కోట్ల నర్సింహులపల్లి గ్రామంలో మరో జైన దిగంబర విగ్రహం

కరీంనగర్‍ జిల్లాలోని గంగాధర మండలం కోట్ల నర్సింహులపల్లె ఒక చారిత్రక గ్రామంగా ప్రసిద్ది చెందియుంది. ఇది ఒక కుగ్రామమైనా ఇక్కడ పురావస్తు సంపదలతో విలసిల్లుతున్నది. ఇక్కడ జైన దిగంబర విగ్రహాలు బయల్పడటం ద్వారా, పదే పదే పత్రికల్లోకి ఎక్కుతోంది. క్రీ.శ. 7-9 శతాబ్దాల మధ్య వేములవాడ చాళుక్యులు, రాష్ట్రకూటులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ గ్రామం అటు హిందూ దేవాలయాలతో పాటు, జైన మత వికాసానికి, ప్రాభవానికి ఆలవాలంగా నిలుస్తున్న దనడానికి కారణం, జూన్‍ 13 వ తేదీన ఇక్కడ ఒగ్గు అంజయ్య అనే ఒక రైతు పొలంలో ట్రాక్టర్‍తో దుక్కులు దున్నుతుండగా వర్ధమాన మహావీరుడి విగ్రహం బయట పడింది. ఇది క్రీ.శ 9వ శతాబ్దానికి చెందిన విగ్రహంగా అంచనా వేస్తున్నారు. వేములవాడ చాళుక్యులు , కళ్యాణీ చాళుక్యులు, హిందూ మత ప్రాభవానికి కృషి చేయడంతో పాటు, అటు జైన మత విస్తరణకు, జైన బసదులు, జైన మందిరాల ఎర్పాటుకు ఎంతగానో కృషి చేసినట్లు చరిత్ర చెబుతున్నది. అంతకు ముందు ఈ గ్రామంలో 23వ తీర్థంకరుడైన పార్శ్వనాధుడి విగ్రహం ఒకటి బయట పడి సంచలనం రేకెత్తించింది. ఏడు తలలు గల సుందరమైన పార్శ్వనాధుడి విగ్రహం ఇదే పొలంలో గత మూడేళ్ళ కిందట బయట పడింది. ఈ మూడేళ్ళలో వరుసగా ఒకే రైతు పొలంలో రెండు జైన మత సంబంధిత విగ్రహాలు వరుసగా బయట పడటంతో ఈ గ్రామం జైన మత విగ్రహాల నిధిగా, ఒకప్పటి జైన మత ప్రాభవాన్ని సూచిస్తున్నదని, ఇక్కడ పురావస్తుశాఖ వారు తవ్వకాలు జరిపితే, మరెన్నో విగ్రహాలు బయట పడే అవకాశముందని గ్రామస్తులు అంటున్నారు. అసలు ఈ గ్రామమే పురావస్తు సంపదలకు నిధియని, జైన విగ్రహాలకు ఆనవాలమని, ఇక్కడ కాకతీయుల కాలం నాటి నందగిరి వీరభద్ర స్వామి దేవాలయం కూడా ఉందని, ఇవన్నీ కలిపితే ఈ గ్రామం అటు హిందూ, జైన మత ప్రాభవాల తో తులతూగినట్లు తెలుస్తోందని ఈ గ్రామాన్ని సందర్శించిన పురావస్తు శాఖ, కరీంనగర్‍ విభాగం ఇంచార్జీ సహాయ సంచాలకులు పి.నాగరాజు, పురావస్తు శాఖ సీనియర్‍ కేర్‍ టేకర్‍ ఎర్రమరాజు భానుమూర్తి గారు అంటున్నారు.


ఇటీవల ఈ ప్రాంతాన్ని వేర్వేరుగా సందర్శించిన జిల్లా కలెక్టర్‍ శశాంక్‍, పోలీస్‍ కమీషనర్‍ కమల్‍ హసన్‍ రెడ్ది, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‍ కు గ్రామస్తులు పురావస్తు తవ్వకాల విషయమై పదే పదే విజ్నప్తి చేశారు. ఇక్కడికి సమీపంలోనే కుడిక్యాల గ్రామశివారులో బొమ్మలమ్మ గుట్టపైన క్రీ.శ 940 కాలం నాటి త్రిభాషా శాసనం ఉంది. దీనిని కన్నడ ఆదికవి పంపమహాకవి సోదరుడైన జినవల్లభుడు నిర్మించాడు. పంప మహాకవి వేములవాడ రెండవ అరికేసరి ఆస్థాన కవిగా వెలుగొంది, విక్రమార్జునీయం, ఆదిపురాణం తదితర గ్రంధాలను రాశాడు. ఇవన్నీ జైన మత సంబంధితమైన గ్రంధాలు కావడం గమనార్హం. ఇక్కడి గుట్తపైన ఉన్న గండశిలపై ఆదికవి నన్నయ్యకు పూర్వం రాయబడిన తొలి మూడు కంద పద్యాలు రాయబడ్దాయి. 2018లో జరిగిన తెలంగాణా తొలి ప్రపంచ మహా సభలకు ఈ శాసనం ఒక స్ఫూర్తి గా నిలిచింది.


కోట్ల నర్సింహులపల్లిలో దేవుని గుట్టపై ఉన్న ఒక గుండు గోడకు షోడశబాహు అష్టముఖ ఉగ్ర నారసింహ స్వామి వెలిశాడు. అంతేకాక దేవుని గుట్టపై ప్రసన్న లక్ష్మీ నరసింహ స్వామి, సీతారామ చంద్రస్వామి వారి దేవాలయం, పక్క నున్న గుట్టపై శివాలయం, అందమైన కోనేరులు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజూ ఈ దేవుళ్ళకు పూజా పునస్కారాలు, ధూప దీఫ నైవేద్యాలు ఆగమ శాస్త్ర రీతిలో కొనసాగుతున్నాయి. కోట్ల నర్సింహులపల్లి ఒక నాటి నందారాజుల సైనిక స్థావరమని, ఇక్కడే నందులు గుట్టపైన ఒక కోటను కూడా కట్టించారని, గుడులు నిర్మించారని ప్రాచీన చారిత్రక గ్రామంగా ఈ గ్రామానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయని ఇక్కడి గ్రామస్తులు అంటున్నారు. కోట నిర్మాణం, మధ్యయుగాల నాటి నరసింహస్వామి దేవాలయం ఉన్నందున, ఈ గ్రామానికి కోట్ల నరసింహులపల్లి అని పేరు వచ్చి యుండవచ్చునని గ్రామస్తులు అంటున్నారు. ప్రస్తుతం ఈ రెండు జైన విగ్రహాలను వ్యవసాయ భూమికి సమీఫంలోని బీరన్న గుడి వద్దకు తరలించారు. ఉమ్మడి కరీంనగర్‍ జిల్లాలో వేములవాడ, జైన, నగునూర్‍, మొక్కట్‍ రావు పేట మునుల గుట్ట, కుడిక్యాల బొమ్మలమ్మగుట్ట తొ పాటుగా, తెలంగాణాలో బోధన్‍, కొలనుపాక, ఆలేర్‍, కీసరగుట్ట, హన్మకొండ తదితర ప్రాంతాలలో జైనమత ప్రాభవాలకు ప్రసిద్ధిగా నిలిచింది. దేవుని గుట్టను, ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసి, దిగువ, ఎగువ మానేర్‍ సర్కిల్‍ లో భాగంగా, ఒక టూరిజం స్పాట్‍ గా గుర్తించి, సందర్శకులు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని,తగిన సౌకర్యాలను కల్పించాలని, స్థానికులు పురావస్తు శాఖ, టూరిజం శాఖ వారిని కోరుతున్నారు. ఇక్కడ లభ్యమైన రెండు జైన విగ్రహాలను మాత్రం ఎవ్వరికీ ఇచ్చేది లేదని, మెదక్‍ జిల్లా కొల్చారం లాగా ఒక జైన క్షేత్రంగా అభివృద్ది చేస్తానమని గ్రామ సర్పంచ్‍ తోట కవిత, గ్రామనాయకులు తోట మల్లారెడ్ది, గ్రామ చరిత్రకారులు చల్లూరి రమణాగారు అంటున్నారు. జిల్లా మ్యూజియం కు గాని, జైన సమాజాలకు గాని ఇచ్చేది లేదని వీరు జిల్లా కలెక్టర్‍ కు విజ్నప్తి చేశారు.


కొత్తరాతి యుగం పరికరాలు

గ్రామంలోని బీరప్ప దేవా లయంలో పూజలందుకుంటున్న రెండు రాతి గొడ్డళ్ళను కొత్త రాతి యుగం రాళ్ళుగా గుర్తించారు. ఈ గ్రామంలో వెలువడిన జైన విగ్రహాలను ఇక్కడే వుంచినపుడు, పురావస్తు శాఖ అధికారుల దృష్టి వీటిపై పడింది. బీరప్ప ఆచారంగా వస్తున్న కత్తుల పక్కనే ఉంచిన ఈ రాతి గొడ్డళ్ళను పురావస్తు శాఖాధికారులు పి.నాగరాజు, భానుమూర్తిలు గుర్తించారు. ఈ గ్రామ పరిసరాలు ఆదిమానవుడి ఆవాసాలుగా ఉన్నాయని, ఇందులకు ఈ రాతి గొడ్డళ్ళే సాక్ష్యం అని వీరంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రాంతానికి మూడు వేల అయిదు వందల ఏళ్ళ పూర్వ చరిత్ర ఉందని వీరు అంచనా వేస్తున్నారు.


జైన విగ్రహాల సాంకేతిక వివరాలు
1. మల్లినాథ తీర్థంకరుని విగ్రహం-నల్లని పాలిష్ట్ రాతితో మలచబడిన ఈ విగ్రహం సుందరంగా ఉంది. విగ్రహం ఎత్తు 90 సెంటీమీటర్లు, వెడల్పు 76 సెంటీ మీటర్లు. పద్మాసనంలో విగ్రహం ఉంది. శిరస్సుపై వెంట్రుకల ముడులు అందంగా చెక్కబడి యున్నాయి. మొదట దీనిని వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకరుడు, చివరివాడు అని తేల్చారు. జైనంలో పరిశోధన చేస్తున్న రెడ్డి రత్నాకర్‍ రెడ్డి మాత్రం మల్లినాథ తీర్ధంకరుడని చెప్పారు. ఇతను కూడా జైన మత ప్రధాన ప్రచారకుడిగా పేరొందాడని చెప్పారు.


ఇలాంటి విగ్రహాలు వేములవాడ రాజేశ్వరాలయంలో ఉండగా, 1970 ప్రాంతాలలో ఆలయ పునర్నిర్మాణ సమయంలో పెకిలించి వేసి, అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయంలో పడవేశారు. అవి రక్షణ లేకుండా ఎండకు ఎండుతూ పాడై పోతున్నాయి. 1980 ప్రాంతాలలో మాత్రం ఇక్కడి గుడిలోని అయిదు జైన విగ్రహాలను, జైన చౌక్‍ లను హైదారాబాద్‍ లోని బిర్లా దేవాలయంలోకి తరలించారు. వేములవాడలో ఇకనైనా జాగు చేయక ఒక సైట్‍ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


2. ప్రార్శ్వనాధుని విగ్రహం- ఇది ఏడు తలల విగ్రహం. జైన తీర్ధంకరులలో ఇతను 23 వ తీర్ధంకరుడిగా చెబుతారు. 22 తీర్ధంకరుల తర్వాత పార్శ్వనాధుడిని, వర్ధమాన మహావీరుడిని చారిత్రిక పురుషులుగా తేల్చి చెప్పారు. నల్లటి బ్లాక్‍ బసాల్ట్ రాతిలో చెక్కబడింది. దీని ఎత్తు మూడు అడుగులు. చూఫరులకు సుందరంగా కనబడుతుంది. ప్రస్తుతం దీన్ని గూడా బీరన్న గుడి వద్దే ఉంచారు. రుగ్వేద కాలం తర్వాత వచ్చిన వైదిక యుగపు చివరి కాలంలో జైన, బౌద్ధ మతాలు ఊపిరి పోసుకున్నాయి. ప్రస్తుతానికి ఈ రెండు విగ్రహాలను ప్రభుత్వ పాఠశాలకు ఎదురుగా ఉన్న చిన్న గదిలో భద్రపరిచారు.


జిల్లా కలెక్టర్‍ శశాంక సందర్శన:
కరీంనగర్‍ కలెక్టర్‍ శశాంక్‍, పోలీస్‍ కమీషనర్‍ కమల్‍ హసన్‍ రెడ్ది, జైన సమాజాల ప్రతినిధులు ఈ గ్రామాన్ని జూన్‍ 16వ తేదీన సందర్శించి, గ్రామ చరిత్రను వాకబు చేశారు. గ్రామస్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొన్నారు. విగ్రహాలను చూసి ముగ్ధులయ్యారు. పురావస్తు తవ్వకాలకై సిఫారస్‍ చేస్తామని అన్నారు. ఇక్కడ ఉన్న దేవుని గుట్టపై గల గుడులను, నందగిరి వీరభద్రస్వామి దేవాలయాల్ని సందర్సించారు. గ్రామస్తుల కోరికపై ఇక్కడే జైన గుడులు కట్టేలా సహకరిస్తామని హామీ ఇస్తూ, అంతవరకు సంరక్షణాబాధ్యతలు గ్రామస్తులు తీసుకోవాలని కలెక్టర్‍ గ్రామస్తులను కోరారు. విగ్రహాలు లభించిన వ్యవసాయ భూమి రైతు ఒగ్గు అంజయ్య గారితో మాట్లాడారు.


-సంకేపల్లి నాగేంద్ర శర్మ
ఎ : 80748 26371

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *