పది ఆర్ల సంవత్సరాల క్రింద హైద్రాబాద్ పాతనగరంలో నివసించే ముసలివారు ‘‘కట్టెపూల్’’ అనేవారు తప్ప ముసల్మానుల లాగా ‘‘లక్డికాపూల్’’ అనేవారు కాదు. అయినా ఏం లాభం? కట్టె ఒకటే తెలుగు పదం. మళ్లీ పూల్ మాత్రం ఉర్దూ పదమే కద. కల్తీలేని తెలుగులో చెప్పాలంటే కట్టెతో కట్టబడిన వంతెన. అబ్బో అంత లంబాచౌడా పేరు పలికేబదులు హాయిగా అందరి నోళ్లల్లో నానిన ‘‘లక్డికాపూల్’’ పేరే బాగుంది కదా! అయినా ఇపుడు లక్డీ ఎక్కడుంది అంతా సిమెంటే కదా ‘‘సిమెంట్‍కాపూల్’’ అందామని మీరు మళ్లీ కొత్త ‘‘కిరికిరీ’’ పెట్టకండి.
సరే లక్డీకాపూల్ నుండి మెహదీపట్నంకు వెళ్లే దారి మధ్యలో ఎడమవైపు జెఎన్‍టీయు కాలేజీ, దానికి ఎదురుగా మహావీర్ హాస్పిటల్ ఉంది కదా! సరిగ్గా దానికి వెనకవైపు ఉన్న బస్తీ ‘‘ఎ.సి.గార్డస్’’ 150 సం।।ల క్రిందట వెలసిన బస్తీ అది. తెలుగు, ఉర్దూ పేర్లతోనే సతమతమవుతుంటే మధ్యలో మళ్లీ ఈ ఇంగ్లీష్ పేర్లేమిటి అని కోప్పడకండి. ఆ ఇంగ్లీషు పేర్లు కూడా అపభ్రంశానికి గురై బార్కాస్, కోరంటి, ముసారాం బాగ్‍లుగా పిలవబడుతున్నాయి. ఎ.సి.గార్డస్ బస్తీ గురించి చెప్పాలంటే అది కథకాదు. అదొక చరిత్ర. ఆ చరిత్ర చీకటి కోణాల్లోకి మనం కండ్లు చిట్లించుకొని తొంగిచూడాలి. ఈ బస్తీ మూలాలు (రూట్స్) ఇక్కడ లేవు. బొంబాయి బానిసల సంత నుండి మొదలై వనపర్తి సంస్థానం ద్వారా హైద్రాబాద్ చేరుకున్నాయి.
మహబూబ్‍నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థా నాధీషుడు రాజా రామేశ్వరరావ్ రాబిన్ హుడ్ తరహా సాహసవీరుడు. అతను బలమైన సైనిక శక్తిని నిర్మించటానికి ఒక ఆలోచన అమలు చేసాడు. బొంబాయిలోని బానిసల సంతకు వెళ్లి అక్కడ అరబ్బు వర్తకులు ఆఫ్రికా ఖండంలోని సోమాలియా, ఇథియోపియా దేశాల నుండి జంతువుల లాగా బంధించి తెచ్చిన బానిస స్త్రీ పురుషులను ఖరీదు చేసి తన వనపర్తి సంస్థానానికి తీసుకొచ్చాడు. వారందరికీ పెళ్లిళ్లు చేయించి కుటుంబాలుగా స్థిరపడిన తర్వాత వారికి కఠినమైన సైనిక శిక్షణ ఇప్పించి ప్రత్యేకమైన అశ్విక దళాన్ని రూపొందించాడు. వారిని బానిసలుగా గాక స్వతంత్ర ప్రజలుగా గౌరవించాడు. వారు కూడా విశ్వాసంతో, స్వామిభక్తితో పనిచేస్తూ ప్రాణాలైనా బలిపెట్టటానికి సిద్దంగా ఉండేవారు. రాజావారి సైన్యంలో ఆ ఆశ్విక దళం ప్రత్యేకమైన శక్తిగా గుర్తింపు పొందింది. ప్రతి సైనికుడి పేరుకు ముందు లేదా చివర ‘‘బిన్ బాహరీ’’ అని ఆఫ్రికాలోని వారి తెగ నామం ఉంటుంది. అది వారి మూలాలను సూచించే పేరు. వారందరూ కలిసి కృతజ్ఞతా చిహ్నంగా రాజావారికి ఒక బిరుదు ప్రసాదించారు. అది ‘‘బాహిరి బలవంత్ బహద్దూర్’’.
ఆ నల్లనయ్యల సహాయంతో రాజావారు అనేక సాహస కార్యాలు చేపట్టాడు. ఇతర సంస్థానాలైన జటప్రోలు, గద్వాల, గోపాలపేటలపై దాడులు జరిపి వారిని కొల్లగొట్టి తన ఖజానా నింపుకునేవాడు. ఏకంగా నిజాం ఆస్తులపైనే దాడులు చేసేవాడు. ఆఖరికి నిజాం ఇతన్ని బంధిస్తే ఈ ఆఫ్రికన్ సైనికుల సహాయంతో చెర నుండి తప్పించుకున్నాడు. ఆ కథ మళ్లీ మరో కథలో సవివరంగా విన్నవిస్తాను.
చివరికి 5వ నిజాం వనపర్తి రాజాతో సంధి చేసుకుని సఖ్యత నెలకొల్పు కున్నాడు. ఈ ప్రయత్నాలలో దివాన్ సర్ సాలార్ జంగ్ పాత్ర చాలా ముఖ్యమైనది నిజాం ఆ రాజావారిని జిల్లే దార్‍గా (కలెక్టర్‍గా నియ మించి) ఇతర సంస్థానాధీషుల నుండి పేష్‍కష్ (కప్పం) వసూలు బాధ్యతను, శాంతిభద్రతల బాధ్యతను అప్పగించి ఆ తర్వాత ఇన్‍స్పెక్టర్ జనరల్‍గా చేసి సైన్యం బాధ్యతలను కూడా కట్టబెట్టాడు.
1866లో రాజావారు అస్తమించారు. ఆ తర్వాత 35 సం।।లు అనగా 1911 వరకు రాణి శంకరమ్మగారే పరిపాలనా పగ్గాలను చేబట్టి సంస్థానం బాద్యతలను సమర్థవంతంగా నిర్వహించింది. ఈమె తవ్వించిన చెరువు పేరు శంకర సముద్రం. మళ్లీ అసలు కతకు వద్దాం.
రాజా వారు చనిపోగానే ‘‘బిన్ బిహారీలు’’ తిరుగుబాటు, అరాచకాన్ని ప్రారంభించారు. వారి తలనొప్పిని తట్టుకోలేక వారందర్నీ ఆమె నిజాం నవాబుకు అప్పగించి చేతులు దులుపుకుంది. నిజాం వారందరికీ ప్రస్తుతమున్న మహావీర్ దవాఖానా వెనుక ప్రాంతంలో స్థిరనివాసాలు ఏర్పరచాడు. వారి ప్రత్యేక ఆశ్విక దళాన్ని అలాగే కొనసాగించాడు. అట్లా ఆ ప్రాంతానికి ఆఫ్రికన్ కావల్రీగార్డస్ – ఎ.సి.గార్డస్ అని పేరొచ్చింది. ఇప్పటికీ హైద్రాబాద్ హార్స్ రైడింగ్ క్లబ్ అక్కడే కొనసాగుతుంది. అరబ్బీ గుర్రాలపై ఆఫ్రికన్ రౌతులు సవారీలు చేస్తూ ఇప్పటికీ కనబడుతుంటారు.
ఈ నల్లనయ్యల మూలాలన్నీ ఆఫ్రికా ఖండంలోని అబిసీనియా (ఇథియో పియా)లో ఉన్నాయి. అందుకే వీరిని హబ్సీలు అని కూడా పిలిచేవారు. వీరు నివసించిన మరో బస్తీ పేరే హబ్సీగూడ. అరబ్బీ భాషలో అబిసీనియన్లను ‘‘హబ్సీ’’లు అంటారు. వీరిలో ఎవరైతే ఇస్లాం మతాన్ని స్వీకరించారో వారిని ‘‘సిద్దీ’’లు అంటారు. వీరి పేరు చివర తప్పని సరిగా సిద్దీ లేదా సయ్యద్ అని ఉంటుంది.
హైద్రాబాద్ నగరంలో ఇతర ముస్లింలు వీరిని ‘‘చావూష్’’లని అంటారు. అంటే తక్కువ మతం వారని అర్థం. అదొక తిట్టు లాంటిది. తక్కువ కులం లాగా. వీరు నీగ్రోల మాదిరి నల్లని రంగు, ఉంగరాల జుట్టు కలిగి ఉండటంతో ఎరుపు వర్ణం కల్గిన అరబ్బులకు, పఠాన్‍లకు, ఇరానియన్‍లకు వీరి పట్ల చులకన భావం కలిగింది. ఇస్లాంలోని వర్ణబేధాలు, జాతిబేధాలకు ఇదొక ఉదాహరణ.
ఎ.సి.గార్డస్ బస్తీకి ఒకవైపు చింతలబస్తీ మరొవైపు శ్యాంరావ్‍నగర్ ఉంది. 1948లో పోలీస్ యాక్షన్ కాగానే ప్రభుత్వం అక్కడున్న ఇళ్లలన్నింటినీ వారికే ఉచితంగా ఇచ్చేసింది. ఈ బిన్ బాహరీలందరూ ఇప్పటికీ అక్కడ ఉంటున్నారు.
వీరు సంగీత ప్రియులు. తాషా, మర్ఫా వీరి వాయిద్యాలు. ఇప్పటికీ ముస్లిం వివాహ వేడుకలలో గుండెలదిరే వీరి సంగీతాన్ని మనం వినవచ్చు. ఈ డప్పుల వాయిద్యాలకు అనుగుణంగా చేసే నృత్యం పేరు ‘‘కుర్ఫీ’’. రెండు చేతులలో చురకత్తులు పట్టుకుని, చెమట చిందేలా నృత్యం చేస్తూ యుద్ధకళను ప్రదర్శించేదే ఈ కుర్ఫీ నృత్యం. మరొక్క మాట చైనీయులు తాగే బ్లాక్ టీ లాగా వీరు తాగే చాయ్ పేరు ‘‘ఘావా’’. పాలు లేకుండా పుదీనా సువాసనలతో గుభాళించే ఆ ఘావా పానీయాన్ని ఆస్వాదించటానికి ఒక సెలవురోజు ఎ.సి.గార్డస్ బస్తీకి వెళ్లి వద్దామా? ఆ నల్లనయ్యల ముఖాల్లోకి తొంగిచూసి, ఆ చిక్కుముడతల ఉంగరాల జుట్టులో ఒకప్పటి ఆఫ్రికన్ ఆనవాళ్లను గుర్తుపడదామా? వీలుంటే అక్కడ దొరికే ఘావా చుక్కల్ని చప్పరిద్దామా?
(షహర్ నామా (హైద్రాబాద్ వీధులు – గాథలు పుస్తకం నుంచి) -పరవస్తు లోకేశ్వర్,
ఎ: 91606 80847