ఇంటిగ్రేటెడ్‍ మాస్టర్‍ప్లాన్‍ ఒక్కటే పరిష్కారం

ప్రకృతి విపత్తులన్నీ మనకు తెలిసేవస్తున్నాయి. వర్తమాన విపత్తులన్నిటికీ మానవ తప్పిదాలే కారణం. మానవాళి ప్రారంభం నుండీ అనేక ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కొంటూనే, తనకు తెలిసినంతలో పరిష్కరించుకుంటూనే తన మనుగడ సాగిస్తున్నది. గత నెల వర్షాలు, వరదలు హైద్రాబాద్‍ నగర జీవితాన్ని అతలాకుతలం చేసాయి. వేలాది మంది నిర్వాసితులయ్యారు. ప్రాణనష్టమూ జరిగింది. హైద్రాబాద్‍కి వరదలు కొత్తకాదు. 1908లో భయంకరమైన వరదలొచ్చాయి. వేలకొద్ది యిళ్లు కొట్టుకుపోయాయి. 20వేల మంది ప్రజలు వరదనీటిలో కొట్టుకుపోయారు.



1914లో ఏడవ నిజాం ఉస్మాన్‍ ఆలీపాషా హైదరాబాద్‍ పట్టణానికి రూపకల్పన చేసారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఆలీనవాజ్‍ జంగ్‍ పర్యవేక్షణలో డ్రైనేజీ మాస్టర్‍ప్లాన్‍ తయారయింది. 1920లో ఉస్మాన్‍సాగర్‍, 1927లో హిమాయత్‍సాగర్‍లను ఎంత ప్రవాహం వచ్చినా నీటిని ఆపుకునేలా నిర్మించారు. జనాభా ఎంత పెరిగినా సాగు, త్రాగునీటి సరఫరా చేసే వ్యవస్థను, అలాగే అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అదే డ్రైనేజీ వ్యవస్థ ఇవాళ్టీకి మనకు పాత ఎంసీహెచ్‍ ప్రాంతానికి రక్షణగా ఉంది. హైద్రాబాద్‍లో 2400 చెరువులు, అదే సంఖ్యలో పార్కులు, నగరం చుట్టూ రక్షణ కవచాల్లా ఫారెస్టులు ఉండేవి. 2008 నాటికి 650 చెరువులు మాత్రమే ఉన్నట్లు మేము చేసిన సర్వేలో తేలింది.

ఒకనాడు హైద్రాబాద్‍ లేక్‍ సిటీ – భాగ్‍ సిటీ, బైసికిల్‍ సిటీ. అవి ఇప్పుడు కథలుగా మారాయి. 2000లో ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైద్రాబాద్‍ ఏర్పడింది. యాభై ఏళ్ళల్లో ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం చేయలేని అన్ని అధ్యయనాలను ఫోరమ్‍ చేసింది. పర్యావరణం, అర్బన్‍ ప్లానింగ్‍, ట్రాఫిక్‍, ట్రాన్స్పోర్టేషన్‍, చెరువులు, నల్లాల ద్వారా తాగ్రునీరు, పారిశుద్ధ్యం, వారసత్వపు కట్టడాల రక్షణ, మూసీ పరివాహక ప్రాంతాల సమస్యలు యిలా అన్ని విషయాల్లో ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి, నిపుణులతో చర్చించి, సహేతుక వాస్తవ సమాచారాన్ని, సూచనలు సలహాలను ఎన్నోసార్లు గత ప్రభుత్వాలకు అందించింది. ఇంటిగ్రేటెడ్‍ మాస్టర్‍ప్లాన్‍ అవసరాన్ని ప్రభుత్వాల, ప్రజల దృష్టికి తెచ్చింది.

ఉమ్మడి రాష్ట్రంలో హైద్రాబాద్‍ పట్టణానికి రీజనల్‍ ప్లాన్‍ లేకుండానే అప్పటి ఉమ్మడి ప్రభుత్వాలు లోపభూయిష్టమయిన ఏడు (7) మాస్టర్‍ప్లాన్‍లు తయారు చేసాయి. ఇవేవీ పట్టణ సమగ్రాభివృద్ధికి దోహదం చేయలేక పోయాయి. జనసాంద్రత అనూహ్యంగా పెరిగి హైద్రాబాద్‍ రూపురేఖలు మారిపోయాయి. నేడు జల, వాయు, శబ్ద కాలుష్యాలతో నిండిపోయింది. సుదీర్ఘ కాల ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని సమగ్రమైన మాస్టర్‍ప్లాన్‍ రూపొందించు కోవాల్సిన అవసరాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తప్పులు జరక్కుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంది. నగర ప్రజలకు త్రాగునీరు, విద్యుత్తు చక్కగా నిరంతరం అందిస్తుంది. రవాణా సౌకర్యాల అభివృద్ధికి కృషి చేస్తుంది. హబ్‍సిటీగా మార్చింది. మూసీరివర్‍ డెవలప్‍మెంట్‍ ఫ్రంట్‍ ఏర్పాటు చేసింది. గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‍ మాస్టర్‍ప్లాన్‍ రూపొందించే కృషి చేస్తుంది.


ఈ సందర్భంలో గృహ సముదాయాలు, పారిశ్రామిక విధాన నియమ నిబంధనలు, త్రాగునీరు, చెరువులు, క్లీన్‍ ఎయిర్‍, పార్కస్, ఓపెన్‍ స్పేసెస్‍, కన్వర్‍జేషన్‍ జోన్లు, పట్టణ పరిశుభ్రత, సాలిడ్‍వేస్ట్ మేనేజిమెంట్‍, ప్రజారవాణా, వలసల నివారణ కోసం కౌంటర్‍ మ్యాగ్ననైట్‍గా పట్టణాల నిర్మాణం, సహజసిద్ధ వనరులు, ప్రజల జీవనవిధానం, సంస్కృతి వంటి పలు అంశాలపై మేధావులు, స్టేక్‍ హోల్డర్స్ వివిధ రంగాల సాంకేతిక నిపుణులతో చర్చించి వెంటనే ఇంటెగ్రేటెడ్‍ మాస్టర్‍ప్లాన్‍ రూపకల్పన చేయాలి. ఇది ‘విశ్వనగరంగా హైద్రాబాద్‍’కి దోహదపడుతుంది.

మణికొండ వేదకుమార్ , ఎడిటర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *