ఆనందాంబ

పూర్వ కవుల చరిత్ర తెలుసుకోవాలంటే వారు రాసిన గ్రంథావతారికలు గానీ, వారి గురించి ఇతరులు తెలిపిన విషయాలే ప్రమాణాలు. విద్యయే మృగ్యమై ఉన్న నైజాం రాష్ట్రంలో తెలంగాణలోని మారుమూల గ్రామంలో పుట్టిపెరిగిన ఆణిముత్యం ఆనందాంబ. బాలకవయిత్రి, అష్టావధాని పన్నెండేళ్ల కాలంలో  1934వ  సంవత్సరంలో 28 పుటాల పద్యకావ్యం ‘సతీలలామ’ పేరుతో ఆనందాంబ రచించారు. అంతకుముందే వెలమవీర, మాదవ పంచాసత్‍ కావ్యాలు రాసినట్టు గోల్కొండ కవుల సంచికలో పేర్కొనబడింది.
ఉపోద్ఘాతంలో ఈమెను గురించి విద్వాన్‍ వెంకట నృసింహాచార్య శాస్త్రిగారు స్వయాన ఆమె గురువు సిరి శెనహల్‍ శ్రీకృష్ణమాచార్యులు, శతావధాని మోర్తాడ్‍ తాలూకా ఆర్మూర్‍ వారు 1934లో వెలువర్చిన అభిప్రాయం సిరిసిల్ల వాస్తవ్యులు పదిరే కృష్ణశాస్త్రి అందించిన అభినందన పద్యాల వల్ల కరీంనగర్‍ జిల్లా మొట్టమొదటి కవయిత్రిగా తెలుస్తోంది.


ఆనందాంబ వారు వెలమ స్త్రీ. వీరి తండ్రి మహారాజుశ్రీ పునుగోటి మంగారావు గారు. తల్లి నరసాంబ. పుట్టిల్లు జగిత్యాల తాలూకా కొడిమ్యాల అని నృసింహాశాస్త్రి తెలియజేశారు. అంతేగాక, సంస్కృతాంధ్రములు, చవిదప్పిన ఇక్కాలమున ద్వాదశి వర్మ అగ్ని ఈ కన్యారత్నం మాతృభాష అందలి గౌరవించే శ్లాఘ్యమగు గ్రంథాన్ని రచించుట అత్యంత ప్రశంసాపత్రము. ఈ కవయిత్రికి కవితా సంపద సహజమని తోచుచున్నది. గణయతి ప్రాసలకై కష్టము లేకయే పద్యములు రచిస్తున్నది. సులభ శైలి కలిగిన వర్ణనలు, విసర్గ రమణీయములు.
విషయం భారతీయ నారీరత్నముకేది పరము ధర్మమో, దేనినవలంభించిన ఇహపర లోకములు కరతలామలకములో, ఏది కులాంగములకు తలమానికమో అట్టి పాతివ్రత్య నీతి యందు కీర్తింప బడినది. ఈమె బాల్యము నుంచే అమూల్యమగు అభిప్రాయములతో నలరారుచున్నది. ఇకముందు అఖిలాంధ్ర స్త్రీలలో మేటి కాగలదనుట నిర్వివాదాంశం.

‘పరమాత్ముడే వైదుష్యము ఆయురారోగ్యం ప్రసాదించుగాక’ అని దీవించారు. నేడు పురుషులలో చాలామంది స్త్రీ విద్యగల గూర్చి వేదికపై గంభీరోపన్యాసము లిచ్చుచున్నారు. కానీ చెప్పినరీతి ఆచరించుట లేదు. ఈ గ్రంథకర్త తండ్రి తమ పుత్రికకాంధ్ర సారస్వతముల నభ్యసింపజేయుచున్నందుకు ధన్యవాదములు. వీరు మన ఆంధ్ర లోకమునకొక మార్గదర్శకులని అభినందించారు.
ప్రతివారు మహిళా జాతిని పవిత్రోద్దేశములతో సన్మానించి పూర్వబైభవం కలిగేటట్లు స్త్రీ విద్యను ప్రోత్సహించాలని, ‘భారతీయ సౌభాగ్యం ఫలించుగాక’ అన్న విద్వాన్‍ వేంకట నృసింహశాస్త్రిగారి మాటలు ముత్యాల మూటలు. ‘స్వీయ కవితానుజీవనమ్‍’ అనే పుస్తకంలో ఒక పేజీలో శతావధాని కృష్ణమాచారి కోరుట్ల వారు ఇలా రాశారు. ‘క్రీ.శ. 1934 భవ నామ సంవత్సరం నేను సకుటుంబంగా మూడేళ్లు కొడిమ్యాలలో నుంటిని. శ్రీ మంగారావు గారి సతీమణి నరసమ్మ దొరసాని మమ్ము ప్రత్యేక గృహములో ఉంచి, భక్తితో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మా కుటుంబం సాపాటునకు పోగా నెలకిరువది రూపాలియ్చేవారు. కాలక్షేపమునకు భగవత్‍ కథలు విని, సేవించి అప్పుడా దంపతులు సత్కారములు చేయుచుండిరి. ఆనందమ్మప్పుడు 12 సంవత్సరాల బాలిక. చాలా మేధావిని. మిక్కిలి భయ భక్తులు కలది. పంచకావ్యములు, శాకుంతలము, ఉత్తరరామ చరిత్ర నాటకం చెప్పితిని. సంస్కృతమున మంచి జ్ఞానం సంపాదించినది. తెలుగులో అదివరకే పద్యములు రాయుచుండెను. వెలమవీర, మాధవ పంచాశత్‍లను పుస్తకములను శ్రీ మాధవరావు ముద్రించి ప్రకటించారు.


చలిగంటి శ్రీ ధర్మజగపతి రావు గారు ఈ అమ్మాయికి మేనమామ కనుక ఆహ్వానించి బండ లింగాపురాస్థానాధీశులగు రాజా ఆనంత కిషన్‍ రావు గారి అధ్యక్షతన ‘ఆనందాంబ’తో అష్టావధానం చేయించారు. అప్పుడాయన సంతోషించి ‘బాల సరస్వతి’ బిరుదునిచ్చారు. ఆ తర్వాత లింగాపురం రాజా గారి మేనల్లుడు వేములకుర్తి వాస్తవ్యులు మాకులూరు భీమారావు (బి.ఎ.) గారితో వివాహమైంది.
కొడిమ్యాలలో శ్రీమతి ఆనందమ్మ చదువు తున్నప్పుడు తిరుమంత్రార్థము మొదలగు గ్రంథములను జెప్పుమనగా పంచ సంస్కారములు కానిది పనికి రాదంటిని. అందువలన తల్లిదండ్రులతో నిర్బంధమాడి పంచ సంస్కారములు పొందెను. తర్వాత మంత్రార్థము మొదలుకొని… భగవద్విషయము వరకు సంప్రదాయ గ్రంథములన్నింటిని పఠించెను. కొడిమ్యాలలో మేమున్నప్పుడే ఆమెకు ఒక కూతురు కలిగెను.

అవధానమున నేనాశీర్వాద పద్యములందించితిని.
‘సతీలలామ’ పుస్తకమునందందించిన పద్యములివి.
కం : హృద్యములు విభుదులకు నా
సాధ్యములు కులాంగనలకు, సరసులకివి సం
సాధ్యములు గుణగణ వదన
పద్యములానందమాంబ, పద్యములరయన్‍.
కం : చిలుకల కొలుకుల మేల్బం
తుల కిక తేనియల నొలుకు, తోరపు చరకుల్‍
కలికాంతల కివిదాటపు
ములఱుకుషులు నానందాంబ ముద్దుల పలుకుల్‍’ – ఇట్లు విద్వాన్‍


శిరశసహల్‍ శ్రీకృష్ణమాచార్యులు శతావధాని గారు, మోర్తాడు తాలూకా అరమూరు నైజం 3-4-1934.
పదిరె కృష్ణశాస్త్రి గారు తన అభిప్రాయాన్ని అభినందన పద్యంలో ఇలా రాశారు.
చం : ‘అతివల మిన్నవై బధులందరిలన్‍ దలలూప
జాతు నీ
చతుర కవిత్వ మాధురికి, సంతనమొంది
ప్రియంబుచే భవ
స్మతి నెపుడున్‍ దలంచగను, మంజుల
పద్యమునొక్క దానినం
దిత హృదయుండనై యొసిగితిన్‍ గయి
కొమ్ముదె బాలికా మన్‍’
అని అభినందించారు.
కార్యేషు దాసి, కరణేషు మంత్రి
భోజ్యేషు మాతా, శయనేషు రంభ
రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ
షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ
అని మన పూర్వులు తెలిపారు. దాన్నే ‘సతీలలామ’ రచనలో శ్రీమతి ఆనందాంబ ఇలా వర్ణించారు.
పతికెట్టి కర్ణంబు, బడసిన నద్దాని
నేర్పుతో నొసరించు నెలమిన్న
నీతి నూహించెటి, నాతి మిన్న
హితుని కాహారంబు, నిడుచున్న వేళల
కన్నతల్లిని మీరు, కలికిమిన్న
ప్రాచేను తోడు, పాన్పునందున జేర
రంభాదులను గెలుచు రమణి మిన్న
వరుని సేమంబు గోరెడు వలతి మిన్న
పుడమిలో నట్టి చిగురాకు బోడికన్న
తపసి వేరుండగలది నెత్తరిని గన్న
వరగనదాదిల్వ పాపంబునున్న – అన్నారు.
కష్టసుఖాల్లో భర్తకు చేదోడువాదోడుగా ఉండేది భార్య అంటూ..
ఓపలేనట్టి కరూపుడైనను భర్త
వలరాజువలె నెంచు పొలతులెవరో
పతి భుజించేది పల్పటి గంజైనా
అమృతం వలె భావించే భార్యే భార్య అన్నారామె.
బాల్యంలో తొలి గురువు తల్లే అందరికి. కనుక ఆమె నుంచే సంక్రమించేట్టు తల్లి దండ్రులుండాలని, పసిప్రాయంలోనే ఏది చెప్పినా చక్కగా వింటారు కనుక ఇంట్లోని వారితో, ఇరుగుపొరుగు వారితో ఎలా ఉండాలో తల్లే చెప్పాలని స్త్రీలకు ఉద్భోధించారు. ఇంటికి దీపం ఇల్లాలు కనుక ఇల్లు., ఇల్లాలు బాగుండాలని ఆకాంక్షించారు.
ఆమె తన చుట్టుపక్కల చదువుల పేరుతో పరభాషను, పాశ్చాత్య నాగరికతను అనుసరిస్తున్న వాళ్లను నిరసించింది. కట్టుబొట్టు భారతీయ సంస్కృతి, సంప్రదాయం కనుక దానికి మనం విలువ ఇచ్చినపుడే ఎదుటివారు గౌరవిస్తారని విన్నవించారు. సుతిమెత్తని భావాలను సరళ భాషలో పద్యాలు రాసి మనకందించిన మహిళా లలామ ఆనందాంబ. సర్వకాల సర్వావస్థల్లో ఆచరించతగ్గవి ఆమె సూక్తులు. అన్ని పద్యాలు ఆణిముత్యాలే.


తన కృతితో జువ్వాడి వంశ సంజాతుడైన కృష్ణారావు, చక్కని గుణగణాలతో నేర్పి పెంచి పెద్దచేసిన తల్లి నరసాంబను, తననెంతో ప్రేమగా చూసి, తన కృతిని ముద్రింపజేసిన అమ్మమ్మ అంతామాంబకు జోహారు లర్పించినది.
‘సతీలలామ’ కావ్యం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టింది. అడుగడుగునా స్త్రీ ధర్మాన్ని పాతివ్రత్య ప్రభావాన్ని నీతిని కీర్తింపజేసింది. ప్రాచీన కవుల వలె కావ్య రచనను శ్రీకారంతో మొదలుపెట్టి ఇష్ట దేవతాసుత్తి, వాణీసుత్తి చేస్తూ ‘కచ్చిములు గూర్చగా శక్తి కలుగజేయు, మమ్మ మాయమ్మ నినుదలతు నమ్మ వాణీ అని భక్తితో పలికింది. ఉభయ వేదాంత శిఖామణి యతిరాజు, ఆంధ్ర గీర్వాణ విద్యల ప్రౌఢి, అవధాన వైఖరి, జ్యోతిష్యము, తర్కమునందు తగు పాండిత్యము సముపార్జించి ఎదుటివారిని తన వాదనతో మెప్పించి కీర్తిగాంచిన తన గురువు కృష్ణమాచార్యుని తలచినది. అంతేకాక ప్రాచీన కవుల స్తుతి చేసింది. పునుగోటి వంశాబ్ధి పూర్ణేందు శేఖరుడు సమభాషకుడగు జనకుడు మంగారావును, తల్లి సౌభాగ్యవతి నరసమాంబకు నమస్కరించింది. నిజాం ప్రభుత్వంలో రజాకార్ల జమానాలో ఉర్దూ మదర్సాలున్న కాలంలో తన తండ్రి శాస్త్రీయ విద్యాబుద్ధులను నేర్పుట గొప్ప విషయమని, తన పూర్వజన్మ సుకృతమని తెలిపినది. ఎంత ఎదిగితే అంత ఒదగాలనే గుణాన్ని ఇలా తెలియజేసింది.
‘‘సకల కావ్యంబుల సంపూర్తిగా గనలేదు
ఛందుస్సును బాల చదువలేదు,
నాటకాలంకార పాటవం లేదని’’
విద్యా వినయ సంపన్నురాలిగా పన్నెండేల్ల ప్రాయంలో పలికింది. భూతలమందనేక జాతులున్నా అందు ముఖ్యమైనది స్త్రీ, పురుషులని, నాతికి పతి సేవయే పరమ ధర్మమని తెలిపింది. అడవిలో పండుటాకులు తిని, ముక్కు మూసుకున్న తాపసులకన్నా గంగానది తీర్థయాత్రలు చేసి, ఉపవాసము లుండి, పూజలు, నోములు చేసేవారికంటే పతి సేవ చేసే మగువ పుణ్యం గొప్పదని తెలియజేశారు ఆనందాంబ గారు.         

(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన  ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
-డా।। ఆర్‍. కమల

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *