అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-5 పొలమెయరట్టోడి కొండపర్తి (పూర్తి) తెలుగు శాసనం (క్రీ.శ.9వ శతాబ్ది)

హైదరాబాదుకు 32 కి.మీ. దూరంలో నున్న కీసరగుట్టలో బయల్పడిన ‘తులచువాన్ఱు’ అన్న క్రీ.శ. 5వ శతాబ్ది నాటి చిన్న శాసనమే, తెలంగాణ తొలిశాసనంగా కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్‍గారి ద్వారా ఇటీవల విస్తృత ప్రచారానికి నోచుకొంది. ఉమ్మడి రాష్ట్ర పురావస్తుశాఖ, 1970-80లలో కీసరగుట్టలో తవ్వకాలు చేస్తున్నపుడు, ఒక బండపై ఈ చిన్న శాసనాన్ని గుర్తించారు. విష్ణుకుండికాలపు ఈ శాసనంలో, తులచు – (తొలచు, తొలిచే) వాన్ఱు – (వారు, వాళ్లు) అంటే తొలచేవాళ్లని, రాతిని తొలిచే శిల్పులు (వడ్డర్లు కూడా కావచ్చు) అని ప్రముఖ శాసన పరిశోధకులు పి.వి. పరబ్రహ్మశాస్త్రిగారు తెలియజేశారు. విష్ణుకుండిల రాజధానిగా గుర్తింపు పొందిన కీసరగుట్టలో రాజప్రాసాదం, శివాలయ సముదాయం, ఇతర కట్టడాలతో పాటు, చుట్టూ కోటగోడ ఆనవాళ్లు లభించాయి. ఈ కోటగోడకు అవసరమైన రాళ్లను బండ్ల నుంచి వేరు చేసి, కావలసిన పరిమాణంలో చెక్కిన శిల్పులు, ఇంతటి పెద్ద పనిని చేసింది తామేనన్న ఆత్మగౌరవాన్ని ‘తులచువాన్ఱు’ శాసనం ద్వారా ప్రకటించుకొన్నారు. విష్ణుకుండిల శాసనాల్లో దానం చేయబడిన గ్రామాల పేర్లు, ఇంకా ఒకటి రెండు తెలుగు పదాలు తప్ప వారి శాసనాలన్నీ, పాకృత – సంస్కృత భాషల్లోనే ఉన్నాయి.
తెలంగాణా శాసనాల గురించి ప్రముఖ శాసన పరిశోధకులు డా.ఎన్‍.ఎస్‍. రామచంద్రమూర్తి, ఆర్కియోలజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా, శాసన విభాగ సంచాలకులు డా. కె. మునిరత్నం రెడ్డి, అప్పుడప్పుడూ నా సందేహాలను తీరుస్తుంటారు. ఇక తెలంగాణ శాసన పరిశోధకుల్లో డా. డి. సూర్యకుమార్‍, శ్రీరామోజు హరగోపాల్‍ కొత్త శాసనాలను వెలికి తీస్తూ, విశ్లేషిస్తూ శాసన పరిశోధన విద్యార్థులకు, పాఠకులకు ఎంతో సేవ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, గబుక్కున తెలంగాణకు సంబంధించిన ఏదైనా ఒక ఆనవాలు కావాలన్నా, సందేహాలు తీర్చాలన్నా వీరిద్దరూ యుద్ధసన్నద్ధులుగా ఉంటారు. తెలంగాణ తొలి, మలి తెలుగు శాసనాల గురించి నేను వీళ్లిద్దరితో చర్చిస్తూనే ఉంటాను.


మా ముగ్గురి మధ్య జరిగిన చర్చల్లో తొలితరం తెలంగాణా తెలుగు శాసనాల్లో ఒకటిగా కొండపర్తి శాసనం ఒక మెరుపు మెరిసింది. ఎక్కడిదీ కొండపర్తి? వరంగల్‍ జిల్లా కేంద్రానికి సమీపంలో నున్న కాకతీయుల శాఖా నగరాల్లో కొండపర్తి ఒకటి. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని సేనానుల్లో ప్రముఖుడైన చౌండసేనాని కొలువు తీరిన నెలవు. కాకతీయ రాజధాని ఓరుగల్లు రక్షణ పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన సైనిక శిబిరంగా కొండపర్తి చరిత్ర కెక్కింది. కొండపర్తి సైనిక శిబిరానికి చౌండసేనాని నాయకుడు. ఇతని భార్య కాకతీయ సామంతులైన విరియాల వంశానికి చెందిన మైలమ. వీళ్లిద్దరూ కలిసి క్రీ.శ.1241లో కొండపర్తిలో చౌండేశ్వరాలయాన్ని నిర్మించారు. వీరికి సమకాలికులూ, సన్నిహితులైన కాట సేనాని, అతని భార్య కాచాంబిక కలసి ఇక్కడే ఒక త్రికూటాలయాన్ని నిర్మించారు. ‘కాకతమ్మకు సైదోడు ఏకవీర’ అన్నట్లు ఓరుగల్లుకు సరిజోడుగా కొండపర్తి విలసిల్లి, కాకతీయ చరిత్రలో తనకంటూ ఒక చోటు దక్కించుకొంది. ఇక్కడి శాసనాలు, ఆలయ నిర్మాణానికి సంబంధించిన రాళ్ల ఎంపిక, చెక్కడం, సంధి బంధనాలను పొందించటంలో శిల్పుల నేర్పరితనాన్ని తెలియ జేస్తున్నాయి. ఇది కాకతీయుల నాటి మాట.


ఇక కొండపర్తిలోని క్రీ.శ.9వ శతాబ్ది నాటి స్థానిక అధికారి పొలమెయరట్టోడి శాసనం గురించి మాట్లాడుకొందాం. ఇది కొత్త శాసనం కాదు. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం పురావస్తు శాఖ వారి దృష్టినాకర్షించింది. కొండపర్తి చెరువులోని కొక్కెరగుండు (కొంగలు సేదదీరే గుండు)పై నున్న ఈ శాసనాన్ని 1973వ సం।।లో అచ్చుతీసి, ఆ సం।।పు 57వ శాసనంగా, ఇన్స్క్రిప్షన్సు ఆఫ్‍ ఆంధప్రదేశ్‍, వరంగల్‍ డిస్ట్రిక్టు అన్న వాల్యూంలో 314వ పేజీలో ప్రచురించారు. పూర్తిగా తెలుగు భాషలో, తెలంగాణ నుడికారాన్ని పండించిన ఈ శాసనానికేమాత్రం ప్రాధాన్యతలేని ఇతరాల్లో చేర్చి, చిట్టచివరి శాసనంగా ప్రకటించారు పురావస్తు శాఖ వారు. సంస్కృత పదాలు లేనందువల్లనేమో ఈ శాసనం చిన్న చూపుకు గురైంది.


కొండపర్తి గ్రామ దేవాలయాల్లోనూ పరిసరాల్లోనూ చెల్లా చెదురుగా పడిఉన్న చారిత్రక శిల్పాల్ని ఒకచోట భద్రపరచటానికి, ఒక సైట్‍ మ్యూజియం ఏర్పాటు చేయాలని 1995లో పురావస్తు శాఖ తలపోసింది. వాటిని సేకరించి చారిత్రక కాలక్రమంలో ప్రదర్శించే పనికి ఆ శాఖ సహాయ సంచాలకులు సముద్రాల రంగాచారి, కేర్‍టేకర్‍ డి.భానుమూర్తి, ఫోర్‍మన్‍ రాజేంద్రలతో పాటు నన్ను కూడా పురమాయించారు.
అందరం కలసి చౌండేశ్వరాలయం చుట్టు ప్రక్కల శాసనాలు, శిల్పాలను ఆలయంలోకి తరలించి పీఠాలపై నిలబెట్టి, వాటిని సంక్షిప్త వివరాలతో పేరుపలకలను ఏర్పాటు చేశాం. ఆ సందర్భంగా, కొండపర్తి చెరువులోని శాసనమున్న కొక్కెరగుండు దగ్గర కెళ్లి చూశాను. రాత, కడప జిల్లాలోని చివరి తరం రేనాటి చోళులు, బాణ, వైదుంబరాజుల లిపిని పోలి ఉంది. భాష కూడ దాదాపు అలానే ఉంది. పురావస్తు శాఖ ప్రధాన కార్యాలయం, శాసన విభాగంలోని శాసనాల నకళ్లను తీసే పనిలో నేర్పరి అయిన కొమరయ్యగారిని రప్పించి, మళ్లీ మరో ముద్రను ఒత్తించి, శాసన పాఠాన్ని చదువుతుంటే తెలుగు మాటల పూదోటలో విహరిస్తున్నట్లనిపించింది.


శాసన పాఠం :

  1. స్వస్తి పొలిమెయ రట్టోడి మని(ం)చి
  2. కాళు కొణ్డపకు సమభగంబు తంబులస్రవంబు నేసిన
  3. భూమి దీని గూన్తుకున్తుల పరువడి వడ్డియారం (బు) చేయువారు
  4. యిట్లు దక్కనీ గల్పనుణ్ణి తంబుల(ం)బు దిన్నవారు వన్దామి గొరవలు (తా)నమెయు
  5. కుమరమయ్యయు గణపతియోజు యిట్లు సాక్షిగాను తం(బు) (ల) స్రవంబు చేసిన స్రవణ భూమి
  6. యి నేల యరి నాలుగు ద్రమ్మలు ఆయంబు పుట్టెణ్డుగొలుగు ధనంజయ ఫలధారు
  7. కొనువారు అకడి (ప(ం)గు లేదు (యిద్దొఱెం) బెత్తున నారభచేయు వారు అమ్మ యారభ
  8. చేయువాణ్డు స్రవకుల భీమియ క్ఱొంపాల దివాకరియ స్రన్నుగోల వేదియయు సాక్షి
  9. నాగ కుమరియక్రొచ్చె మంగళ మహా శ్రీ.


పాలమెయ రట్టోడి మంచికాళు కొణ్డవకు తాంబూలం తీసుకొని కొంత భూమిని ఇచ్చి, వచ్చే ఆదాయంలో చెరిసగం పంచుకొనేట్లుగా చేసుకున్న ఒడంబడికను ఈ శాసనం నమోదు చేస్తుంది. ఈ భూమిని బిడ్డబిడ్డతరం, వ్యవసాయ పండగ నాడు, సేద్యాన్ని ప్రారంభించేట్లుగా ఒప్పందం చెల్లుతుందని, స్థానిక నమస్కరించదగ్గ గురువులు పెద్ద మనుషులుగా తాంబూలాన్ని తిన్నారని, ఇందుకు దానమెయ, కుమరమయ, గణపతి అనే శిల్పి, సాక్షులని, ఈ భూమి స్రవణ (జైనమతావలంబికులు) భూమి అనీ, పన్నుగా నాలుగు ద్రమ్మలు (అప్పటి నాణేలు), పుట్టెడు ధాన్యాన్ని కొలిచి ఇవ్వాలని, వీటిని ధనంజయుడు వసూలు చేస్తాడనీ, దీనికి అకిడి, పంగు (పన్ను) లు లేవనీ, (పైన చెప్పిన ఇద్దరి పొత్తులో సేద్యాన్ని అనుమకొండ నుండి తమ సేద్యగాళ్ల ద్వారా ప్రారంభిస్తారని ఇందుకు శ్రావకుల భీమియ, క్ఱొంపాల దివాకరయ, స్రన్నుగొల మేడియ అనే ముగ్గురు సాక్షులని, ఈ సమభాగ కౌలు ఒప్పంద శాసనాన్ని, (ఈబండ మీద) నాగకమరియ అనే శిల్పి చెక్కిన వివ రాలున్నాయి. చివరన అంతా మంచే జరగాలన్న మంగళ వాచకముంది. శాసనాక్షరాలు అరిగి కొన్ని చోట్ల ఆనవాళ్లు లేకుండా పోయాయి. లిపి, భాష క్రీ.శ.9వ శతాబ్ది నాటివని పి.వి.పరబ్రహ్మశాస్త్రిగారు తెలిపారు. శాసన ప్రారంభంలో ‘స్వస్తి’ అన్న శుభ శబ్దం ఆనవాయితీగ వస్తున్నదే. ఇక శాసన పదాల్ని పరిశీలిద్దాం.


ఒప్పందంలోని ప్రధానవ్యక్తి పొలమెయరట్టోడి, రట్టోడి అంటే రట్టగుడి, రడ్డి, రెడ్డి అని. కడప జిల్లా కొలవల్లిలోని క్రీ.శ.9వ శతాబ్ది నాటి వైదుంబ శాసనంలో సాక్షులుగా దానియ రట్టోడి, వినయ రట్టోడిలను పేర్కొన్న సంగతిని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. స్థానిక అధికారులను రట్టోడులని పిలిచే వారని దీనివల్ల తెలుస్తుంది. పొలమెయరట్టోడి తనతో ఒప్పందం చేసుకొన్న సేద్యగాడు మంచి కాళు. కాళు, కాళ్లు శబ్దం అనేక కడప జిల్లా శాసనాల్లో కనిపిస్తుంది. కడపజిల్లా పొద్దుటూరు సమీపంలోని అరకటవేములలోని బాణ రాజుల క్రీ.శ. 9వ శతాబ్ది శాసనంలో పెన్ఱకాలు ప్రస్తావన ఉంది. అంతదాకా ఎందుకు తెలంగాణలోని నల్లగొండ జిల్లా ఏలేశ్వరంలో దొరికిన క్రీ.శ.6-7 శతాబ్దాల నాటి చిన్న శాసనాల్లో జయసింఙ్గ మఞ్చి, అంణనమఞ్చి అన్న పేర్లున్నాయి. సమభాగము అన్న పదాన్ని సమ భాగంబు అని, తాంబూల స్రావంబు చేసిన అన్న పదాన్ని తంబుల స్రవంబు సేసిన అనీ, దీని = దీన్ని, గూన్తుకున్తుల = బిడ్డ బిడ్డ తరముగా, వడ్డియారంబు చేయు వారు = ఒప్పందం ప్రకారం (బయానా) చెల్లించి వ్యవసాయాన్ని ప్రారంభింవాలని, యిట్లు దక్కని (ఇట్లు – దక్కు- అని) = ఇలా చెల్లునని, తంబులంబు దిన్నవారు = తాంబూలం వేసుకొన్నవారు, వన్దామి గొరవలు = గౌరవించదగిన గురువులు, స్రవణ భూమి = జైన అనుయాయులను, (దీక్షతీసుకొన్న వారిని) శ్రమణులంటారు. వారిపేరున పిలువబడుతున్న భూమి. యినేలయరి = ఈ భూమిపై విధించే పన్ను (నాలుగు ద్రమ్మలు). అయంబు పుట్టెణ్డు గొలుగు = సేద్యం వలన లభించే ఆదాయం ఒకపుట్టెడు కొలతగల ధాన్యం. కడప జిల్లా, పొద్దుటూరులోని చోళ మహారాజు క్రీ.శ.9-10 శతాబ్దాల నాటి శాసనంలో, ‘ఆయంబు’ ప్రస్తావన ఉంది. అదే శబ్దం ఇక్కడ అయంబు = ఆయంబు =ఆదాయం. ధనంజయ ఫలదారు = పంటను దక్కించుకొనే అధికారి. అకిడి పంగులేదు = ఈ భూమి మీదగానీ, పంట మీదగానీ అకిడి, పంగు అనే పన్నులు లేవు.


యిద్దఱంబొత్తున నార(ం) భంచేయువారు = ఒప్పందం చేసుకొన్న పొలమెయరట్టోడి, మంచి కాళు కొణ్ఱవలు కలిసి పొత్తులో సేద్యం చేసేవారు. అమ్మ కొణ్డనుణ్డి = అర్మకొండ నుండి = అ(హ)నుమకొండ నుండి, యారంభం చేయు వాణ్డు = సేద్యాన్ని ప్రారంభ(ం) (భిం)ప చేసే వాడు. స్రావకుల భీమియ = శ్రావకుల (జైన మతావలంబి) భీమయ్య, క్ఱొంపాల దివాకరయ, స్రన్నుగొల మేడియ సాక్షి. ఈ ఒప్పందానికి క్రొంపాల దివాకరయ్య సన్ను గొల (చెర్నాకోల) మేడియ్యలు సాక్ష్యం. నాగ కమరియక్రొచ్చె = కమ్మరి నాగయ్య ఈ శాసనాన్ని చెక్కాడు. మంగళమహాశ్రీ = గొప్ప శుభం కలుగుగాక.
ఈ శాసనంలో పేర్కొన్న గణపతి యోజు సాక్షి అన్న పదాలకు పోలికగా కడపజిల్లా కమలాపురం తాలూక వెల్దుర్తిలోని క్రీ.శ.9వ శతాబ్దినాటి చోళ మహారాజుల శాసనంలో వెణవోజుచక్షి (వెన్నవోజుసాక్షి) పదాలను చూపించవచ్చు. అలానే, ఈ శాసనంలోని ‘నాగ కమరియ క్రొచ్చె’ పదానికి పోలికగా, కడపజిల్లా ముద్దునూరులోని క్రీ.శ.10వ శతాబ్దినాటి చోళ మహారాజుల శాసనంలో ‘క్రొచ్చె’ పదం కనిపిస్తుంది.


శాసన పదాలను పరిశీలిస్తే సున్నకు బదులు బిందువు వాడటం గమనించాల్సిన అంశం. క్ఱొంపాల శబ్దంలో బండి‘ఱ’, నుణ్డి, కొణ్డు వాణ్డు, అరి, పుట్టెణ్డు, యిట్లు, అమ్మ కొణ్డ (బాదామీ చాళుక్యుల వాడుక అయిన ద్విత్వానికి ముందు రకారపొల్లు) ఆనాటి వ్యవహార, లిఖిత భాష సంప్రదాయాలను, వ్యాకరణాన్ని, కొలతలను నామ వాచకాలను, మతాచారాలను తెలియ జేస్తున్నందున, ఇంకా శాసనం పూర్తిగా తెలుగులో ఉండటం వల్ల ఈ శాసనాన్ని అలనాటి తెలంగాణ మేటి శాసనాల్లో ఒకటిగా పేర్కొనవచ్చు.


క్రీ.శ. 6-8 శతాబ్దాల మధ్య కాలా నికి చెందిన యేలేశ్వరం చిన్న శాసనాల్లో గుణబ(వ)రుణ్ఱు, శ్రీను, శ్రీధరుణ్డు, శ్రీరణమర్దనుడు మొదలైన తెలుగు పదాలున్నాయి. కొండపర్తిలో క్రీ.వ. 9వ శతాబ్ది నాటికి పూర్తి తెలుగు శాసనం వెలువడటానికి యేలేశ్వరం లాంటి చిన్న తెలుగు శాసనాలు బాటవేసి ఉండొచ్చు. ఈ సందర్భంగా కీ.శే. ఎన్‍. వెంకటరమణయ్య, పి.వి.పరబ్రహ్మశాస్త్రి, డా.ఎన్‍.ఎస్‍ రామచంద్రమూర్తి, డా. డి. సూర్య కుమార్‍, శ్రీరామోజు హరగోపాల్‍, అవధానం ఉమామహేశ్వరశాస్త్రి, కొండా శ్రీనివాసులు గార్లకు నా కృతజ్ఞతలు.


-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *