5G స్థాయి కార్పొరేట్‍ యువ నైపుణ్యాలు

విశ్వమే కుగ్రామం అయ్యంది. అరచేతిలో వైకుంఠం చూపే చరవాణి లీలలు. శాస్త్రసాంకేతిక విప్లవం నిత్యనూతన అంతర్జాల క్రీడ అయ్యింది. 4G తరం సాంకేతికతను దాటుతూ 5G తరానికి వడివడిగా అడుగులు వేస్తోంది ఆధునిక శాస్త్రపరిజ్ఞానం. నేటి వినూత్న ఆవిష్కరణలే రేపటికి పాతవంటున్న ఘడియలు. పోటీ ప్రపంచంలో అవకాశాలు అనేకమైనప్పటికి, నిరుద్యోగం పెరుగుతున్న వైనాలు. చదువుల్లో అత్యుత్తమ మార్కులు, ర్యాంకులు, గ్రేడ్‍లు సాధించిననూ ఉద్యోగ ఎంపిక కఠినమైన అనుభవంగా మిగిలింది. చదువుల్లో రాణిస్తూనే కార్పొరేట్‍ కౌశలాలు అలవర్చుకోవాలనే హితపలుకులు పెద్దల నుండి సర్వసాధారణం అయ్యాయి. తమ కోర్‍ సబ్జెక్టులలో లోతైన పరిజ్ఞానం కలిగి ఉండాలి. విజ్ఞాన సమపార్జనకు తోడుగా వ్యక్తిగత మరియు సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకునేందుకు విద్యార్థినీవిద్యార్థులు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. కార్పొరేట్‍ కంపెనీ నిర్వహించే ప్రాంగణ నియామకాలలో వందలు, వేల సంఖ్యలో అభ్యర్థులు హాజరైననూ పదులు కూడా ఎంపిక కాకపోవటం మనకు చేదు అనుభనవవుతున్నది. ఈ సమస్యలను అధిగమించి బహుళజాతి సంస్థలలో ఆకర్షణీయ వేతనంతో కూడిన మంచి ఉద్యోగం రావటానికి అనేక కార్పొరేట్‍ నైపుణ్యాలు అనివార్యం అయ్యాయి. ఇవి సమృద్ధిగా ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు, ప్రశంసలు, వేతన సవరణలు లభిస్తున్నాయి. కొన్ని ముఖ్య కార్పొరేట్‍ కౌశలాలను అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం.


సంభాషణా నైపుణ్యాలు – వీటినే కమ్యునికేషన్‍ స్కిల్స్ అంటారు. మనిషి సంఘజీవి. సమాజంలోనే కాకుండా సంస్థలో విధులను నిర్వర్తించే క్రమంలో పది మందితో కలిసి పనిచేయాల్సి వస్తుంది. సహచర సమూహంతో పనిచేసేందుకు చక్కటి సంభాషణా సామర్థ్యం తప్పనిసరి. ఎదుటివాళ్ల అభిప్రాయాలను శ్రద్దగా విని, తన వివరణను ప్రశాంతంగా ఇవ్వటానికి కమ్యూనికేషన్‍ స్కిల్స్ ఉపయోగపడతాయి. చక్కగా మాట్లాడటంతో జట్టుపై పట్టు వస్తుంది. సహచరులతో మంచి సంబంధాలు ఏర్పడి మెరుగైన ఫలితాలు పొందవచ్చు. సంభాషణా చతురతగల వారు కంపెనీలో ఉన్నత స్థాయికి ఎదుగుటే కాకుండా సంస్థ ప్రగతికి దోహదపడతారు. కంపెనీ ప్రతినిధులు నిర్వహించే నియామక పక్రియలో కమ్యూనికేషన్‍ స్థాయిని అంచనా వేస్తారు. నియామక పక్రియలోని జామ్‍ (జస్ట్ ఎ మినట్‍), బృంద చర్చ, హెచ్‍ ఆర్‍ రేండ్లలో ఈ స్కిల్‍ ఉపయోగపడుతుంది. సంభాషణా నైపుణ్యాలు అలవర్చుకొనుటకు ఉపన్యాసం, సెమినార్‍, సాంస్కృ తికి కార్యక్రమాలు, కార్యశాలలు, ఆటపాటలలో చురుకుగా పాల్గొనాలి. చక్కగా మాట్లాడటం, శ్రద్ధగా వినటం, మంచిగా వ్రాయటం లాంటివి కమ్యూనికేషన్‍ నైపుణ్యాలలో భాగాలేనని మరిచిపోరాదు.


