నోట్ల రద్దు- దాని తర్వాతి పరిణామాల మూలంగా ఇవ్వాళ దేశ వ్యాప్తంగా ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం పోయింది. పైసలున్నా డిపాజిట్లు చేసేందుకు జనం సిద్ధంగా లేరు. నిజానికి విజయ్‍మాల్యా, నీరవ్ మోడి, లలిత్ మోడి, దీపక్ తల్వార్, మెహుల్ చోక్సి ఇట్లా కొన్ని వందల మంది ‘ఘరానా దొంగలు’ బ్యాంకులను ముంచి దర్జాగా విదేశాల్లో షికార్లు చేస్తున్నారు. మరోవైపు భారతదేశ సగటు మనిషి బ్యాంకులో ఉన్న తన ఖాతాలోని సొమ్ముని విత్‍డ్రా చేసుకునేందుకు ఎటిఎంల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తున్నది. మరోవైపు ఇంటి దొంగలు పంజాబ్ నేషనల్ బ్యాంక్‍లో వేల కోట్లను మెక్కేసిండ్రు. అట్లాగే చందాకొచ్చార్ తాను చైర్మన్‍గా ఉన్న ఐసిఐసిఐ బ్యాంకు లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఐడిబిఐ బ్యాంక్ ఉన్నతాధికారులు కిశోర్ కారత్, మెల్విన్ రెగోలు అవినీతికి పాల్పడ్డారని సిబిఐ కేసులు నమోదు చేసింది. ఇది వర్తమానం. చరిత్రలో కూడా ఇలాంటి బ్యాంకింగ్ మోసాలు, దివాళాలు చాలానే ఉన్నాయి.
హైదరాబాద్‍లో 1901లో స్థాపితమైన శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వారు అధిక వడ్డీ ఇస్తుందనే ఆశతో అర్బత్తునాట్ కంపెనీలో తమ సొమ్ముని దాచి పెట్టినారు. అయితే ఆ కంపెనీ 1906లో దివాళ ప్రకటించడంతో ఆ గ్రంథాలయం ఆదిలోనే ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ కంపెనీ మద్రాసు కేంద్రంగా నడిచింది. హైదరాబాద్‍లో దాని శాఖ ఉండింది. దీని లాంటిదే మరో విదేశీ బ్యాంక్/సంస్థ పామర్ అండ్ కంపెనీ. అధిక వడ్డీలు వసూలు చేస్తూ నిజాం ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టింది. ఈ బ్యాంక్ అక్రమాలు, మోసాలు, అవినీతిని బ్రిటీష్ రెసిడెంట్ చార్లెస్ మెట్కాఫె (1785-1846) తప్పుపట్టిండు చివరికి లండన్‍లోని కోర్టువరకూ ఈ వ్యవహారాలు వెళ్ళినాయి.
దేశంలో వివిధ సంస్థానాధీశులతో ఒప్పందం కుదుర్చుకున్న మాదిరిగానే రెండో నిజామ్ నిజాం అలీఖాన్ (1762-1803)తో బ్రిటీష్ గవర్నర్ జనరల్ ‘సైన్య సహకార పద్ధతి’న 1798, 1800ల సంవత్సరాల్లో రెండు వేర్వేరు ఒప్పందాల్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల ప్రకారం సైన్యంలో నియామకాలు, నియంత్రణ అంతా బ్రిటీష్ అధికారుల చేతిలో ఉంటుంది. నిజాం ర్యాంలో ఎక్కడ శాంతి భద్రతల సమస్యలు తలెత్తినా ఈ సైన్యం రంగంలోకి దిగుతుంది. అయితే ఈ సైన్యం జీతభత్యాలు, వాటి నిర్వహణకు అయ్యే ఖర్చులన్నీ నిజాం ప్రభుత్వమే భరించాల్సి ఉండేది. వీటి ఆర్థిక వ్యవహారాల రాత కోతలు, ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ నిజాం ప్రభుత్వం తరపున ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న రాజా చందూలాల్ (1766-1845) నిర్వహించేవాడు. చందూలాల్ 1808 నుంచి ఈ బాధ్యతలు స్వీకరించాడు. ఈయన పూర్తిగా అవినీతి పరుడు. బ్యాంక్ అధికారులతో కుమ్మక్కయి ప్రభుత్వానికి లక్షల రూపాయల నష్టాన్ని వాటిల్ల జేసిండు. చందూలాల్ భార్యకు ఆనాటి బ్రిటిష్ రెసిడెంట్ కిర్క్పాట్రిక్ భార్య ఖైరున్నీసా బేగమ్‍తో మంచి సంబంధాలు, మిత్రత్వం ఉండేది. అందివచ్చిన ఏ అవకాశాన్ని జారవిడుచు కోకుండా ఆయన తన ‘పనులు’ చక్కబెట్టుకునేవాడు.
ఆనాడు చాలా మంది బ్రిటీష్ అధికారులు స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం నవాబుల అమ్మాయిలను వివాహమాడేవారు. ఇది తమ విధి నిర్వహణకు తోడ్పడుతుందని కూడా వారు భావించేవారు. అట్లా హైదరాబాద్‍లో బ్రిటీష్ రెసిడెంట్‍గా ఉన్నటువంటి కిర్క్పాట్రిక్ రాజ కుటుంబానికి చెందిన ఖైరున్నీసాను వివాహమాడినాడు. అలాగే విలియమ్ పామర్ (1740-1816) అనే బ్రిటీష్ మేజర్, తాను లక్నోలో ఉన్న సమయంలో అవధ్ సంస్థానానికి చెందిన ఫైజున్నీసా బేగమ్‍ని (1828లో మరణం) 1780 ఆ ప్రాంతంలో వివాహమాడినాడు. ఈయనకు అంతకుముందే ఇంగ్లండ్‍లో మరో స్త్రీతో పెళ్ళయింది. ఈయన గ్వాలియర్, లక్నో , పూనా రెసిడెన్సీల్లో రెసిడెంట్‍గా విధులను నిర్వహించినాడు. విలియం పామర్‍కు వారన్ హేస్టింగ్స్ కాలం నుంచి గవర్నర్ జనరల్స్తో సత్సంబంధాలున్నాయి. ఆ తర్వాత కార్న్వాలిస్ కాలంలో కూడా ఇవి కొనసాగాయి. ఈ సంబంధాలను ఆసరాగా చేసుకొని ఇంగ్లండ్‍కు చెందిన భార్యకు పుట్టిన ఈయన కుమారుడు జాన్ పామర్ కలకత్తాలో ‘పామర్ అండ్ కంపెనీ’ పేరిట ఒక బ్యాంక్/సంస్థని 1809లో స్థాపించినాడు. దీని హైదరాబాద్ శాఖను ‘ఫైజున్నీసా బేగమ్’కు పుట్టిన విలియమ్ (తండ్రీ కొడుకులకు ఒకే పేరున్నది) పామర్ చూసుకునేవాడు.
అంతకుముందు ఈ విలియమ్ పామర్ (జూనియర్) తన 19వ యేట ఇంగ్లండ్‍లో చదువు ముగించుకొని హైదరాబాద్ వచ్చిండు. ఈయన బ్రిటీష్ రెసిడెన్సీకి, మిలిటరీకి సంబంధం లేకుండా నేరుటీ నిజాం అంతరంగిక సైన్యంలో ఉద్యోగిగా చేరినాడు. త్వరలోనే బ్రిగేడియర్ స్థాయికి ఎదిగిండు. బహుశా తన తల్లి ముస్లిం కావడం కూడా ఇందుకు ఉపయోగ పడి ఉంటుంది. ఈయన నిజాం సంస్థానంలో ఉద్యోగం చేసిన మొట్టమొదటి బ్రిటీష్ జాతీయుడు. ఈ దశలో అంటే పామర్ 1810లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన అన్న జాన్ పామర్, సొంత తమ్ముడు హేస్టింగ్స్ పామర్‍తో కలిసి బ్యాంకింగ్ రంగంలోకి దిగినాడు. ఈ బ్యాంక్ కేంద్ర కార్యా లయం బ్రిటీష్ రెసిడెన్సీ (కోటీ)కి సమీపంలోనే ఉండేది. బహుశా ఈనాడు కోటీలో ఉన్న ఆంధ్రాబ్యాంక్ ప్రాంతంలోనే ఆ బ్యాంక్ ఉండేది. తర్వాతి కాలంలో కొంచెం అటు ఇటుగా ఈ వీధినంతా బాంక్‍స్ట్రీట్‍గా పిలిచే వారు. ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని అలాగే పిలుస్తారు. ఈ కంపెనీలో పామర్ కుటుంబంతో పాటుగా గుజరాత్‍కు చెందిన మిలియనీర్, వ్యాపారస్తుడు సేట్ బంకట్ దాస్ అనే అతను కూడా భాగస్వామిగా చేరిండు. ఎంత పెద్దమొత్తంలో డబ్బు కావాల్సిన క్షణాల్లో సమకూర్చే సత్తా ఈయన కుండేదని ‘నిజాం హిజ్ హిస్టరీ’ అనే పుస్తకంలో హెన్రీ జార్జ్ బ్రిగ్స్ రాసినాడు. ఈ బ్యాంక్‍లో పెట్టుబడి పెట్టిన మరో వ్యక్తి హైదరాబాద్ బ్రిటీష్ రెసిడెన్సీలో డాక్టర్ (సర్జన్)గా పనిచేస్తున్న (అప్పటికి) విలియమ్ కర్రీ. ఈయన రెండు లక్షల రూపాయలను ఇన్వెస్ట్ చేసినాడు. అలాగే సామ్యూల్ రస్సెల్ అనే హైదరాబాద్-బ్రిటీష్ సైన్యంలో పనిచేసిన వ్యక్తి 13 లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టిండు. అట్లాగే వారెన్ హేస్టింగ్స్ కుటుంబంలోని అమ్మాయిని వివాహమాడిన విలియమ్ రంబోల్డ్ (ఈతని తాత థామస్ రంబోల్డ్ మద్రాసు గవర్నర్‍గా పనిచేసిండు. అత్యంత అవినీతి పరుడిగా ఆయనకు ముద్ర ఉన్నది) కూడా ఇందులో పెట్టుబడి పెట్టినాడు.
సామ్యూల్ రస్సెల్ హైదరాబాద్‍లో బ్రిటీష్ రెసిడెంట్స్గా పనిచేసిన హెన్రీ రస్సెల్‍తో ఎలాంటి బాంధవ్యం లేకున్నా నామస్వామ్యంతో బాంధవ్యమున్నట్లుగా నమ్మించి తన కార్యకలాపాలు నిర్వహించుకునేవాడు. ఈ సంస్థ 1816లో లైసెన్స్ కోసం ఈస్టిండియా కంపెనీకి అప్లయి చేసుకున్నది. ఈస్టిండియా కంపెనీ 1797లో చేసిన చట్టం ప్రకారం ఇంగ్లండ్‍కు చెందిన ఏ బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ ప్రత్యక్షంగా స్థానిక సంస్థానాధీశులతో ఎలాంటి లావాదేవీలు చేయకూడదనే నిబంధన ఉండేది. అలాగే ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులు ఎవ్వరు కూడా ఇలాంటి లావాదేవీలు చేయకూడదనే నిబంధన కూడా ఉండేది. ఒక్క డాక్టర్లకు మాత్రం 1840వకు ఈ మినహాయింపు ఉండేది.
వీటన్నింటిని ఆసరా చేసుకొని తమ తండ్రికి ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్ దగ్గర ఉన్న పరపతిని ఉపయోగించి పామర్ సోదరులు బ్యాంక్‍కు అనుమతిని పొందినారు. ఈ అనుమతిని ఈస్టిండియా కంపెనీ మంజూరు చేస్తూ బ్యాంక్ హైదరాబాద్ లావాదేవీలు ‘బ్రిటీష్ రెసిడెంట్’ ఉత్తర్వులకు లోబడి ఉండాలని నిర్దేశించింది. ఇట్లా హైదరాబాద్‍లో తమ లావాదేవీలు ప్రారంభించిన పామర్ అండ్ కంపెనీ ఆది నుంచి లాభాల్లో నడిచింది. ఈ దశలోనే బ్రిటీష్ వారితో కుదుర్చుకున్న ‘సైన్య సహకార ఒడంబడిక’ మేరకు ఏడాదికి దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు జీతభత్యాలు, నిర్వహణ కింద నిజాం ప్రభుత్వం భరించాలి. ఇందుకు నిజాం ప్రభుత్వం వద్ద తగినంత సొమ్ము లేక పోవడంతో ‘బ్యాంక్’నుంచి ఈ మొత్తాన్ని అప్పుగా తీసుకునేవారు. ప్రతియేటా ఇదే తంతు జరిగేది. దీనికి మొదట్లో బ్రిటీష్ రెసిడెంట్ గ్యారం టీర్‍గా వ్యవహ రించారు. పామర్ అండ్ కంపెనీ ఒక్క బ్యాంకింగ్ రంగంలోనే గాకుండా హైదరాబాద్ రాజ్యం నుంచి పత్తి, టేకు కలపను పెద్ద ఎత్తున ఇంగ్లండ్‍కు ఎగుమతి చేసింది. మరఠ్వాడా ప్రాంతంలో పండే పత్తిని, పాల్వంచ ప్రాంతంలో దొరికే మేలు రకమైన టేకును విదేశాలకు ఎగుమతి చేసేవారు. వీరి ఎగుమతి సజావుగా సాగడానికి రోడ్డు మార్గం కాకుండా గోదావరి నదీ మార్గాన్ని ఎంచుకున్నారు. ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టిన ఆర్థర్ కాటన్ సేవలను కూడా ఇందుకోసం వినియోగించుకున్నారు. గోదావరీ నది సముద్రంలో కలిసే ప్రాంతంలో అప్పటి రాయల్ నేవికి చెందిన కెప్టెన్ చార్లెస్ టైలర్ సేవలను కూడా వినియోగించుకున్నారు. ఇదంతా ప్రభుత్వం సొమ్ముతో ప్రయివేటు సోకు చేయడమే! చార్లెస్ టైలర్ పామర్ అండ్ కంపెనీ కోసం ‘కోరింగ’లో పెద్ద ఓడరేవునే నిర్మించినాడు.
నిజానికి పామర్ అండ్ కంపెనీ స్థాపనలో ప్రధానోద్దేశ్యం వ్యాపారం చేయడం. కాని లాభాలు అధికంగా ఉంటాయని తలచి బ్యాంకింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇట్లా ప్రజల నుంచి ఏడాదికి 12శాతం వడ్డీ చెల్లించే విధంగా డిపాజిట్లను స్వీకరించారు. ఇదే కంపెనీ నిజాం ప్రభుత్వానికి ఏడాదికి 24శాతం వడ్డీపై అప్పులను ఇచ్చింది. ఈ దశలో హైదరాబాద్‍లో బ్రిటీష్ రెసిడెంట్‍గా నియమితులైన సర్ చార్లెస్ మెట్కాఫె బ్యాంకు వసూలు చేస్తున్న అధిక వడ్డీపై అభ్యంతరం వ్యక్తం జేసినాడు.
అంతేగాకుండా 20లక్షల రూపాయల క్లెయిమ్స్ చెల్లబోవని ప్రకటించినాడు. అలాగే గతంలో నిజాం ప్రభుత్వంలో పనిచేసినందుకు విలియమ్‍పామర్‍కు చెల్లించే భత్యాల చెల్లింపులను ఆపు చేయించినాడు. 1820 నాటికి 60 లక్షల రూపాయలను అప్పుగా ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా కంపెనీ దొంగ లెక్కలను చూపించిందని ఇదంతా మోసమని కేసు నడిచింది. ఈ కేసులో విలియమ్ రంబోల్డ్ కోర్టులో ఒక పత్రాన్ని దాఖలు చేస్తూ 1815, 1816, 1817, 1818 మరియు 1819 సంవత్సరాలకు గాను పామర్ అండ్ కంపెనీ నిజాం ప్రభుత్వానికి 42,41,452 రూపాయలను అడ్వాన్స్గా చెల్లించినట్లు పేర్కొన్నది. అయితే అదే పత్రాల్లో 1820నాటికి 40 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఒక్క ఏడాదిలోనే ఇచ్చినట్లుగా తెలిపింది. అంటే సైన్యం జీత భత్యాల కోసం 1815 నుంచి 1819 వరకు సంవత్సరానికి దాదాపు ఎనిమిది లక్షల రూపాయల చొప్పున చెల్లిస్తూ ఒక్క 1820లోనే 40 లక్షలు చెల్లించినట్లు చెప్పడం అవినీతి జరిగిందనడానికి రుజువులు దొరికాయి. ఎందుకంటే ఒక్క ఏడాదిలోనే పదింతలుగా జీతభత్యాలు పెరగడమనేది అసంభవం. ఈ దొంగ లావాదేవీల్లో నిజాం ప్రధానిగా పనిచేసిన రాజా చందూలాల్‍కు వాటాలు దక్కాయి. ఇట్లా మోసపూరితంగా ప్రభుత్వ సొమ్ముని కాజేయడాన్ని రెసిడెంట్ చార్లెస్ మెట్కాఫె అటు కలకత్తా కోర్టులోనూ, ఆ తర్వాత లండన్‍లోనూ సమర్ధవంతంగా వాదించి నిజాం ప్రభుత్వానికి మేలు జేసిండు.
ఈ మోసాల్లో చాలామంది అధికారులకు భాగస్వామ్య ముండింది. బ్రిటిష్ రెసిడెంట్‍గా పనిచేసిన హెన్రీ రస్సెల్ మద్రాసులో దుబాసీగా పనిచేసిన లంగర్ పాపయ్యతో కలిసి మోసాలకు పాల్పడ్డారని ఈస్టిండియా కంపెనీ ఆయన్ని పదవీలోంచి తప్పించింది. తర్వాత ఈ విషయాన్ని రస్సెల్ బంధువు ప్రఖ్యాత ఆంగ్ల నవలా రచయిత వాల్టర్‍స్కాట్ తన ‘సర్జన్స్ డాటర్’లో రికార్డు చేసినాడు. నిజానికి ఆనాడు బ్రిటీష్ అధికారులు అందరికీ దగ్గరి సంబంధ, బాంధవ్యాలుండేవి. దీంతో ఏ స్థాయిలోనైనా తమ పనులు చకచకా నెరవేర్చుకునేవారు. రంబోల్డ్కు హేస్టింగ్ కుటుంబంతో, విలియం పామర్ (జూనియర్) చెల్లె మేరి వివాహం హైదరాబాద్ రాజ్యంలో ఉన్నతాధికారిగా పనిచేసిన ఫిలిప్ మెడోస్‍తో జరిగింది. విలియం (సీనియర్) మేనల్లుడు ఎడ్వర్డ్ పామర్ డాక్టర్‍గా పనిచేసిండు. మంత్రులందరితో సన్నిహిత సంబంధాలుండేవి. మొత్తమ్మీద చాపకింద నీరులా హైదరాబాద్ ఆదాయానికి గండి కొట్టడం, మోసపూరితంగా స్వాహా చేయడం జరిగింది.