నిజాం రాజ్యం అసఫ్జాహీల పాలన ఆరంభంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. మొదటి నిజాం 1724-1948ల మధ్య కాలంలో పాలించాడు. ఆ తర్వాత ఆయన కొడుకులు నాసర్ జంగ్, ముజఫ్ఫర్ జంగ్, సలాబత్ జంగ్‍లు మొత్తం 14 ఏండ్లు పాలన చేసిండ్రు. అయితే వీరెవ్వరిని అసఫ్జాహీ పాలకులుగా చరిత్రలో పేర్కొనలేదు. నాసర్ జంగ్, ముజఫ్ఫర్ జంగ్‍లు కర్నూలు, కడప నవాబుల చేతుల్లో హతమయిండ్రు. సలాబత్ జంగ్ తమ తమ్ముడు రెండో అసఫ్జాహీ పాలకుడు నిజామ్ అలీఖాన్ చేతిలో బందీ అయిండు. నిజాం నవాబులు ఒక వైపు ఫ్రెంచ్ సైన్యంతో ఒప్పందాలు చేసుకుంటూనే మరోవైపు బ్రిటీష్ అధికారులతో దోస్తానీ చేసిండ్రు. అంటే రెండు పడవల్లో రెండు కాళ్ళు పెట్టి ప్రయాణించిండ్రు. ఆఖరికి అదే వారి పుట్టి ముంచింది. తొలి దశలో ఫ్రెంచ్ ఈస్టిండియా కంపెనీతో హైదరాబాద్ పాలకులు అంటకాగిండ్రు. దోస్తాని చేసిండ్రు. అయితే తన 66వ యేట 1763లో ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ డూప్లెక్స్ చనిపోవడంతో హైదరాబాద్‍పై ఫ్రెంచ్ ప్రభావం క్రమేణా తగ్గుతూ వచ్చింది. చివరికి ఈ ఫ్రెంచ్ పటాలం తమ కెప్టెన్ మూసా రేమాండ్ మరణంతో దాదాపు కనుమరుగయింది. డూప్లెక్స్ మరణానంతరం బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ తమ అధికారులను హైదరాబాద్‍కు పంపించి రెసిడెంట్లుగా నియమించి షాడో ప్రభుత్వాలను నడిపించింది.
ఒకవైపు మరాఠాలతో యుద్ధాలు జరుగుతుండగా మరోవైపు అదును చూసుకొని అప్పటి వరకు పాలన చేస్తున్న తన అన్న సలాబత్ జంగ్‍పై నిజాం అలీఖాన్ అధికారం కోసం తిరుగుబాటు చేసిండు. పెద్ద సైన్యంతో వస్తున్న అలీఖాన్‍ని అడ్డుకోవలసిందిగా, తగిన సహాయం చేయవలసిందిగా సలాబత్ జంగ్ కొత్తగా ఒప్పందం కుదుర్చుకున్న బ్రిటీష్ అధికారులను కోరినప్పటికీ వారు అందుకు నిరాకరించారు. కొంత జాగీరును కూడా బ్రిటీష్‍వారికి ఇస్తామని ఆశ చూపిన వారు సహాయనిరాకరణ చేసిండ్రు. చివరికి అన్నదమ్ముల మధ్యన హైదరాబాద్‍లో ఒక అవగాహన కుదిరి నిజాం అలీఖాన్ దివాన్‍గా నియమితులయ్యారు.
ఇట్లా తిరుగుబాటు ద్వారా దివాన్ పదవి దక్కించుకున్న నిజాం అలీఖాన్ (రెండో నిజామ్) తర్వాత తానే సర్వస్వతంత్ర రాజయ్యిండు. నిజానికి సలాబత్ జంగ్ 1751 నుంచి 1762 మధ్య కాలంలో హైదరాబాద్‍ని పాలించిండు. హైదరాబాద్‍లోని ఖిల్వత్ ప్యాలెస్‍ని ఈయనే కట్టించాడు. ఈయన పాలన కొనసాగుతుండగానే 1760లో అహ్మద్‍నగర్ ఖిలాదార్‍కు లంచమిచ్చి దాన్ని మరాఠాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాత నిజాం-పీష్వాల మధ్య జరిగిన యుద్ధంలో నిజాం ఓడిపోవడంతో దౌలతాబాద్, బీజాపూర్, అస్సీర్‍ఘడ్ తదితర ప్రాంతాలను ప్రత్యర్థులకు అప్పజెప్పాల్సి వచ్చింది. యుద్ధ ఖర్చుల కింద భారీ ఎత్తున డబ్బు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ దశలో అదును చూసి నిజాం అలీఖాన్ తన అన్న సలాబత్ జంగ్‍ని ఓడించి, బందీగా చేసుకున్నాడు. ఇట్లా నిజాముల్ ముల్క్ నాలుగో కుమారుడైన నిజాం అలీఖాన్ 1762లో అధికారంలోకి వచ్చిండు. ఈయన మొత్తం 42 ఏండ్లు పాలన జేసిండు.