నాయకత్వ లక్షణాలు- పనులను పర్యవేక్శిస్తూ, బృందంతో ఫలితాలను సకాలంలో చూపించే సత్తా కలిగిన వారిని కంపెనీ వెతుకుతుంది. పది మందితో సఖ్యతగా ఉండటం, కార్యసాధనా నైపుణ్యాలను సొంతం చేసుకున్న వారు మంచి నాయకత్వాన్ని ఇవ్వగలరు. పరిస్థితుల పట్ల సంపూర్ణ అవగాహన, ప్రేరణ ఇవ్వటం, ఉత్సాహపరచటం, క్రమశిక్షణ కలిగిన టీమ్‍ను నిర్మించుటం, సమస్యలను అధిగమించే చతురత కలిగి ఉండటం వంటి గుణాలు కలిగిన నాయకులు కంపెనీకి ఆశించిన ఫలితాలను సకాలంలో ఇవ్వగలుగుతారు. సహచరులను ప్రభావితం చేస్తూ, వారి యోగ క్షేమాలను చూసుకునే నాయకులు సత్ఫలితాలను కార్పొరేట్‍కు అందించగలరు. దూరదృష్టి కలిగి, సాంకేతిక నైపుణ్యాలు గలవారు మంచి లీడర్‍షిప్‍ ఇవ్వగలరు. నియామకాలు చేపట్టే సమయంలో మంచి నాయకత్వ, నిర్వహణ సామర్థ్యాలు కలిగిన వారిని మాత్రమే ఎంపిక చేసుకుంటారు. కళాశాలలో నిర్వహించే కార్యక్రమాలను భుజస్కంధాలపై వేసుకొని నిర్వహించిన వారికి నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఈవెంట్‍ మేనేజ్‍మెంట్‍, ప్రాజెక్ట్ వర్క్, సదస్సులు మ్నెదలగు కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనుటతో, తెలియకుండానే నాయకత్వ లక్షణాలు అబ్బుతాయి. ఏ పనిని ఎలా, ఎప్పుడు, ఎందుకు చేయాలో తెలిసిన వారు నాయకులు. నాయకుడుగా పనులను కేటాయించటం, సకాలంలో పూర్తి చేయించడం, అవాంతరాలకు పరిష్కారాలు ఇవ్వటం, మానవీయ కోణంతో పర్యవేక్షించటం ద్వారా కంపెనీ నిర్వహకుల దృష్టిని ఆకర్షించి గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. నాయకత్వ లక్షణాలు సమృద్ధిగా ఉన్న వారు త్వరత్వరగా కెరీర్‍లో పదోన్నతులు, వేతన సవరణలు పొందుతూ, కంపెనీ సిఈఓ స్థాయికి చేరుతారనటానికి అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తాయి.


సాంకేతిక నైపుణ్యాలు- ప్రపంచం టెక్నాలజీ చుట్టు చక్కర్లు కొడుతోంది. ఏ కోర్స్, డిగ్రీ చదివినా కనీస కంప్యూటర్‍ నాలెడ్జ్ తప్పని సరి. నేటి టెక్నాలజీ రేపటికి అవుట్‍డేట్‍ అవుతున్నది. నిత్యం సాంకేతిక నైపుణ్యాలలో అప్‍డేట్‍ కానట్లైతే వెంటనే అవుట్‍డేట్‍ కావలసి వస్తుందని గుర్తుంచుకోవాలి. కృత్రిమ మేథ, ఐఓటి, మెషిన్‍ లెర్నింగ్‍, రేబోటిక్స్, డేటా సైన్స్ లాంటి పలు ఆధునిక పరిజ్ఞానాల పట్ల లోతైన అవగాహన కలిగి ఉండాలి. పాఠ్యాంశాలలో పట్టు నిలుపుకుంటూనే వివిధ ఆన్‍లైన్‍, ఆఫ్‍లైన్‍ కోర్సుల్లో చేరి ఆధునిక సాంకేతిక కౌశలాలను నేర్చుకోవాలి. రేపటి సాంకేతిక విప్లవాన్ని పసిగట్టి వాటిలో పట్టు సాధించాలి. ఇంట్లో కూర్చొని అనేక టెక్నికల్‍ కోర్సులను పూర్తి చేయవచ్చునని మరువరాదు.


జట్టు కృషి లేదా టీం వర్క్- ప్రతి ఉద్యోగి కంపెనీలో సహచరులతో కలిసిమెలిసి పని చేయాల్సి ఉంటుంది. పది మందితో కలిసి సజావుగా పని చేయటం, సహకార ధోరిణి కలిగి ఉండటం, ఎదుటివాళ్ల అభిప్రాయాలను గౌరవించటం, ఇతరుల అనుభవాలను పంచుకోవటం లాంటి సద్గుణాలు ఉన్న వారు జట్టులో ఇమిడి ఫలితాలను అందిస్తారు. కార్పొరేట్‍లో బృంద కౌశలాలు తప్పనిసరి. వివిధ కౌశలాలు, నేపథ్యాలు, అర్హతలు, ఆలోచనలు, మనస్తత్వాలు, ఆత్మగౌరవాలు కలిగిన వారిని ఒక్కతాటిపైకి తెస్తూ, లక్ష్యాలను అధిగమించటం కంపెనీ మౌళిక అవసరం. విద్యార్థి దశ నుండే క్రీడలు, కల్చరల్‍, గ్రూప్‍ ప్రాజెక్ట్, సెమినార్లు, యన్‍సిసి, యన్‍యస్‍యస్‍లో పాల్గొనుట మనలో బృంద నైపుణ్యాలను పెంచుతుంది. జట్టుకు నాయకత్వం వహించటం కన్న ముందు జట్టులో ఒక బాధ్యతగల సభ్యుడుగా ఒదిగిపోయి పని చేసిన అనుభవం తప్పనిసరని అర్థం చేసుకోవాలి.


సమస్యల పరిష్కార నైపుణ్యం- దీనినే ప్రాబ్లమ్‍ సాల్వింగ్‍ స్కిల్‍ అంటారు. ప్రయాణంలో వంకలు, డొంకలు, స్పీడ్‍ బ్రేకులు సర్వసాధారణం. వాటిని పసిగట్టి, ఒడుపుగా తప్పించి గమ్యం చేరటం పరిపాటి. కంపెనీలో ఉద్యోగం అంటేనే సమస్యలను ఎదురిస్తూ, సరైన పరిష్కారాలను కనుగొనుట అని అర్థం చేసుకోవాలి. సమస్యను అన్ని కోణాల్లో లోతుగా విశ్లేషించాలి. కారణాలను శోధించి కనిపెట్టాలి. పటిష్ట పరిష్కారాలను ప్రతిపాదించటం, మన విజ్ఞానానికి అనుభవాలను జోడించి సమాధానం ఇవ్వగల నైపుణ్యాలను అలవర్చుకోవాలి. గత వైఫల్యాలు నేర్పిన పాఠాలు సమస్య పరిష్కారానికి బాగా ఉపయోగపడతాయి. సమస్య పూర్తిగా అర్థమైతే పరిష్కారం సులభంగా లభిస్తుంది. అనుకూల, ప్రతికూల పరిస్థితులను అంచనా వేయగలగాలి. కంపెనీలో సమస్య పరిష్కార ప్రత్యేక విభాగం ఉండటం దాని ప్రాధాన్యతను తెలుపుతోంది. ఈ నైపుణ్యం కలిగిన వారు కార్పొరేట్‍లో ఉన్నత స్థాయిలో ఉంటారు.


ఒత్తిడి నియంత్రణ- ప్రతి పనిలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడిలోనే ఫలితాలు చక్కగా ఉంటాయి. ఇలాంటి ఒత్తిడిని సానుకూల ఒత్తిడి అంటారు. సకాలంలో, ఆశించిన ఫలితాలు అందిం చాలనే ఒత్తిడిలోంచి కార్యదక్షత జనిస్తుంది. ఒత్తిడి అధికం అయినపుడు ప్రతికూల ఫలితాలు రావచ్చు. ఒత్తిడి లేని ఉద్యోగం ఉండదు. సానుకూల ఒత్తిడిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒత్తిడి ఎదురై నపుడు, అధిగమించి సమర్థవంతంగా బయటపడాలి. సానుకూల దృక్ఫథం ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకుంటుంది. కష్టపడి గెలవాలను కోవటం సానుకూల ఒత్తిడి అవుతుంది. ఎలాగైనా ఎదుటివాడిని ఓడించాలనుకోవటం ప్రతికూల ఒత్తిడికి దారితీస్తుంది. ఒత్తిడి లేని పని నెమ్మదిగా జరుగుతుంది. ఒత్తిడిన సవాళుగా తీసుకోవాలి. ఒత్తిడి నియంత్రణ ఆన్‍లైన్‍ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.


సమయ పాలన- ప్రతి వ్యక్తికి సమయపాలన అతి ముఖ్యమైన నైపుణ్యం. అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారందరు ప్రగతి పథంలో పయనిస్తారు. ఏ పనికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా అంచనా వేయగలగాలి. సరైన సమయానికి సరియైన నిర్ణయాలను తీసుకోవాలి. సకాలంలో పని పూర్తి చేయటానికి సమయ నిర్వహణ తెలిసి ఉండాలి. అనుకున్న సమయానికి పని పూర్తి చేసేవారి కోసం సంస్థ వెతుకుతుంది. సమయాన్ని గౌరవిస్తేనే, అది మనలను గౌరవ స్థాయికి చేర్చుతుంది. అందుబాటులో ఉన్న సమయాన్ని అకడమిక్‍ మరియు ఇతర నైపుణ్యాలను పెంపొందించు కొనుటకు వినియోగించాలి. సమయాన్ని పట్టించుకోని యెడల, అది మనలను విస్మరిస్తుంది. కోరుకున్న ఫలితాలు రాకపోవటానికి కారణం టైం మేనేజ్‍మెంట్‍ తెలియక పోవటమేయని తెలుసుకోవాలి.


మానవ సంబంధాల నైపుణ్యం- దీవిని ఇంటర్‍పర్సనల్‍ స్కిల్‍ అంటారు. వివిధ వర్గాల సహచరులతో సన్నిహిత సంబంధం ఏర్పరచు కోవటం ప్రతిఒక్కరిలో ఉండవలసిన ముఖ్య నైపుణ్యం అవుతుంది. జట్టు నిర్మాణంలో పరస్పర నమ్మకాలు, వ్యక్తిగత సంబంధాలు ఉపయోగపడతాయి. ఎదుటి వ్యక్తికి గౌరవం ఇస్తూ, వారి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వటం, సద్విమర్శలకు స్థానమివ్వటంలో మానవ సంబంధాలు బలపడతాయి. వీటినే ప్రజాసంబంధాలు అని కూడా అంటారు. మానవ సంబంధాలను కలిగిన వారు నాయకులుగా ఎదుగుతారు. ఉద్యోగులలో పరస్పర సహకార, సమన్వయాలు నెలకొనినపుడు కంపెనీ లక్ష్యాలు సులభంగా అధిగమింపబడతాయి. మానవ సంబంధాలు కొరవడిన జట్టు పనితీరు నిరాశాజనక ఫలితాలను ఇస్తుంది.


సృజనశీలత- దీనినే క్రియేటివిటి అంటారు. ఉత్తమ ఫలితాల సాధనలో సంప్రదాయ దారులను వదిలి సులభంగా లక్ష్యసాధన చేయగల నూతన ఆలోచనలనే సృజనశీలత అంటారు. సృజనను పోషించినపుడు నూతన ఆవిష్కరణలకు తలుపులు తెరుస్తాయి. ఒక లక్ష్యాన్ని ఛేదించుటకు తలపెట్టిన నవ్య మార్గాన్వేషణలోంచి సృజన జనిస్తుంది.

నలుగురు నడిచిన దారిని అనుసరించటం అందరం చేస్తాం. ఈ దారికి ప్రత్యామ్నాయ సులభ మార్గాన్ని అన్వేషించిన యెడల మన సృజన పది మందికి కొత్తదనాన్ని అందిస్తుంది. శాస్త్రసాంకేతిక విజ్ఞానం, వినూతన ఆలోచనా సరళి, సానుకూల దృక్ఫథం వంటి లక్షణాలు సృజన శీలురలలో కనిపిస్తాయి.
కార్పొరేట్‍ నైపుణ్యాలు స్వంతం చేసుకున్న యువతలో ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుంది. వీరు కార్పొరేట్‍ నిర్వహించే నియామకాలలో సులభంగా బయటపడి విజేతలుగా నియామకాలు పొందుతారు. కంపెనీ నియామక పక్రియలోని జామ్‍, గ్రూప్‍ డిష్కషన్‍, టెక్నికల్‍ రౌండ్‍, ఆన్‍లైన్‍ టెస్ట్, హెచ్‍ఆర్‍ రౌండ్లలో నెగ్గి నియామక పత్రం పొందటానికి ఈ కార్పొరేట్‍ నైపుణ్యాలు ఉపయోగపడతాయి. ఈ దశలో ఉద్యోగం పొందిన తరువాత వీటి అవసరం ఆగదు. ఇవి జీవన నైపుణ్యాలుగా మారి మన వెంట వస్తూ, ప్రతి సందర్భంలో మనకు పదోన్నతి, గెలుపు, కీర్తిని తెచ్చి పెడతాయి. నైపుణ్యాలు సమృద్ధిగా ఉన్నవారు తమ వేతనాన్ని కంపెనీ నిర్ణయించటానికి బదులు తామే డిమాండ్‍ చేసి సఫలీకృతులు అవుతారు. ఇంజనీరింగ్‍, మేనేజ్‍మెంట్‍ చదువుతున్న యువత పాఠ్యాంశాలతో పాటు నైపుణ్యాలను పొంది కార్పొరేట్‍ దిగ్గజాలుగా వెలుగొందాలని ఆశిస్తున్నాం. వైజ్ఞానిక శాస్త్రంతో పాటు సాంకేతికశాస్త్రంలో పరిణతి పొందిన వారిదే రాబోయే కాలం. నాలెడ్జికి టెక్నాలజీ జోడైతేనే మానవాళి జీవనసరళి సులభమవుతుంది. ఈ క్రమంలో యువత నైపుణ్యశీలురుగా మారాలని కోరుకోవాలి. అప్పుడే యువభారతమంతా నైపుణ్యభారతంగా ప్రపంచదేశాల ముందు నిలబడగలుగుతుంది.


-డా।। బుర్ర మధుసూదన్‍ రెడ్డి
ఎ : 99497 00037

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *