ఉధృతంగా సాగుతున్న మొక్కలు నాటే కార్యక్రమం
ఎంపి జోగినపల్లి సంతోష్‍కుమార్‍గారి పిలుపుకి అనూహ్య స్పందన
సంకల్పం చిన్నదే కావచ్చు కానీ అందులో సమాజ శ్రేయస్సు ఉంది. తీసుకున్న సంకల్పం, ఎత్తుకున్న బాధ్యతను అమలు చేయాలనే పట్టుదల కూడా కావాలి. లేకుంటే మనం తీసుకున్న సంకల్పం ఎంత గొప్పదయినా నిరుపయోగం అవుతుంది. ఆశించిన ఫలి తాలు రావు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న హరిత హారం కార్యక్రమం కానీ, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తీసుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం కానీ చాలా గొప్పవని చెప్ప వచ్చు. ఎందుకంటే పర్యావరణం దెబ్బతినడంతో వాతావరణ సమతుల్యత దెబ్బతింది. దీనితో కాలానుగుణంగా పడాల్సిన వర్షాలు పడకపోగా ఇతర కాలాలు కూడా కాలానుగుణంగా ఉండడం లేదు. అల్ప పీడనాలు, వాయు గుండాలు, తుఫానులు, వర్షాలు తప్ప రుతుపవనాలతో వచ్చే వర్షాలు అంతంత మాత్రంగానే పడుతున్నాయి. ఒకొక్కసారి ఎండల తీవ్రత, చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు వాతావరణ కాలుష్యం కూడా తీవ్ర స్థాయిలో పెరిగింది.
దీనిపై పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్య సమస్యలు, చర్మ వ్యాధులు వస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంటే పర్యావరణం దెబ్బతింటే ఎంతటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో దీనిని బట్టి అర్ధం అవుతుంది. పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అందుకే హరిత హారం, గ్రీన్ ఇండియా పోగ్రాంలు చాలా ముఖ్యమైనవి. అశోకుడు చెట్లు నాటించాడని మనం చరిత్ర పాఠాలలో చదువుకున్నాం. అంటే నాడు రాజులు, చక్రవర్తులు పర్యావరణానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్ధం అవుతుంది. కానీ కాలక్రమంలో మనిషిలో స్వార్ధం పెరిగింది, అవసరాలు పెరిగాయి. దీనితో అడవులు అంతరించాయి. కాలుష్యం పెరిగింది. పర్యావరణం దెబ్బతింది. ఆరోగ్య సమస్యలు పెరిగాయి. పేద, మధ్య తరగతి వర్గాలు ఆర్ధిక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యల నుండి బయట పడాలంటే పర్యావరణాన్ని రక్షించుకోవాలి అందుకు హరిత హారాన్ని చేపట్టాలని కెసిఆర్ సర్కార్ భావించింది.
ఇప్పటికే దాదాపు 2.64 లక్షల హెక్టార్లలో అడవులకు జీవం పోసి రాష్ట్ర అటవీశాఖ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. వచ్చే ఐదేండ్లలో దాదాపు 10 లక్షల హెక్టార్ల క్షీణించిన అటవీ భూముల్లో మొక్కలు పెంపకానికి అటవీశాఖ అధికారులు బృహత్తర ప్రణాళిక రూపొందించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచడమే ధ్యేయంగా 2015లో ప్రారంభించిన హరితహారం కార్యక్రమం క్షీణించిన అడవులకు ఊపిరిపోస్తుంది. కోట్లల్లో మొక్కలు నాటి అడవులను పునరు ద్దరించాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‍రావు ఆదేశాలతో అటవీశాఖ ప్రత్యేకంగా రీజువెనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 24 శాతం పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు తద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు సిఎం కెసిఆర్ ఈ బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. రాష్ట్రాన్ని అందమైన, ఆరోగ్యకరమైన, అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రంగా మార్చాలనే ప్రయత్నమే తెలంగాణకు హరితహారం. ఇందులో భాగంగా తొలుత అటవీ ప్రాంత సరిహద్దులను నిర్దిష్టంగా గుర్తించి చొరబాటును తగ్గించడానికి ట్రెంచులను ఏర్పాటు చేయడం, బ్లాకులుగా విభజించి ప్లాంటేషన్ చేపట్టడం వల్ల విధ్వంసమైన అడవులకు ఎయిడెడ్ నాచురల్ రీజనరేషన్ పద్ధతిలో తిరిగి జీవం పోయడం అభినందనీయం. అడవుల సమగ్ర అభివృద్ధికి ఫారెస్ట్ 2.0 యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‍మెంట్ ముందుకు రావడంతో పునరుజ్జీవన పనులు కొనసాగుతున్నాయి. అడవుల పునరుద్దరణ కోసం జరుగుతున్న కార్యక్రమాలను యూఎస్ ఎయిడ్ సంస్థ అభినందించి అవసరమైన సహకారం అందిస్తామని చెప్పడం తెలంగాణ ప్రభుత్వ కృషి ఫలితమే. తెలంగాణ అటవీశాఖ మొత్తం 2,64,714 హెక్టార్లలో పునరుజ్జీవన కార్యక్రమాన్ని చేపట్టింది.
గత ఐదు విడతల్లో నాటిన మొక్కలు, ప్రభుత్వ సంకల్పం, సమాజంలో అన్ని వర్గాల సహకారంతో ఫలితాలు ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి. రాష్ట్ర మంతటా పచ్చదనం చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుతోంది. అన్ని రోడ్ల వెంట రహదారి వనాలు (అవెన్యూ ప్లాంటేషన్) ఏపుగా పెరుగుతూ ఆకర్షిస్తున్నాయి.
ఇటీవల ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన దేశ వ్యాప్త నివేదికలోనూ పచ్చదనం గణనీయంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి అని స్పష్టం చేసింది. కంపా నిధుల సద్వినియోగంతో ప్రత్యామ్నాయ అటవీకరణ పద్ధతులు, సహజ అటవీ పునరుద్ధరణ పథకాల్లోనూ తెలంగాణ అగ్రగామిలో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీటి లభ్యత పెరగటం హరితహారానికి అందివచ్చే వరమే. మరింత సమర్థవంతంగా మెట్ట భూముల్లోనూ మొక్కలు పెంచేందుకు, వాటి రక్షణకు కాళేశ్వరం అదనపు వనరు కానుంది. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం నిర్దేశించు కున్నప్పటికీ, క్షేత్రస్థాయి నివేదికలు, సిబ్బంది ద్వారా మంచి చెడులు తెలుసుకున్న ప్రభుత్వం అంచనాలు సవరించింది. మొక్కలు నాటే లక్ష్యాన్ని గ్రామ స్థాయి యంత్రాంగమే నిర్దేశించుకునేలా ఆదేశించింది.
ప్రభుత్వం చేపట్టిన హరితహారం ఒక ఎత్తైతే, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం మరొక ఎత్తు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే! సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులను ముందు కదిలించాలి. దీనితో సమాజంలో కదలిక వస్తుంది. దాని కోసమే లెజెండ్లను, సెలబ్రెటీస్‍లను కదిలించే కార్యక్రమాన్ని అయన చేపట్టారు. అదే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పోగ్రాం. దీని ముఖ్య ఉద్దేశం లెజెండ్స్, సెలబ్రిటీస్‍ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి. తద్వారా వారితో ప్రజలకు మెసేజ్ ఇప్పించాలి. వారు చెప్పే మాటకు, చేసే పనికి సమాజంపై ప్రభావం ఉంటుంది. సంతోష్ దీనిని గుర్తించారు. అందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే వినూత్న పోగ్రాం చేపట్టారు. సినీ, సాహిత్య, క్రీడా, రాజకీయ, పరిపాలన విభాగంలో పని చేసే పై స్థాయి అధికారులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి వారి ద్వారా సమాజానికి సందేశం ఇప్పించాలని సంకల్పం తీసుకున్నారు. ఒకరు ఒక మొక్క నాటి వారు మరో ముగ్గురికి ఛాలెంజ్ విసరడం ద్వారా ఇది విస్తృతం అయ్యింది.
సంతోష్‍కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ గ్రీన్ ఇండియా ఉద్యమం కేవలం మన రాష్ట్రమే కాకుండా దేశ, విదేశాలకు కూడా పాకింది. వారి నుంచి మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఊరు, వాడ అన్న తేడా లేకుండా జోరుగా సాగుతోంది. పలువురు సెలెబ్రిటీలు ఎంతో ఉత్సాహంతో మొక్కలు నాటుతూ సెల్ఫీలు తీసుకుంటూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‍లో భాగస్వామ్యం అయినందుకు తమ సంతోషాన్ని ట్విట్టర్ల ద్వారా పంచుకుంటున్నారు. కేవలం వారు మొక్కలు నాటడమే కాకుండా మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్‍ను విసురుతూ ముందుకు కొనసాగిస్తున్నారు.
గ్రీన్ ఇండియా యొక్క సరైన వ్యూహాన్ని తెలుసుకున్న తరువాత, గౌరవనీయ భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నుండి సినీ తారలు, క్రీడా తారలు, పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్తలు మరియు రాజకీయ నాయకులు భాగస్వామ్యులయ్యారు. నిర్మాణ యుత మార్పులకు పట్టుదల మరియు చిత్తశుద్ధి అవసరం, ఎంపి జె. సంతోష్ కుమార్ అన్ని ప్రశంసలకు అర్హుడు, ఈ చొరవ తెలంగాణ ప్రజలతో పాటు ప్రపంచ అరేనాలో కూడా ఆమోదం పొందింది. ప్రకృతిని పెంపొందించడానికి క్యాస్కేడింగ్ ప్రభావాలను కలిగి ఉన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3 కోట్లమార్కును చేరుకుంది. మూడు కోట్ల మొక్కలు పూర్తయినట్లు గుర్తుగా సంతోష్ కుమార్ నెక్లెస్ రోడ్ వద్ద జిహెచ్‍ఎంసి విజిలెన్స్ మరియు ఎన్‍ఫోర్స్మెంట్ వింగ్ కార్యాలయ ప్రాంగణంలో ఒక మొక్కను నాటారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్‍ను రాజ్యసభ సభ్యులు సంతోష్‍కుమార్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం సంతోషదాయకం. గ్రీన్ చాలెంజ్‍లో భాగంగా ఒక్కొక్కరూ మూడు మొక్కలు నాటి తిరిగి మరో ముగ్గురికి గ్రీన్ చాలెంజ్ చేయడం, దీంతో దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఈ సవాల్‍ను స్వీకరించి మొక్కలు నాటడం హర్షదాయకం. పచ్చదనాన్ని పెంచడానికి గ్రీన్‍చాలెంజ్‍ను ఉద్యమంలా చేపట్టడం అభినందనీయం. ఇందులో ప్రతి ఒక్కరమూ భాగస్వాములం కావాలి. పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి బాధ్యత. ప్రజల భాగస్వామ్యమే ఏ అభివృద్ధికైనా కీలకాంశం.
సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (జిఐసి) చొరవ తెలంగాణ సరిహద్దులను దాటి పొరుగున ఉన్న ఎపి, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాఖండ్లతో సహా సుమారు 10 రాష్ట్రాలకు వ్యాపించింది.
సంతోష్ ఈ కార్యక్రమాన్ని జూలై 17, 2017న ప్రారంభించారు. రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి విసిరిన గ్రీన్‍చాలెంజ్‍ను రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదట స్వీకరించారు. ప్రగతిభవన్‍లో ఆయన మూడు మొక్కలను నాటారు. మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణకు చర్యలు చేపడతానని ఆయన ట్వీట్ చేశారు. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, హీరో అక్కినేని నాగార్జునకు గ్రీన్‍చాలెంజ్‍ను విసిరి తన చాలెంజ్ స్వీకరించాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ కవర్ను ప్రోత్సహించడానికి ఒక చిన్న చొరవగా ప్రారంభమైన ఈ మిషన్, కౌంటర్లో దాదాపు 10 కోట్ల మొక్కలు నాటిన ఒక వ్యక్తి చేపట్టిన అతిపెద్ద ప్రచారంగా ఇప్పుడు బయటపడింది. ఐదేళ్ల క్రితం ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్ వంటి సవాళ్లు ఉన్నాయి. వాతావరణ మార్పు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆందోళనగా ఉన్నందున గ్రీన్ కవర్‍ను ఎలా మెరుగుపరుచుకోవాలన్న సంతోష్ ఆలోచనతో జరుగుతున్న కృషి యిది. ప్రస్తుతమున్న 24% నుండి 33%కి గ్రీన్ కవర్ పెంచాలనే ఏకైక ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలంగాణకు హరితా హారమన్నారు. తెలంగాణలో గ్రీన్ కవర్ 4% పెరిగి 28%కి చేరుకుంది. గ్రీన్ కవర్ను ప్రోత్సహించడానికి వ్యక్తులు బ్లాక్స్ మరియు గ్రామాలను స్వీకరించడంతో జిఐసి ప్రచారం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. కీసర వద్ద 2 వేల ఎకరాల ఫారెస్ట్ బ్లాక్‍ను సంతోష్ స్వయంగా దత్తత తీసుకోగా, నటుడు ప్రభాస్ ఇటీవల ఓఆర్‍ఆర్, కీసరకు సమీపంలో ఉన్న కాజుపల్లి ఫారెస్ట్ బ్లాక్‍లో 1,650 ఎకరాలను దత్తత తీసుకుంటానని, దానిని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు.
హైదరాబాద్ పరిసరాల్లో 88 ఫారెస్ట్ బ్లాక్స్ ఉన్నాయి. ప్రభాస్ ఒక ఫారెస్ట్ బ్లాక్ను స్వీకరించిన తరువాత, చాలా మంది ప్రజలు ఫారెస్ట్ బ్లాకులను స్వీకరించడానికి, పెద్ద ఎత్తున ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టడానికి ముందుకు వస్తున్నారు. హెటెరో గ్రూప్ చైర్మన్ బి పార్థ సారధిరెడ్డి నర్సపూర్ ఫారెస్ట్ బ్లాక్‍ను చేపట్టడానికి ఆసక్తి చూపగా, నటుడు నితిన్, రాజకీయ నాయకుడు గోకరాజు రంగరాజు 300 నుంచి 600 ఎకరాల్లో పచ్చదనాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని సంతోష్ తెలిపారు.
వాడవాడలా విస్తరిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3 కోట్లకు చేరింది. వన హారతికి మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా స్పందిస్తున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‍ఎలు, ఎంఎల్‍సిలు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, పలు రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలు ఒకరికొకరు సవాలు విసురుకుంటూ మొక్కలు నాటుతున్నారు.
కొన్ని మొక్కలను నాటినంత మాత్రాన మేము గొప్ప పని చేసినట్లు కాదని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా అందరం మొక్కలను నాటాలని నొక్కి చెప్పారు. చెట్లు భూమిపై ఆనందం యొక్క స్వచ్ఛమైన రూపాలు అని ఎంపీ సంతోష్ కుమార్ చెప్తారు. ఆకుపచ్చ కవర్ను పెంచుతూ, దేశాన్ని, దేశంలో అత్యంత జీవించదగిన రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేయాలి. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలను నాటాలి మరియు ముగ్గురు వ్యక్తులను నామినేట్ చేయాలి అని ఆయన కోరుతున్నారు. ఈ చాలెంజ్‍లో మనందరం భాగస్వాములవుదాం. భవిష్యత్తు తరాలకు పచ్చదనాన్ని అందిద్దాం.