చిత్తా…? బొత్తా..

మీరు ఏం మాట్లాడినా
ఎవర్ని ప్రశంసించినా
మీరెన్ని వంకర్లు పోతున్నా
మీ పరిధులు దాటినా
మేం కళ్ళు మూస్కు నడవాల్సిందే
నిస్సహాయంగా
నిశ్శబ్దంగా
నా గొంతు కింద
ఆర్టికల్‍ 19 నలిగి పోతుంది
నేనిక మాట్లాడను
ధిక్కారమో, దండనో
నన్ను పరుగెత్తిస్తుంది
జెండా వందనం తరువాత
పిల్లలకి చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు
ఇది కూడా అలాంటిదేనేమో!!
ప్రశాంత్‍భూషణ్‍ కోర్టు ధిక్కారణ నేరం చేశాడని సుప్రీంకోర్టు నిర్ధారణ చేసిన తరువాత ఓ తెలుగు కవి ఆవేదన, ఆక్రోసం. ఇంతకీ ప్రశాంత్‍ భూషణ్‍ చేసిన నేరం ఏమిటి? ఆయనకు వేసిన శిక్ష ఏమిటి?
సుప్రీంకోర్టు తనకు తానుగా స్వీకరించిన కోర్టు ధిక్కార నేరంలో ప్రశాంత్‍ భూషణ్‍కి ఒక్క రూపాయి జరిమానాన్ని విధించింది. జరిమానా కట్టని పక్షంలో మూడు నెలల జైలుశిక్షని, మూడు సంవత్సరాలు సుప్రీం కోర్టులో ప్రాక్టీస్‍ చేయడానికి వీల్లేదని కోర్టు ప్రకటించింది. ఈ జరిమానాని సెప్టెంబర్‍ 15లోగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో జమ చేయాలని కోర్టు ఆదేశించింది. అతను డిపాజిట్‍ చేశారు. సుప్రీంకోర్టులో రివ్యూ దరఖాస్తుని దాఖలు చేశాడు. తీర్పుని ప్రకటిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీపక్‍ మిశ్రా ఇలా అన్నారు.
‘‘న్యాయమూర్తులు మీడియా దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళు కోర్టు వెలుపల చేసిన కామెంట్స్ని స్వీకరించకూడదు.’’
ప్రశాంత్‍ భూషణ్‍ చర్యలు సుప్రీంకోర్టు గౌరవాన్ని కించపరిచే విధంగా వున్నాయి. ప్రజల దృష్టిలో సుప్రీంకోర్టు చులకన అయ్యే విధంగా అతని చర్యలు వున్నాయని కోర్టు తన తీర్పులో పేర్కొంది. వాక్‍ స్వాతంత్య్రం వుంది కాని అది ఇతరుల హక్కుని గౌరవించే విధంగా వుండాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
భూషణ్‍ నేరం చేశాడని కోర్టు నిర్ధారించిన తరువాత, అతను క్షమాపణ చెప్పుకోవడానికి సుప్రీంకోర్టు చాలా అవకాశాలను అతనికి ఇబ్బంది. సారీ! నేను క్షమాపణలు చెప్పలేనని అతను సుప్రీంకోర్టుకి విన్నవించాడు. తాను క్షమాపణలు చెప్పితే తనలో విధేయత లేదని భావించే అవకాశం వుందని తన విమర్శ సదుద్దేశ్శంతో చేసిందని అతను అభిప్రాయ పడ్డాడు కోర్టుకి అదే విషయం వివరించాడు.
సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని భూషణ్‍ తీర్పు వచ్చిన వెంటనే ప్రతిస్పందించాడు. ఈ దేశపౌరునిగా కోర్టు నిర్ణయాన్ని పాటిస్తానని, ఈ దేశ పౌరులకి హక్కులని కాపాడే దిక్కు సుప్రీంకోర్టు మాత్రమేనని అతను పేర్కొన్నాడు. అక్కడితో ఆయన వూరుకోలేదు. తన ట్వీట్లు నిర్మాణాత్మక మైనవని, న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పని చేయడానికి ఉపయోగపడుతుందని కూడా ఆయన అన్నారు.
కోర్టు ధిక్కార నేరం ప్రశాంత్‍ భూషణ్‍ చేశాడని సుప్రీంకోర్టు ఆగస్టు 14, 2020న నిర్ధారించి, అతను క్షమాపణ కోరడానికి విపరీతమైన సమయాన్ని ఇచ్చి ఆగస్టు 31, 2020 రోజున తన తీర్పుని ప్రకటించింది. కోర్టు ఇలా తన తీర్పులో అభిప్రాయపడింది.
‘‘ప్రశాంత్‍ భూషణ్‍ నడవడికను గమనించి మేం అతన్ని శిక్షించకపోతే సమాజానికి తప్పుడు సంకేతం వెళ్తుంది. మా ఔదార్యాన్ని ప్రదర్శించి కఠిన శిక్షను కాకుండా ఒక్క రూపాయి జరిమానాని, టోకెన్‍ జరిమానాగా విధిస్తున్నామని కోర్టు పేర్కొంది’’. జరిమానా కట్టని పక్షంలో మూడు మాసాల జైలుని అనుభవించాలని, అదే విధంగా మూడు సంవత్సరాలు సుప్రీంకోర్టు ముందు ప్రాక్టీస్‍ చేయడానికి వీల్లేదని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
ఈ నామమాత్రపు జరిమానాన్ని ఈ దేశంలోని ఎవరైనా చెల్లించగలరు. అది 15 రోజుల్లో. భూషణ్‍ లాంటి సీనియర్‍ న్యాయవాదులకి అది చాలా చిన్న విషయం. అది కట్టని పక్షంలో సుప్రీంకోర్టు విధించిన శిక్ష కఠినమైనది. అయితే జరిమానా కట్టని పక్షంలో అంత జైలుశిక్షని కోర్టు విధించే అవకాశం వుందా?
శిక్షని నిర్ధారించడం, శిక్షని (జరిమానాన్ని) విధించడం, జరిమానా కట్టని పక్షంలో విధించే శిక్ష అన్నవి మూడు ప్రధాన అంశాలు. వేరు వేరు విషయాలు.
భారతీయ శిక్షాస్మృతిలోని అధ్యాయం మూడులో శిక్షలు అన్న చాప్టర్‍ వుంది. శిక్షలు ఎలా వుంటాయి. జరిమానా క్టనప్పుడు ఎలాంటి శిక్షలు విధించాలన్న విషయాలని అందులో పేర్కొన్నారు. ఆ అధ్యాయంలోని సె.64 ప్రకారం జరిమానా విధించిన తరువాత, అది కట్టలేని పరిస్థితి వున్నప్పుడు కోర్టు జైలు శిక్ష విధించే అధికారం గురించి చెబుతుంది. ముద్దాయి చేసిన నేరానికి జైలు శిక్షా, అదే విధంగా జరిమానా విధించే అవకాశం వున్నప్పుడు, జరిమానా కట్టని పక్షంలో విధించే శిక్ష అతను చేసిన నేరానికి వున్న శిక్షలో 1/4 మాత్రమే విధించాల్సి వుంటుందని సె.65 చెబుతుంది. దీని ఉద్దేశ్యం అతను జరిమానా చెల్లించాలి. అంతే కాదు.. కట్టని పక్షంలో విధించే శిక్ష మరీ మితిమీరి ఉండటానికి వీల్లేదు.


కోర్టు ధిక్కారణ చట్టంలోని సె.12 ప్రకారం నేరం చేసిన వ్యక్తికి 6 మాసాలు జైలు వరకు, అదే విధంగా 2000/- రూపాయల వరకు జరిమానాని లేదా రెండింటిని కోర్టు విధించవచ్చు. ఈ నేరానికి విధించాల్సిన ఎక్కువలో ఎక్కువ 2000/- రూపాయలు. శిక్ష ఆరు మాసాలు. జరిమానా కట్టని పక్షంలో విధించాల్సిన శిక్ష 6 నెలల్లో 1/4 అంటే నెలమీద పదిహేను రోజులు.


ఈ కేసులో ప్రశాంత్‍ భూషణ్‍ జరిమానా కట్టని పక్షంలో విధించాల్సిన శిక్ష మూడు మాసాలు కాదు. కానీ సుప్రీంకోర్టు మూడు మాసాల శిక్షని జరిమానా కట్టని పక్షంలో విధించింది. అంతేకాదు అది ఎక్కువలో ఎక్కువగా విధించాల్సిన శిక్ష. అతనికి విధించిన జరిమానా ఒక రూపాయి. ఈ జరిమానా కట్టని పక్షంలో విధించాల్సిన శిక్ష ఆ జరిమానానికి తగినట్టుగా వుండాలి తప్ప ఎక్కువగా వుండకూడదు. నిజానికి జరిమానా కట్టని పక్షంలో విధించే శిక్ష, శిక్ష కాదు.
సుప్రీంకోర్టు తన ఔదార్యాన్ని ప్రదర్శించి ప్రశాంత్‍ భూషణ్‍కి అతి తక్కువ శిక్ష, నామమాత్రపు శిక్షని విధించింది. అలాంటి ఔదార్యాన్ని జరిమానా కట్టని పక్షంలో ప్రదర్శించలేదు. అదే విధంగా అతను సుప్రీంకోర్టులో మూడు సంవత్సరాల పాటు ప్రాక్టీస్‍ చేయకూడదని కూడా ఆదేశించింది. ఇవి రెండూ ఔదార్యానికి నిదర్శనాలు కాదు. అంటే నామమాత్రపు శిక్ష విధించడానికి సుప్రీంకోర్టు ప్రదర్శించిన ఔదార్యం కాదానన్న సందేహం చాలా మందికి వచ్చే అవకాశం వుంది. నిజంగానే ఔదార్యం అయితే జరిమానా కట్టని పక్షంలో ఒక్కరోజు శిక్ష విధిస్తే సరిపోయేది. సుప్రీంకోర్టు అలా చేయలేదు. మరో విషయం జరిమానా కట్టని పక్షంలో శిక్షని కోర్టు తప్పక విధించాల్సిన అవసరం లేదు. భారతీయ శిక్షాస్మృతిలోని సె.68 ప్రకారం జరిమానా విధిస్తే సరిపోతుంది. ఒకవేళ జరిమానా కట్టక పోతే భూమి శిస్తుని వసూలు చేసే విధంగా అతని ఆస్తిని జప్తు చేసి వసూలు చేయవచ్చు. ఈ విషయాన్ని క్రిమినల్‍ ప్రొసీజర్‍ కోడ్‍లోని సె.421 చెబుతుంది. శాంతిభూషణ్‍ తప్పక జరిమానా కట్టాలని కోర్టు సె.69ని ఉపయోగిచింది.


శిక్ష విధించే ముందు ముద్దాయి వాదనని కోర్టు వినాల్సి వుంటుంది. అందుకోసం కేసుని వాయిదా వేయాల్సిన అవసరం లేదు. ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే వాయిదా ఇవ్వవచ్చు. అది కూడా ముద్దాయి కోరితేనే. కానీ ఈ కేసులో కోర్టు తనకు తానుగా రెండుసార్లు వాయిదాని ఇచ్చింది. తనకు తానుగా సుప్రీంకోర్టు కోర్టు ధిక్కార నేరాన్ని గుర్తించి, ప్రశాంత్‍ భూషణ్‍న్ని కోర్టు పిలిచి శిక్షను విధించింది. తన ఔదర్యాన్ని ప్రదర్శించి నామమాత్రపు జరిమానాని విధించింది. కానీ జరిమానా కట్టని పక్షంలో తన ఔదర్యాన్ని ప్రదర్శించలేదు. ఇది ఔదార్యం కాదానన్న విషయాన్ని వదిలేద్దాం.


సుప్రీంకోర్టు ఎందుకు ఔదార్యాన్ని ప్రదర్శించినట్టు? ఎందుకు రెండుసార్లు క్షమాపణ కోరమని ప్రశాంత్‍ భూషణ్‍ని కోరినట్టు? లేదా ఒత్తిడి తెచ్చినట్టు.
ఇలాంటి ఔదార్యాన్ని సిట్టింగ్‍ న్యాయమూర్తి కర్ణన్‍ విషయంలో కొంత మేరకైనా ఎందుకు ప్రదర్శించనట్టు? ఇవి నాలాంటి వాళ్ళకి అర్థం కాని విషయం.
ఏమైనా కోర్టుల్లో శిక్షలు చిత్తా బొత్తాలా వుంటే ఎలా మరి..?


-మంగారి రాజేందర్‍ (జంబో)
ఎ : 9440483001

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *