విద్య కోసం, మల్టినేషనల్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం వివిధ దేశాల నుంచి వచ్చిన వారితో హైదరాబాద్ ఇవ్వాళ అంతర్జాతీయ నగరంగా అలరారుతున్నది. భిన్న సంస్కృతులను, ఆహారపు అలవాట్లను అలవర్చుకుంటున్నది. ఈ అలవాట్లు ఇటీవలి కాలంలోనే మొదలయినట్టుగా బయటికి కనిపిస్తుంది. కాని చరిత్ర మాత్రం మరో విధంగా ఉన్నది. వందల యేండ్ల క్రితమే గోలకొండ/హైదరాబాద్ అంతర్జాతీయ రూపుని సంతరించుకున్నది. భిన్న రుచులకు వేదికగా నిలిచింది. హైదరాబాద్‍తో వివిధ దేశాల సాంస్కృతిక, సాహిత్య సంబంధాలు, కట్టడాల నిర్మాణశైలీ ప్రభావాలు ఆరువందల యేండ్లకుపైగా కొనసాగుతున్నదనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. హైదరాబాద్ నగరానికి డచ్, బ్రిటీష్, పోర్చుగల్, ఫ్రెంచ్ లాంటి యూరోపియన్ దేశాల నుంచి వ్యాపారులు, కంపెనీ అధికారులు వచ్చిండ్రు. వీరంతా ఇక్కడి వనరులను దోచుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. రోడ్లు, రవాణా, కమ్యూనికేషన్ తదితర రంగాల్లో అభివృద్ధి వారి అవసరాలకు అనుగుణంగా జరిగింది. అయితే ఏషియన్ దేశాల నుంచి వచ్చిన వారు మాత్రం ఇక్కడి వారితో మమేకమయిండ్రు. సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ సంబంధాలను పెనవేసుకున్నారు. హైదరాబాద్ చరిత్రలో ఇరాన్, టర్కీల సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే రీతిలో సాగాయి. గోలకొండ నవాబులు కుతుబ్‍షాహీలు ఇరాన్ నుంచి వచ్చిండ్రు. అసఫ్‍జాహీలు ముఖ్యంగా చివరి నిజామ్ కాలంలో టర్కీతో సంబంధ బాంధవ్యాలను ఏర్పర్చుకున్నారు. అయితే ఇప్పుడిక్కడ మాత్రం ఇరాన్-హైదరాబాద్ మధ్యల ఉన్నటువంటి సంబంధాలు, సాంస్క•తిక ప్రభావాల గురించి తెలుసుకుందాం! బాధాకరమైన విషయమేంటంటే ఇప్పటికీ కొంతమంది హైదరాబాద్ ‘మా కష్టార్జితం’ అని నిర్లజ్జగా మాట్లాడుతున్నరు. వందల యేండ్ల చరిత్ర, కాస్మోపాలిటన్ కల్చర్‍ని తనలో ఇముడ్చుకున్న ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ అని తెలంగాణ ఉద్యమకారులు ఎన్నడో తేల్చి చెప్పిండ్రు. అయినప్పటికీ ‘యూరోపియన్ల’ మాదిరి వలసాధిపత్య పైత్యం ఉన్న వాళ్లు మాత్రం హైదరాబాద్‍పై అవాకులు చవాకులు పేలుతున్నారు. వీళ్ల నోళ్లు మూయించాలంటే మళ్లోసారి చరిత్రను విడమర్చి చెప్పాల్సిన అవసరమున్నది.
హైదరాబాద్/గోలకొండ నిర్మాణమే అంతర్జాతీయ పునాదులపై నిలబడింది. కుతుబ్‍షాహీ- గోలకొండ నవాబులు ఇరాన్ నుంచి ఇండియాకు వలస వచ్చిండ్రు. స్థానిక ప్రజలతో మమేకమయిండ్రు. దసరా, దీపావళి రోజుల్లో అలయి-బలయి తీసుకునేవారు. ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులో కూడా తెలియబరిచేవారు. అక్కన్న, మాదన్నలను మంత్రులుగా నియమించుకున్నారు. సాహితీవేత్తలు వీరిని ‘మల్కిభరాము’డుగా పొగిడిండ్రు. మొహర్రం పండుగని స్థానికులు జరుపుకునేందుకు వీలుగా ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పించేది. ఈ కుతుబ్‍షాహీలే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ నగరం నిర్మించాలని నిర్ణయించారు. అట్లా నిర్మితమయిన నగరమే హైదరాబాద్. 427 ఏండ్ల క్రితమే అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం పొందింది. ఇరాన్ శైలిలో నగరం నిర్మితమయింది. విశ్వవ్యాప్తమైన హైదరాబాద్ సంస్కృతి, సాహిత్యం, నిర్మాణశైలి, పండుగలు, రుచుల్లో ఇరాన్ ప్రభావం ప్రధానంగా హైదరాబాద్‍పైనా, కొంత మేరకు తెలంగాణ అంతటా ఉన్నది. ఇవ్వాళ హైదరాబాదీయులు ‘ఇరానీ’ ఛాయ్ తాగకుండా ఉండని రోజు లేదంటే అతిశయోక్తి కాదు.
హైదరాబాద్ నగర నిర్మాణానికి 1591లో పునాదులు పడ్డాయి. దీనికి శ్రీకారం చుట్టింది మీర్ మోమిన్ పెష్వా. హైదరాబాద్ నగర లేఅవుట్‍ని తయారు చేయడమే గాకుండా, ఎక్కడ ఏ భవనం నిర్మించాలి, దారులు, రహదారులు ఎలా ఉండాలి, ఉద్యానవనాలు, సరస్సులు, మసీదులు, అషూర్‍ఖానాలు ఏ రీతిలో ఎక్కడ ఉండాలో ప్లాన్ గీసింది స్వయంగా అర్కిటెక్ట్ కూడా అయిన మీర్ మోమిన్. ఇరాన్‍లోని అస్త్రాబాద్ నగరానికి చెందిన మోమిన్ గోలకొండకు వచ్చిన తర్వాత 1585లో ఆయన్ని కుతుబ్‍షాహీలు పెష్వా(ప్రధానమంత్రి)గా నియమించారు. ఇరాన్‍లో అత్యంత గౌరవం పొందిన అల్ హుసేని, సయ్యద్ కుటుంబానికి చెందిన మోమిన్ తన మేనమామల వద్ద విద్యాభ్యాసం చేసిండు. ఆయన మేనమామ మీర్ ఫక్రుద్దీన్ సమకీ ఆనాడు ఇరాన్‍లో రాజగురువులు. మీర్ మోమిన్ కూడా కొన్నాళ్ళు ఇరాన్ రాజవంశీకులకు గురువుగా ఉన్నాడు. తాను హైదరాబాద్‍కు వచ్చిన తర్వాత అపారమైన జ్ఞాన సంపన్నుడు, కవి, ఆర్కిటెక్ట్, సాంస్కృతిక రాయబారి అయిన మీర్‍మోమిన్ హైదరాబాద్ నగర నిర్మాణం నాటి నుంచే దక్కన్-ఇరాన్ సాహిత్య, సాంస్కృతిక, వారసత్వ కట్టడాలకు వాహికగా, వారధిగా నిలిచాడు. ఇరానియన్ శైలిలో నాలుగు మినార్లతో చార్‍మినార్ కట్టడానికి ప్లాన్ గీసింది, నిర్మించింది మీర్ మోమిన్. అదే హైదరాబాద్ నగరానికి పునాది. చార్మినార్ పక్కనే 1595లోనే మెడికల్ కళాశాల ‘దారుషిఫా’ను ఏర్పాటు చేసింది కూడా ఈయనే! నిజానికి ఇరాన్ ప్రభావం లేని హైదరాబాద్, చరిత్ర, సంస్కృతి, వారసత్వం లేదంటే అతిశయోక్తి కాదు. ఇరాన్ నుంచి వలస వచ్చిన ‘షియా’లు హైదరాబాద్ నగరంలోని చారిత్రక కట్టడాలు, మసీదులు, అషూర్‍ఖానాలు (పీర్ల సావిడిలు), సమాధులు లోపల, బయట తీర్చి దిద్దిన తీరు అద్భుతం. వాటిలోని కళా నైపుణ్యం, ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్న టైల్స్తో అలంకరణలు అన్నీ కూడా తమదైన శైలిని చాటుకుంటాయి. నగరంలోని జామా మసీదు, మక్కా మసీదు, ఖుతుబ్‍షాహీ మసీదు, సైదాబాద్ మసీదు, మీర్‍పేట మసీదులు గోలకొండలోని ఉద్యానవనాలు, సుందరమైన నగిషీలు ఇప్పటికీ పాత నిర్మాణాల్లో, కొన్ని జీవకళతో చెక్కు చెదరకుండా ఉన్నాయి. వ్యాపారస్థులు తమ గుర్రాలు, వాహనాలను నిలుపుకోవడానికి వీలుగా సరాయిలను, వచ్చిపోయే వారికి ఉచిత భోజన పానాదుల వసతులు, అతిథి గృహాలను కూడా నిర్మించిండ్రు. ఇవేగాకుండా మౌలాలి దర్గా, హుస్సేని ఆలం, బీబి కా చష్మా, హయత్‍నగర్, హుసేన్ సాగర్, ఇబ్రహీంపట్నం, బుద్వెల్ చెరువు, పురానా పూల్, మా సాహెబ్ టాంక్, గోషామహల్ బారదరి మొదలైన కట్టడాల/నిర్మాణాల సూత్రధారి కూడా మీర్ మోమిన్.
ఈయన పూనిక మేరకు తెలంగాణ/హైదరాబాద్‍లో షియా సంస్కృతిలో భాగమైన మొహర్రం (పీర్ల పండుగ) జరుపుకోవడం ప్రారంభమయింది. ‘ఆలమ్’లను నిలుపుకోవడం అంటే పీర్లను నిలబెట్టే సంప్రదాయము కూడా మీర్ మోమిన్ ప్రచారంలో పెట్టిండు. హైదరాబాద్ పాతనగరంలోని బీబికా ఆలం వెండి చెయ్యికి ముత్యాల తాపడం చేసి ఉండేది. ఈ ఆలంని యాఖుత్‍పురా నుంచి చాదర్‍ఘాట్ వరకు భక్తి ప్రపత్తులతో ఊరేగింపు తీసేవారు. మీర్ మోమిన్ బోధనలు, ప్రచారం మూలంగా మొహర్రం పండుగను తెలంగాణ అంతటా పది రోజులపాటు భక్తి శ్రద్ధలతో చేసుకునేవారు. ఈయన బోధనల మూలంగా రసికుడైన కుతుబ్‍షాహీ రాజు మహమ్మద్ కులీ కూడా దైవ చింతన కలవాడుగా మారిండు. కులీని చిన్నతనం నుంచి విద్యాబుద్ధులు నేర్పించిందీ, మత విషయాలు బోదించిందీ మీర్ మోమిన్. ఈ బోధనల ప్రభావంతో కులీ ప్రతి సంవత్సరం మొహర్రం పండుగ జరుపుకునేందుకు వీలుగా పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించి ప్రజల్లో భక్తి ప్రపత్తులు, హిందూ-ముస్లిం సహజీవన సంస్కృతి అలవడేందుకు కృషి చేసిండు.
ఇరాన్/పర్షియన్ సాహిత్యాన్ని, నిర్మాణ శైలి, సంస్కృతిని గోలకొండ, హైదరాబాద్ నగరాల్లో 1585 నుంచి తాను 1625లో చనిపోయే వరకు అంటే నాలుగు దశాబ్దాల పాటు మోమిన్ ప్రాచుర్యం కల్పించాడు. హైదరాబాద్‍కు అంతర్జాతీయ సొబగులను అద్దిండు. తన సమాధి కూడా తానే డిజైన్ చేసుకున్నాడని ప్రతీతి. ఈయన సమాధి హైదరాబాద్ పాతనగరంలోని సుల్తాన్‍షాహిలో ‘దాయర-ఎ-మోమిన్’ పేరిట ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉన్నది. ఇదే ప్రదేశంలో ఔరంగజేబు ఆస్థాన కవి అహ్మద్ నిజామత్ ఖాన్ అలీ సమాధి కూడా ఉన్నది. అలాగే సాలార్జంగ్ కుటుంబీకుల సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ సమాధియొక్క మరో విశిష్టత ఏమిటంటే మీర్ మోమిన్ తాను హజ్ యాత్ర చేసి కర్బలా నుంచి తీసుకొచ్చిన మట్టిని ఇక్కడి దాయర సమాధి స్థలంలో కలిపి వాటిని పవిత్ర స్థలంగా తీర్చి దిద్దిండు. హైదరాబాద్ నగరానికి ఇంతటి విశిష్టమైన సేవలందించిన మీర్ మోమిన్ పేరిట మీర్‍పేట్, మోమిన్‍పూర్, మోమిన్ పేట్, దాయిర ఎ మీర్ మోమిన్, మీర్ చౌక్ తదితర ప్రదేశాలు వెలిసినాయి.
కుతుబ్‍షాహీల అనంతరం హైదరాబాద్‍పై ఇరాన్ నుంచి వలస వచ్చిన వారి ప్రాభవం క్రమేణా తగ్గుతూ వచ్చింది. అయితే రెండో నిజాం అలీఖాన్ (అసఫ్‍జా -2) వద్ద 1778-1804ల మధ్య కాలంలో ప్రధాన మంత్రిగా పనిచేసిన అరస్తూ జా కూడా ఇరాన్ నుంచి వచ్చినవాడే! ఈయన పైగా నవాబ్ ఖాందాన్-కుటుంబీకుల మూల పురుషుడు. నిజామ్ తరపున అనేక యుద్ధాల్లో పాల్గొన్నాడు. మరాఠాల చేతిలో నిజాం ఓడిపోయినప్పుడు కొంత కాలం వారి చేతిలో బందీగా కూడా ఉన్నాడు. తానూ వలస వచ్చినవాడే అయినా హైదరాబాద్ రాజ్యానికి సర్వశక్తులు ఒడ్డి సేవ చేసిన ఉన్నతుడు అరస్తూ జా. ఈయన నేటి సరూర్ నగర్‍లో సరస్సుని, రాజ భవనాన్ని, ఉద్యాన వనాన్ని నిర్మించాడు. ఆ తర్వాతి కాలంలో మరో ఇరానియన్ రుక్నుద్దౌలా ముషీరాబాద్ రిజర్వాయరుని కట్టించాడు. 1804లో హైదరాబాద్ నగర ప్రజలకు స్వచ్ఛమైన తీయని తాగు నీరు అందించే ఉద్దేశ్యంతో మీర్ ఆలమ్ నేటి జూపార్క్ వద్ద ఒక తటాకాన్ని తవ్వించాడు. రాయబారిగా, అడ్మినిస్ట్రేటర్‍గా ప్రజల మన్ననలు ప్రశంసలు అందుకున్న మీర్ ఆలమ్ ఈద్గా (జూపార్క్ దగ్గర), బారదారి నిర్మింప జేసిండు. ఈయన పేరిట పాతనగరంలో మీర్ ఆలమ్ మండి అనే కూరగాయల మార్కెట్ నడుస్తోంది.
సాలార్‍జంగ్ కుటుంబం కూడా ఇరాన్ నుంచి వచ్చినవారే! ఇందులో మొదటి సాలార్‍జంగ్ హైదరాబాద్ ప్రధానిగా పనిచేస్తూ జిలాబంది, పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టిండు. ఈయన దివాన్ దేవిడి, ముక్తార్ గంజ్, ముక్తార్‍పురలను నిర్మింపజేసిండు. మూడో సాలార్జంగ్ తాను వివిధ దేశాల నుంచి సేకరించిన వస్తువులతో ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేసిండు. ఇందులో వస్తుసముదాయంతో పాటుగా ఎన్నో విలువైన గ్రంథాలున్నాయి. ఇప్పుడీ లైబ్రరీ సాలార్జంగ్ మ్యూజియంలోనే కొనసాగుతున్నది. హైదరాబాద్ నగరంలో విద్యారంగ అభివృద్ధికి విశేషమైన కృషి చేసిన సయ్యద్ హుసేని బిల్‍గ్రామి ఉత్తరాది వాడు. ఈయన పూర్వీకులు కూడా ఇరాన్ నుంచి వచ్చినవారే!
ఆధునిక కాలంలో హైదరాబాద్‍లో రెస్టారెంట్ వ్యాపారం చేస్తున్న వారిలో మెజారిటీగా ఇరానీయులున్నారు. అందుకే హైదరాబాద్ ఆ తర్వాత ముంబాయి ఇరానీ చాయ్‍లకు ఫేమస్. 1970ల కాలంలో ఇరాన్‍లో అంతర్గత యుద్దం కారణంగా చాలా మంది హైదరాబాద్‍కు వలస వచ్చిండ్రు. ఇరానీయులు హైదరాబాద్‍లో ఎక్కువగా మెహదీపట్నం, బంజారాహిల్స్, పత్తర్‍ఘట్టీ, మదీనా ప్రాంతంలో నివాసాలు ఏర్పర్చుకున్నారు. బిర్యానీ, హలీమ్ తయారీలకు ఇరానీ హోటళ్ళు ఎక్కువగా పేరు పొందినవి.
ఒకప్పుడు హైదరాబాద్‍లో చాలా ఇరానీ హోటళ్లలోనే సాహిత్య సమావేశాలు జరిగేవి. ఉచితంగా హిందీ పాటలు వినే సౌకర్యం ఉండేవి. మతాలకు సంబందం లేకుండా తమ హోటళ్లకు నేషనల్, ఎ-1 తదితర పేర్లను పెట్టేవారు. పర్షియన్ భాషలో రాసిన తాళపత్ర గ్రంథాలను రక్షించడానికి ఇరాన్ ప్రభుత్వం గతంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక్కడి వారు అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్న రక్షణ చర్యలను కూడా చూసి రావడం జరిగింది. అదే విధంగా హైదరాబాద్‍లో ఇరానియన్ కాన్సులేట్ జనరల్‍ని ఏర్పాటు చేసిండ్రు.
ఇరాన్ దేశానికి చెందిన ప్రధానమంత్రులు ఎప్పుడు ఇండియా వచ్చిన హైదరాబాద్‍కు రావడమనేది ఒక ఆనవాయితీగా మారింది. ఇరాన్ నుంచి హైదరాబాద్‍కు వచ్చిన వాళ్ళు కూడా స్థానిక సంప్రదాయాలు, సంస్కృతితో మమేకమయిండ్రు. సంవత్సరంలో కేవలం ఒక్క రోజు మాత్రమే ఇరానీ హోటళ్లు మూతబడుతాయి. ఈ హోటళ్ళు నడిపేవారు దాదాపు అందరూ షియాలే. అందువల్ల మొహర్రం రోజున హోటళ్ళను మూసివేస్తారు. ఇరాన్ నుంచి ముస్లింలు మాత్రమే కాకుండా పార్సీలు కూడా వచ్చినారు. వాళ్ళు కూడా హైదరాబాద్ చరిత్రలో భాగస్వాములైనారు. వారి గురించి మరోసారి తెలుసుకుందాం! నిజానికి ఇరాన్‍కు పర్షియా అనే మరో పేరుకూడా ఉంది. పర్షియా నుంచి వచ్చిన వారే పార్సీలు. అగ్నిని పూజించేవారు.
ఇరాన్ సంస్కృతిని, కట్టడాల శైలిని, ఆహారపు అలవాట్లను, సంప్రదాయాలను హైదరాబాద్ దినచర్యలో భాగం చేసిన ఇరానీయుల గురించి ఇంకా విస్తృతంగా అధ్యయనం చేయాల్సిన అవసరమున్నది. అలాగే హైదరాబాద్ నగర నిర్మాణానికి పునాది వేసిన మీర్ మోమిన్ గురించి ఉర్దూలో పుస్తకాలు వెలువడ్డాయి. వీటిని తెలుగులోకి తర్జుమా చేయాల్సిన అవసరమున్నది. మన నగర నిర్మాణానికి ప్రణాళికలు రచించిన వారి గురించి తెలుసుకోవాలి.
–సంగిశెట్టిశ్రీనివాస్,
ఎ:98492 20321