నిజాం అలీఖాన్ మరాఠాలతో ‘పూనా ఒప్పందా’న్ని చేసుకున్నాడు. అనంతరం తన సోదరుడు సలాబత్ జంగ్‍ని బంధించి బీదర్ కోటలోని జైల్లో వేయించాడు. ఆయన 15నెలలు అక్కడే ఉండి మరణించాడు. ఈ మధ్యకాలంలో మరాఠాలు నిజాంల మధ్యన పోరాటాలు కొనసాగాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు ప్రయత్నాలు చేసిండ్రు. నిజాం సైన్యంలోని మరాఠాలు తమకు రావాల్సిన జీతాలు చెల్లించడం లేదనే మిషతో ప్రత్యర్థి వర్గంతో చేరినారు. ఇట్లా గోదావరి నదిలో ఇరుపక్షాల రక్తం పారింది. కొంత కాలం తర్వాత మరాఠాలపై మరోసారి నిజాం రాజు దాడికి దిగగా వారికి అండగా పూనాలో బ్రిటీష్ రెసిడెంట్, కల్నల్ కాంప్‍బెల్ నిలిచిండు. ఆ తర్వాత మళ్ళీ దాడికి ప్రయత్నించగా ఈ సారి మద్రాసు ఈస్టిండియా కంపెనీకి చెందిన జనరల్ కైలియాడ్ హైదరాబాద్‍కు వచ్చి నిజాంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఈ దశలో నిజాం నవాబుతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే నేరుగా ఢిల్లీ మొఘల్ పాలకులతో చర్చలు జరిపి ఉత్తర సర్కారు ప్రాంతాలను తమకు ధారదత్తం చేస్తున్నట్లుగా బ్రిటీష్ వారు తమ పేరిట ఒక ఫర్మానా జారీ చేయించుకున్నారు. నిజానికి వీటిపై పూర్తి అధికారం, స్వాధీనత నిజాంకే ఉన్నప్పటికీ మొఘల్ పాలకుల పట్ల గౌరవంతో పాలన వారి పేరిట (ఖుత్బా, నాణాలు)జరుపుతున్నందుకు దాన్ని ఆసరాగా చేసుకొని ఢిల్లీ రాజు ఆ ఫర్మానా జారీ చేసిండు.
బక్సర్ యుద్ధంలో ఇంగ్లీషువారు తనకు చేసిన సహాయానికి ప్రతిగా షా ఆలమ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇందుకు గవర్నర్ జనరల్ లార్డ్ క్లైవ్ వత్తిడి కూడా పనిచేసింది. నిజాం రాజు ఈ నిర్ణయాన్ని గౌరవించినాడు. దానికి అనుగుణంగా మరో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం మేరకు 1765లో అప్పటివరకు బుస్సీ అధీనంలో ఉన్నటువంటి ఉత్తర సర్కారు ప్రాంతాలను ఢిల్లీ నవాబులు ఇంగ్లీష్ వారికి కట్టబెట్టారు. 12 నవంబర్, 1766లో కుదిరిన మరో ఒప్పందం మేరకు బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ ఏడాదికి ఏడు లక్షల రూపాయలను తమ అధీనంలో ఉన్న జిల్లాలకు సంబంధించిన మొత్తాన్ని నిజాంకు చెల్లించాలి. అలాగే బసాలత్ జంగ్ (ఈయన నిజాం అలీఖాన్ మరో సోదరుడు) అధీనంలో ఉన్న గుంటూరును ఆయన బతికున్నంత కాలం అందులో ఎలాంటి జోక్యం ఉండబోదని కూడా ఈ ఒప్పందం చెబుతుంది. ఇట్లా హైదరాబాద్ రాజ్యంలో బ్రిటీష్‍వారికి అజమాయిషీ లభించింది. అయినప్పటికీ నిజాం అలీఖాన్ సైన్యం కర్నాటకలోని హైదర్ అలీతో కలిసి ఇంగ్లీష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం చేసింది.
అయితే ఈ యుద్ధంలో బ్రిటీష్‍వారు విజేతగా నిలిచారు. దీంతో మరోసారి నిజాం అలీఖాన్ ప్లేటు ఫిరాయించి 26 ఫిబ్రవరి, 1768నాడు ఈస్టిండియా కంపెనీతో మరో ఒప్పందాన్ని కుదుర్చు కున్నాడు. దీని ప్రకారం బ్రిటీష్‍వారు రెండు బెటాలియన్ల సైన్యాన్ని నిజాం రక్షణలో నిలుపుతుంది. వాటి నిర్వహణకయ్యే ఖర్చుని నిజాం ప్రభుత్వం భరించేలా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో మూడో పార్టీగా కర్నాటక నవాబు కూడా సంతకం చేసిండు. వీరు తమ మధ్య సయోధ్య ఉండాలని కోరుకున్నారు. అయితే అది ఎక్కువ కాలం మనలేదు. మరోవైపు నిజాం- మరాఠాల మధ్య యుద్ధ వాతావరణం ఏమాత్రం చల్లారలేదు. ఇరు పక్షాల వారు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇందుకు బీదర్ కేంద్ర బిందువయింది. 1778లో పాండిచ్చేరి బ్రిటీష్‍వారి హస్తగతమయింది. 1779లో మైసూర్‍కు చెందిన హైదర్‍అలీ నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని భావించిన నిజాం సోదరుడు గుంటూరు సుబేదార్ ‘బసాలత్ జంగ్’ బ్రిటీష్‍వారి సహకారాన్ని అర్థించాడు.
ఇందుకు ప్రతిఫలంగా గుంటూరు ప్రాంతంలో రెవిన్యూ వసూలు చేసే అధికారాన్ని బ్రిటీష్ వారికి కట్టబెడుతూ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. తన పోషణలో, సుబేదారి రక్షణగా ఉన్న ఫ్రెంచ్ సైన్య స్థానంలో బ్రిటీష్‍వారిని నియమించుకునేందుకు అంగీకరించాడు. అయితే తన ప్రమేయం లేకుండా కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని హైదరాబాద్‍లోని నిజాం ఆమోదించడానికి నిరాకరించాడు. అంతేకాదు ఉపాధి కోల్పోయిన ఫ్రెంచ్ సైన్యానికి తన ఆస్థానంలో ఉద్యోగాలిచ్చాడు. 1782ఆ ప్రాంతంలో బసాలత్ జంగ్ చనిపోయిండు. మద్రాసు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న తీర ప్రాంతమంతా బ్రిటీష్‍వారి అధీనంలో ఉండింది. అయితే మధ్యలో ఒక్క గుంటూరు వారికి ఇబ్బందిగా ఉండేది. ఇక్కడ బసాలత్ జంగ్ పాలన ఉండడంతో మోటుపల్లి రేవు నుంచి ఎలాంటి ఎగుమతులు, దిగుమతులు చేసుకోవాలన్నా ఆటంకంగా ఉండేది. ఈ మోటుపల్లి రేవును తమకు అప్పజెప్పాలని బ్రిటీష్ రెసిడెంట్లు అనేక సార్లు నిజాం అలీఖాన్‍ని కోరినప్పటికీ అంతకుముందు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆ అంశాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించారు. అయితే 1768లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 1782బసాలత్ జంగ్ చనిపోయిన తర్వాత గుంటూరుపై అధికారాన్ని బ్రిటీష్‍వారికి అప్పజెప్పాలి. అయితే ఈ హామిని కూడా అమలు చేయడానికి నిజాం అలీఖాన్ (రెండో నిజాం) నిరాకరించాడు. ఐదేండ్ల వరకు గుంటూరు నిజాం అధీనంలోనే ఉన్నది. దీనికి జవాబుగా బ్రిటీష్‍వారు తాము వసూలు చేసిన మొత్తాన్ని నిజాం టంకశాలలో జమచేయలేదు. ఈ సమయంలో ఈస్టిండియా కంపెనీ వారు ఒక ప్రతిపాదన చేసిండ్రు. గుంటూరుని తమకు అప్పజెప్పి రెవిన్యూ వసూలు చేసుకునేందుకు అనుమతిచ్చినట్లయితే, అట్లా వసూలైన మొత్తాన్ని నిజాం చెల్లించాల్సిన బకాయీల నుంచి మినహాయించుకుంటామని చెప్పిండ్రు.
ఈ మేరకు మద్రాస్ గవర్నర్ లార్డ్ మెకార్ట్నీ ఒక ఉత్తరం రాసిండు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపడడానికి తాము పూర్తిగా చిత్తశుద్దితో కృషిచేస్తామనీ, అలాగే నిజాం ప్రభువు కూడా గతంలో రెసిడెంట్ హాలండ్‍కు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఇందులో కోరిండు. 1783లో ఫ్రెంచ్ అడ్మిరల్ సఫ్రిన్ మళ్ళీ బుస్సీని ఇండియా రప్పించి ఆయన్ని హైదరాబాద్ వ్యవహారాలను చూసేందుకు నియుక్తుణ్ణి చేసిండు. ఇట్లా 20 ఏండ్ల విరామం తర్వాత హైదరాబాద్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న బుస్సీ నిజాం ఆస్థానంలో రాయబారిగా ఉన్నటువంటి అమాంట్‍కు లేఖ రాసిండు. ఈ లేఖలో ఇంగ్లండ్ ప్రతిపాదించే ఎలాంటి ఒప్పందాన్నైనా నిజాం ప్రభువు ఒప్పుకునేలా వత్తిడి తీసుకురావాలని కోరిండు. ఇట్లా ఏదైనా ఒప్పందంతో ఇంగ్లీష్‍వారు రంగంలోకి దిగితే వారిని ఓడించవచ్చనేది ఆయన వ్యూహం.
ఈ సమయంలోనే టిప్పుసుల్తాన్- నిజాం అధీనంలోని బీజాపూర్‍ని తనకు స్వాధీనం చేయాలని హుకుం జారీచేసిండు. ఇందుకు నిజాం నిరాకరించడమే గాకుండా బ్రిటీష్‍వారి సహాయాన్ని అర్థించినాడు. మరోవైపు గుంటూరుని బ్రిటీష్‍వారికి అప్పజెప్పడంలో ఏర్పడ్డ ప్రతిష్టంభన అలాగే కొనసాగుతున్నది. ఆపత్కాలంలో నిజాంపై వత్తిడి తీసుకురావడం పద్ధతి కాదని బ్రిటీష్‍వారు భావించారు. అందుకే లార్డ్ కార్న్వాలిస్ తన కెప్టెన్ కెన్నవేను హైదరాబాద్‍కు పంపించాడు. ఈయన హైదరాబాద్‍లో బ్రిటీష్ రెసిడెంట్‍గా పనిచేశాడు. ఈయన ద్వారా 1768నాటి ఒప్పందం మేరకు గుంటూరును తమకు అప్పజెప్పాలని బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ డిమాండ్ చేసింది. అయితే ఇలాంటి ప్రమాదం ఉంటుందని ముందే ఊహించిన నిజాం అలీఖాన్ పూనాలో ఫ్రెంచ్ ప్రతినిధిగా ఉంటున్న మాంటిగ్ని ద్వారా పాండిచ్చేరి (ఫ్రెంచ్)వారికి ఒక ప్రతిపాదన చేసిండు. ఇంగ్లీష్ వారు, టిప్పుసుల్తాన్ (ఈ ఇద్దరి మధ్యన అప్పుడు సయోధ్య ఉండింది) లు సంయుక్తంగా ఒక వేళ హైదరాబాద్‍కు దాడికి దిగినట్లయితే తమతో కలిసి యుద్థంలో పాల్గొనేందుకు, సైన్య సహకారాన్ని అందించేందుకు తోడ్పడాలని ఆయన్ని కోరిండు. ఇట్లా చేసినట్లయితే గుంటూరును ఫ్రెంచ్‍వారికి ఇవ్వడానికి సిద్ధమని కూడా తెలిపిండు. అయితే ఈ విషయంలో ఫ్రెంచ్‍వారు ఎటూ తేల్చుకోలేక పోయినారు. ఎందుకంటే అప్పటికి వారిదగ్గర చాలినంత సైన్యం లేదు.
ఈ దశలో నిజాం అలీఖాన్ తన మంత్రి అజాముల్ ఉమ్రాను మైసూరు రాజు టిప్పుసుల్తాన్‍తో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని అక్కడికి పంపిచాడు. ఈ ప్రయత్నం ఏదీ ఫలించలేదు. అప్పటికే స్వాధీనం చేసుకున్న తమ భూభాగాన్ని తమకు అప్పగించాల్సిందిగా నిజాం అలీఖాన్ తన మిత్రుడు మైసూర్‍కు చెందిన మీర్ అబ్దుల్ ఖాసిమ్ ద్వారా ఒక పిటిషన్ ఇప్పించాడు. అంతకు ముందు నిజాంతో బ్రిటీష్‍వారు ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. దీని ప్రకారం నిజాం కోరిక మేరకు ఆయనకు సైన్య సహాయం చేసేందుకు తాము సిద్ధమంటూనే, (యుద్ధంలోని) ప్రత్యర్థి తమ మిత్రవర్గంలోని వారై
ఉండకూడదనే షరతును విధించారు. దీనికి కొనసాగింపుగా కొత్తగా 1790లో మరో ఒప్పందం కుదిరింది. పీష్వా-బ్రిటీష్-నిజాంలు ఈ త్రిముఖ ఒప్పందంలో భాగస్వాములు. అయితే ఈ ఒప్పందాన్ని బ్రిటీష్‍వారు ఉల్లంఘించారు. దీంతో ఇదే కాలంలో మూడో ఆంగ్లో-మైసూర్ యుద్ధానికి బీజాలు పడ్డాయి.
ఎట్లాగూ బ్రిటీష్‍వారు తమని శత్రువర్గంగా గుర్తించినందున నిజాం సైన్యంపై దాడి చేసేందుకు టిప్పు సమాయత్తమయిండు. శ్రీరంగపట్నంపై దాడికి రెండు బెటాలియన్ల సైన్యం హైదరాబాద్ నుంచి బయలుదేరింది. వీటికి నిజాం అలీఖాన్ కుమారుడు సికిందర్‍జా నాయకత్వం వహించినాడు. ఈయనతో పాటు మంత్రి అజాముల్ ఉమ్రా కూడా ఉన్నాడు. ఈ యుద్ధంలో (1792)లో టిప్పు పరాజయం పాలయిండు. చాలా పెద్ద మొత్తంలో రూపాయలను నజరానాగా చెల్లించుకోవాల్సి వచ్చింది. చౌత్, సర్దేశ్‍ముఖ్ పన్నులను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ విషయమై పుణె కోర్టులో కేసులు కూడా నడిచాయి. అయితే ఈ యుద్ధం వల్ల నిజాం ప్రభుత్వానికి ఆశించిన ఫలితాలు దక్కలేదు. మరోసారి పీష్వాలతో ఘర్షణలకు దిగిండ్రు. 11 నవంబర్, 1795 నాడు ఖర్దాలో కొట్లాట జరిగింది. ఈ కొట్లాటలో పీష్వాలు విజయం సాధించారు. నిజాం అలీఖాన్ పరాజయం పాలయిండు. దాదాపు మూడు కోట్ల రూపాయలను చెల్లించి బతుకు జీవుడా అంటూ నిజాం ఈ సంక్షోభం నుంచి బయటపడ్డాడు. అంతేకాదు తన మంత్రి అజాముల్ ఉమ్రాను పీష్వాలకు ‘బందీ’గా అప్పజెప్పాల్సి వచ్చింది. ఇది ఏ రాజుకైనా అత్యంత అవమానకరమైన పరిస్థితి. అటు పుణెలోనూ, ఇటు హైదరాబాద్‍లోనూ బ్రిటీష్‍వారే రెసిడెంట్లుగా ఉన్నారు. వీరిద్దరూ యుద్ధ నివారణ చర్యలు తీసుకోలేదు. మరోవైపు హైదరాబాద్‍లో రక్షణ పేరిట బ్రిటీష్‍వారి సేనలు నిజాంకు అండగా రాలేదు. దీంతో బ్రిటీష్ వారి పట్ల నిజాం అలీఖాన్ కోపాన్ని పెంచుకున్నాడు.
బ్రిటీష్ వారిని నమ్ముకున్నామంటే ఆపత్కాలంలో అణచివేస్తారని భావించిన నిజాం అలీఖాన్ తనకు అవసరమైన సమయంలో ఆదుకునేందుకు గాను ఫ్రెంచ్ సైన్యాధికారిని మూస రేమాండ్‍ని ప్రోత్సహించి పటాలాన్ని పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరాడు. అందుకు కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించేందుకు సన్నద్ధుడయ్యాడు. ఈ సమయంలో యూరప్‍లో బ్రిటన్-ఫ్రాన్స్ల మధ్యన యుద్ధాలు జరుగుతున్నాయి. నిజాం అండను ఆసరాగా చేసుకొని రేమాండ్ తన పటాలాన్ని పెంచుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాడు. ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఉన్నతాధికారులను, అనుభవజ్ఞులైన సైన్యాధికారులను పటాలంలో చేర్చుకున్నాడు. ఇందుకోసం అజముల్ ఉమ్రా ఖమ్మంను రేమాండ్ పటాలానికి కేటాయించాడు. ఖమ్మం ప్రాంతం రెవిన్యూని వసూలు చేయడానికి, ఖర్చు పెట్టడానికి రేమాండ్‍కు పూర్తి అధికారాలు కట్టబెట్టిండ్రు. ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో గెలిచినందుకు గాను కడప ప్రాంతం నిజాం అలీకి బదిలీ అయింది. ఈ ప్రాంతం అప్పటి వరకు కర్నాటక నవాబు టిప్పు అధీనంలో ఉండింది. ఇక్కడ పన్నులు వసూలు చేసుకునేందుకు గాను, శాంతి భద్రతలు కాపాడేందుకు గాను రేమాండ్ తన అధికారి బాప్టిస్టేను నియమించాడు. కడపకు నాలుగువేల సైన్యాన్ని, ఖమ్మంకు 1100లకు పైగా సైన్యాన్ని పంపించాడు. అయితే కడప ప్రాంతం ఇంగ్లీష్‍వారి పాలన ప్రదేశానికి దగ్గరగా ఉండడంతో ఇందుకు బ్రిటీష్ రెసిడెంట్ జాన్ షోర్ అభ్యంతరం చెబుతూ నిజాంకు 1795 జూన్ 9న ఒక లేఖ రాసిండు.
ఇదే సమయంలో నిజాం అలీఖాన్ పెద్ద కుమారుడు ప్రిన్స్ అలీ జా తిరుగుబాటు చేసిండు. దివాన్ అజముల్ ఉమ్రా వ్యవహార శైలి నచ్చని వారందరూ అలీజాతో జతకూడిండ్రు. తిరుగుబాటుని అణచివేయడానికి పంపిన ఫ్రెంచ్ పటాలాన్ని పటాన్‍చెరువు దగ్గర అలీజా, పాపన్నపేట సంస్థానాధీశుడు సదాశివరెడ్డి, వీరితో జతగూడిన పాలెగాళ్ళ బృందం తిప్పికొట్టగలిగింది. ఆ తర్వాత అలీజా, సదాశివరెడ్డిలు బీదర్ కోటలో మకాం వేసిండ్రు. 1768 నాటి ఒప్పందం మేరకు బ్రిటీష్ వారు ఈ తిరుగుబాటును అణచివేయడానికి తమ పటాలాన్ని పంపించాలని నిజాం అలీఖాన్ అప్పటి బ్రిటీష్ రెసిడెంట్ కిర్క్ పాట్రిక్‍ని కోరిండు. ఇందుకు తమ సైన్యం బెంగాల్ నుంచి రావడానికి సమయం పడుతుంది అంటూ సాకులు చెబుతూ ఆ బాధ్యతల నుంచి బ్రిటీష్ వారు తప్పుకున్నారు. ఈ తిరుగుబాటు 1795 జూన్, 28న జరిగింది. అయితే నిజాం అలీఖాన్ ప్రత్యేక ఆదేశాలతో అలీజాను ‘బందీ’గా చేసుకోవడానికి ఇంకా చెప్పాలంటే మచ్చిక చేసుకునేందుకు ఫ్రెంచ్ సైన్యాధికారి మూసా రేమాండ్ తన పటాలంతో బీదర్ చేరుకున్నాడు. సదాశివరెడ్డి సైన్యం అత్యంత చాకచక్యంతో యుద్ధం చేస్తూ ఫ్రెంచ్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. ఒకానొక దశలో ఫ్రెంచ్ సైన్యం బలహీనపడింది. అయితే బాప్టిస్ట్ అదనపు ఫ్రెంచి దళాలతో రేమాండ్‍కు అండగా నిలిచాడు. కొత్తగా మరింత పటాలం అండగా రావడంతో రేమాండ్ దాడి ముమ్మరం చేశాడు.
ఈ దశలో రేమాండ్‍కు దొరక్కుండా అలీజా ఔరంగాబాద్‍కు వెళ్ళిండు. అతన్ని అనుసరిస్తూ ఫ్రెంచ్ పటాలం కూడా వెళ్ళింది. తనకు మద్ధతుగా నిలవాల్సిందిగా పూణె పీష్వాలను అలీజా కోరినప్పటికీ వాళ్ళు అందుకు నిరాకరించిండ్రు. అయితే టిప్పుసుల్తాన్ బయటికి ఏమీ ప్రకటించకున్నా అంతర్గతంగా మద్ధతు పలికిండు. ప్రధాని మీర్ ఆలం సలహా మేరకు నిజాం అలీ బ్రిటీష్ సైన్యాన్ని ఆదుకునేందుకు ఆహ్వానించాడు. సత్వరమే స్పందించిన మేజర్ రాబర్టస్ తన బెటాలియన్‍తో మీర్ ఆలమ్‍కు అండగా నిలిచిండు. ఔరంగాబాద్‍లో అలీజాను అరెస్టు చేసి హైదరాబాద్‍కు తీసుకు వస్తూ ఉండగా మార్గమధ్యలో ఆయన ఆత్మహత్య చేసుకున్నడు. దీంతో నిజాం అలీకి బ్రిటీష్‍వారి మీద నమ్మకం ఏర్పడింది. అలాగే నడిగడ్డలో ముఖ్యంగా రాయచూర్‍లో స్థానిక పాలెగార్లు సమస్యలు సృష్టిస్తూ ఉండడంతో వారిని అణచడానికి రాబర్ట్, కెప్టెన్ డాల్రింపుల్ 1796 ఫిబ్రవరి, అక్టోబర్ నెలల్లో దాడి చేసి ‘శత్రువు’లను మట్టుబెట్టిండ్రు. ఇది కూడా నిజాం అలీలో ధైర్యాన్ని పెంచింది. అంతేకాదు డాల్రింపుల్ లాంటి సైన్యాధికారులపై గురి ఏర్పడింది.
మరోవైపు రేమాండ్ పట్ల కూడా నిజాం అంతే ప్రేమతో ఉండేవాడు. సదాశివరెడ్డికి చెందిన మెదక్ ప్రాంతాన్ని రేమాండ్‍కు ధారదత్తం చేసిండు. నెలకు 35 నుంచి 50 వేల రూపాయల వేతనంతో రేమాండ్‍ని సైన్య నియంత్రణాధికారిగా నియమించినాడు. 1798 మార్చి, 25నాడు రేమాండ్ చనిపోయే నాటికి అతని అధీనంలో 10వేల సైన్యముండింది. అలాగే బ్రిటీష్ అధికారి ఫిన్‍లాండ్ స్వాధీనంలో కేవలం 800 మంది సైనికులుండేవారు.
ఇదే సమయంలో పుణెలోని పీష్వాల నిర్బంధం నుంచి విడుదలై వచ్చిన అజముల్ ఉమ్రా సలహా మేరకు బ్రిటీష్ రెసిడెంట్ జాన్ షోర్ రంగంలోకి దిగిండు. రేమాండ్ బెటాలియన్ మొత్తాన్ని రద్దు చేయించగలిగాడు. అలాగే 1798, 1800ల సంవత్సరాల్లో సైన్య సహకార ఒడంబడికను నిజాంతో కుదుర్చుకున్నాడు. ఇట్లా హైదరాబాద్‍లో ఫ్రెంచ్‍వారి ప్రాభవానికి తెరపడింది. అంతేగాకుండా బ్రిటీష్‍వారి ఆధిపత్యానికి పునాది పడింది.
-సంగిశెట్టిశ్రీనివాస్,
ఎ:98492 20321