ముందుముల నరసింగరావు

పాత్రికేయుడిగా, రెండు ఆంధ్ర మహాసభ సమావేశాల అధ్యక్షునిగా, రయ్యత్‍ పత్రిక సంపాదకుడిగా, సంస్థానంలో హిందూ ముస్లిం సమైక్యత కోసం తన శక్తి మేరకు కృషి చేసిన దార్శనికుడిగా, ఆత్మకథా కర్తగా, రాజకీయ మేధావిగా, చరిత్రలో నరసింగరావు స్థానం సుస్థిరం. మహబూబ్‍నగర్‍ జిల్లాలో ముందుమల వారి కుటుంబానికి ఎంతో పేరున్నది. పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధులలో ప్రముఖుడైన ముందుముల నరసింగరావు మార్చి 17, 1896లో ప్రస్తుత రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో జన్మించారు. స్వగ్రామమైన తలకొండపల్లిలో ప్రాథమిక విద్య పూర్తి చేసి 1912లో హైదరాబాదు వచ్చి ఉన్నత విద్య నభ్యసించారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. బాల్యంలోనే ఉర్దూ, పర్షియన్‍ తదితర భాషలలో బాగా పరిచయం ఏర్పడింది.


1916లో తన తోటివారితో కలిసి వామన్‍ నాయన్‍ అధ్యక్షతన ‘‘యంగ్‍మెన్‍ యూనియన్‍’’ను స్థాపించారు. 1921లో న్యాయవాద వృత్తికి స్వస్తి చెప్పి పత్రికారచన, రాజకీయాలు చేపట్టారు. రయ్యత్‍ అనే ఉర్దూ వార్తా పత్రికకు వ్యవస్థాపక సంపాదక బాధ్యతలు చేపట్టారు. రయ్యత్‍ ద్వారా నిజాం నిరంకుశాన్ని ఎండగడుతూ ప్రజలను చైతన్యపర్చారు. 1927లో ప్రారంభించబడిన రయ్యత్‍ వార్తాపత్రిక నిజాం ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు నిషేధానికి గురై 1931లో దినపత్రికగా పునఃప్రారంభమైంది.
సుదీర్ఘకాలంపాటు ప్రచురితమైన ‘‘రయ్యత్‍ గురించి ప్రముఖ రచయిత – వెల్తురి మాణిక్యరావు అభివర్ణనల్లో చెబితే ‘‘నిజాం రాష్ట్రంలో భావ విప్లవాన్ని తెచ్చిన రయ్యత్‍ సంపాదకులైన ముందుముల భారతదేశంలోనే ఉత్తమ పత్రికా సంపాదకుల స్థాయికి చెందినవారు. రయ్యత్‍ విశేషాల్ని నరసింగరావు తమ ఆత్మకథ ‘యాభై సంవత్సరాల హైదరాబాద్‍’’లో నమోదు చేశారు. ముందుముల వారి మాటల్లోనే చెబితే..


‘‘పత్రికా రచన గురించి నేను ఎక్కడా తర్బియత్‍ తర్పీద్‍ (ట్రైనింగ్‍) పొందలేదు. కనీసం బాగా నడుస్తున్న పత్రికల్లో చేరి పని నేర్చుకొని యుండలేదు. అనుభవాలు సాధించియుండలేదు. నిజంగా విచారిస్తే ఏ విశ్వవిద్యాలయములోనైనా చేరి పత్రిక రచనకు అనుగుణ్యమైన రాజకీయ ఆర్థిక విషయాల గురించి విద్యాభ్యాసము చేయు భాగ్యము నాకు లభించలేదు. నేను ఎంతవరకు సమర్థుడునా అన్న విషయము ఆలోచించకుండ ఈ రంగములో కాలు పెట్టినాను. ఆ కాలములో ప్రభుత్వ సమాచారశాఖ అనునది యేదిలేదు. పత్రికా ముద్రణ గురించి నియమాల ననుసరించి సర్వాధికారాలు పట్టణ పోలీస్‍ కమీషనర్‍ (కొత్వాల్‍)కే ఉండేవి. పత్రికా ముద్రణకు సంబంధించిన దరఖాస్తు కొత్వాల్‍ సాహెబు వద్ద పెట్టుకోవలసి వచ్చేది. దరఖాస్తు మంజూరు చేసే అధికారము కొత్వాలుదే. పత్రికలను కంట్రోలులో పెట్టుబకునే సర్వాధికారాలు కొత్వాలు సాహెబుకుండేవి. ఆ కాలములో రాజబహదూరు వెంకట రామారెడ్డి గారు కొత్వాల్‍ పదవిపై నుండిరి. నేను రయ్యత్‍ వారపత్రిక ముద్రించుటకు వీరి వద్దనే దరఖాస్తు పెట్టుకొని అనుమతిని పొందితిని. పత్రికా నిర్వహణకు కావలసిన యేర్పాట్లు యేమిలేవు. ఆర్థికంగా కూడా యే యేర్పాటు లేవు. నా ఆర్థిక పరిస్థితి ఏమి బాగాలేదు. పెట్టుబడి పెట్టు భాగస్థుడు కాని, లేక యజమాని కాని లేడు. నేనే యజమాని, నేనే ఉద్యోగిని, నేనే పెట్టుబడిదారుడును. నేనే వర్కింగ్‍ జర్నలిస్టును.’’
తొలుత రయ్యత్‍ పత్రికను ‘‘దక్కన్‍ లా రిపోర్ట్ ప్రెస్‍’’లో అచ్చు వేసేవారు. సంస్థాన ఆర్య సమాజ నాయకులలో ప్రముఖులైన పండిట్‍ నరేంద్రజీ కొంతకాలం పాటు పత్రికకు మేనేజర్‍గా ఉన్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం పట్టభద్రుడు బషీర్‍ అహ్మద్‍ తాహీర్‍ మొదట ఉప సంపాదకులుగా పని చేశారు. ఇమ్రోజ్‍ పత్రిక ద్వారా విఖ్యాతుడైన అమర పాత్రికేయుడు షోయబుల్లాఖాన్‍ తొలుత రయ్యత్‍లో నరసింగరావు దగ్గర ఉప సంపాదకులుగా ఉన్నారు. రయ్యత్‍కు ప్రభుత్వ ప్రకటనలు లేవు! హైదరాబాద్‍ పుర ప్రముఖుల్లో కొందరు ఆర్థికంగా ఆదుకున్నారు.


నరసింగరావును తెలంగాణా ముట్నూరి కృష్ణారావుగా అభివర్ణించవచ్చు. కోస్తాలో ‘‘కృష్ణాపత్రిక’’ అందించిన చైతన్యాన్ని హైదరాబాద్‍ రాష్ట్రంలో ‘‘రయ్యత్‍’’ సాధించింది. కృష్ణా పత్రికలో ముట్నూరివారు రాసే సంపాదకీయాలు అత్యంత సమగ్ర రీతిలో ఉండేవి. రయ్యత్‍లో నరసింగరావు కూడా అట్లాగే సవివరమైన సంపాదకీయాలు రాసేవారు. వీటిని ఉన్నతస్థాయికి చెందిన సంపాదకీయాలుగా పేర్కొంటారు.


ముందుముల నరసింగరావు మితవాది. ఆయన ప్రజా జీవితం ఆ సాంతం మితవాద వైఖరితోనే కొనసాగింది. తెలంగాణాలో 1930లో తొలి సమావేశాన్ని జరుపుకున్న ఆంధ్ర మహాసభలో ఆరంభదశలో మితవాదులవే అధిక బలం. వారిలో నరసింగరావు ఒకరు. రయ్యత్‍ పత్రిక ద్వారాను, హైదరాబాద్‍ సంస్థానం విషయంలో సమగ్ర అవగాహన ఉన్న మేధావిగానూ 1930ల నాటికే నరసింగరావు గుర్తింపును పొందారు. అందుకే 1937 డిసెంబరు నెలలో నిజామాబాద్‍లో నిర్వహించిన (ఆరవ) ఆంధ్ర మహాసభకు నరసింగరావును అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. అక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. నరసింగరావు ఉర్దూలో అద్భుత వైదూష్యాన్ని సాధించారు. కానీ ఆయనకి తెలుగులో లోతైన ప్రవేశంలేదు. అధ్యక్షులు నరసింగరావుతో సహా అందరూ ఉర్దూలోనే ప్రసంగిచటంతో సభలోనే ఉన్న తెలుగు భాషా వాదులు తమ నిరసన తెలిపారు. అయితే ‘‘ఆంధ్ర మహాసభ ఆంధ్ర భాషాసభకాదు’’ అని రావి నారాయణరెడ్డి, కొండా వెంకటరెడ్డి వంటివారు గట్టిగా చెప్పడంతో భాషా వివాదం సద్దుమణిగింది.


ఆనాటి హైదరాబాద్‍ సంస్థానంలో నెలకొన్న వాతావరణంపట్ల పూర్తి అవగాహనతో ఉంటూ, బాధ్యతాయుత వైఖరిలో వ్యవహరించిన మేధావి ముందుముల. సంస్థానంలో మత ఉద్రిక్తతలులేని ప్రశాంత స్థితి ఉండాలన్న సంకల్పంతో ఆయన చేసిన కృషి ఇందుకు నిదర్శనం. 1938 నాటికి సంస్థాన పరిస్థితులు సజావుగాలేవు. ఆరంభంకాక మునుపే కాంగ్రెస్‍పై సర్కారు నిషేధాన్ని విధించింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు వందేమాతరం ఆందోళనను నిర్వహించారు. హిందువుల మత సంబంధమైన హక్కులను కోరుతూ ఆర్య సత్యాగ్రహం జరిగింది. ఈ స్థితిలో హిందూ ముస్లిం ఐక్యత ఎంతో అవసరమని నరసింగరావు భావించారు. ఈ సందర్భంలో నరసింగరావు ఎంతో వివేచనతో వ్యవహరించారు. చర్చల కోసం మహాత్మాగాంధీని, మౌలానా అబ్దుల్‍ కలాం ఆజాద్‍ను కలుసు కుందామని బహదూర్‍ జంగ్‍కు సూచించారు. అయితే సంస్థానంలో బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటు అన్న కీలకాంశంపై సయోధ్య కుదరలేదు. చర్చలు నిర్వహించే విషయంలో నరసింగరావు ప్రదర్శించిన దార్శనికత ఎంతో గొప్పది. ఆయన అభిప్రాయాలకు ఆ కాలంలో సంస్థానంలో ఎంతో విలువ వుండేది.
వెల్దుర్తి మాణిక్యరావు తమ ‘‘హైదరాబాద్‍ స్వాతంత్రోద్యమ చరిత్ర’’ అనే గ్రంథంలో ఇట్లా రాశారు. అఖిల భారత స్టేట్‍ పీపుల్స్ కాన్పరెన్స్కు కర్ణధారిగా ఉండిన పండిత జవహర్‍లాల్‍ నెహ్రూగారి వద్దకు హైదరా బాద్‍కు సంబంధించిన ఏ కాగితాలు వెళ్ళినా వాటిని పరిశీలించ వలసిందిగా నరసింగరావు వద్దకు పంపేవారు. ఇదీ నరసింగరావు స్థాయి. ఇంక రాష్ట్రస్తాయిలో -రయ్యత్‍ పత్రికలో నరసింగరావు గారేమి రాసినారో చూతామని స్వయంగా నిజాం నవాబు మీర్‍ ఉస్మాన్‍ అలీఖాన్‍ అతురత చెందేవాడు. ప్రతీవారం రయ్యత్‍ సంపాదకీయ వ్యాఖ్యలు తప్పక చదివేవాడు.


నరసింగరావు మితవాదే అయినప్పటికీ ఆనాటి నిజం వ్యతిరేక పోరాటంలో ఆయన కూడా ఎన్నో ఇబ్బందులు అనుభవించక తప్పలేదు. చిత్తశుద్ధితో వ్యవహరించే నాయకుడు కనుక ఈ ఇబ్బందుల్ని నిబ్బరంతో భరించారు. పలు పర్యాయాలు రయ్యత్‍ పత్రికను నిలిపివేయవలసి వచ్చింది. నిజాం సర్కారు ఆయనపై హైదరాబాద్‍ దాటి బయటకు వెళ్ళకూడదనే నిషేధాన్ని విధించింది. 1947 నవంబరు 24వ తారీఖున అరెస్టు చేసింది. నరసింగరావును ముషీరాబాద్‍ జైలుకు తరలించారు. అయితే నిజాం మంత్రి మండలిలో చేరేందుకు నరసింగరావు నిరాకరించారు. గాంధీయ సిద్ధాంతాలు, విలువలపట్ల నరసింగరావు విశ్వాసం తిరుగులేనిది ఈ దిశలో ఆయన పలు బాధ్యతలు చేపట్టారు. 1954లో ల్యాండ్‍ కమీషన్‍ చైర్మన్‍గా వ్యవహరించారు.


‘‘వాక్స్వాతంత్య్రం, బహిరంగ సభలు పెట్టుకునే స్వేచ్ఛలేని రాష్ట్రములో కొంతవరకైనా పత్రికల ద్వారా చైతన్యము కలిగించవచ్చునని నేను నమ్మేవాడిని. ఆ నమ్మకముతో పత్రికా రచన ఆరంభించినాను. శాసన సభలులేని మరియు ప్రభుత్వమును విమర్శించే వ్యతిరేక పక్షంలేని పరిపాలనలో పత్రికల ప్రాముఖ్యత చాలా ఉంటుందని గ్రహించినాను. రాజకీయ పార్టీలు లేని రాజ్యములో ప్రజాభిప్రాయము కల్గించడము ప్రజా సమస్యలను ఎదుర్కొనడం మరియు ప్రజల కష్టసుఖాలు ప్రభుత్వ దృష్టిలోకి తేవడం పత్రికల బాధ్యత, నిద్రిస్తున్న యాజమానిని కావలి కాసే కుక్క ఏ విధంగా మేల్కొల్పుతుందో అదేవిధంగా నిద్రిస్తున్న ప్రజలను మేల్కొల్పి తమ ప్రజాస్వామ్య హక్కులు సాధించుకొనుటకు సిద్ధపరచటమే ‘‘రయ్యత్‍’’ బాధ్యత అని తలచి సమస్యలు చర్చించే వాడిని. అంతవరకు ప్రభుత్వ అధికారులను పొగుడుతూ వచ్చిన ఆచారానికి భిన్నంగా వారు అవలంబించే అవకతవక చర్యలను బాగా విమర్శించేవాడిని. ప్రభుత్వ మంటే ప్రజల్లోనున్న భయము పోగొట్టవలెనను దృష్టితో కొన్ని కొన్ని పర్యాయములు ఘాటుగా విమర్శించేవాడిని.


ఇక్కడొక అంశాన్ని తప్పకుండా గుర్తించాలి. స్వామి రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు, పల్లెర్ల హనుమంతరావు, ముందుముల నరసింగరావు – వీరందరూ నిజాం పాలనా కాలంలో కాంగ్రెసు సంస్థ కోసం పని చేసినవారు. ఇంకా ఇటువంటి ఎంతో మంది ఆ రోజుల్లో పలు త్యాగాలు చేశారు. అయితే ఆంధప్రదేశ్‍ రాష్ట్ర అవతరణ అనంతరం వీరిని పూర్తిగా విస్మరించటం లేదా వారి స్థాయికి తగిన గుర్తింపును కల్పించక పోవడం కనబడుతుంది. ముందుముల నరసింగరావు విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన 1960వ దశాబ్ది మధ్య భాగం తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నరసింగరావు మరణానంతరం చాలాకాలం పాటు ఆయన గురించిన ప్రస్తావనలు కూడా ఎక్కడా వినిపించలేదు. అయితే తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంలో ఆనాటి త్యాగధనుల్ని గురించి తిరిగి గుర్తుకు చేసుకునే సంప్రదాయం బలపడింది. ఈ వరుసలో నరసింగరావు వంటి ప్రముఖుల విలక్షణ మూర్తిమత్వాల గురించిన విశ్లేషణ జరుగుతోంది. రయ్యత్‍ పత్రిక ద్వారా ఆయన సాగించిన సామాజిక సేవను గురించి ఇప్పుడు చాలా మంది సమీక్షిస్తున్నారు. మార్చి 12, 1976న ముందుముల నరసింగరావుగారు మరణించారు.


(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
షబ్నవీజ్‍ వెంకటరంగారావు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *