రెండువేల పద్నాలుగు నుంచి తెలుగులో బాల సాహిత్యాన్ని గురించిన సోయి గతంలో ఎప్పుడూ లేనంతగా పెరిగింది. పెద్దవాళ్ళు పిల్లలకోసం రాయడంతో బాటు పిల్లలు కూడా బాల సాహిత్యంలో కథలు, కవిత్వం విస్తృతంగా రాస్తున్నారు. వాళ్ళ రచనలు కూడా పుస్తకాలుగా అచ్చయి వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు అన్ని తెలుగు పత్రికలు పిల్లల రచనలను ప్రచురిస్తున్నాయి. బాలసాహిత్యం వికసించడానికి అవసరమైన వాతావరణాన్ని కొన్ని సాహిత్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, బాల సాహిత్యవేత్తలు, బాల సాహిత్య అభిమానులు పోత్సహిస్తున్నా తెలంగాణ సాహిత్య అకాడమి కూడా ఇందుకు ప్రోత్సహిస్తూ, సహకరిస్తున్నది. పాఠశాలలు, ఉపాధ్యాయులు ఇందుకు చేస్తున్నకృషి ప్రత్యేకంగా గుర్తింపదగ్గది.
పిల్లల్లో భాషతో పాటు సాహిత్యం పట్ల అవగాహన కలిగించడానికి అభిరుచిని పెంచుతూ, నైపుణ్యాలు వికసింప జేయడానికి ఈనాటి పిల్లలు చదివే పాఠశాల పాఠ్యపుస్తకాలు విస్తారమైన అవకాశాన్ని కల్పిస్తున్నాయి. పరీక్షల కోసం, మార్కుల కోసం కాకుండా ఆటల్లో కథలనూ, పాటలనూ, కవితలనూ, ఇంకా వివిధ సాహిత్య పక్రియలనూ పాఠాలకు అనుబంధంగా పిల్లలకు పరిచయం చేయడం కనిపిస్తున్నది. సొంతంగా పిల్లలు ఆలోచించేలా, రాసేలా, చెప్పేలా ప్రోత్సహిస్తూ ఎన్నో కృత్యాలు ఉన్నాయి. ఈనాటి పాఠ్యపుస్తకాల్లో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న తెలుగు పాఠ్యపుస్తకాల్లో కథ, గేయం, పాట, కవిత్వం పక్రియల గురించి పిల్లలకు ఇస్తున్న పనులు, ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో క్లుప్తంగా ఓ విహంగావలోకనం చేద్దాం రండి!
పరిశీలించడం, ఊహించడం, కల్పించడం, సంభాషణలు రాయడం, శీర్షికలు నిర్ణయించడం, పొడిగించి రాయడం, అనుభూతి చెందడం, మంచి చెడుల వివేచన చేయడం వంటివి సాహిత్య సృజనకు అవసరమైన నైపుణాలు. ముఖ్యంగా కథకు, కవిత్వానికి ఈ నైపుణ్యాలు అత్యంత కీలకమైన అవసరాలు. కనుక వీటిని నేర్పడానికి సంబంధించిన ఎన్నో పనులు, ప్రాజెక్టులు పిల్లల కోసం ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న తెలుగు పాఠ్యపుస్తకాల్లో అనేకం ఉన్నాయి. వాటిలో కొన్నింటిని చూద్దాం.
ఒకటవ తరగతి పాఠ్యపుస్తకంలో పిల్లలు బొమ్మను చూసి కథను ఊహించి చెప్పడం, తెలిసిన కథలను, తాము విన్న కథలను సొంతమాటల్లో చెప్పడం వంటివి ఉన్నాయి.
పిల్లలు అంతకుముందే విని ఉండే అవకాశం ఉన్న పంచతంత్రం వంటి ప్రసిద్ధమైన బొమ్మలు కథలు, ఊహకు ఆస్కారం ఇచ్చే కథల బొమ్మలు, కుటుంబం, ఊరు, సమాజం వంటివి ప్రతిఫలిస్తున్న బొమ్మలు, కల్పనలకూ, సృజనకూ ఎంతో ఆస్కారం ఇచ్చే బొమ్మలు ప్రతి పాఠంలోనూ కనిపిస్తాయి. ఉదాహరణలు చూస్తే ఓ ‘ఇల్లు – వంటిల్ల్లు’ అక్కడ రకరకాల పనులు చేస్తున్న ‘పెద్దలు – పిల్లలు’ మరో పాఠంలో రకరకాల ఆటలు ఆడుకుంటున్న పిల్లలు, మాట్లాడుకుంటున్న పెద్దలు కనిపిస్తారు.
ఈత కొడుదాం అనే బొమ్మలో ఓ పల్లెటూరు, చెరువు. ఆచెరువు నీళ్ళలో చేపలు, వాటికోసం వెతుకుతున్న కొంగలు, జాలరులు, నీళ్ళు తాగుతున్న పశువులు, వాటి వెంట కాపరులు, ఓ పడవ, సంతోషంగా ఈతలు కొడుతున్న పిల్లలు, బట్టలు ఉతకడానికి వస్తున్న ఆడవాళ్ళు, వాళ్ళ వెంట పిల్లలు, చెరువు పక్కన చెట్టు మీద పక్షులు, పిల్లలు, బాటమీద వెళుతున్న ఎడ్లబండి, ఓ సైకిల్ మీద మనిషి, గడ్డిమోపును మోసుకు పోతున్న స్త్రీ, బాటకు మరో పక్కన పొలాలు కనిపిస్తాయి. ఆ పొలాల గట్ల మీద ఈతచెట్లు, వాటిపై ఒక కల్లుతీసేవాడు, పొలాల మధ్యలోంచి ఊళ్ళోకి కనిపిస్తున్న తోవ, చిన్న చిన్న ఇళ్ళతో ఊరు, నీళ్ళట్యాంకు, ఓ కొండ మీద గుడి , వెళుతున్న ఓ బస్సు , చెట్ల మీద తేనేతెట్లు, తేనెటీగలు ఇలా బొమ్మల్ని చూస్తూ పిల్లలు స•జనకు ప్రాణమైన పరిశీలనా శక్తి అద్భుతంగా పెంచుకోవచ్చు. అనేక పేజీల్లో ఇలా ఉన్న బొమ్మల్ని చూస్తూ కథలుగా ఊహించుకోవచ్చు. ఇలా ఒకటవ తరగతి పాఠ్యపుస్తకం నిండా బొమ్మలు పిల్లల సాహిత్య సృజనకు ప్రాణం పోస్తాయి. పిల్లలు ఈ బొమ్మల్ని చూస్తూ తెలిసిన కథలు గుర్తించి, జ్ఞాపకం తెచ్చుకొని తమ భాషలో చెప్తారు. సంఘటనల్ని చెప్తారు. సంభాషణలు కల్పిస్తారు. ఈ ఒకటవ తరగతి నిండా బొమ్మలు, కథలు, గేయాలే కనిపిస్తాయి. కథల్ని చెప్పడం, గేయాల్ని పాడించడం పిల్లలు ఓ ఆటలాగా నేర్చుకునే ఓ క్రమం ఈ పుస్తకంలో ప్రారంభమౌతుంది. అయితే ఇది ఒకటవ తరగతి కనుక మౌఖికంగా చెప్పడానికి పరిమితం ఔతుంది. ఈ పుస్తకం పూర్తయ్యేసరికి పిల్లలు తెలిసిన కథల్ని సొంత మాటల్లో చెప్పగలుగుతారు. బొమ్మల ఆధారంగా కథలు ఊహించి చెప్పగలుగుతారు. బొమ్మల్లో కనిపించే వాళ్ళకు పేర్లు పెట్టగలుగుతారు. బొమ్మల్లో వాళ్ళ సంభాషణల్ని ఊహించ గలుగుతారు. తరువాత ఏం జరిగి ఉంటుందో ఊహిస్తారు. గేయాలను పొడిగించడం ప్రారంభిస్తారు.
రెండవ తరగతి పుస్తకంలో కూడా ఇలా బొమ్మల్ని చూసి కథల్ని చెప్పడం, తెలిసిన కథను సొంత మాటల్లో చెప్పడం, తెలియని కథల్ని బొమ్మల సహాయంతో ఊహించి, కల్పించి చెప్పడం వంటివి చాలా ఉన్నాయి. పిల్లలు బొమ్మల్ని చూసి ఏ కోణంలో పరిశీలించాలో ఏ దృష్టితో తమ ఆలోచనలు, ఊహలు చేయాలో కూడా తెలిపే సూచనలున్నాయి. ఆ బొమ్మల్లోని పాత్రల సంభాషణలు కూడా ఊహించి చెప్పడం, రాయడం, ఆ బొమ్మల్లోని పాత్రలకు పేర్లు పెట్టడం, గేయంలో ఉన్న కథను, కథగా మార్చి చెప్పడం. అంటే ఒక పక్రియలోంచి మరో పక్రియలోకి విషయాన్ని మార్చడం పిల్లలు ఈ పాఠ్య పుస్తకం పూర్తయ్యేసరికి నేర్చుకుంటారు.
ఇంకా చిన్నచిన్న గేయాలను పొడిగించడం, రాయడం ప్రారంభిస్తారు. అలాగే తాము గతంలో చూసిన వాటిని గురించి చెప్పడం తమకు నచ్చిన విషయాలు, తమ అనుభవాలు, ఆలోచనలు ఒక క్రమ పద్ధతిలో చెప్పడం మొదలు పెడతారు. అలాంటి పనులకు సంబంధించిన ఒక రెండు సూచనలు చూడండి. మీరు ఎప్పుడైనా రైలు ఎక్కారా? ఎక్కడికి పోయారు? ఎట్లా అనిపించింది? మీరు చూసిన చెరువు గురించి చెప్పండి. మీకు నచ్చిన ఆట ఏది? అది ఎట్లా ఆడతారు?
మూడవ తరగతి పుస్తకంలో కూడా ఇటువంటి కృత్యాలు ప్రతి పాఠంలో ఉన్నాయి. పిల్లల పరిశీలనా దృష్టి ఊహలనూ, కల్పనలనూ, ఆలోచనలనూ మరింత పెంచి విస్తృతం చేసే అవకాశాలు అందిస్తున్నది ఈ పాఠ్య పుస్తకం.
వ్యక్తుల గురించి, పాఠంలోని పాత్రల గురించి తమ అభిప్రాయాలు చెప్పడం పిల్లలు నేర్చుకునే కృత్యాలు ఉన్నాయి. కథలు, గేయాలు పొడిగించి చెప్పడం, రాయడం, సంభాషణలు రాయడం, వర్ణించి రాయడం, ఊహించి రాయడంతో బాటు అత్మకథను రాయడం గురించి తెలుసుకుంటారు. అందుకు సాధన ప్రారంభిస్తారు. వివిధ రూపాల్లో ఉన్న బాల సాహిత్యాన్ని ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం చెప్పడం ఓ ఆటలా అభ్యసిస్తారు. విరామ చిహ్నాలు ఉపయోగించి ఓ క్రమ పద్ధతిలో రాయడం వంటివి నేర్చుకోవడానికి తోవ ఏర్పరుస్తూ ఈ పాఠ్యపుస్తకం పిల్లలను ముందుకు నడిపిస్తుంది. వివిధ సన్నివేశాల్లో సందర్భోచితంగా ఈ భాష ఉపయోగించడం పిల్లలకు పరిచయం చేసే సూచనలున్నాయి.
బొమ్మలు చూసి పిల్లలు చేయాల్సిన, రాయాల్సిన సూచనలు కొన్ని చూడండి ‘‘ఈ బొమ్మలో కుటుంబంలో కనిపిస్తున్న వాళ్ళందరికీ పేర్లు పెట్టండి, ఇల్లు లేకపోతే ఏమవుతుంది? ఈ బొమ్మలో చలిమంట ముందర ఉన్న బాలుడికి, పక్కన నిలబడ్డ తండ్రికి మధ్య సంభాషణ ఊహించి రాయండి. ఈ బొమ్మలో బాలభీముడు, పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారో ఊహించి రాయండి. నవ్వొచ్చే విధంగా ముచ్చట్లు రాయండి. ఈ బొమ్మలో చీమ ఏనుగును ఎత్తి పట్టుకున్నప్పుడు ఏనుగుకు ఎట్లా అనిపించి ఉంటుంది?
ఇంకా పిల్లల సృజనాత్మక శక్తికి ఊతం ఇచ్చే సూచనలు, వివిధ పాఠాలకు అనుబంధంగా ఎన్నో ఉన్నాయి. కొన్ని చూడండి. వాన నీటిలో ఆడుతుంటే నీకు ఏమనిపిస్తుందో రాయండి. వాన పడుతుంటే మీరు ఏంచేస్తారు? నీకే బాలభీముడికి ఉన్నంత బలం ఉంటే ఏమేం చేస్తావు? మీరు ఆడుకునే ఆటలు ఏవి? వాటిని మీరు ఎక్కడ ఆడుతారు? మీరే చెట్టు స్థానంలో కదలకుండా ఒకే చోట ఉంటే ఎట్లా ఉంటుందో రాయండి.
వీటితో బాటు పక్రియలు మార్చి రాయడం, నాటకీకరణ చేయడం, సూక్తులు తయారు చేయడం, బాల సాహిత్యం చదవడం పాత కథను అనుసరించి, మార్చి కొత్త కథ రాయడం కూడా పిల్లలు మూడవ తరగతి పాఠ్యపుస్తకం సహాయంతో నేర్చుకుంటారు.
నాలుగవ తరగతి పాఠ్యపుస్తకంలో కూడా ఇలా పనులు ఉంటాయి. వీటితో బాటు పిల్లలలో సాహిత్య సృజనాత్మకతను పెంచడానికి అవసరమైన మరికొన్ని విషయాలు కనిపిస్తాయి. ఊహశక్తిని పెంచడం, పరిశీలనా శక్తిని, పరిశీలించే విధానాలను దృష్టిని కలిగించడం, సమాచారాన్ని సేకరించడం, వర్ణించి రాయడం, సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ ఆలోచించడం, రాయడం, స్పందించడం, కల్పనలు చేయడం, పక్రియలను మార్చిరాయడం, జ్ఞాపకాల పొరలలోంచి వెలికి తీయడం, కళాకారులను కలిసి ముచ్చటించడం, సంభాషణలు రాయడం, శీర్షికలు నిర్వహించడం, నిర్ణయించడం, విశ్లేషించడం వంటివి ఉన్నాయి. అయితే వాళ్ళ స్థాయిని మించకుండా కేవలం పరిచయ మాత్రంగానే ఉన్నాయి. ఇది అభిరుచి కలిగించే దశ, పరిచయం చేసే దశ అని మాత్రమే గుర్తుంచుకోవాలి. ‘బాల సాహిత్యం, కథల పుస్తకాలు, మేగజైన్ల వంటివి తరగతిలోనే అందుబాటులో ఉంచాలని’ ముందు మాటలో సూచించారు. అంతేకాదు ‘పిల్లలు రాసిన సృజనాత్మక వ్యక్తికరణ, ప్రాజెక్టు పనుల ఆధారంగా ఒక్కో పాఠానికి ఒక సంకలనంతో పుస్తకాన్ని తయారు చేయాలి’ అని కూడా సూచించారు.
ఈ పాఠ్యగ్రంథంలో ఉన్న కొన్నికృత్యాలు ప్రాజెక్టులు అందుకు సంబంధించి పిల్లలకు ఇచ్చిన ప్రశ్నలు, పనులు కొన్ని చూద్దాం. ‘బొమ్మలో ఒక అమ్మాయి బాధతో ఉందికదా! ఆమె బాధకు కారణం ఏమై ఉండొచ్చు? అక్కడి పిల్లలు, ఏమని ఓదారుస్తుండవచ్చు?’ మరో బొమ్మలో – ‘జారి పడిన పిల్ల వాడిని చూసి మిగిలిన పిల్లలు ఏంచేస్తున్నారు? నువ్వైతే ఏంచేసేవాడివి?’- మరో బొమ్మకు సంబంధించి – మీరు ఎప్పుడైనా జంతువులు, పక్షులకు సహాయం చేశారా? ఏంచేశారు?’ వృద్ధాశ్రమం కనిపిస్తున్న మరోబొమ్మకు సంబంధించి ‘బొమ్మలో వృద్ధులు అక్కడ ఎందుకున్నారు?’ వాళ్ళు పిల్లలతో తమ గురించి ఏమి చెప్పి ఉంటారు?’ ‘ఆస్థలంలో మీరే ఉంటే వృద్ధులను ఏమని ప్రశ్నిస్తారు? వాళ్ళకేం సహాయం చేస్తారు?’ పిల్లలకు ఇలాంటి సూక్ష్మ దృష్టిని ఇచ్చే కృత్యాలతో ఒక్కో బొమ్మకు ఒక్కో కథను సృష్టించుకునే నైపుణ్యం ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాదు సమాజం పట్ల, తమ చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల అవగాహన కలుగుతుంది.
ఇంకా-పిల్లలతో మాట్లాడుతున్న క్రికెట్ బ్యాట్ బొమ్మను చూపించి పిల్లలను కథ రాయమన్నారు. కొన్ని పదాలు ఇచ్చి గేయం రాయమన్నారు. ‘నీవు ఏయే మంచి పనులు చేస్తావు? ఎందుకు?’ అని రాయమని చెప్పారు. ‘కల్పనలకు రెక్కలు తొడుగుతూ’ – చెట్లకు రెక్కలు వచ్చి ఎగిరితే ఎట్లా ఉంటుంది? అవి మీతో మాట్లాడితే మీరేం చేస్తారు? అని అడిగారు. ‘రవికి పక్షులకు జరిగిన సంభాషణ ఊహించి రాయండి’ అని ఊహలకు పని కల్పించారు. అంతేకాదు మీగ్రామంలో మీకు తెలిసిన ఒక కళాకారుని గురించి తెలుసుకొని రాయండి’ అని క్షేత్ర పర్యటనకు తోవ చూపించారు. ఇంకా -చెరువు లేదా బడి గురించి ఆత్మకథ రాయగలను అనే నమ్మకాన్ని పిల్లల్లో కల్పించే ప్రయత్నాలు చేశారు. ‘మీ అమ్మా, నాన్న ఎట్లా ఉంటారో వర్ణించి రాయండి, అలాగే ‘మీరు తయారు చేసిన బొమ్మ మీతో మాట్లాడితే ఏం ముచ్చట్లు చెప్పుకుంటారో ఊహించి రాయండి! ఇలా అనేక కోణాల్లోంచి పిల్లల్ని ఆలోచింపజేస్తూ, పరిశీలింపజేస్తూ, ఊహలకూ, కల్పనలకూ అవకాశం ఇస్తూ నాలుగవ తరగతి పాఠ్య పుస్తకం పిల్లల్లో సాహిత్య సృజనాసక్తిని, శక్తినీ కలిగిస్తున్నది.
అయిదవ తరగతి పాఠ్య పుస్తకంలో కూడా కథలు, కవితలు, గేయాలు పొడిగించడం, సొంతంగా రాయడం ఉన్నాయి. ఆత్మకథ, నినాదాలు రాయడం, సూక్తులు, లేఖలు, సంభాషణలు, నాటకీకరణ వంటి పనులు పిల్లలు చేయడానికి అవసరమైన సూచనలు క•త్యాలు, బొమ్మలూ ఎన్నో ఈ పాఠ్యపుస్తకంలో చోటు చేసుకున్నాయి. సూచనలకు అనుగుణంగా చిత్రాలను గీయడం, వాటికి రంగులు వేయడం వంటివి కూడా ఉన్నాయి.
బొమ్మల్లో అనేక ఊహలకూ, కల్పనలకూ, ఆలోచనలకు ఆస్కారం ఇచ్చే చిత్రాలు, సూచనలు ఉన్నాయి. ఓ మార్కెట్ లో మనుషుల చుట్టూ కూరగాయలు రెక్కలొచ్చి గాల్లో ఎగురుతున్న బొమ్మ. ‘అవి అట్లా ఎందుకు ఎగురుతున్నాయి? అవి ఏమనుకుంటూ ఉండవచ్చు?’ అంటూ పిల్లల్ని ఆలోచింపజేసే మాటలు కనిపిస్తాయి. అంతేకాదు ‘నీవు కూడా అక్కడ ఉండి ఉంటే కూరగాయతో ఏం మాట్లాడే వాడిని?’ అని ఊహలకు రెక్కలు తొడగడం కూడా ఉంది. మరో చోట- ఒక అడవిలో ఎలుగుబంటి, పులి మంచి స్నేహితులు. ఒక రోజు అవి దారి తప్పి పట్నం వచ్చాయి. అక్కడేం జరిగిందో ఊహిస్తూ కథ రాయండి అంటూ ఓ మంచి కథా వస్తువును ఇచ్చారు.
మరో బొమ్మ లో ఓ అమ్మాయి నిలబడి ఉంది. ఆ అమ్మాయి ప్రిజ్, కూలర్, టీవీ, ఫ్యాన్, కంప్యూటర్, మిక్సి లాంటి వస్తువులు ఆ అమ్మాయితో ఏదో మాట్లాడుతూ ఉన్నాయి . ఇక్కడ ‘ఆ పాపతో వస్తువులు ఏం మాట్లాడుతూ ఉండవచ్చు?’ అని పిల్లలు ఆలోచించాలి. ఇక్కడ పిల్లలు ఓ అద్భుతమైన ఆధునిక కల్పన చేసే సందర్భాన్ని కల్పించారు. ఇలా పిల్లల్ని ఊహలకూ, కల్పనలకూ పురికొల్పే బొమ్మలు ఎన్నో ఉన్నాయి. ఈ పుస్తకంలో ఓ బొమ్మలో మైకు ముందు నిలబడి ఏదో మాట్లాడుతున్నారు. ఆయన దేని గురించి మాట్లాడుతుండవచ్చో పిల్లలు ఆలోచించాలి. ఓ తారాజువ్వమీద చంద్రుడి దగ్గరకు ఎగిరి వెళుతున్న ఇద్దరు పిల్లలు, వాళ్ళతో సంతోషంగా మాట్లాడుతున్న చందమామ. ఈ బొమ్మను చూసి పిల్లలు ఓ కథ రాస్తారు. ఇలా పిల్లలు ఊహలకి సాహిత్య రూపాన్నిచ్చే బొమ్మలు ప్రతి పేజీలో కనిపిస్తాయి. ఈ పాఠ్య పుస్తకంలో ఇంకా కథలకు, పాఠాలకు శీర్షికలు పెట్టడం, ‘చెరువు’ వంటి వాటి గురించి పాటలు రాయడం, పొడిగించడం, పద్యభావాన్ని తీసుకుని కథ రాయడం, గేయం రాయడం, స్వగతం రాయడం వంటివి కూడా ఉన్నాయి. సామాజిక స్పృహ, అవగాహన కలిగిస్తూ ‘‘చాలా మందికి తినడానికి అన్నం దొరకడం లేదు. దానికి గల కారణాలు ఏమై ఉంటాయో రాయండి’’ వంటి ఆలోచనలు కలిగించే సూచనలు, పనులు పరిశీలించి, తెలుసుకొని ఆలోచించి రాసే రాతలు కూడా ఉండడం ఈ పుస్తకంలోని ప్రత్యేకత.
ఇలా ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న పాఠ్య పుస్తకాలు పిల్లల్లో సాహిత్యం పట్ల ఆసక్తిని, అభిరుచినీ కలిగిస్తూ ఓ ఆటలా వారిని సాహిత్య ప్రపంచంలోకి మెల్లగా అడుగులు వేయించేలా ఉండడం అభినందనీయం!
-డా।। వి. ఆర్. శర్మ
ఎ : 9177 88 7749