సదాశివుడు

తెలంగాణ బీళ్ళను తడిపిన
గోదారి పాట సదాశివుడు
‘‘తలాపునా పారుతుంది గోదారి, నీ చేనూ, నీ చెలుకా ఎడారి, రైతన్నా! నీ బతుకు అమాస, నీ చుట్టూ సిరులు ఉన్నా నికేది దక్కదన్నా / నీ చేతిలోని బువ్వే నీ నోటి కందదన్నా / చేతికి మూతికి నడుమ గీత గీసిరన్నా / మోసపోతివన్న అరిగోసపడితివన్నా’’ అంటూ ఆయన రాసిన పాట ఉద్యమానికి ఊపిరిలా పనిచేసింది. ఆ పాటే అందరినీ ఆలోచింపజేసే పోరు బాటైంది. ఆయన పాట దగాపడ్డ తెలంగాణ పల్లె జీవితాల చిత్రికైంది. నీళ్ళు, నిధులున్నా తెలంగాణలో ఎందుకు బతుకలేకపోతున్నామో… మోసం చేసిందెవరో తన కవిత్వం, పాటలతో ప్రజల్ని చైతన్యవంతం చేశారు.
తలాపున గోదావరి పారుతున్నా తెలంగాణ గొంతెండుతున్న తీరును తన గొంతెత్తి పాడిన గాయకుడు, ఎండి బీటలు వారిన తెలంగాణ బీళ్లను చూసి కన్నీళ్ళను సిరా చుక్కగా మార్చి పాలకులను ప్రశ్నించిన కవిగాయకుడు, బతికినంత కాలం తెలంగాణను పలవరించి, మన పాలన మనకే కావాలని నినదించిన ఉద్యమకారుడు, అతని పాటలు విముక్తి ఉద్యమ సాంస్కృతిక కార్యాచరణకు చుక్కానిలా పని చేసినాయ్‍.


ఆయనే కీ.శే. మల్లావఝల సదాశివుడు, ఉత్తర తెలంగాణా పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖని నుంచి పాటల శివుడిగా ప్రసిద్ధుడైన ఆయన తన రాతలనిండా జనసామాన్యం వాడుక భాషలో, చిన్న చిన్న పదాలతో లోతైన భావాలను అగ్ని కీలలలాంటి భావనలను పలికించారు. పాఠశాలలోనూ పాటల శాలలోనూ తన గురువు స్వర్గీయ చొప్పకట్ల చంద్రమౌళి అని, తన పాటలో తడీ, తండ్లాట, మార్దవం తెలంగాణా మట్టి పెట్టిన భిక్షే అని సవినయంగా చెప్పుకునేవాడాయన. సమాజాన్ని చూసి చేతనైనంతచేసి పాట రాసి పల్లవించమన్న ఒక ప్రజాపోరాటాయోధుని మాటనే బాటగా కదిలి, అతనిచ్చిన చూపుతోనే సమాజాన్ని చూసి సంక్షోభాల మూలాలను గ్రహించి ప్రజల పాటై నినదించిన ప్రజా చైతన్య స్వరం సదాశివుడు.


తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించడానికి సైతం వెనుకాడు తున్న కాలంలో నిర్బంధాన్ని ధిక్కరించి నీటి వాటా పంపిణీలో జరుగుతున్న అన్యాయాలమీద పాటను ఎక్కుపెట్టి తన తెగువను ప్రదర్శించిన కవి, గాయకుడు, బడిపంతులే అయినా, కష్టాల చీకట్లలో కూరుకుపోయి ఉన్నా, తాను బలహీనుడిని కాదూ, కలం గళం సంధించిన సంపూర్ణ మానవుడిని అని సగర్వంగా ప్రకటించుకున్న తెలంగాణా తల్లి గుండె చప్పుడు ఆయన. మలిదశ ఉద్యమానికి సాంస్కృతిక ప్రేరణలేని సమయంలో ఆయన పాటే ఉద్యమానికి చుక్కానిలా పనిచేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆయన పాట దగాపడ్డ తెలంగాణ పల్లె జీవితాల చితికైంది. నీళ్ళు, నిధులన్నా తెలంగాణలో ఎందుకు బతకలేకపోతున్నామో, మోసం చేసిందెవరో తన కవిత్వం, పాటలతో ప్రజల్ని చైతన్యం చేశారు. సదాశివుడు పుట్టింది 02-09- 1943న కరీంనగర్‍జిల్లా (నేడు పెద్దపల్లి జిల్లా) రామగుండం మండలంలోని మురుమూర్‍ గ్రామంలో. తండ్రి వెంకట క్రిష్ణయ్య తల్లి లక్ష్మీనరసమ్మ. వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడైనా అప్పటి సామాజిక పరిస్థితుల్లో విప్లవమార్గం పట్టి రైతుకూలీ పోరాటాలు, యువజన సంఘాల నిర్మాణంలో కీలక పాత్ర వహించారు. అనంతరం సామాజిక ఉద్యమాల్లో కొనసాగుతూనే ఉపాధ్యాయ సంఘాల నాయకత్వాన్ని కూడా కొనసాగించారు.


20 ఏళ్ళ పాటు విప్లవ, అభ్యుయదయ గీతాలెన్నింటికో ఊపిరి పోశారు. ఆయన పాటలు నాటి పాలకులు తీరును ప్రశ్నించినవే. వలస బతుకుల వలపోతకు అద్దంపట్టినట్టు ఆయన రచించి, గానం చేసిన ‘‘ఏమున్నదక్కో.. ఈ ఊళ్లే మనకింక ఏమున్నదక్కా… ఇళ్ళు సర్దుకున్న… ముల్లె సర్దుకున్న ఎళ్ళిపోతావున్నా ఈ ఊళ్ళే మనకింక ఏమున్నదక్కా’’ ఈ పాట వినని తెలుగోడు ఉండడు. ఆర్‍. నారాయణమూర్తి ఎర్రసైన్యం కోసం సదాశివుడు రాసిన ఈ పాట దిక్కులేని పక్షుల్లా వలసపోయే తెలంగాణా రైతుల వెతలను కట్టింది.


ఈ పాట గురించి చెప్పుతూ నేనూ ఊరు విడిచి ముల్లె సదురుకొని బయల్దేరిన్నాడు ఏ మట్టిమీద మమకారం తన గాత్రాన్ని గద్గదం చేసిందో ఆ మమకారమే తన పాటకు అశృలిపిగా అమరిందని ఇవాళ ఆ వేదనే వలసల దుఃఖంగా ప్రవహించిందని అంటాడు. దళారులు తమ దోపిడీ విధానాల కింద స్వార్థ రాజకీయాల అండతో అప్పుకింద భూమిని, ఇళ్ళనూ లాక్కుంటే అన్నీ పోగొట్టుకున్న రైతు గుండెకోత పాట నిలువెల్లా కన్నీటిసెగై కమ్ముకున్నది అంటాడు.

అంతేకాక ‘‘జాబిలమ్మకు జిలుగు పోగుల దుప్పటి కప్పిన చేతులివి’’ అంటూ చేనేత కార్మికుల జీవనశైలిని ఆర్ద్రంగా వర్ణించాడాయన. వరకట్న రక్కసి కోరలకు బలవుతున్న ఆడబిడ్డల చూసి కళ్ళు చెమర్చాడాయన. చిన్న వయస్సులోనే తనువు చాలిస్తున్న అబలలను చూసి ‘‘పారాణి ఆరలేదు చెల్లెలా… అప్పుడే నూరేళ్ళు నిండాయా చెల్లెలా?’’ అని అన్నగా ఆక్రోశించాడు. ఇలా ఒక్కటని కాదు ఆయన పాటలన్నీ వినేవారి గుండెకు సూటిగా గుచ్చుకుంటాయి. ఆలోచనలు రగిలిస్తాయ్‍. ఆయన పాటల్లోని పల్లె వాతావరణం పల్లె ఆత్మకు అద్దంపడుతాది. పల్లె పాయిరానికి పాదాలు కడుగుతాది. బతుకు తత్వాలను బతుకమ్మ జెప్పంగా పల్లె పాడిన పచ్చ పచ్చని పాటకు ఆనవాలు తానై ప్రతిధ్వనించిండు.


గత పాలకుల పన్నాగాలను ఎండగడుతూ ‘‘ఇంకుడు గుంతల ఇగురుంజెప్పవ్‍ అన్నో ఓరన్నా! మా చెరువు కుంటలను మింగిందెవరో చెప్పవేందిరోరన్నా! అంటాడు. రైతులూ, చేనేత కార్మికులూ, కూలీలూ, కష్టాలు పడుతున్న స్త్రీలూ, బాల కార్మికులూ, పల్లెలూ, రాజ్యం దౌష్ట్యానికి బలైన ఎందరో అమరులు సదాశివుడి పాటల్లో ప్రాణమున్న చరణాలైండ్రు.
వరంగల్‍ జనార్ధన్‍కు స్మృతిగీతాన్ని సమర్పిస్తూ ‘‘మహర్షీ నా తెలంగాణా వాల్మీకీ! వలసవాదం అణచివేత ఇంకానా ఇకపై సాగవంటూ యుద్ధం ప్రకటించి / నేలకొరిగిన వీరుడా! పరాజితుల కోసం సాగిన నీ పాట మా దగ్గర స్వరంజీవిగా ఉంది / అది గాలై ఏరై హోరై / అంతటా విస్తరిస్తోంది… మా కోటి రతనాల వీణపై కదన కుతూహలమై మోగుతుంది / అంటూ ఆయన దీక్షను తన గొంతుకెత్తుకొని ఉద్యమ ప్రస్థానానికి పునరంకితమౌతాడు. తన పాటలను అభిమానించిన కాళోజీ, శివసాగర్‍ల వంటి మహాకవులతో ప్రేమగా శివుడూ అని పిలిపించుకుని తనదైన నడకను సార్థకం చేసుకున్నాడు.
కేవలం ఉద్యమ పాటలే కాకుండా 90వ దశకంలో కరీంనగర్‍ జిల్లాలో చేపట్టిన అక్షరాస్యత కార్యక్రమం అక్షర ఉజ్వల కోసం ఆయన ఎన్నో పాటలు రాశారు. రాయడమే కాకుండా కంచుకంఠం లాంటి ఆయన గొంతుతో ఎన్నో వేదికల మీద స్వయంగా ఆలపించాడు. పారిశ్రామిక ప్రాంతంలో మరియు ఉత్తర తెలంగాణా పల్లెల్లో, కాలనీల్లో వఝల శివకుమార్‍తో కలిసి ఔత్సాహికులైన ఏలేశ్వరం వెంకటేశ్వర్లు వంటి యువకులను ప్రోత్సహించి వారి సహకారంతో పలు సాహిత్య సాంస్కృతిక సంస్థల స్థాపనలో ముఖ్య భూమికను పోషించాడు. గ్రంథాలయోద్యమంలో చురుకుగా పాల్గొని ఊరూరా నిర్వహింపబడిన గ్రంథాలయ సభల్లో స్ఫూర్తివంతమైన తన ప్రసంగాలతో ప్రజలలో చైతన్య బీజాలు నాటారు.
స్వయంగా ప్రజా సాంస్కృతికోద్యమ నిర్మాణంలో భాగంగా చేతన సాహితి సాంస్కృతిక సమాఖ్యను స్థాపించి ఎందరో గాయనీ గాయకులను తీర్చిదిద్దారు. పారిశ్రామిక ప్రాంతంలోని ఎందరో ప్రసిద్ధ గాయకుల గొంతుల్లో పాటలై పరవళ్ళు తొక్కాడు.


సదాశివుడు రాసిన పాటలను ఎర్రకుంకుమ పేరుతో ఆడియో క్యాసెట్‍, పుస్తకం, సైరన్‍ పేరుతో ఆయన కవితలను పుస్తక రూపంలోకి తీసుకువచ్చారు. ఎర్రకుంకుమతో పాటై పోటెత్తిన శివుడు కాలేరన్నల నిత్యఘర్షణలనూ, స్వేదనదుల్లో తడిపి ఆరేసు కుంటున్న బండకిందిబతుకుల పెనుగు లాటలనూ తన కవితా స్వరాలుగా ఈ సైరన్‍ కవితా సంపుటిలోనూ మోగించాడు. తెలం గాణా నేల విముక్తి కోసం పాటను ఉద్యమ బాటగా స్వీకరించి కలమెత్తి కవనమై, గొంతెత్తి నాదమైన ఈ కవి గాయక యోధుడు 2005 నవంబర్‍ 25న ఆకస్మికంగా తనువు చాలించాడు. మనకు అమూల్యమైన తన పాటలను, కవితలనూ వదిలి ఆయన గొంతు మూగ బోయింది. ఆయన పాట మాత్రం ఉద్యమమై తెలంగాణను మోసుకొచ్చింది.

పల్లె గొంతు పెగిలితే పాట
నేల చెమ్మగిల్లితే పాట ఆ పాటే సదాశివుడు
ఎన్నెల కోనల ఊపిరి దారలమీద
అక్షరాల అగ్ని కణం సదాశివుడు
కాలేరన్నల దిగులు చీకట్లమీద
జ్వలత్‍ కవనాల జైత్రయాత్ర సదాశివుడు

2007 నుంచి ప్రతి ఏడాది సదాశివ స్మారక అవార్డులను సాంస్కృతిక రంగంలో రాణిస్తున్న వారికి అందజేస్తున్నారు. గోదావరిఖని కేంద్రంగా సదాశివుడి సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఏడాది ఒక సాహితీ మూర్తిని ఆయన స్మారక అవార్డుతో సత్కరిస్తున్నారు.

(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
వఝల శివకుమార్‍

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *