రామానంద తీర్థ

స్వామి రామానంద తీర్థ హైదరాబాదు సంస్థానంలో స్వాతంత్య్ర సమర శంఖారావాన్ని పూరించిన వీరసేనాని సంస్థాన విమోచనోద్యమంలో కీలకపాత్రను పోషించిన పోరాటయోధుడు. సంస్థాన ప్రజల విముక్తి కోసం ఉద్యమాలను నడిపిన విప్లవనాయకుడు. ఇక్కడి ప్రజలకు ఉద్యమాల ఉగ్గుపాలుపోసి, తిరుగుబాటు తత్వానికి బాటలు చేసిన మార్గదర్శి, అణచివేతల నుంచి తలలు పైకెత్తి, పిడికిలి బిగించి నిరంకుశ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించే ధైర్య సాహసాలను నూరిపోసిన శౌర్యవంతుడు. యవ్వన దశలోనే అవివాహితునిగా సన్యాసం స్వీకరించిన యోగి పుంగవుడు ఆధ్యాత్మిక ప్రవక్త. యావజ్జీవితాన్ని నమాజసేవకు, దేశారాధనకు వెచ్చించిన త్యాగధనుడు. నిజాం ప్రభుత్వాన్ని ఢీకొన్న ఆయన సాహసం. ప్రజలను జాగృత పరచడంలో ఆయన సలిపిన కృషి అసమానమైనది.


నిస్వార్థపరుడు, నిరాడంబర జీవి, త్యాగశీలి, దేశభక్తుడు, గాంధేయవాది సత్యాహింస సిద్ధాంతాల ద్వారానే స్వాతంత్య్రం సాధించవచ్చునని ప్రగాఢంగా విశ్వసించినవాడు. నిరుపేదల పట్ల, అణగారిపోయిన అట్టడుగు వర్గాల పట్ల, దళిత ప్రజల పట్ల ఆయనకు ఉండిన స్పందన అపారమైనది. వారి జీవితాలు మెరుగుపడాలనీ, వెలుగులు నిండాలని అహరహం ఆలోచిస్తూ, ఆ దిశగా అడుగులేస్తూ ఉండేవాడు. కొందరు ఇతనిపై తీవ్రవాది అనే ముద్రను కూడా వేశారు. ప్రజలలోని పేదరికాన్ని తొలగించాలంటే, ధనస్వామ్య వ్యవస్థపై అదుపు ఉండాలనే వారు. సామ్యవాదం, ప్రజాస్వామ్యపు విలువల పట్ల అత్యంత గౌరవం కలిగిన వారు. వాటి విధానాల అమలు పట్ల అచంచలమైన దీక్ష కలిగిన వారు.


స్వామి రామానంద తీర్థ కర్ణాటకలో పుట్టినప్పటికీ, మహారాష్ట్రలో విద్యాభ్యాసం చేసి, రాజకీయ కార్యకలాపాలు కొనసాగించినప్పటికీ ఆయన రాజకీయ నాయకత్వం సంపూర్ణంగా వికసించి, విరాడ్రూపాన్ని ప్రదర్శించింది. మాత్రం తెలంగాణలోనే.


స్వామిజీ పూర్వాశ్రమంలోని పేరు వెంకటేశ్‍ భావన్‍రావ్‍ ఖడ్గీకర్‍. ఈయన 1903 అక్టోబర్‍ 3వ తేదీన గుల్బర్గా జిల్లాలోని చిన్నెల్లా జాగీర్‍ అనే గ్రామంలో జన్మించారు. ఇది పూర్వపు కర్ణాటక ప్రాంతంలోనిది. వీరు షోలాపూర్‍ మెట్రిక్యులేషన్‍ చదువుతూ, దానికి స్వస్తి పలికి, 1921లో గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ఆ తరువాత పూణెలోని తిలక్‍ విద్యాపీఠం నుంచి ఎం.ఏ. పట్టా పొందారు.


ఆనాడు కార్మిక నాయకునిగా పేరు పొందిన ఎస్‍.ఎం. జోషికి కార్యదర్శిగా కార్మిక రంగంలో కొంతకాలం పనిచేశారు. బొంబాయి బట్టల మిల్లు కార్మికులను సంఘటిత పరచడంలో వీరి ప్రజాసేవ ప్రారంభమైంది. ఆ తరువాత 1929లో ఉస్మానాబాద్‍ జిల్లా ఇప్పర్గి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ప్రధానో పాధ్యాయునిగా పనిచేశారు. నెలకు 70 రూపాయలు జీతం లభించేది. ఆ దానిలో నుండి ఒక్క పైసా కూడా తన కోసం వాడుకోకుండా, ఆపాఠశాల వదిలి వెళ్ళేటప్పుడు జమ అయిన తన వేతనం మొత్తం డబ్బును అదే పాఠశాలకు విరాళంగా ఇచ్చారు. మెట్రిక్‍ తరగతికి ఇంగ్లీషు పాఠాలు చెప్పేవారు. ఆ పాఠశాలలో అనంతరావు కులకర్ణి అనే దేశభక్తుడు కరస్పాండెంట్‍గా పనిచేసేవారు. ఆయన ధ్యానేశ్వరీమాత ఉపాసకుడు. యువకుడైన వెంకటేశ్‍ ఆయన ప్రభావంలో పడిపోయి ఆధ్యాత్మిక రంగంలోకి అడుగు పెట్టాడు. దాదాపు ఆరేళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, అనంతరం బీడ్‍ జిల్లాలోని మొయినాబాద్‍లో యోగీశ్వరి పేరుతో స్వయంగా ఉన్నత పాఠశాలను స్థాపించారు. భిక్షాటన చేస్తూ జీవితం గడిపారు.


గృహస్థ జీవితం రాజకీయోద్యమాలలో పని చేయడానికి ఆటంకం అని భావించి వీరు వివాహం చేసుకోలేదు. భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి గురుకుల దీక్ష ఆత్మోన్నతికి తోడ్పడుతుందని అభిప్రాయ పడ్డారు. ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండి కఠోరమైన సన్యాసాశ్రమాన్ని తన 29వ ఏటనే అంటే 1931లో స్వామి తీర్థా స్వీకృతిలో స్వీకరించి స్వామి రామానందతీర్థగా మారిపోయారు.
1938లో మరాఠా ప్రాంత మహాసభకు స్వామిజీ కార్యదర్శిగా పనిచేయడంతో వారి రాజకీయోద్యమ రంగ ప్రవేశం జరిగింది. అప్పటి నుంచి వీరు రాజకీయాలలో క్రియాశీలంగా పని చేస్తూ వచ్చారు. ఇందుకు హైదరాబాదు నగరాన్ని వారు కార్యక్షేత్రంగా ఎంచుకొన్నారు.


తెలంగాణాలో ఒకవైపు ప్యూడల్‍ వ్యవస్థ, మరొకవైపు దారిద్య్రం, పేదరికం, వీటి వల్ల ప్రజలలో తిరుగుబాటు తలఎత్తితే, ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణచివేతకు పూనుకొనేది. దాని వల్ల నిరంతరం ప్రభుత్వానికి, ప్రజలకు నడుమ సంఘర్షణ జరుగుతూ ఉండేది. అది అరాచరానికి, హింసాత్మక ఘటనలకు దారి తీసేది. దానివల్ల ఎల్లప్పుడు అల్లకల్లోలం, అలజడి, అశాంతి చెలరేగుతుండేది.
ఇటువంటి పరిస్థితులను చక్కబెట్టి, ప్రజలకు ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించడానికి స్వామీజీ నడుం బిగించారు. తెలంగాణ వెనుకబాటు తనానికి కేవలం మత దురహంకారమో, నిరంకుశత్వమో కారణం కాదు. అక్కడ సాంఘిక, ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణమని స్వామిజీ భావించారు. అందువల్ల ముందుగా వాటిని సంస్కరిస్తే ప్రజల సమస్యలు వాటంతట అవే పరిష్కరింపబడతాయని ఆయన ఉద్దేశం.


1938 అక్టోబరు 24న తేదీన హైదరాబాదు స్టేట్‍ కాంగ్రెసు ఏర్పడింది. దానికి స్వామిజీ కార్యదర్శిగా ఎన్నుకో బడ్డారు. ఈ సంస్థకు సంపూర్ణ స్వరూపం ఏర్పడక ముందే నిజాం ప్రభుత్వం దానిని నిషేధించింది. ఆ నిషేదాజ్ఞను ఉల్లంఘించినందుకు స్వామిజీ జైలు శిక్షకు గురయ్యారు. ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి, కాళ్ళకు బేడీలు తగిలించారు. ఒక న్కిరు, గొంగలి, చెంబు, కంచం ఇచ్చారు. ఆయనతో రోజూ ఎనిమిది గంటలు పనిచేయించారు. మొదటిసారే ఆయను పదిహేను నెలలు జైలులో ఉంచారు. రాష్ట్రంలో వందేమాతరం
ఉద్యమం కూడా అప్పుడే వచ్చింది. గాంధీజీ సూచనపై స్టేట్‍ కాంగ్రెసు తన సత్యాగ్రహాన్ని విరమించుకుంది. నాయకులందరూ సేవాశ్రమం వెళ్ళి గాంధీజీతో సంప్రదింపులు జరిపారు. సేవాశ్రమం నుంచి తిరిగి రాగానే స్వామిజీ ఆనాటి సంస్థాన ప్రధాని సర్‍ అక్బర్‍ హైదరీకి లేఖ రాస్తూ ప్రజాపోరాటాలను, మతపోరాటాలుగా భావించరాదని హెచ్చరిస్తూ, తన పోరాటాన్ని తిరిగి కొనసాగించారు. 1940 నవంబరు 11వ తేదీన స్వామిజీని ప్రభుత్వం మళ్ళీ అరెస్టు చేసి పదిహేను మాసాలు నిజామాబాద్‍ కోట జైలులో ఉంచింది. 1946-47లలో స్వామిజీ మూడవసారి అరెస్టయి మరో 16 నెలలు కారాగార జీవితం గడిపారు. 1946 లోనే స్వామిజీ స్టేటు కాంగ్రెసుకు అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు. హైదరాబాదు సంస్థానం స్వాతంత్య్ర పోరాట చరిత్రలో నాలుగున్నర సంవత్సరాలుగా సుదీర్ఘ జైలు జీవితం అనుభవించింది స్వామి రామానంద తీర్థయే. దేశానికి స్వాతంత్య్రం లభించిన రోజున ఢిల్లీలో నెహ్రూ ఇచ్చిన జాతీయ పతాకం తీసుకుని హైదరాబాదు రాగానే స్వామిజీని పోలీసులు తిరిగి అరెస్టు చేసి చంచల్‍గూడ జైలులో నిర్బంధించారు. పోలీసు చర్య తరువాత ఆయన విడుదలయ్యారు.


హైదరాబాదు సంస్థానంలోని కాంగ్రెసు రాజకీయోద్యమం ఆనాడు రెండు రకాలుగా నడిచింది. ఒకటి మితవాద ధోరణితో, రెండోది తీవ్రవాద ధోరణితో. ఒక వర్గం నిజాం నవాబుతో సంప్రదింపులు జరుపుతూ సఖ్యంగా రాజకీయ పరిష్కార మార్గం గురించి సయోధ్యతో ఆలోచించడం మంచిదనే దృష్టితో ఉండేది. ఇక మరో వర్గం తెలంగాణలోని యువత. వీరు తీవ్రవాద కార్యక్రమాలతో తప్ప నిజాం పాలనను అంతమొందించడం సాధ్యం కాదనే అభిప్రాయం కలిగి ఉండేది. ఈ వర్గం వారు స్వామిజీని తమ నాయకునిగా బలపరిచారు. స్వామిజీ స్టేట్‍ కాంగ్రెస్‍ అధ్యక్షులుగా కాగానే సంస్థాన ప్రజా ఉద్యమంలో అతివాద రాజకీయాలను ప్రవేశపెట్టారు. దానితో ఆయనపై తీవ్రవాది అనే ముద్రపడింది.


స్వామిజీ స్టేట్‍ కాంగ్రెసు అధ్యక్షులుగా ఉన్న సమయంలోనే ఆయన తెలంగాణలోని గ్రామాలలో పర్యటించారు. ఆ రోజులలో గ్రామాలలోని పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండేవి. రజాకార్లు ఈ సంస్థానంలోని ముస్లిమ్‍లు రాజులు, మహమ్మదీయేతరులందరూ వారికి దాసులనే నినాదాలతో అరాచకాన్ని సృష్టించసాగారు. ప్రజలపై అనేక రకాల అకృత్యాలు చేస్తూ భయోత్పాతం కలిగించారు. ఒక వైపు మిలటరీ, పోలీసుల దాడులు, మరొకవైపు కమ్యూనిస్టు దళాల దాడులు ఈ రెండింటి మధ్య ప్రజల జీవితం నలిగిపోయేది. పోలీసులను పగటి దొరలని, కమ్యూనిస్టులను చీకటి దొరలని ఆ రోజులలో అంటూ ఉండేవారు. దీన్నే ‘రాత్‍కీ సర్కార్‍, దిన్‍కే సర్కార్‍’ అనేవారు. ఇటువంటి అననుకూల వాతావరణంలో స్వామిజీ గ్రామాలలోకి అడుగు పెట్టారు. ఆయనకు ఎటువంటి అధికారం లేదు. పోలీసు రక్షణ లేదు. అయినా వెనుకడుగు వేయలేదు. భయంతో గ్రామాలను వదిలి వెళ్ళిపోతున్న రైతులను పిలిచి వారికి ధైర్యాన్ని నూరిపోశారు. వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపారు. పల్లె ప్రాంతాలలో జీవచ్ఛవాలలా ఉన్న ప్రజలకు మళ్ళీ ప్రాణం పోశారు. వారికి బ్రతుకుపై ఆశలు చిగురింపజేశారు.


స్వామిజీ స్టేట్‍ కాంగ్రెసు అధ్యక్షులుగా ఉన్న కాలంలోనే హైదరాబాదులో భూసంస్కరణలు జరిగాయి. హైదరాబాదు కౌలుదారీ చట్టం వచ్చింది. ఇది అందరికీ ఆమోదయోగ్యం గానే గాక ఆనందదాయకంగా మారింది. దేశానికంతటికీ మార్గదర్శకంగా నిలిచింది. బూర్గుల ప్రభుత్వ హయాంలో ఈ భూసంస్కరణలను వీరు వేగవంతం చేయించారు.


స్వామిజీ మొదటిసారి గుల్బర్గా నుంచి, రెండవసారి ఔరంగాబాదు నుంచి లోకసభకు పోటీ చేశారు. హైదరాబాదు స్టేట్‍ కాంగ్రెసు నాయకత్వాన్ని వదిలేసిన తరువాత స్వామిజీ నిర్మాణాత్మకమైన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక రంగంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. హైదరాబాదు ఖాదీ సమితి అధ్యక్షునిగా పనిచేశారు. తెలంగాణ ప్రముఖ కాంగ్రెసు నాయకులు పి.వి. నరసింహారావు, జమలాపురం కేశవరావు, కోదాటి నారాయణరావు, ఇంకా కాళోజీ మొదలైన ప్రముఖులంతా స్వామీజీ శిష్యులే.


స్వామిజీది ఒకరికి లోబడి ఉండే తత్త్వం కాదు. తలెత్తి ప్రశ్నించే నైజం, పోలీసు చర్య తరువాత కమ్యూనిస్టులను ఆణచివేసే తీవ్రహింసా పద్దతిని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. స్వామిజీ కేంద్రంపై తీసుకొని వచ్చిన ఒత్తిడి వల్లనే రాష్ట్రంలో మిలటరీ పాలనను తొలగించి ఎం.కె. వెల్లోడి ముఖ్యమంత్రిగా సివిల్‍ ప్రభుత్వం ఏర్పాటయింది. కమ్యూనిస్టులు జరిపిన సాయుధ పోరాటాన్ని కూడా స్వామిజీ సమర్ధించలేదు.


నల్లగొండ జిల్లా హుజూర్‍నగర్‍ తాలూకా చిల్లేపల్లి అనే గ్రామంలో కుటీరం ఏర్పాటు చేసుకొని కొంతకాలం అక్కడి ప్రజలకు శాంతిబోధలు చేశారు. స్వామిజీ షష్టిపూర్తి ఉత్సవం హైదరాబాదులో లాల్‍బహదూర్‍ శాస్త్రిగారి అధ్యక్షతన అత్యంత వైభవంగా జరిగింది. ఆ సందర్భంలో ఆయన పట్ల అశేష జనవాహిని ప్రకటించిన భక్తి గౌరవాలు స్వామిజీకి ప్రజలలో ఉన్న ఆదరణ ఎటువంటిదో స్పష్టం చేశాయి. ఇంతటి మహనీయుడైన ఆయన 1972 జనవరి 22వ తేదీన హైదరాబాదులో తుదిశ్వాన విడిచారు. పలురాష్ట్రాలలోని ఆయన శిష్యులు ఆయన స్మార్థకార్థం ‘స్వామి రామానందతీర్థ సాంఘిక, ఆర్థిక పరిశోధన సంస్థ’ను హైదరాబాదులో స్థాపించారు. గత ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం నెలకొల్పిన ‘గ్రామీణ విశ్వవిద్యాలయా’నికి స్వామి రామానంద తీర్థ పేరును పెట్టి ఆయనకు నివాళులర్పించింది.

(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన  ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
– డా।। టి. గౌరీశంకర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *