధతు ధర కంటే పది రూపాయలు ఎక్కువ ఇస్తా అంటాడు. ఎందుకంటే వాడి మార్కెట్ వాడికి ఉంటది. వ్యవసాయ ఉత్పత్తులు మొత్తం ప్రభుత్వమే చేపట్టాలంటే ఇంకో ప్రభుత్వ మార్కెటింగ్ కావాల్సి వస్తది. కానీ ఎక్కడెక్కడ దళారుల ప్రమేయం, కల్తీల ప్రమేయం, బ్లాక్ మార్కెట్ ప్రమేయం ఉందో అక్కడ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.
వలస కార్మికుల పరిష్కారానికి ఏం చేయాలి? ప్రభుత్వాలు ఎలాంటి ప్రణాళికలు రూపొదించాలి?
చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఇన్ని రోజులు వలస కార్మికుల బాధ గుర్తుకు రాలేదు. అంటే వలస కార్మికుల తరగతి ఉన్నదని అనుకోలేదు మనం. లాక్‍డౌన్ ప్రకటించిన మరుక్షణమే కొన్ని లక్షల మంది ఈ దేశపు రోడ్లను బ్లాక్ చేశారు. అప్పటి వరకు ఇంతమంది ఉన్నారని ప్రభుత్వానికి కూడా తెల్వదు. నిజానికి ఒక తీవ్రమైన, దురదృష్టకరమైన సమస్య. చైనాలో ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో లెక్క ఉంటది. వారు ఏ ఊర్లో ఉన్నారు, ఎవరి దగ్గర పని చేస్తున్నాడు, అతని కాంట్రాక్ట్ నెంబర్ ఏది ఇలా ఉంటది. ఉదాహరణకు కార్మికులను తీసుకొచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళు ఏ జిల్లాల నుంచి ఎంతమందిని తీసుకొచ్చినారో ప్రభుత్వం లోకల్ అడ్మినిస్ట్రేటివ్‍కు సబ్‍మిట్ చేయాలి. లోకల్ అడ్మినిస్ట్రేటివ్ పోయి వాళ్ళకు ఒక ఇల్లు కట్టించలేదు. ఒక రియల్ ఎస్టేట్ సంస్థ హైదరాబాద్‍లో ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మూడు సంవత్సరాలు పడుతుంది. ఈ మూడు సంవత్సరాలలో ఆ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లో పనిచేసే అక్కడ తాత్కాలిక నివాసాలు ఉన్నాయా లేవా వాళ్ళకు ఎంతమంది పిల్లలున్నారు. వాళ్ళకి స్కూల్స్ ఉన్నాయా, నీటి సౌకర్యం, కరెంటు, రేషన్, సరుకుల పంపిణీ ఉందా లేదా అని చూడాలి. ఇవన్నీ లోకల్ అథారిటీ దగ్గర రిజిస్ట్రర్ చేసుకోవాలి. ఈ పద్ధతి చైనాలో ఉంది. వలస కార్మికులను సోషల్ సెక్యూరిటీ పరిధిలోనికి తీసుకురావడం, వాళ్ళని ఎమిరేట్ చేయడం వాళ్ళకు సంబంధించి నటువంటి ఒక స్పెషల్ కార్డు డిజైన్ చేసి, వాళ్ళని ట్రాక్ చేసేటువంటి వ్యవస్థ గనుక ఇప్పటికైనా తీసుకురాకపోతే చాలా సమస్యలు వస్తాయి.
ప్రపంచ దేశాల మధ్య సంబంధాలపై కోవిడ్ ప్రభావం ఎలా ఉండబోతుంది?
ఇవాళ ప్రపంచమంతా ఒకటే పద్ధతిలో ఉన్నది. చాలా సార్లు మనం ఏం చెబుతున్నామంటే ఏకధృవ ప్రపంచం అంటాం. ఈ గ్లోబలైజేషన్స్ వచ్చిన తరువాత గ్లోబల్ విలేజ్ అంటున్నాం. ప్రపంచంలో గతంలో ఉన్నటువంటి విభేదాలు, శిబిరాలు, రాజకీయ సిద్ధాంత శిబిరాలు లేవు. వరల్డ్ వార్ తరువాత మనకి రెండు శిబిరాలు అనేటు వంటివి మొదలైనాయి. ఒకటి సోషలిస్ట్ శిబిరం, రెండోది క్యాపిలిస్ట్ శిబిరం. గ్లోబలైజేషన్స్ పుణ్యమా అని ఆ వ్యవస్థలు అంతరించి పోయినాయి. తరువాత అన్నిటినీ పెట్టుబడిదారీ దేశాల కిందనే జమ కడుతున్నాం. గతంలో లాగా యుద్ధాలు విభజన వచ్చే అవకాశమైతే ఇప్పుడు లేదు.
పర్యావరణ పరిరక్షణను కాపాడుకోవాలని అందరూ అంటున్నారు. అందులో మన ప్రభుత్వం హరితహారం కూడా ప్రారంభించింది? ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రారంభం చేసినప్పుడు చెట్లన్లు సంరక్షించుకొనే బాధ్యత కూడా మన మీద ఉంటది గదా! అట్లాంటి విషయంలో మొక్కలను నాటి చెట్లను నరికేయడం ఎంత వరకు సమంజసం?
పర్యావరణం అంటే కేవలం చెట్లే కాదు. ప్రాథమికమైన పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడి దోహదం చేసే అంశాలు. హరితహారం పోగ్రాం వచ్చిన తరువాత కొన్ని లక్షల చెట్లు నరికేయడం జరిగింది. అలానే పెంచడం కూడా జరుగుతుంది. చెట్టు నరకడానికి ఒక పాలసీ ఉంది. దాన్ని ఇంప్లుమెంట్ చేయాల్సిన బాధ్యత పర్యావరణ సంస్థలు, మిగతావారు కూడా చేస్తున్నారు. ఏ సందర్భంలో చెట్లను నరుకుతున్నారు, ఎవరు నరుకు తున్నారు, వారికి ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు. వీటన్నిటిని సీరియస్‍గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చెట్లు అభివృద్ధి భాగస్వామ్యంలో అంతర్భాగంగా పెంచాలి.
మూసీ అనేది ఒక జీవనది. మనకు సహజ నది. 365 రోజులూ పారే నది. ఇప్పటికీ మూసికి ఆయకట్టు ఉంది. ఈ మురికి నీళ్ళతోటే కొన్ని లక్షల ఎకరాల పంట తీస్తున్నారు రైతులు. అటువంటి నదిని మళ్ళీ జీవనదిగా మార్చుకోవాలి. మూసీ అనేది చాలా పెద్దది. ‘ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్’ వాళ్ళు ఇవన్నీ టేకప్ చేసినారు. మిషన్ కాకతీయ, భగీరథ నీళ్లు వస్తున్నాయి. మనకి ఆ నీళ్ళని ఎండిపోయిన ఇటువంటి నదుల్లో పారించుకోవాలి. పర్యావరణం అంటే కేవలం గ్రీనరీ కాదు. నీళ్లుండాలి, పక్షులు, పశువులు, క్రిమికీటకాలు ఉండాలి. మళ్ళీ సహజమైన వాతావరణం అనేది ఏర్పడాలి.
దేశంలోను, రాష్ట్రంలోను పబ్లిక్ సర్వీస్ కమీషన్ కోవిడ్-19 నేపథ్యంలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోబోతుంది?
ఇప్పుడు దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా గత రెండు నెలలుగా కోవిడ్-19 అనే కోడ్ వచ్చిన తరువాత అన్నీ పబ్లిక్ సర్వీస్ కమీషన్స్ మూత పడిపోయినాయి. ఈ లాక్‍డౌన్ కారణంగా యూపీఏస్‍సీ ఇవ్వాల్సిన నోటిఫి కేషన్స్ను పోస్ట్ఫోన్ చేసింది. ఇంకా నోటిఫికేషన్ రాలేదు. పెట్టాల్సిన ఎగ్జామ్స్ను ఫోస్ట్ఫోన్ చేసింది. ఆ ఎగ్జామ్స్ డేట్ రాలేదు. బహుశా ఇంకో జూన్ వరకు కూడా ఇటువంటి వాతావరణమే ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమీషన్స్ అనేటువంటివి ప్రజలతో కలిసి పనిచేయాల్సిన కమీషన్స్. అంటే మిగతా డిపార్ట్మెంట్స్ లాగా వర్క్ ఫ్రం హోం ఉండే అవకాశం లేదు. అభ్యర్థులు అప్లికేషన్స్ వరకు వర్క్ ఫ్రం హోం పెట్టుకోవచ్చు. కానీ దాని తరువాత పరీక్ష కేంద్రాలకు రావాలి. హాజరు కావాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కు రావాలి. ఇలాంటి ప్రయాణం ఉంటది. బస్సులు లేవు సో ఇటువంటి నేపథ్యంలో తాత్కాలికంగా షట్‍డౌన్‍లోనే ఉన్నాం. ఇదంతా అయిపోయిన తరువాత భవిష్యత్‍లో ఒక కొత్త కోడ్ అనేది మాకు కూడా రాబోతుంది. ఇంతకు ముందు ఒకో రూంలో 22, 23 మందిని వేసి పరీక్షలు రాయించేవాళ్ళు. బహుశా ఇది 12, 15 మందికో మార్చుకోవాల్సి ఉంటది. రోజుకు 500 మందికి సర్టిఫికేషన్ వెరిఫికేషన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక 100 మందికి చేసుకోవచ్చు. అంటే దేన్ని సోషల్ డిస్టెన్సింగ్ అని చెబుతున్నామో అది సోషల్ డిస్టెన్సింగ్ కాదు. అది ఫిజికల్ డిస్టెన్సింగ్. అంటే వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉండే దూరాన్ని పాటించుకుంటూ మాస్క్లు, మిగతా వాటిని కూడా అలోచన చేసే పరిస్థితి. ఇటువంటిది పబ్లిక్ మీద ఎక్కువ ప్రభావం తప్ప, పబ్లిక్ సర్వీస్ కమీషన్స్ మీద పెద్ద ప్రభావం ఉండదు. మాస్క్ ఆర్గనైజేషన్స్ కాదు మేము రిస్టెక్టెడ్‍గా ఈ పనులన్నీ చేయొచ్చు.
నిరుద్యోగ సమస్యను అధిగమించాలంటే విద్యా ప్రమాణాలు ఎలా ఉండాలి?
ప్రమాణాలు మార్కెట్, డిమాండ్, అవసరాలకు అనుగుణంగా ఉండాలి. దురదృష్టం ఏమిటంటే నూటికి తొమ్మిది మంది మాత్రమే ఇవాళ మార్కెట్ అనుకూలమైన, మార్కెట్ కావాల్సిన నైపుణ్యం, అటువంటి ప్రమాణాలు కల్గి ఉంటున్నారు. నిజానికి కూడా భారతదేశంలో ఒక స్పష్టమైనటువంటి ఆలోచనగానీ, స్పష్టమైనటువంటి ఆచరణగానీలేదు అని చెప్పడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మనము నిరుద్యోగులను తయారు చేస్తున్నాం. చదువు అనేది ఒక స్టేటస్ అనుకుంటున్నాము. కానీ ఎప్పుడైనా సరే సమాజంలో మీ ప్రతిభ స్టేటస్ కావాలి. మీకున్న స్కిల్స్ స్టేటస్ కావాలే తప్ప మీకున్న డిగ్రీ స్టేటస్ కాదు.
మీకున్న నైపుణ్యాలను బట్టే మీకు ఉద్యోగం వస్తది. 91 మంది ఆ నైపుణ్యాలు లేకుండా మార్కెట్‍లో సెటిల్ కాకుండా పోతున్నారంటే ఎంత ఫెల్యూర్ సిస్టమ్ మనం డెవలప్ చేస్తున్నామో ఆలోచించాలి. దీనికి సమూలమైన మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. అది విద్యారంగంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా మన విద్యావ్యవస్థలో చాలా మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా టీచింగ్, లెర్నింగ్ సిస్టమ్స్లో చాలా మార్పులు రాబోతున్నాయి. మన ఎడ్యుకేషన్ ఇన్సిట్యూషన్స్లో చాలా మార్పులు రాబోతున్నాయి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ ఇన్‍ఫ్రా స్ట్రక్చర్స్ అనేది మనం దాదాపుగా ఒక వంద వంద యాభై సంవత్సరాలుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నటువంటి ఇన్‍ఫ్రా స్ట్రక్చర్. స్కూల్స్, కాలేజీలు, యూనివర్శిటీలుగానీ నూరు నూటయాభై సంవత్సరాలు దాటిపోతున్నాయి. సిటీ కాలేజీ నూట యాభై సంవత్సరాలు. ఈ ఇన్‍ఫ్రా స్ట్రక్చర్ అనేది ఏళ్లుగా చేస్తుంది. ఒక క్లాస్ రూంలో యాభై, అరవై మందో, కార్పొరేట్ స్కూల్స్ అయితే దిక్కుమొక్కులేదు.
ఇప్పుడు 120 మందిని ఒకే క్లాస్‍లో కూర్చోబెడుతున్నారు. ఇప్పుడు అలా తీసుకోవడానికి లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీటరు దూరంలో ఉండి మాట్లాడు కోవాల్సిన పరిస్థితులు. ఈ మార్పులన్ని కూడా మన విద్యా వ్యవస్థ మీద ప్రభావాన్ని చూపుతాయి. క్లాస్ టీచరు వచ్చి ఇంతమందికి పాఠాలు చెప్పి, ఇన్ని గంటలు అనుకుంటే సమస్య అవుతుంది. కాబట్టి కొంత ఆన్‍లైన్ ఎడ్యుకేషన్ వస్తది. డిజిటల్ బోర్డు, టెలివిజన్ ఛానల్స్లో టీచింగ్ వస్తయి. ఎడ్యుకేషన్ సిస్టమ్, టీచింగ్ సిస్టమ్ అనేది చాలా వరకు మారే అవకాశం ఉంది. కరోనా ప్రభావంతో డిజిటల్ లెర్నింగ్ వచ్చినప్పుడు స్టూడెంట్‍కి టీచర్‍కి ఎంతో డిస్టెన్స్లో ఉంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి దగ్గరుండి జవాబు చెప్పాలి.
విద్యారంగంలో మనకు ఉన్న ప్రధానమైన సమస్య ఏమిటంటే ఒక సంప్రదాయ విద్యా వ్యవస్థలోంచి వచ్చినవాళ్ళం. మిగతా సమాజంలా పోస్ట్ ఇండస్ట్రియల్ సొసైటీ కాదు మనది. చాలా అధునాత, సనాతన ఆచారాలున్న సొసైటీ. ముఖ్యంగా మన గురుకుల విద్యావిధానం గురుకులం అంటే గురువుల దగ్గర ఉండి విద్యాబుద్ధులు నేర్చుకొని గురువుతో ముఖాముఖి ఇంటరాక్షన్‍తో మాత్రమే చదువు చెప్పడం అనేది భారతీయ సంసృతి. ఇప్పుడు ఫేస్ వాష్‍లు, హ్యాండ్‍వాష్‍లు, ఫేస్ మాస్కులు వచ్చిన కాలంలో ఇది ఖచ్చితంగా కొత్త సమస్యని తీసుకొస్తది. అయినా సరే మార్చుకోక తప్పని పరిస్థితి. అందరూ కింద చాప వేసుకొనే భోజనం చేయాలనేది మన ఆచారం. ఇంట్లో అందరూ అన్నమే తినలేదు. పిల్లలు న్యూడిల్స్, పిజ్జాలు, బర్గర్‍లు తింటున్నారు. పెద్దలు రొట్టెలు, చపాతీలు తింటున్నారు. తిండిని అలవాటు చేసుకోవడం సులభం అయినప్పుడు, చదువుకోవడం ఎందుకు కష్టమవుతుంది. మనకు చదువే కష్టం మిగతావి అన్నీ సులభమే.
నేడు ప్రతి ఒక్కరు స్మార్ట్ఫోన్ వాడుతున్నారు. వాట్సప్‍లో ప్రతి ఒక్కరూ చాలా విషయాలు స్ప్రెడ్ చేస్తున్నారు, వింటున్నారు. వాట్సప్‍లో చదువు చెబితే నష్టం ఏముంటది. టీచర్ ఎదురుగా ఉండరు కదా అంటారు. అంటే రూమర్స్ను స్ప్రెడ్ చేసేవాడు మీ ఎదుట ఉండి చేస్తున్నాడా. చదువంటే టీచరే ఉండాలి, టీచర్ చేతిలో బెత్తం ఉండాలి, అల్లరి చేస్తే కొట్టాలి, తిట్టేలా చేయాలి ఇవన్నీ ఉంటాయి. మీకు డౌట్ వచ్చినప్పుడు నోట్ చేసుకోండి. స్కూల్‍కు పోవద్దు అనలేదు, స్కూల్‍కి పోవాలి. టీచర్ అందుబాటులో ఉంటాడు. టీచర్‍ను తీసేయరు. వారికి డౌట్స్ను క్లారిఫై చేయడానికి క్లాసులు ఉన్నాయి. అడిషన్ మెటీరియల్ డెవలప్ చేయమన్నాం. పని ఒత్తిడి క్లాస్ మీద తగ్గించాలి. ఎందుకంటే క్లాస్ లోడ్ కూడా తగ్గించాలి కాబట్టి, అరవైమందిని కూర్చోబెట్టలేరు కాబట్టి, ముప్పైమంది ఒక క్లాస్, ముప్పైమంది ఇంకో క్లాస్ ముప్పైమంది వేరు చేయాలి.
ఒక టీచర్ రెండు చోట్ల చెప్పలేదు. కావున సగం పాఠాలను మీరు డిజిటల్‍గా పట్టుకురండి, డిజిటల్ అనేది మన మెంటల్ బారీయర్ తప్ప డిజిటల్ బారీయర్ ఉండదు. ఎన్నికలు వస్తే అందరికీ ట్యాబ్‍లిస్తారమో రేపు. అంటే తమిళనాడులో మిగతా చోట్ల అలా ఇచ్చారు. ట్యాబ్‍లు, ల్యాప్‍టాప్‍లు ఇచ్చినారు విద్యార్థులకు. రేపు ఎవరో ఒక రాజకీయ పార్టీ ప్రతి స్టూడెంట్‍కి మ్యానిఫెస్టోలోనే పెడతారు. ప్రతి ఇంటికి మేము డిజిటల్ రూం ఇస్తాము ప్లాట్‍ఫాం ఇస్తాము, ట్యాబ్ ఇస్తాము అని స్కూల్స్లోనే ల్యాబ్‍లు పెడతారు. ట్యాబ్‍లు పెడతారు. ఎలక్ట్రానిక్ ఇన్‍ఫాస్ట్రక్చర్‍లో క్రియేషన్ అనేది చాలా సులభం. ఎందుకంటే అది మనం కట్టేది. కానీ క్రియేషన్ ఆఫ్ క్లాస్ రూం ఫిజికల్ బిల్డింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అది సాధ్యం కాదు. డిజిటల్‍ల్లో, ఆన్‍లైన్‍లో, టీవీల్లో ఎంతవరకు అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. విద్యా వ్యవస్థలో చాలా మార్పులు జరగవచ్చు.
ప్రైవేటు యాజమాన్య రంగాలల్లో విద్యా సంస్థల ప్రమాణాలు ఏ విధంగానైన పేరేంట్స్ చెప్పుకోవచ్చు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి డిజిటల్ లెర్నింగ్ వస్తే వాళ్ళకు ల్యాప్‍టాబ్, ట్యాబ్స్ ఉండవు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది. ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నది?
ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచిస్తాయి. ఇప్పటికి వరకు ఏం జరిగిందో తెలియదు. కానీ ఇదొక అపోహ మాత్రమే. కార్పొరేట్ స్కూళ్లల్లో అన్నీ ఉంటాయి, ప్రభుత్వంలో ఏమీ ఉండవు అని. ఇవాళ ప్రభుత్వంలో ముఖ్యంగా డా।। ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్ స్కూళ్లని చూసినట్లయితే కార్పొరేట్ స్కూళ్లల్లో ఏమీ లేవు ప్రభుత్వ స్కూళ్లల్లోనే అన్నీ ఉన్నాయి. రెండోది ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇవాళ భౌతిక దూరం పేరుతో దూరాన్ని పాటించే స్పేస్ ఉంది. ఇప్పటికీ మూత పడ్డ చాలా పాఠశాలలను తెరిపించవచ్చు. మనం ఆలోచించాల్సింది అపార్ట్మెంట్స్ల్లో లేదా కోళ్ళ ఫారంలల్లో లాగా వేలమందిని కుక్కి చదువు చెబుతున్న కార్పొరేట్ స్కూళ్ళ పరిస్థితి గురించి. ఎలక్ట్రానిక్ ఇన్‍ఫ్రా స్ట్రక్చర్ చాలా సులభం.
ఒక రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి మీద ప్రభుత్వం పెడుతున్నది సంవత్సరానికి లక్షా ముప్పైవేలు, లక్షా యాభైవేల రూపాయలు. రాష్ట్రంలోని మిగతా ఇరవై, యాభై లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం ముప్పైవేలు పెట్టి ట్యాబ్ కొనియ్యాలంటే ఐదు, పదివేలకు కంపెనీలే నేరుగా అందజేయాలి. యాభై లక్షల ఆర్డర్ ఇవ్వడానికి ఆ కంపెనీకి కొన్ని సంవత్సరాలు పడుతది. ఇది చాలా పెద్ద ఎడ్యుకేషన్ మార్కెట్. శానిటైజర్స్, మాస్క్లు, ట్యాబ్‍లు, డిజిటల్ లెర్నింగ్ యాప్‍లకు కొత్త మార్కెట్ క్రియేట్ కాబోతున్నది. భవిష్యత్తులో విస్తృతంగా ఆలోచించాల్సిన విషయం. వలసలను అధిగమించాలంటే, నిరుద్యోగులను అధిగమించా లంటే ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ట్రైనింగ్ సెంటర్‍గానీ, ఒక స్కిల్డ్ పోగ్రామ్ డెవలప్ మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
గత పది సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ కోసం ఎంత ఖర్చుపెడుతున్నామో దాదాపు ఆ స్థాయిలో కాకపోయినా చాలా తక్కువ అమౌంట్‍ను స్కిల్డ్ డెవలప్‍మెంట్‍లో కూడా పెడుతున్నాం. ఇవి ప్రతి జిల్లాలో ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ప్రస్తుతం శిక్షణలు కూడా నడుస్తున్నాయి. రామానంద తీర్థ ఇనిస్టిట్యూట్‍లలో శిక్షణ నడుస్తుంది. కానీ వాటికి కార్పొరేట్ స్థాయిలో లేవు కాబట్టి గుర్తింపు లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టాస్క్ అనే పెద్ద ప్రాజెక్టును చేస్తుంది. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంది. విద్యా వ్యవస్థలో మీరు ఇరవై, ముప్పై, ఏండ్లలో నేర్చుకోంది రెండు నెలల్లో స్కిల్డ్ డెవలప్ మెంట్ నేర్చుకుని ఇంజనీర్‍ను అవుతా అంటే కుదరదు. స్కిల్డ్ నీవు నేర్పించింది కాదు. నీవు సొంతం చేసుకుంది. ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఎంత సీరియస్‍గా నేర్చుకుంటున్నారు. వారికి ఏం నాలెడ్జ్ ఉంది. వాళ్ళందరు మళ్ళీ ఏదో ఒక కోర్సు నేర్చుకోవాలి, లేదా స్కిల్ నేర్చుకోవాలి.
గ్రామీణ యువతకు కూడా స్కిల్ డెవలప్‍మెంట్ ఉంది. ఆల్‍రెడీ వాళ్ళని సెక్యూరిటీగాడ్ నుంచి హౌస్ కీపింగ్, డ్రైవింగ్ వరకు వాళ్ళ స్థాయిని బట్టి మార్కెట్లో ఉన్న డిమాండ్‍ను బట్టి స్కిల్ అడాప్షన్ జరుగుతుంది. కావున మనుషులు స్కిల్స్ నేర్చుకోవాలి. స్కిల్ లేని ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ వ్యవస్థలోనే లోపం వుంది. మొదటి నుంచి మనం నేర్పించే ఎడ్యుకేషన్ పద్దతిలోనే లోపం ఉంది. ఏం నేర్పిస్తంలే అని. నేర్పియ్యక పోతే స్కిల్ రాదు. రూరల్‍లో వ్యవసాయ కుటుంబంలో ఉన్న వారికి మల్టిఫుల్ స్కిల్స్ ఉంటాయి. అపార్ట్మెంట్ వారికి ఇన్ని స్కిల్స్ ఉండవు. నీవు దేని స్కిల్ అంటున్నావో అది ముఖ్యం. ఇవాళ కంప్యూటర్ తెలుస్తేనే స్కిల్ అవుతుందా లేదు. ఇంగ్లీష్ మాట్లాడితే స్కిల్ అవుతుందా కాదు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఎడ్యుకేషన్ కరిక్యూలమ్ డిజైన్‍లో మార్పులనేవి రావాల్సిన అవసరం ఉంది.
రాబోయే రోజుల్లో కంప్యూటరైజేషన్, డిజిటలైజేషన్, ప్రాసెస్ ఉంటున్న ప్పుడు ఖచ్చితంగా అవి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా?
ఖచ్చితంగా నేర్చుకోవాలి. భవిష్యత్‍లో కంప్యూటర్ లేని స్కూల్స్ ఉండవు. ఎడ్యుకేషన్ పాలసీలో మార్పులు రావాలి. ప్రతి ఒక్కరు స్కిల్, డిజిటలే దేన్నైనా టీజ్ చేస్తయి. స్మార్ట్ఫోన్ వాడకం అనేది ఏమీ చదువురాని వాళ్ళకు కూడా తెలుసు. మెస్సేజ్‍లు పంపిస్తున్నారు. ఏ షాపులో ఎంత ఆఫర్ ఉందో తెలుస్తుంది. ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి అనేది తెలుసు. ఇవన్నీ ఎవరో నేర్పిస్తే రాలేదు. ఓవెన్‍లు, కంప్యూటర్లు, ఫ్రిజ్‍ల వాడకం పెరిగింది. టీవీ ఛానెల్ మార్చడం కూడా రాదు. ఇప్పుడు అందరూ ఆపరేట్ చేస్తున్నారు. ఏదైనా మనకి అవసరం అనుకున్నప్పుడు దాన్ని ఆటోమేటిక్‍గా అడాప్ట్ చేసుకుంటాం. ఆటోమెటిక్‍గా దాని పరిజ్ఞానం వస్తది, ఫోకస్ కూడా పెరుగుతది. దీని బడ్జెట్ డిమాండ్ చేయొచ్చు. మనదేశంలో ఒక పాలసీ రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కొన్ని వేల లక్షల కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలను మేపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ట్యాబ్ ఇవ్వలేరా. లక్షా ముప్పైవేలు పెట్టి ఇంజనీరింగ్ చదివించవచ్చు. ఆ లక్షా ముప్పైవేలు పెడితే ఐదు మందికి ట్యాబ్‍లు వస్తాయి. డబ్బు లేకపోతే ఈ పాటికి ప్రైవేట్ విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్మెంట్ తీసేసి ఏదైతే ష్కాలర్‍షిప్స్ ఉందో దాన్నే ఇచ్చేవారు. ప్రభుత్వం, ప్రజలు సృష్టించినటువంటి సంపదని మళ్ళీ ప్రజలకు ఫీజు రూపంలో, పెన్షన్ రూపంలో పథకం రూపంలో, రేషన్ రూపంలో పోతుంది. కావున దిగులు చెందాల్సిన పనిలేదు. ప్రభుత్వాలు ఏవైనా ఇది ఆలోచించకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటది. ప్రభుత్వం అవసరం ఉండదు. ఇప్పుడు ఒకే బ్రాంచ్‍లో పదివేల మందిని జాయిన్ చేసుకొన్ని మాకు వంద ర్యాంకులు వచ్చినాయి అని చెబుతున్నారు. ఇప్పుడు అలా కుదరదు. ఆ పదివేల మందిని ఇరవై బ్రాంచ్‍లుగా డిస్ట్రిబ్యూట్ చేసి ఏ బ్రాంచ్‍లో కూడా ఐదు వందల మందికి ఎక్కువగా ఉండకూడదని ఒక జీవో రావాలి. ప్రభుత్వ పాఠశాలల్లో నలభై మంది ఉండాలి. కోవిడ్-19 ఒక వ్యవస్థని అభివృద్ధి చేస్తున్నది. ఇవన్నీ కూడా ఒక ఆర్థిక శాస్త్రవేత్త చెప్పినట్లు ఆర్థిక వ్యవస్థను నాశనం చేయటానికి కోవిడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతున్నట్లు అనిపిస్తుంది.
ఆర్థిక సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన దేశాలు కరోనాను ఎదుర్కోవడంలో ఎందుకు విఫలమయ్యాయి? చిన్న చిన్న దేశాలు ఎలా ఎదుర్కొన్నాయి?
ఇప్పుడున్న మార్కెట్ వ్యవస్థగానీ, సాంకేతిక వ్యవస్థ, లేదా ఈ అగ్రరాజ్యాల చేతిలో ఉన్న ఏ టెక్నాలజీ ఈ వైరస్‍ని కనిపెట్టలేక పోయినాయి. అంటే ఈ వైరస్ అనేది చెప్పి రాదు, చెప్పకుండానే వస్తది. ఒక భూకంపం లాగానో, ఒక సునామీ లాగానో ప్రకృతి ప్రకోపించి నప్పుడు ఏదైనా ఎప్పుడైనా వస్తది. అది ఎంత పెద్ద అగ్రరాజ్యమైనా కూలిపోతుటంది. ఒక ఉపద్రవం ప్రకృతిలో వచ్చినప్పుడు బాగా పెరిగిన చెట్టునే కూలగొడతది. చిన్న మొక్కను ఏం చేయలేదు. అలానే చిన్న దేశాలకు నష్టం చిన్నగా జరుగుతది. పెద్ద దేశాలకు పెద్దగా జరుగుతది. ఎందుకు ఎక్కువగా జరుగుతదంటే వాళ్ళకు ఉన్నటువంటి నియమాలు, పద్ధతులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళు నగరాలను ఒక మురికి కూపాలుగా మార్చేశారు.
ప్రపంచంలోను, భారతదేశంలోను ఆర్థిక రంగం ఎలా ఉండ బోతుంది?
కరోనా అనే వైరస్ మనుషులకంటే ఎక్కువగా ప్రపంచ దేశాల వెన్నముకలైనటువంటి వ్యవస్థలను కూల్చేసింది. మనుషులు లక్షమంది చనిపోయింటారు. కానీ ఎక్కువ ప్రభావం ఆర్థికరంగం మీద, పారిశ్రామిక రంగం మీద ఉండబోతుంది. ఆర్థికరంగం మీద, పారిశ్రామిక రంగం మీద ఉండబోతుంది అనుకున్నప్పుడు మార్కెట్ వ్యవస్థను ఆధారంగా చేసుకొని ఈ పారిశ్రామిక ఉత్పత్తులను ఆధారంగా చేసుకొన్న వ్యవస్థలే ఎక్కువ ప్రభావితం అవుతాయి. భారత్ కొంత నయం. ఎందుకంటే వ్యవసాయం కూడా సమానంగా ప్రాధాన్యత ఉన్నది. చైనా వాళ్ళు ఎందుకు దిగులు పడలేదు అంటే లాక్‍డౌన్ తరువాత వాళ్ళ పరిశ్రమలు ప్రారంభమై మ్యాన్‍పాక్చర్‍లో వాళ్ళు ముందుఉన్నారు. కానీ మన ఆర్థిక వ్యవస్థ సర్వీసెస్ బేసిక్ ఆర్థిక వ్యవస్థ మిషనరీలతో మ్యానుపాక్చరింగ్ చేసినట్లుగా వ్యవసాయంలో పని చేయలేము.
ఎవరికైనా సరే మనీ సర్క్యులేషన్ మార్కెట్లో లేకపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. నేడు భారత ఆర్థిక వ్యవస్థ కూడా మార్కెట్‍తో ఒప్పుకున్నది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఉంది. అక్కడ పెట్టుబడులు పడిపోతున్నాయి. వ్యవస్థ పడిపోతుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా దీని ప్రభావం అనేది అంచనాలకు అందని స్థాయిలో ఉంది.
రాబోయే రోజులల్లో ఇలాంటి వైరస్ ఇక ముందు ఉంటుందా? ప్రజలు భౌతిక దూరం పాటిస్తారా? పాటించరా? లేక పాటిస్తే ఎలా ఉంటుంది? ఏవిధంగా వివిధరంగాలల్లో అభివృద్ధి చెందుతాయి?
కరోనా వైరస్సే ఊహించనది. రేపు ఇంకో వైరస్ ఉండదని ఎలా ఊహిస్తాం. విడి విడిగా ఉంటే కూడా వచ్చే వైరస్‍లు ఉండవచ్చు. మనుషుల్ని విడగొట్టే వైరస్ ఉందని మనకి ఇప్పటికీ తెలియదు. ఒంటరిగా ఉంటే సోకే వ్యాధులు కూడా రావొచ్చు. రేపు ఏం జరుగుతుందో ఎలా వస్తదో ఊహించే శక్తి ఉంటే వాడు ఈ రెండు వందల సంవత్సరాల నుండి ఊహించాలి కదా ఈ కరోనా వస్తదని. ఈ కరోనా కూడా కొత్తది కాదు, ఏడో తరం కరోనా. ఆరు కరోనాలను చూసినవారికి ఏడోది ఎలా వస్తదో తెలుసుకునే శక్తి లేదు. మనిషి ఆలోచన శక్తి గొప్పది అనుకోకండి. వైరస్ మనకంటే వేగంగా, సులువుగా, చురుకుగా, గొప్పగా ప్రకృతి ఆలోచిస్తది. కావున ప్రకృతిని అనుసరించాలి. అంతకు మించి ఏమి చేయడానికి వీలులేదు.
రేపటి ప్రపంచం ఎలా ఉండబోతుంది? ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి?
రేపటి ప్రపంచం మూతికి మాస్క్లు, చేతులకు గ్లౌజులు, శానిటైజర్లు పూసుకుంటు ఉంటారు. కరోనా చాలా పాఠాలు నేర్పించింది. నేర్చుకున్న వాళ్లకి నేర్చుకునేంత. ముఖ్యంగా ఇటలీ, చైనా, ఇరాన్, అమెరికా నుంచి వస్తున్నటువంటి కథనాలు చూస్తున్నప్పుడు మనిషి ఒంటరివాడు అని అర్థం చేసుకోవాలి. కరోనా పోయిన తరువాత ప్రజల ఆలోచన మళ్ళీ మామూలుగానే ఉంటది. మారుతుందనే నమ్మకం లేదు.
కరోనా వల్ల పేద ప్రజలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు సేవింగ్స్ అనేది నేర్చుకున్నారా? అంటే ఆరోగ్య పరంగా డబ్బులను జమ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని సేవింగ్ నేర్చుకున్నారా?
ఏమీ నేర్చుకోలేదు. అసలు సేవింగ్స్కి అవకాశంలేదు. పేదలు, మధ్యతరగతి చేతికి డబ్బులు వస్తే గదా సేవ్ చేసేది. కాకపోతే ఉల్టా ఖర్చు పెట్టుకున్నారు. సంపన్నుడు నష్టపోలేదు. పేదవాడికి కనీస ఆదాయమే లేకపోయాక సేవింగ్ ఎక్కడది.
లాక్‍డౌన్ సమయంలో మీకు కలిగిన ఆలోచనలు, అంతర్మథనాలు ఏమిటి?
పైన చెప్పినవన్నీ ఈ సమయంలో వచ్చిన ఆలోచనలే. సమూహంలో ఉన్నప్పుడు, రోటీన్‍లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఆలోచించరు. ఈ పరిణామాలన్ని జరుగుతున్న టువంటి సందర్భంలో చాలా విషయాలు మనం చేసిన పొరపాట్లు అయి ఉండొచ్చు. మనుషులందరిలో కూడా ఖచ్చితంగా ఈ పనులు చేసి ఉండకపోతే బావుణ్ణులాంటి ఆలోచనలు, సందర్భాలు వస్తాయి. కాబట్టి జీవితంలో నలభై, యాభై ఏళ్లుగా ఒక నెల రోజులు ఖాళీగా ఉండే అవకావం రాలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది.
మన దేశ ఫెడరల్ వ్యవస్థ రేపు ఎలా ఉండబోతుంది?
దీన్ని అర్థం చేసుకున్నవాళ్లకి ఒక పెద్ద సమస్య. కరోనా అనేది ప్రపంచ వ్యాప్తంగానే సామాజిక వ్యవస్థను నాశనం చేసింది. భిన్నాభిప్రాయాలు పోయినాయి. విషాదంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడే చెప్పలేం. కానీ ఖచ్చితంగా ఈ చట్టాన్ని 1897 అఫడమిక్ యాక్ట్ను వాడడమే ఫెడరల్ వ్యవస్థకు ఒక పరీక్ష. దేశంలో రెండు రకాల చట్టాలున్నాయి. ఒకటి న్యాచురల్ లా కమిటీస్ ఇవన్నీ వచ్చినప్పుడే వాడే చట్టం. ఇంకొకటి ఇలాంటి ప్యాండమిక్, మహమ్మారీలు వచ్చినప్పుడు బ్రిటిష్‍వాడు అలా కొన్ని చట్టాలు చేసుకుంటూ వచ్చినాడు. 1995లో వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యాల నియంత్రణ చట్టం మేనేజ్‍మెంట్ యాక్ట్ అనేది ఏదో ఒకటుంది. ఇవాల్టి వరకు ఈ రాష్ట్రాల అధికారాలు, రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి కేంద్రం ఏం సపోర్టు చేస్తున్నదని దాని మీద చర్చ జరగట్ల. కానీ రాష్ట్రాలు ఆర్థిక సహాయాన్ని ఆశిస్తే రేపు చర్చ జరుగుతది. మూడు అంశాలను ముందు చేయమని కేంద్రంను రాష్ట్ర ప్రభుత్వాలు అడిగాయి. ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ఆర్థికసహాయం, ప్యాకేజీ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. రేపు వస్తదో లేదో తెల్వదు. ఇది కొంచెం ఇబ్బందికరం. రెండోది ఏం అడిగినాయి అయ్యా మీరు ఆర్థిక సహాయం చెయ్యకపోయినా ఫర్వాలేదు, సివియర్ గైడ్‍లైన్స్ ఉంటాయి, మేము ఎంత అప్పు చేయాలో అనే దానికి ఒక పరిమితి ఉంటది, ఆ పరిమితి మీరు విధించినారు, దాన్ని కొంచెం పెంచండి. రుణపరిమితిని చేస్తే మేము ఎక్కడో ఒకచోట అప్పు చేసుకోనైనా సరే చేస్తాం అని కేసిఆర్ గారు ఒకటి రెండు సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లల్లో దాన్ని ప్రస్తావించినారు. కానీ ఇప్పటివరకు అటువంటి ఫర్మిమిషన్స్ ఏమీ చేయలేదు.
మూడోది ఏమి అడిగారు కేసీఆర్ గారే హెలికాప్టర్ మనీ అనేది. మీరు సమస్యలు వచ్చినప్పుడు ఆర్‍బీఐకి ఆ శక్తి, పవర్ ఉంది. మీరు ఒక్కమాట చెబితే వాళ్ళు ఆ హెలికాప్టర్ మనీ ఇస్తారు అన్నారు. దాని మీద జోక్‍లు వచ్చినాయి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు గవర్నమెంట్ మనీ ట్రాన్స్క్షషన్ లేకపోతే మనిషి బతకలేడు. ఎకానమీ లేదు. అటువంటి సిస్టమ్ డెవలప్ అయి ఉన్నది. సో ఇటువంటప్పుడు ప్రజలు బయటికి పోయి ఖర్చు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఖర్చును ఎంకరేజ్ చేయడానికి వీలులేదు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ కొంత అమౌంట్‍ని తక్కువ రేటుకి, తక్కువ వడ్డీకి ప్రింట్ చేసి అన్ని రాష్ట్రాలకి ఇస్తది. రాష్ట్రాలు మళ్ళీ కడతాయి అది వేరే సంగతి. ఇవాళ బండి నడవాలన్నా పెట్రోలు లేదు. సో అటువంటి వాతావరణంలో ఇది ఉపయోగపడతది అని సీఎం కేసీఆర్ గారు చాలా వివరంగా చెప్పారు. కానీ స్పందన లేదు. ఈ మూడు ఒకటి. రెండు పారిశ్రామిక వేత్తలు అడుగుతున్నారు వినిపించుకోలేదు. ఇంటికెళ్ళి బయట పడడం కోసం మనం లాక్‍డౌన్ ఎత్తేసినాం. ఇది ఒక పార్ట్. రెండోది కేంద్రం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొంటుంది. ఫెడరల్ పద్ధతిలో నా రాష్ట్రం మీద ప్రభావితం చేసే నిర్ణయం నీవు తీసుకోవద్దు. భవిష్యత్తులో దీని పరిణామాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే ఏమీ చెప్పలేం.
ఒక సామాన్య వ్యక్తిగా ప్రజలకు కరోనా నుంచి దూరంగా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి సూచనలు ఇస్తారు?
సినిమా యాక్టర్స్ చేతులు కడుక్కోమని, మాస్క్లు తొడుక్కోమని చెబుతున్నారు. ఖచ్చితంగా ఎవరైనా అదే చెబుతారు. వైజాగ్‍లో విషవాయువు వచ్చినప్పుడు బండి తీసుకుని స్పీడ్‍గా అరవై కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోయి సేఫ్‍గా ఉన్నాడు. కరోనా అలా కాదు కదా. నీ మీదనే ఎక్కి సవారీ చేస్తుంటది. కాబట్టి అటువంటి జాగ్రత్తలు ఏమీ చెప్పలేను. మీరు కరోనా తోటి కలిసి ప్రయాణం చేయాల్సి వస్తది. దీర్ఘ కాలం ఉంటది. ఇక మందు కనిపెట్టగనే పార్టీ చేసుకునే అవకాశం లేదు. ఈ కష్టకాలంలో మన ప్రాణం కంటే ఏదీ ఎక్కువ గాదు కదా. కాబట్టి ప్రజలు చాలా తెలివి గల వాళ్లు. వాళ్ళకు ఉద్ఘాటించి నీతి బోధ చేయాల్సిన పనిలేదు.
(సచిన్, మల్లేష్ – దక్కన్ ఛానల్ ఇంటర్వ్యూ ఆధారంగా)
– కట్టా ప్రభాకర్, ఎ : 8106721111