మధ్యయుగాల చరిత్రలో ఎందరో చారిత్రక పురుషులు, ప్రసిద్ధులున్నా, రాజులలో అతికొద్దిమంది మంత్రి, ధండనాథులు స్వల్పంగా చరిత్రలో మిగిలినారు. అలాంటి వాళ్లలో తెలంగాణ యోధుడొకడు చరిత్రలో అక్షర బద్ధం ఐనాడు. అతని పేరు ఎనుములపల్లి పెద్దన. పెద్దనామాత్యుడు తనకాశ్రితుడైన మహాకవి చరిగొండ ధర్మన్న చేత ‘చిత్రభారతం’ కృతి రాయించుకొని అంకితం పుచ్చుకొన్నాడు. ఈ కావ్య అవతారికలో ఇతని జీవితంలోని పలు కోణాలు బయట పడ్డాయి.
ఎనుములపల్లి పెద్దనామాత్యుడు జగిత్యాల జిల్లాలోని ధర్మపురి గ్రామస్థుడు ఐన బ్రాహ్మణుడు. బాల్యం నుండే కత్తిపట్టి యుద్ధాల్లో అనేక విజయాలకు కారణం ఐన సైన్యాధిపతికూడా. ఇతడు ఓరుగల్లు రాజ్యానికి ప్రధానమంత్రిగా పని చేసినాడు. మాదయ, కృష్ణాంబలు తల్లిదండ్రులు, కాశ్యప గోత్రీకుడు, స్థానిక దైవం లక్ష్మీ నరసింహుని ఆరాధనను, ఆయన కుటుంబం, ఆయన పూర్వీకులు ఒక అలంకారంగా భావించారు. కుటుంబం (వంశవృక్షం)లో చాలా మందికి నరసింహనామాలే పేర్లుగా ఉన్నాయి. నరహరి, సింగమంత్రి, లక్కసాని, లక్కాయి ఇలా ఉన్నాయి.
ఇతడు ఓరుగల్లు నేలిన షితాబ్‍ఖాన్ (చిత్తాప్ ఖాన్) రాజుకు మంత్రిగా పని చేసినాడు. ఈ షితాబ్‍ఖాన్ శాసనం ఒకటి ఓరుగల్లులో క్రీ.శ. 1504లో లభిస్తున్నది. ‘‘శాకాబ్దే తత్త్వదేవ వ్రజి విభుగణితే రక్తసంవామివర్షే మాఘేపక్షే సితాఖ్యే శుభగుణ సహితే పంచమీ భానువారే భోగే చిత్తాపఖాన క్షితిపతి తిలకో విక్రమాదిత్య తుల్య: ప్రాస్కందాద్రాజధానీం యవన పరిహృతం రమ్యామేకో పలాఖ్యాం
ఏక+ఉపల = ఏకశిలా నగరం. దీన్ని యవనుల నుండి (తురుష్కుల నుండి) పరిహృతం చేసి (జయించి) ఏలుతున్న చిత్తపఖానుడు ఒక గొప్ప వీరుడైన రాజు.
‘‘ఆ రాజేంద్ర శిఖావతంస నిజ బాహాయత్త విశ్వంభరాధౌరే యుండు ఎన్ములపల్లి మాదవిభు పెద్దామాత్యుడు’’ (పీఠిక – 15వ ప.)అని చిత్రభారతము పేర్కొన్నది. ‘‘నిజ బాహా…’ అనడంలో పెద్దన కత్తి పట్టిన వీరుడని తెలుస్తోంది.
పెద్దనామాత్యుడే కాదు ఇతని వంశంలోని పూర్వులు కూడా యోధులే. ఈతని పెత్తండ్రి కుమారుడు నరసింగన ‘‘సంగర స్థల విదారిత శాత్రవుడు’’ అని పేర్కొనబడ్డాడు. పెద్దన స్వంత తమ్ముడు సింగ కూడా మంత్రే. చిత్తాపఖాను వద్దే పని చేసాడు. రెండో తమ్ముడు ఓరుగల్లులో పాంచాలేశ్వర దేవాలయ ప్రాంగణంలో లక్ష్మీదేవికి మందిరం కట్టినాడు. పెద్దనాన్న నారయ రెండో కుమారుడు రంగనాథుడు కూడా సైన్యాధిపతే. అతడు ‘‘దండనాథకుల శేఖరుడు…’’. ఇతడు కొరవి నగరంలో నరసింహాలయం కట్టించాడు.
ఓరుగల్లు తురుష్కా క్రాంతం ఐనాక తెలంగాణలో హిందూ మతస్థులకు రక్షణ కరువైంది. అనేక దేవాలయాలు పాడు చేసారు. హిందూమతానికి పట్టిన దుర్గతి గూర్చి విలతామ్ర శాసనం, మధురా విజయం, అనితల్లి కలువచే•రు శాసనం, వేదాంత దేశికుల అభీతిస్తవం మొ।। గ్రంధాలు వివరంగా రాసాయి.
ఎనుములపల్లి పెద్దన ధర్మపురిలో ఉండగా లక్ష్మీనరసింహాలయం దోపిడీకి గురిఐంది. ఈ దేవాలయం పశ్చిమ చాళుక్యులు క్రీ.శ. 1018లో నిర్మించారు. దీన్ని క్రీ.శ. 1425లో బహుమనీ సుల్తాన్ అహమ్మద్ షా సేనాని అజింఖాన్ దోచుకుని దేవాలయంలోని విగ్రహం పగులగొట్టించి నగరమంతా ధ్వంసం చేసాడు. అప్పటికి పెద్దన పైలాపచ్చీస్ వయస్సు. ఆయనకు ఒళ్ళు మండింది. కత్తిపట్టి నరసింహాలయం పాడు చేసిన తురకలను చంపి వచ్చినాడు. ఇది చరిత్రలో ఓ అపురూపమైన విషయం. దీన్ని పెద్దన చేసిన ఘనమైన పనిగా కృతికర్తను చరిగొండ ధర్మన్న తన చిత్ర భారతంలో ఉటంకిస్తే ప్రశంసించినాడు.
కం।। బాహాసి తీక్ష్ణధారా
రాహుముఖ గ్రస్త విమతరాజ!
‘‘మహాలక్ష్మీహరి మందిర స్వామి’’
ద్రోహర గండాంక!’’ దానరుచిర శశాంకా!
అని మహాలక్ష్మీ హరిమందిరం పేర్కోబడింది. అంటే ‘‘శ్రీలక్ష్మీనరసింహాలయం’’. ఆ ఆలయ స్వామికి ద్రోహం చేసారని, వారిని గండ+అంక = చంపిన ఘనత (బిరుదుగా) వహించాడని అర్థం.
తురక సైన్యాలు క్రీ.శ.1425లో ధర్మపురిలోని లక్ష్మీనరసింహా స్వామి ఆలయాన్ని ధ్వంసం చేసి స్వామి యొక్క అపురూపమైన విగ్రహం పాడు చేసారు. అది ‘‘స్వామి ద్రోహం’’గా పేర్కోబడింది. ఈ విగ్రహం గోదావరిలో పారవేయగా, 2010లో నది ఎండిపోయిన తరువాత దొరికింది. శిల్పం అద్భుతంగా అసిత చంద్రకాంతశిలతో చేసి ఉంది. షడ్బుజ నారసింహుడు, హిరణ్యకశివుని పొట్ట చీల్చిన పేగులను రెండు చేతులతో పైకెత్తినపుడు అవి హారాలుగా శిల్పి మలిచాడు. ఈ 1000 సం।। నాటి విగ్రహం తరువాతి విజయనగర రాజుల కాలపు ఆలయాల్లో అదే ‘భారచిత్రం’గా మెరిసింది. హంపి విఠలాలయంలో, ఒంటిమిట్ట రామాలయంలో దీని ప్రతికృతులున్నాయి. ఈ ధర్మపురి లక్ష్మీ నరసింహాలయం శిథిలంగా మారినాక ఒక 20 సం।। పిదప క్రీ.శ. 1693లో రుస్తుం దిల్‍ఖాన్ మసీదుగా (మధ్యకాలంలో మారినదానికి) నిర్వహణ విధానాన్ని నిర్దేశిస్తూ ఒక మౌజన్ (మసీదు నిర్వాహకుణ్ణి) నియమించి వంద భీగాల భూమిని ఏర్పాటు చేసి దానపత్రం రాయించినాడు.
‘బాహాసి తీక్షణ ధారా రాహుముఖగ్రస్త విమతరాజ! అని ఈ పద్యంలో తొలి భాగంలో చేసిన ప్రశంసలో (చేతికత్తి అంచు పదును అనే రాహువు కోరల్లో చిక్కిన శత్రు రాజులు కలవాడా!) అతని భుజబలం, ఖడ్గ చలనా నైపుణ్యం (విమతరాజులు = స్వమతంకాని తురుష్కులు) శత్రురాజులైన ముస్లిం పాలకులు, వారి విధ్వంస కాండ స్ఫుటం అవుతున్నాయి. చిత్ర భారతకర్త ధర్మన కూడా ధర్మపురి వాడే. అతని ధర్మపురి ప్రశంస కావ్యం నిండా కనబడుతుంది. పెద్దనను తొలి (కావ్య) పద్యంలోనే ధర్మపురి లక్ష్మీ నరసింహుడు కాపాడాలని రాసినాడు.
శా. శ్రీలక్ష్మీ కుచ పారిజాత కలికాశ్లిష్టోరు వక్షుండు దే
వాళీ మౌళిమణి ప్రభారుచిన పాదాంభోజుడుద్యద్దయా
వీలన్ ధర్మపురీశ్వరుండు గుణశాలిన్ మాదనాంభోనిధి
ప్రాలేయ ద్యుతి పెద్దన ప్రభు సమగ్ర శ్రీయుమంజేయుతన్
ఈ గ్రంథంలోని ఇతర ఆశ్వాసాది పద్యాల్లో కూడా ధర్మపురి నరసింహస్వామి ఆశీస్సులను పెద్దనకు అందించినాడు.
ఎనుములపల్లి పెద్దన పూర్వీకులు కూడా స్థానిక దైవాన్ని కొలిచినవారే. స్వామి అనుగ్రహంతో పుట్టినవారేనని పేర్కోబడ్డారు. తాత సింగన నరసింహుని వరం చేత పుట్టి నాడట. లక్కాయిలోని ఆయి అనేది అమ్మశబ్దం. ఇది మరాఠీ పదం. ధర్మపురిలో బ్రాహ్మణ స్త్రీలకు పేరు పక్కన ఉంటుంది. లక్షింబాయి. రుక్మాబాయి, రాధాబాయి వంటి పేర్లు నేటికీ ఉన్నాయి. స్త్రీలకు సింగమ్మ, సింగసాని వంటి పేర్లున్నాయి. స్వయంగా పెద్దన భార్య పేరు సింగసాని.
పెద్దన వంశం వారు కందాళ వంశీకుడైన గురువును (కందాళప్పను) దీక్షాగలరునిగా స్వీకరించారు. పెద్దన పెద్దనాన్న, తండ్రిఐన నారయ, మాదయలు కందాళప్ప శిష్యులని చరిగొండ ధర్మన్న పేర్కొన్నాడు. ఈ కందాళ వంశీకులు నేటికీ 500 ఏండ్లుగా లక్ష్మీనరసింహాలయంలో ఆస్థాన పురోహితులుగా కొనసాగుతున్నారు.
తాత నరసింగన్న కొరవిలో నరసింహాలయం కట్టించాడు. ఇది క్రీ.శ. 14వ శ. ఉత్తరార్ధంలో చివరి దశకంలో జరిగింది. ఈతని మనమడుగా పెద్దన్న 1410 ప్రాంతాన పుట్టి ఉంటాడు. ధర్మపురి ఆలయ ధ్వంసం నాటికి 15 సం।। కుర్రవాడు.
అనేక యుద్ధాలు చేసిన ఈ పరాక్రమశాలికి గల బిరుదులు చిత్ర భారతంలో పేర్కోబడ్డాయి. 50 సం।। వయస్సులో బహుశ షితాబ్‍ఖాన్ మంత్రి ఐనాడు. క్రీ.శ. 1475 ప్రాంతానికి ఓరుగంటి ప్రభువుకు మంత్రిగా, దండనాధునిగా ఉన్నాడు. ధర్మన్న చిత్ర భారతాన్ని ఇదే సమయంలో రాసినాడు. షితాబ్‍ఖాన్ ఏలిన ఓరుగల్లును అద్భుత వైభవోపేత రాజధాని నగరంగా వర్ణించినాడు. ఈ కావ్యకాలంనాటికి పెద్దన వృద్ధుడైనాడు. ఆ విషయం ఎలా తెల్సిందంటే ఈ పెద్దన తత్పూర్వరాజుల వద్ద పని చేసి ప్రశంసలు పొందినాడట. పూర్వ క్ష్మానాయక ప్రశంసిత అని చిత్ర భారతంలో (×పే-1) పేర్కోబడ్డ పెద్దన సైన్యాధిపతిగా, శూరునిగా పేరుగాంచిన అనుభవంతో చిత్తాపఖాన్ వద్దకు చేరినాడు.
చిత్తాపఖానుడు హిందూరాజు, ఖాన్ శబ్దం బహుమనీల సైన్యంలో ప్రదర్శించిన పరాక్రమానికి లభించిన బిరుదు. అతడు ఓరుగల్లులో స్వయంభూ దేవాలయం, అలాగే పాంచాల రామాలయం ‘కుజన తురుష్కులు’ పాడుచేసిన వాటిని పునరుద్ధరించినట్లు వరంగల్ శాసనంలో పేర్కొబడ్డాడు. తురకల ఆలయ, మత విధ్వంసాలను ఇష్టపడని వీరిద్దరు రాజు, సైన్యాధిపతులుగా ఓరుగంటి నేలి, హిందూధర్మాన్ని ఆలయాలను పునరుద్ధరించారు. షితాబ్‍ఖాన్ పాకాల చెరువును బాగు చేసినట్లు శాసనంలో ఉంది.
ఎన్ములపల్లి పెద్దన, మహారాజ వైభవంతో ఉన్నాడు. అతని వైభవం ఈ కావ్యంలో వర్ణించబడింది. ఈ వైభవం అంతా యుద్ధాల్లో విజేత కావడం వల్ల వచ్చింది. ఆ విషయం ‘‘సంగ్రామోపార్జిత భూరి భూవర సమగ్ర ప్రాభవా!’’ అని చిత్ర భారతంలో కృతి కర్త చరిగొండ ధర్మన ఎనుమల పల్లి పెద్దనామాత్యుని (కృతి భర్తను) ప్రశంసించడం ధృవపరుస్తోంది. ఆ ప్రాభవం అంతా సంగ్రామాల్లో (యుధ్ధాల్లో) ఉపార్జితం (సంపాదించినది) గా పేర్కొనడం బట్టి తెలుస్తుంది. పెద్దనామాత్యుని తమ్ముడు సింగన కూడా అన్నగారు, తాతగారివలెనే యోధుడై షితాబ్‍ఖాన్‍కు విజయాలు చేకూర్చి, ఛత్ర చామరాందోళికాది సత్కారాలు పొందినాడని రాసి ఉంది.
పంపమహాకవికి వేములవాడ నేలిన చాళుక్య ప్రభుత్వ ఇమ్మడి అరికేసరి చేత ధారాదత్తం ఐన గోదావరి తీరస్థ ధర్మపురిగ్రామం నేటికి గొప్ప చారిత్రక సాంస్కృ తిక కేంద్రం. పింగళి సూరన తన కళాపూర్ణోదయంలో నాలుగు వేదాలు నలుగురు బ్రాహ్మణ కుమారులుగా ధర్మపురిలో పుట్టినట్టు రాసినాడు. ఈ ఊరిలోనే పుట్టిన చతుర్వేదులు నరసింహ భట్టు విజయ నగర సామ్రాజ్యంలో చక్రవర్తి సదాశివరాయలచే, అళియ రామరాయల చేత పల్లకీ మోయించుకున్న వేద స్పర్ధా విజేత. విద్యారణ్య సాయుణులు ధర్మపురివారే. ఇలాంటి పోతుగడ్డపై పుట్టిన బ్రాహ్మణుడు ఎనుములపల్లి పెద్దనామాత్యుడు యోధునిగా, ఖడ్గవీరునిగా, యుద్ధవిజేతగా, మహామంత్రిగా మనోహర కావ్యకృతిభర్తగా, పదిహేనవ శతాబ్దిలో మెరిసి శాశ్వత యశః కాయుడైనాడు.
– సంగనభట్ల నర్సయ్య, ఎ : 94400 73124