అనామకంగా.. అన్యాయంగా

నేనో మామూలు స్త్రీని
నా శీలాన్ని మీరు
ఎలాగూ కాపాడలేదు
మా వాళ్ళు
గాలి పీల్చుకోవడానికి కూడా
అవకాశం ఇవ్వలేదు

మానభంగ పరిష్యంగంలో
చనిపోయిన నా మొఖాన్ని
చివరికి
మా అమ్మకి, నాన్నకి చూపించలేదు
రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు
నన్ను దహించి వేశారు

మీకు తెలుసో తెలియదో
జీవితానికి వ్యతి రేకం మరణం కాదు
జీవితంలోనే మరణం వుంది
అది అంతర్గతం

అన్నీ తెలిసీ మీరు
అనామకంగా
అన్యాయంగా
నన్ను


ఇది ఓ కవి ఆక్రోశం, అర్థరాత్రి రేప్‍ బాధితురాలి దహనం గురించి. దేశం నిద్రిస్తుంది. రాత్రి రెండుగంటల ప్రాంతంలో హత్రాస్‍ మేల్కొంది. ఓ శవాన్ని ఆ శవం శోకిస్తున్నప్పుడు అన్యాయంగా దహనం చేసింది ఉత్తరప్రదేశ్‍ ప్రభుత్వం లేదా ఆ ప్రభుత్వ అధికారులు.
హత్రాస్‍ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 19 సంవత్సరాల దళిత యువతి మీద సామూహిక మానభంగం జరిగింది. ఆమెకు గాయాలు కూడా అయ్యాయి. ఆ గాయాల కారణంగా ఆమె 29.9.2020 రోజున ఢిల్లీలోని సప్థర్‍ జంగ్‍ హాస్పిటల్‍లో చనిపోయింది.
పోస్ట్మార్టమ్‍ తరువాత ఆమె శవాన్ని అదే రోజు రాత్రి ఆమె గ్రామానికి తీసుకొని వచ్చారు. రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఆమె శవాన్ని దహనం చేశారు. ఈ వార్త ప్రముఖంగా పత్రికల్లో రావడం వల్ల అలహాబాద్‍ హైకోర్టుకి చెందిన లక్నో బెంచి ఈ కేసుని తనకు తానుగా స్వీకరించి విచారించింది.
ఆ బాధితురాలి కుటుంబ సభ్యులు కోర్టు ముందు హాజరై జరిగిన విషయాన్ని కోర్టుకి వివరించారు. ఆఖరి చూపుకి కూడా తాము నోచుకోలేదని వాళ్ళు కోర్టుకి విన్నవించారు. తమ అనుమతి లేకుండానే తమ కూతురు శవాన్ని కాల్చివేసినారని వారు కోర్టుకి చెప్పారు. ఆ రోజు రాత్రి దహనం చేయకపోతే తీవ్రస్థాయిలో అలజడులు జరిగే అవకాశం వుండటం వల్ల దహనం చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం కోర్టుకి చెప్పింది. మీ కూతురు విషయంలో కూడా మీరు ఇలాగే చేస్తారా అని కోర్టు జిల్లా మెజిస్ట్రేట్‍ని మందలించింది. గొప్పవాళ్ళింటి బిడ్డ అయితే ఇదే విధంగా అనామకంగా దహనం చేసే వారా? అని కూడా అధికారులని కోర్టు ప్రశ్నించింది.
ఆమె మీద రేప్‍ నేరం జరుగలేదని 2013లో వచ్చిన రేప్‍ లా మార్పులు తెలియకుండా మాట్లాడిన ఓ ఉన్నత పోలీస్‍ అధికారిని కోర్టు మందలించింది. బతికి వున్నప్పుడు ఆమె గౌరవాన్ని ప్రభుత్వం రక్షించలేకపోయింది. అదేవిధంగా చనిపోయిన తరువాత కూడా ఆమె శరీరానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆ ప్రభుత్వం ఇవ్వలేదు.


శవానికి కూడా గౌరవం వుంటుందన్న ప్రత్యేక చట్టం లేదు. కానీ తాను చనిపోయిన తరువాత శవం ఏ విధంగా పరిష్కరించాలో చెప్పే అధికారం ఆ వ్యక్తికి వుంటుంది. దానికి అవసరమైన వీలునామాని కూడా ఆ వ్యక్తి రాయవచ్చు. కోర్టులు వాటిని ఆమోదిస్తున్నాయి. ఈ విషయంలో కోర్టులు కూడా చాలా తీర్పులని వెలువరించాయి. అందులో ప్రముఖమైన తీర్పు పరమానంద కటారా తీర్పు. గౌరవంగా జీవించే హక్కు బతికి వున్న మనిషికే కాదు చనిపోయిన వ్యక్తి శవానికి కూడా వుంటుందని, అది రాజ్యాంగంలోని అధికరణ 21లో భాగమని కోర్టు ఈ తీర్పులో ప్రకటించింది. ఆ తరువాత మద్రాస్‍ హైకోర్టు మరిముత్తు కేసులో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వ్యక్తి సంప్రదాయాల ప్రకారం ఖననం కానీ దహనం కానీ చేయాల్సి వుంటుందని స్పష్టం చేసింది.
కరోనా కాలంలో కూడా ఈ విషయం మళ్ళీ కోర్టు ముందుకు వచ్చింది. కరోనా వల్ల చనిపోయిన వ్యక్తుల చివరి క్రియలు గౌరవంగా వాళ్ళు విశ్వాసాల ప్రకారం జరగాలని బొంబాయి హైకోర్టు మద్రాస్‍ హైకోర్టులు తమ తీర్పుల్లో ప్రకటించాయి.
కరోనా వల్ల మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులు వారి అంతిమ క్రియలు జరిపే అవకాశం కల్పించాలని, తగు జాగ్రత్తలు తీసుకొని అయినా జరపాలని కలకత్తా హైకోర్టు ఇటీవల తన తీర్పుని ప్రకటించింది.


శవం ఎలాంటి ఉపశమనాలని కోరదు. కోరే అవకాశం లేదు. ఈ విషయాన్ని కోర్టులు గుర్తించి అంతిమ క్రియలు గౌరవప్రదంగా జరగాలని సుప్రీంకోర్టు ప్రకాశ్‍ చంద్ర కేసులో చెప్పింది.
ఎన్ని తీర్పులు వున్నా, ప్రభుత్వాలు తమకు తోచింది, తమకు అనుకూలంగా వున్న పనులని చేస్తాయిన అనడానికి హత్రాస్‍ దహన ఉదంతాన్ని పేర్కొనవచ్చు. ఈ విషయాన్ని లక్నో బెంచి తీవ్రంగా తీసుకొంది. కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది.
‘‘మానవత్వాన్ని మతంగా భావించే దేశం భారతదేశం. బతికి వున్నప్పుడు చనిపోయినప్పుడు కూడా ఒకరినొకరు గౌరవించు కుంటారు. ఈ సంఘటనలో ఆ విధంగా జరుగలేదు. బాధితురాలి శవాన్ని ఆమె కుటుంబ సభ్యులకి అప్పగించలేదు. వాళ్ళ అనుమతి లేకుండానే అధికారులు శవాన్ని దహనం చేశారు. లా అండ్‍ ఆర్డర్‍ పేరు మీద తీసుకున్న ఈ చర్య వల్ల బాధితురాలి హక్కులకి, ఆమె కుటుంబ సభ్యుల హక్కులకి భంగం వాటిల్లింది. అంతిమ సంస్కారాలు అనేది చాలా ముఖ్యమైన మత నియమం. శాంతి భద్రతల పేరు మీద దాన్ని లేకుండా చేయడం సరైంది కాదు.’’
ఈ కేసులో ఉత్తరప్రదేశ్‍ అధికారులు బాధితురాలి హక్కులని, వాళ్ళ కుటుంబ సభ్యుల హక్కులని హరించివేసింది. గౌరవ ప్రదమైనఅంతిమ సంస్కారాన్ని బాధితురాలి శవానికి ఇవ్వలేదు. ఈ సదాచార ధర్మాన్ని రాజ్యం నిర్వర్తించలేకపోయింది.
ఏమైనా శవం తన హక్కులని ఉపశమనాలని కోరదు. బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా కోరే పరిస్థితులలో వాళ్ళు లేరు.
న్యాయాన్ని కోరక పోయినా న్యాయాన్ని అందించాల్సిన బాధ్యత కోర్టుల మీద రాజ్యం మీద వుంటుంది.
ఈ విషయాన్ని రాజ్యం ఎప్పుడు గుర్తిస్తే అప్పుడు ఈ అనామక దహనాలు జరగవు అన్యాయాలు తగ్గే అవకాశం వుంటుంది.


మంగారి రాజేందర్‍ (జింబో)
ఎ : 9440483001

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *