మన తెలంగాణ రాష్ట్రంలో తీగజాతి కూరగాయలను విరివిగా సాగుచేస్తున్నారు. అందులో బీర, కాకర, దోస, పొట్ల ముఖ్యమైనవి. వీటికి మార్కెట్‍లో మంచి డిమాండ్ ఉంది. ధర కూడా స్థిరంగా ఉంటుంది. తీగజాతి కూరగాయల సాగులో కొన్ని మెళకువలు పాటించి సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడి పొంది ఎక్కువ లాభాన్ని సాధించవచ్చు.
గుమ్మడి పెంకు పురుగులు :
పిల్ల పురుగులు పెరుగుదల దశలో ఆకులను, పూలను కొరికి తింటాయి. తీవ్ర దశలో ఆకులను, పూలను పూర్తిగా తిని నష్టాన్ని కలుగజేస్తాయి.
నివారణ :
డై మిధోయేట్ 2 మి.లీ. లేదా మలాధియాన్ 2 మి.లీ. లేదా మిథైల్ డెమటాన్ 2 మి.లీ. లీటరు వీటిని కలిపి పిచికారి చేయాలి.
గొంగళి పురుగులు (పొట్ల ఆకు పురుగు) :
ఇవి పంట పెరుగుదల దశలో మరియు పూత దశలో ఆకులను కొరికి తినేస్తాయి.
నివారణ :
క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. లేదా క్వినాల్ ఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి .
పండుతీగ :
పూత దశలో తల్లి ఈగలు పువ్వులపై గ్రుడ్లను పెడతాయి. ఇవి పూత, పిందెలలోనికి చేరి కాయలను తిని నష్టపరుస్తాయి. ఈ పురుగు బీర మరియు కాకర పంటలను ఎక్కువగా ఆశిస్తుంది.
నివారణ:
మిథైల్ యుజెనాల్ ఎరలను ఒక ఎకరానికి 4-6 చొప్పున అమర్చినట్లయితే తల్లి ఈగలు ఎరలో పడి చనిపోతాయి. రాలిన కాయలను ఏరి కాల్చివేయాలి. పూత, పిందె దశలో మలాధియాన్ 2 మి.లీ/ లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవథితో పిచికారీ చేయాలి.
తెగుళ్ళు – నివారణ చర్యలు :
బూజు తెగులు
ఒక మాదిరి వర్షంతో కూడుకొన్న చల్లని వాతావరణంలో ఆశిస్తుంది. మొదట్లో లేత ఆకుపచ్చ, ముదురాకుపచ్చ కలిసి మొజాయిక్ వలె కనిపిస్తుంది. తర్వాత ఆకుల పైభాగాన పసుపు రంగు మచ్చలు, అడుగుభాగాన ఊదారంగు మచ్చలు, బూజు వంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి.
నివారణ :
మాంకోజెబ్ 2.5 గ్రా లేదా మెటలాక్సిల్ ఎమ్.జెడ్. 2గ్రా/ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
బూడిద తెగులు :
ఆకుల పై భాగాన ముందుగా తెలుపు లేదా బూడిద రంగులో చిన్న మచ్చలు ఏర్పడి తర్వాత తెల్లని పొడి వంటి (బూడిద) పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. లేత ఆకుల కన్నా, దాదాపు 20 రోజుల వయసున్న ఆకులపై ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది.
నివారణ :
ట్రై ఒమార్, లేదా డైనోకాప్ 1 మి.లీ./ లీటరు నీటికి కలిపి
ప్వుడేరియం వేరు కుళ్ళు తెగులు :
దీన్ని ఎండు తెగులు అని కూడా అంటారు. తెగులు సోకిన తీగలు వడలిపోయి అకస్మాత్తుగా ఎండిపోతాయి. ఆకులు వాడిపోతాయి. ఈ శిలీంద్రం భూమిలో వుండి వ్యాపిస్తూ వుంటుంది.
నివారణ :
బోర్డో మిశ్రమం 1% లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటరు నీటికి 3గ్రా. చొప్పున కలిపిన ద్రావణాన్ని మొక్క మొదలు చుట్టూ నేల తడిచేలా పోయాలి. పదిరోజుల వ్యవధిలో 2-3 సార్లు చేయాలి. ఈ శిలీంద్రం భూమిలో వుంటుంది. కనుక పంట మార్పిడి చేయాలి. ఆఖరి దుక్కిలో వేపపిండి 2 గం కిలోలు /ఎకరాకు వేసి కలియదున్నాలి. పంటవేసిన తర్వాత ట్రైకోడర్మా విరిడే అనే కల్చర్‍ను భూమిలో పాదుల దగ్గర వేయాలి.
వెర్రి తెగులు :
ఆకుల ఈనెల మధ్య మందంగా చారలు ఏర్పడి, పెళుసుగా మారి, గిడసబారి పోయి, పూత, పిందె ఆగిపోతుంది.
నివారణ :
తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తెగులును వ్యాప్తి చేసే పేనుబంక పురుగులను లీటరు నీటికి 2మి.లీ. చొప్పున డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ కలిపి పిచికారి చేసి నివారించాలి.
అంత్రాక్నాస్ పక్షికన్ను తెగులు :
ఆకులపై, కాయలపై గుండ్రని చిన్న మచ్చలు ఏర్పడి, ఎండి పిందె దశలో రాలిపోతాయి.
నివారణ :
తెగులును గమ నించిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజులకు ఒకసారి చొప్పున ఒకసారి పిచికారి చేసుకోవాలి.
తీగజాతి పంటలపై గంధకం సంబంధిత పురుగు/ తెగులు మందులు వాడరాదు. దీని వలన ఆకులు మండిపోతాయి.
ఎ. రాములమ్మ (సస్యరక్షణ శాస్త్రవేత్త),
డా।। ఇ. రాంబాబు (ఉద్యాన శాస్త్రవేత్త)
డా।। ఎన్. కిశోర్ కుమార్ (విస్తరణ శాస్త్రవేత్త),
క్రాంతికుమార్ (పంటల ఉత్పత్తి శాస్త్రవేత్త)
ఎ. సరళకుమారి (పోగ్రాం కో ఆర్డినేటర్),
కృషి విజ్ఞానకేంద్రం, మల్యాల. 8317505717