ఆయిమే మేడం.. ఆయియె.. అంటూ దుకాణాల ముందు కూర్చొని బేరసారాలు.. ఒకరికి మించి మరొకరి ఆహ్వానం. ఐదు వందలు చెప్పిన గాజుల జత రూ. 200కు ఇవ్చొచ్చు. లేదా రూ. ఐదు కూడా తగ్గకపోవచ్చు. ఇది చార్మినార్ దగ్గర ఉన్న లాడ్ బజార్ గాజుల మార్కెట్ పరిస్థితి.
ప్రఖ్యాతి గాంచిన లాడ్ బజార్ పేరు వినగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది అందమైన గాజులు. అందుకే స్త్రీలు ఇక్కడి గాజులపై ఎంతో మక్కువ చూపిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మరీ తమకు కావాల్సిన గాజులను ఇక్కడ కొంటారు. ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి వచ్చే మహిళలు కూడా ఇక్కడ షాపింగ్ చేస్తారు. ఇంతగా ప్రజలను ఆకట్టుకుంటున్న గాజులు ఒక హస్తకళగా కూడా అందని మన్న నలు పొందుతున్నాయి.
చేతులకు మెరిసే బంగారు గాజుల మ ధ్య మట్టి గాజులు వేసుకుంటే మరింత నిగారిం పు చేకూరుతుంది. మట్టి గాజులకు ఉన్న ఆకర్షణ అలాంటిది మరి. పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు రెండు చేతులకూ రంగురంగుల మట్టిగాజులు వేసుకుంటే మహిళల చేతులు కళకళలాడుతూ ఆకర్షణీయంగా వుంటాయి. రెండు చేతుల నిండా ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా ఒక్కో చేతికి కనీసం రెండేసి మట్టి గాజులు ఉండాలని చెబుతారు పెద్దలు. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు గాజులమ్మే వారు కాని, మట్టి గాజులు ధరించిన స్త్రీ ఎదురుగా వచ్చినా శుభకరమని నమ్ముతారు. ప్రధానంగా గాజులు నాలుగు రకాలు. మామూలు(మట్టి) గాజులు, ప్లాస్టిక్ గాజులు, బంగారు గాజులు(ఆభరణం), లక్క గాజులు. ధరించే గాజులు సైతం అభిరుచిని, వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి.
నేటి ఆధునిక వస్త్రాధారణలో రకరకాల స్టైల్లో గాజులు ధరించడం కనిపిస్తుంది. వేదకాలం నాటికన్న ముందే స్త్రీలు గాజులు ధరించే వారని లభించిన ఆధారాల బట్టి తెలుస్తుంది. మొహోంజోదారొ తవ్వకాల్లో లభించిన చిత్రాల్లో చేతికి కంకణం ధరించిన స్త్రీ చిత్రాలున్నాయి. బాణబట్టు తన కావ్యంలో సరస్వతి దేవి చేతికి గాజులు(కంగణ్) ధరించినట్లుగా పేర్కొన్నాడు. పురాతన తవ్వకాలలో తక్షశిల వద్ద మౌర్య సామ్రాజ్య కాలం నాటి రాగి గాజులు లభించాయి. అజంతా చిత్రాలలోని, ఎల్లోరా శిల్పాల్లోని స్త్రీలు గాజులు(కంగణ్) ధరించడం కన్పిస్తుంది. క్రీస్తు పూర్వం 230 సంవత్సరాల కాలం నుండే సింధూ లోయలో ఆడవాళ్లు గాజులు ధరించే వారని తెలుస్తుంది.
రకరకాల పేర్లు…
చేతికి ధరించే కంకణాలను ఎక్కువగా గాజుతో చెయ్యడం వల్ల వీటికి గాజులు అని తెలుగులో పేరు వచ్చింది. గాజులను సంస్కృతంలో ‘కంకణ్’, హిందీలో ‘చిడియ’, ‘చుడ’ అని అంటారు. అలంకరణకు ఆడవారు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు… తాము ధరించిన వస్త్రాలకు అనుగుణంగా గాజులను వేసుకోవడం కూడా మరిచిపోరు..
పురాతన పరిశ్రమ..
అతి పురాతనమైన చేతికళల పరిశ్రమలలో చేతిగాజుల పరిశ్రమ ఒకటి. గాజుల తయారీ, అమ్మకంపై ఆధారపడి నేటికి చాలా కుటుంబాలు జీవిస్తున్నాయి. ఎక్కడ తిరునాలు లేదా జాతర జరిగినా తప్పని సరిగా కనిపించేవి గాజుల దుకాణాలు. గ్రామాల్లో తిరుగుతూ గాజులు అమ్మేవారు సైతం కనిపిస్తా రు. గాజులు అమ్మేందుకు ప్రత్యేకంగా ఒక కులం (గాజుల బలిజ) సైతం ఉంది. వీరంతా గాజులు తయారు చేయడం, విక్రయించడం వృత్తిలోనే స్థిరపడ్డారు. పూర్వం ఇంటింటికీ తి రుగుతూ గాజులు అమ్మేవారు. ఇంటిలో ఏ శుభకార్యం జరిగినా ఆడవాళ్లు గాజుల వాళ్లను ఇంటికి పిలిపించుకుని గాజులు వేయించుకునే వారు. వారికి తగిన విధంగా సంభావన యిచ్చి పంపేవారు. ఆధునిక కాలంలో వచ్చిన పెను మార్పుల మూలంగా ఊరూర తిరిగి గాజులమ్మే వారు కనుమరుగయ్యారు.అక్కడక్కడ అరకొర ఉన్నా జీవనోపాధి కరువై ఇతర పనుల్లో స్థిరపడుతున్నారు. వివిధ ఆశ్రిత కులాల వారు ఊర్లను పంచుకున్నట్లు గానే గాజులను విక్ర యించే వారు సైతం పూర్వకాలంలో ఊర్లను పంచుకున్న దాఖలాలు ఉన్నాయి.
రాష్ట్రంలో ఎన్నో గ్రామాల పేర్లకు ముందు గాజుల అనే పదం కూడా ఉంటుంది. అప్పట్లో అవి గాజుల తయారీ, విక్రయాలకు పేరొందిన కారణంగా వాటి పేర్లకు ముందు గాజుల అనే పదం వచ్చి ఉండవచ్చునన్నది ఒక భావన. ఒక హస్తకళగా గాజుల తయారీ పక్రియ ఎంతో కష్టంతో కూడుకున్నది కావడంతో ఈ రంగం క్రమంగా కుదించుకుపోతోంది. దీనిలోకి యంత్రాలు ప్రవేశించాయి.
హైదరాబాద్ నగర చరిత్రలో చార్మినార్ ఎలాగో లాడ్ బజార్ కూడా అలాగే. ఒక్కసారి లాడ్‍బజార్‍లో అడుగు పెడితే చాలు గంటల తరబడి దుకాణాలను చూస్తూ గడిపేస్తాం. ప్రారంభంలో ఒకటి రెండు వ్యాపార సముదాయాలతో ఏర్పడినా గాజుల దుకాణాలు సంఖ్య రానురాను పెరిగి లాడ్ బజార్‍గా విస్తరించింది. హైదరాబాద్‍లో ఉండేవారైనా, నగరాన్ని చూసేందుకు వచ్చే వారైనా లాడ్‍బజార్‍ను చూడడం మాత్రం మరువవద్దు. దాన్ని చూడకపోతే ఎంతో ఆనందాన్ని కోల్పోయినట్లే.