ఫెడరల్‍ స్ఫూర్తికి హానికరం జాతీయ విద్యావిధానం

కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చైర్మన్‍ కస్తూరి రంగన్‍ అధ్యక్షతన నియమించిన కమిటీ యిచ్చిన నివేదిక ఆధారంగా విద్యా మంత్రిత్వశాఖ ఒక విధాన పత్రాన్ని 67 పేజీలతో తయారు చేసింది. జాతీయ విద్యావిధానం – 2020 పేరుతో కేంద్ర ప్రభుత్వం 2020 జులై 29న ఆమోదించింది. ఈ విధానపత్రం మనదేశాన్ని నాలెడ్జి సెంటర్‍గా మారుస్తుందని, మనదేశం ప్రపంచ దేశాలకు మార్గదర్శి అవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.


భారత ఉపఖండం వివిధ భాషలు, ప్రజలు, మతాలు, కులాలు, చరిత్ర, సంస్కృతులు వంటి విభిన్నతకు నిలయమని, ఏకత్వంలో భిన్నత్వం కలిగిన సర్వోన్నతమైన అస్తిత్వం దీనికున్నదని, ప్రపంచంలో అత్యంత ఔన్నత్యం పొందిందని మనం చిన్నప్పుడు మన సాంఘిక శాస్త్ర పాఠాల్లో చదువుకున్నాం. స్వాతంత్య్రానికి ముందూ, తర్వాత ఈ విభిన్నతను కాపాడుకునే ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. మనం కూడా ‘స్థానికత’, ‘ప్రాంతీయత’ అనే మౌలిక భావనల ప్రేరణతో సుదీర్ఘకాలం ఉద్యమాలు, పోరాటాలు చేసి తెలంగాణాను సాధించుకున్నాం. తెలంగాణ భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, వనరుల వినియోగం వాటి పరిరక్షణ ధ్యేయంగా ఉద్యమించి విజయం సాధించాం. తెలంగాణ సాధించిన తరువాత మన ధ్యేయాల సాధనకోసం అన్ని రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం అవిరళ కృషి చేస్తూనే ఉంది.


ముఖ్యంగా విద్యారంగంలో మన భాష, సంస్కృతి, చరిత్రకు అత్యంత ప్రాధాన్యతయిస్తూ మన పాఠ్యగ్రంథాలు రూపొందాయి. విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలు పెంచే విధంగా మొదటి తరగతి నుండి 10వ తరగతి వరకు సిలబస్‍లో మార్పులు జరిగాయి. ఆదివాసీ, గిరిజన, వెనుకబడిన కులాల కోసం గురుకుల పాఠశాలల ఏర్పాటు జరిగింది. ఇవి 100 శాతం విద్యా ఫలితాలు సాధించాయి. మాతృభాషలో విద్యాబోధనకు పెద్దపీట వేసింది. ఉర్దూ మీడియంలో అనేక పాఠశాలలు ఏర్పాటు జరిగింది. ఉర్దూ అకాడమీ, సాహిత్య అకాడమీ, తెలంగాణ సాంస్కృతికశాఖ వంటివి ఏర్పాటయ్యాయి. ఆదివాసీ, గిరిజన, జానపద సాంస్కృతిక రంగాలకు అధిక ప్రాధాన్యతలను యిచ్చి మన ప్రాంత ఔన్నత్యాన్ని నిలబెడుతుంది. 10 జిల్లాలను 33 జిల్లాలుగా వికేంద్రీకరించి పాలనను ప్రజల వద్దకు తీసుకువెళ్ళింది. ఈ నేపథ్యంలో ఈ జాతీయ విద్యావిధానాన్ని విశ్లేషించుకోవాలి. ఈ విధానపత్రం ప్రాథమిక విద్యనుండి ఉన్నత విద్య వరకు కేంద్రీకరణకు ప్రతిపాదిస్తున్నది. దీని నిర్వహణ కోసం వేరు వేరు కమీషన్లు ఏర్పాట్లు చేస్తుంది.


ఈ విధాన పత్రంలో హిందీ, సంస్కృతం వంటి కొన్ని భాషలకు అధిక ప్రాధాన్యత యిచ్చారు. భారతీయ ప్రాచీన భాషల లిస్టులోగానీ, ప్రాంతీయ భాషల లిస్టులో గానీ ఉర్దూ భాష గురించి ప్రస్తావన లేదు. రిజర్వేషన్ల ప్రస్తావన లేదు. భారతీయ జ్ఞానాన్ని సుసంపన్నం చేసిన మధ్యయుగాల చరిత్రక అంశాలు చోటు చేసుకోలేదు. ముఖ్యంగా రాజ్యాంగ స్ఫూర్తి, పర్యావరణం, లౌకిక భావనలను తొలగించారు.


మనకు సమగ్రమైన శాస్త్రీయ విద్యావిధానం లేదని, ఇప్పటికే అకడమిక్‍ ఇయర్‍ తగ్గిన కారణంగా పలు పాఠ్యాంశాలను తొలగించారు. ఈ విద్యావిధానం అన్ని రంగాలలో ప్రజల అభ్యున్నతికి దోహదకారిగా లేదని పలువురు విద్యావేత్తలు, భాషావేత్తలు, మేధావుల అభిప్రాయం.
దీనితో విద్యావిషయాలలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు, బాధ్యతలు, హక్కులు నిర్వీర్యమవుతాయి. స్థానిక, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉండదు. విద్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత (కంకరెంట్‍లిస్ట్)కు విఘాతం కలుగుతుంది.

-మణికొండ వేదకుమార్
ఎడిటర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *