భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక హిందుస్తానీ సంగీతం

భారతదేశం ఏకశిలా సదృశ్యమైన ధార్మిక, సాంస్కృతిక విలువలు కలిగిన దేశం కాదు. భిన్నభాషా సంస్కృతులు, భిన్నమైన ఆలోచనా ధారలు వికసిల్లిన విశాల దేశం. భిన్నత్వమే ఈ దేశం ప్రత్యేకత. భిన్నత్వంలోనే ఏకత్వాన్ని సాధించిన సాంస్కృతిక ధార ఈ దేశానిది. అందులోనే సహజీవన సంస్కృతి వెల్లి విరిసింది. ఈ సహజీవన సంస్కృతి ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడింది. భారత దేశం ఏకశిలా సదృశ్యమైన ధార్మిక సాంస్కృతిక సమాజంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నది. ఆ దిశగా చరిత్రను పునర్లిఖించే ప్రయత్నం జరుగు తున్నది. భారతదేశంలో శతాబ్దాలుగా నిర్మాణం అవుతూ వచ్చిన భిన్నత్వాన్ని తిర స్కరించే భావజాలం ఈ తరం మనస్సులలో స్థిరపరచే ఒక అధికారిక కుట్ర అంతర్గతంగా మనకు తెలియకుండానే మనలను చుట్టుముడుతున్నది. వీటిని చర్చించే ముందు దేశంలో సహజీవన సంస్కృతి ఎట్లా మన జీవితాల్లో పెనవేసుకు పోయిందో కొన్ని సన్నివేశాలను ప్రస్తావించుకొని మననం చేసుకుందాము.


ఉస్తాద్‍ బడే గులాం అలీ ఖాన్‍ :
ఉస్తాద్‍ బడే గులాం అలీ ఖాన్‍ ఈ దేశం గర్వంగా ప్రస్తావించుకునే హిందుస్తానీ సంగీత శిఖరం. పాటియాలా ఘరానా సంగీత సంప్రదాయాన్ని సమున్నతంగా నిలబెట్టిన మహనీయుడు. ఉస్తాద్‍ ముసల్మాన్‍ అయినా మత బేధాలు ఆనాటి గాయనీ గాయకుల్లో లేనట్టే ఉస్తాద్‍లో ఉండేవికావు. తన జీవితపు చరమాంకంలో 1967లో ఆయన పక్షవాతానికి గురి అయినాడు. ముంబాయిలో నివసించే ఉస్తాద్‍ పక్షవాతానికి మూలికా వైద్యం చేసే హకీం ఉన్నాడని తెలిసి చికిత్స కోసం ఆదిలాబాద్‍ జిల్లా బోథ్‍ గ్రామానికి వచ్చాడు. బోథ్‍ ఆనాటికి తాలూకా కేంద్రమైనా ఒక కుగ్రామమే. బోథ్‍ డాక్‍ బంగ్లాలో ఉస్తాద్‍ రెండు మూడు నెలలు ఉన్నాడు. మూలికా వైద్యం చేయించుకున్నాడు. ఆయన బోథ్‍ లో ఉన్న రోజుల్లోనే వినాయక నవరాత్రులు వచ్చాయి. బోథ్‍లో ఉండే సంగీత ప్రియులు వినాయక మండపంలో ఆయన సంగీత కార్య క్రమాన్ని ఏర్పాటు చేయదలచి ఉస్తాద్‍ను పాడమని ఆహ్వానించారు. ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. ఆయనది భారీ శరీరం. ఒక పలంగ్‍ మీద ఆయనను పడుకోబెట్టి మండపానికి తీసుకొచ్చారు. హార్మోని, తబలా స్థానిక కళాకారులే వాయించినారు. నిపుణులైన షాజిందాలు (వాద్య సహాయకులు) లేకపోయినా మూడు గంటలపాటూ అప్రతిహతంగా సంగీత రాగాలు, భజన్‍లు, టుమ్రీలు వినిపిం చాడు ఉస్తాద్‍. దేశంలో ఉస్తాద్‍ సంగీత కచేరీల కోసం నెలల తరబడి వేచి చూస్తారు. బోథ్‍ సంగీత ప్రియులు మాత్రం అనాయాసంగా వినాయక నవరాత్రుల సందర్భంగా ఆయన సంగీత కచేరీని వినే అదృష్టాన్ని పొందారు. 1968 ఏప్రిల్‍లో హైదరాబాద్‍లోనే తుది శ్వాస విడిచాడు. హైదరాబాద్‍లోనే ఆయన పార్థివ శరీరాన్ని పాయెగాల అధికారిక శ్మశాన వాటికలో ఖననం చేశారు. కోఠిలో ఒక రోడ్డుకు ఆయన పేరు కూడా పెట్టారు. ఒక ముసల్మాన్‍ ను వినాయక మండపానికి ఆహ్వానిస్తున్నామన్న భావన కార్యక్రమ నిర్వాహకులకు లేదు. తాను వినాయక మండపంలో పాడబోతున్నానన్న స్పృహ ఉస్తాద్‍కూ లేదు.


ఉస్తాద్‍ బిస్మిల్లా ఖాన్‍ :
భారత రత్న ఉస్తాద్‍ బిస్మిల్లాఖాన్‍ షహనాయి వాదనంలో మేరు నగం. ఉండేది గంగా నది ఒడ్డున ఉన్న బనారస్‍లో. ఆయన మేనమామ అలీబక్ష్ వారణాసి విశ్వనాథ దేవాలయంలో ఆస్థాన షహనాయీ వాదకుడు. బిస్మిల్లా ఖాన్‍ తన మేనమామ వద్దనే షహనాయీ వాయించడం నేర్చుకున్నాడు. ఆయన సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో దేశ విదేశాల్లో ఎన్నో సంగీత కచేరీలు చేసినాడు. షహనాయీ వాద్యానికి ఒక గొప్ప శాస్త్రీయ సంగీత ప్రశస్తిని కలుగజేసినాడు. ఆయనకు బాబా విశ్వనాథుని దర్శనం కూడా అయ్యిందట. ప్రతీరోజు గంగా నదిలో ఉదయం మునక వేసి, తన షహనాయికి గంగా నదీ జలాలతో సంప్రోక్షణ చేసిన తర్వాతనే ఆయన తన రోజు వారీ కార్యక్రమాలు మొదలు బెట్టేవాడు. అతనిది సాదాసీదా జీవితం. హజ్‍ యాత్ర చేసిన సచ్చా ముసల్మాన్‍ అతడు. ఒకసారి అమెరికాలో కచేరీ నిర్వహించిన తర్వాత కచేరీలో పాల్గొన్న కొందరు ‘‘ఉస్తాద్‍ మీరు ఇక్కడనే ఉండిపోండి. మీకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం’’ అన్నారట. దానికి ఉస్తాద్‍ ‘‘మీరు సంపన్నులు. నా కోసం స్వర్గాన్నే సృష్టించగలరు. అయితే బనారస్‍లో ఉన్న గంగా మాయిని తేగలరా? రోజూ గంగామాయిలో మునగ కుండా ఉండలేను కదా!’’ అన్నారట. గంగామాయితో హిందువులకే కాదు బిస్మిల్లాఖాన్‍ లాంటి సచ్చా ముసల్మాన్‍లకు విడదీయలేని అనుబందం ఉందని, ఉంటుందని మన అనుభవంలోకి రాదు.


నవాబ్‍ మీర్‍ మహాబూబ్‍ అలీ ఖాన్‍ :

నవాబ్‍ మీర్‍ మహబూబ్‍ అలీ ఖాన్‍ హైదరాబాద్‍ సంస్థానానికి ఆరవ నిజాం రాజు. హైదరాబాద్‍ నగర ప్రజలు అతన్ని ప్రేమతో మహబూబ్‍ పాషా అని పిలుచుకునే వారు. ఆధునిక హైదరాబాద్‍ నగర నిర్మాణానికి మూల కారకుడు. ఆధునిక హైదరాబాద్‍ నిర్మాణానికి ప్రణాళికలను, సంస్కరణలను అమలు పరచడానికి తన దీవాన్‍ సాలార్‍ జంగ్‍కు పూర్తి స్వేచ్ఛను కల్పించాడు. ఆ ఇద్దరి సహచర్యంలో ఆధునిక హైదరాబాద్‍ నగరం నిర్మాణం ప్రారంభం అయ్యింది. 1908లో మూసీ పరీవాహక ప్రాంతంలో ఒకే రోజు కురిసిన 32 ఇంచుల వర్షపాతంతో మూసీకి గతంలో కనీ వినీ ఎరుగని వరదలు సంభవించి హైదరాబాద్‍ నగరాన్ని అతలాకుతలం చేసిన సంగతి అందరూ ఎరిగినదే. హైదరాబాద్‍ నగరాన్ని ముంచెత్తిన మూసీ వరద భీభత్సం నుంచి నగర ప్రజలను రక్షించడానికి తన రాజ భవనాలను ప్రజల కోసం తెరచిపెట్టాడు మహబూబ్‍ పాషా. పండితుల సలహా మేరకు మూసీని శాంతింపజేయడానికి మూసీ నదీమ తల్లికి చీర సారెలు హిందూ మత సాంప్రదాయబద్దంగా సమర్పించాడు. తాను ఒక ముసల్మాన్‍ అనే స్పృహ ఆయనకు లేదు. తన ప్రజల సంక్షేమమే పరమావధిగా ఆయన ఆ పని చేయడానికి సంకోచించ లేదు.


నౌషాద్‍-షకీల్‍-రఫీ :
నౌషాద్‍ అలీ పేరు వినని వారు ఉండరు. తొలి తరం హిందీ సినిమా సంగీత దర్శకులలో ఆయన ఒక దిగ్గజం. ఆయన ఒక ముసల్మాన్‍ అన్న సంగతి అందరికీ ఎరుకే. ఆయన స్వర కల్పన చేసిన వేలాది పాటలు ఇప్పటికీ మనలను అలరిస్తున్నాయి. సంగీత ప్రధాన చిత్రం బైజు బావ్రాకు నౌషాద్‍ సంగీత దర్శకుడు. బైజు అద్భుత గాయకుడు. కానీ గుర్తింపు లేక పేదరికంలో మగ్గిపోతుంటాడు. ఎవరో అక్బర్‍ పాదుషాను దర్శించు కొమ్మని సలహా ఇస్తారు. అప్పటికే అక్బర్‍ దర్బారులో గోపాల్‍ దాస్‍, హరిదాస్‍, తాన్‍ సేన్‍ లాంటి సంగీత దిగ్గజాలు కొలువుతీరి ఉన్నారు. బైజు అక్బర్‍ పాదుషా దర్శనం కోసం ఆగ్రా వెళతాడు. కానీ అతనికి అక్బర్‍ దర్శనం దొరకదు. నిరాశతో కృష్ణుడి దేవాలయంలో తన గోసను వెళ్ళబుచ్చుతూ ‘‘హరి ఓం.. మన్‍ తర్పత్‍ హరి దర్శన్‍ కో ఆజ్‍’’ అనే పాట పాడుతాడు బైజు. నౌషాద్‍ ఆ పాటను మాల్‍ కౌన్స్ రాగంలో స్వర పరచాడు. పాట రాసింది మహమ్మద్‍ షకీల్‍ బధాయునీ, పాట పాడింది మహమ్మద్‍ రఫీ. ఆ కృష్ణ భక్తి రస ప్రధానమైన పాటకు ప్రాణం పోసిన ముగ్గురూ ముసల్మాన్‍ లు కావడం విశేషం. రికార్డు చేసేది కృష్ణ భక్తి రస ప్రధానమైన పాట కాబట్టి రికార్డ్ చేసే రోజున అందరూ స్నానం చేసి శరీరాన్ని, మనసును శుభ్రం చేసుకొని పవిత్రంగా రావాలని తన ఆర్కెస్ట్రా కళాకారులను ఆదేశించానని నౌషాద్‍ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ పాట అంత గొప్పగా రావడానికి మాల్‍ కౌన్స్ రాగం గొప్పదనమే కానీ తన గొప్ప ఏమీ లేదని వినమ్రంగా చెప్పుకున్నాడు నౌషాద్‍. బైజు పాట విన్న ఒక పెద్ద మనిషి బైజును అక్బర్‍ దర్బారుకు తీసుకు వెళ్ళడం, ఆ తర్వాత బైజు అక్బర్‍ దర్బారులో పాడి, తాన్‍ సేన్‍ను ఓడించి, అక్బర్‍ను మెప్పించి దర్బారులో స్థానం సంపాదించడం వేరే కథ.
ఇవి ప్రజాజీవితంలో చాలా ప్రచారం పొందిన కొన్ని సన్నివేశాలు. ఇటువంటి జీవితానుభవాలు కోకొల్లలుగా మనం ఉటంకించవచ్చు. ఏ జాతి సాంస్కృతిక ఔన్నత్యానికైనా ఆట, మాట, పాట, సాహిత్యం, పండుగలు, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం మొదలైనవి ప్రధాన ప్రతీకలుగా భావిస్తారు.

భారత దేశ సహజీవన సంస్కృతికి మన సంగీత సంప్రదాయాలు బలమైన ప్రతీకలుగా ఉన్నాయి. భారత దేశంలో రెండు.. హిందుస్తానీ, కర్నాటకసంగీత సాంప్రదాయాలు ఉన్నాయి. హిందుస్తానీ సంగీత సాంప్రదాయం ఉత్తర భారతంలో అభివృద్ది అయితే కర్నాటక సంగీత సంప్రదాయం దక్షిణ భారతంలో అభివృద్ది అయ్యింది. హిందుస్తానీ సంగీత స్రవంతి చరిత్ర మూలాలు 13వ శతాబ్దం నుండే దొరుకుతాయి. అయితే ఆధునిక హిందుస్తానీ సంగీత సంప్రదాయాలు ఘరానాలుగా స్థిరపడటం మాత్రం 18వ శతాబ్దం చివరి దశాబ్దాలలోలేదా 19వ శతాబ్దం తొలి దశాబ్దాలలో మనకు కనబడుతుంది. హిందుస్తానీ సంగీత సంప్రదాయంలో ప్రధానంగా ఖాయాల్‍,  దృపద్‍, టుమ్రీ గాయన శైలిలు కనిపిస్తాయి. ఇవి గాక మరికొన్ని ఉప శాస్త్రీయ, లోక్‍ సంగీత్‍ (జానపద సంగీత రీతులు), గజల్‍, భజన్‍, నాట్య సంగీత్‍ తదితర గాన రీతులు కూడా కనిపిస్తాయి. అయితే దక్షిణాన పరిఢవిల్లిన కర్నాటక సంగీత శైలిలో ఇటువంటి ఘరానాలు స్థిరపడలేదు. కర్నాటక సంగీత శైలి శుద్ధ శాస్త్రీయమైన, క్రోడీకరించ బడిన గాయన శైలిలో లేదా రాగాల్లోనే పాడతారు. అందువలన వైవిద్యానికి, మార్పులకు తావులేక పోవడం వలన ఘరానాలుగా స్థిరపడటానికి అవకాశం లేకుండా పోయిందనేది పరిశోధకుల అభిప్రాయం. ఇక్కడ కూడా గురు శిష్య పరంపర మాత్రం కొనసాగుతున్నది.

హిందుస్తానీ సంగీత ఘరానాలు
(Schools of Hindustani Music)

హిందుస్తానీ సంగీతంలో ఖయాల్‍ గాయన శైలికి సంబందించి దాదాపు 10 సుప్రసిద్ద ఘరానాలు స్థిరపడి ఈనాటికీ కొనసాగుతున్నాయని హిందుస్తానీ సంగీత పరిశోధకులు తేల్చినారు. అట్లాగే  దృపద్‍, టుమ్రీ గాయన శైలికి కూడా ప్రత్యేక ఘరానాలు వెలసినాయని పరిశోధకులు గుర్తించినారు. అయితే ఖయాల్‍ ఘరానాలకు ఉన్న ప్రాధాన్యత మిగతా వాటికి లేదు. ఖయాల్‍ ఘరానాల సంగీత గాయన పద్దతులు, రీతులు, రాగాలు తదితర అంశాలపై ఇప్పటికే విస్తృతమైన పరిశోధనా సాహిత్యం వెలువడింది. హిందుస్తానీ సంగీతంలో ప్రసిద్ది చెందిన పది ఘరానాలు ఇవి. 1. గ్వాలియర్‍ ఘరానా 2. ఆగ్రా ఘరానా 3. కిరాణా ఘరానా 4. పాటియాలా ఘరానా 5. భేండీబాజార్‍ ఘరానా 6. జైపూర్‍ ఘరానా 7. రాంపూర్‍-సహాస్వాన్‍ ఘరానా 8. ఇండోర్‍ ఘరానా 9. మేవాటి ఘరానా 10. షామ్‍ చౌరాసియా ఘరానా. ఇవన్నీ మౌఖిక సంగీత సంప్రదాయాలకు సంబంధించిన ఘరానాలు. ఇవికాక సంగీత వాద్యాలైన తబలా, సితార్‍, సరోద్‍లకు కూడా ఘరానాలు స్థిరపడినాయి. అలాగే హిందుస్తానీ  నృత్య రీతులకు కూడా ఘరానాలు స్థిరపడినాయి.


ఘరానా అనే పదం ఘర్‍ అనే హిందీ/ఉర్దూ పదం నుంచి ఉద్భవించింది. ఘర్‍ అంటే ఇల్లు అనేది అందరికీ తెలిసిందే. ఒక ఇంటికి/వంశానికి/పరంపరకు కట్టుబడి తమ సంప్రదాయానికి సంబంధించిన సంగీత రీతులను తరం నుంచి తరానికి వ్యాప్తి చేయడం ఈ వ్యవస్థలో మనకు కనిపిస్తుంది. ఇది ఆ కుటుంబంలో వారసత్వంగానో లేదా గురు శిష్య పరంపరలో భాగంగానో తరతరాలుగా వ్యాప్తి చెంది ఘరానాలుగా స్థిరపడినాయి. కనీసం మూడు తరాలుగా వారి సంగీత సంప్రదాయాలు కొనసాగినట్టయితే వాటిని ఘరానాలుగా పరిశోధకులు గుర్తించారు. 19వ శతాబ్దంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సంస్థాన రాజుల ఆస్థానాల్లో ఇవి ఆదరణ పొంది స్థిరపడినాయి. అందుకే ఆ ఘరానాలు ఆయా ప్రదేశాల పేరు మీదనే ప్రసిద్ది చెందినాయి. వీటిలో గ్వాలియర్‍ ఘరానా హిందుస్తానీ సంగీత పరంపరలో అత్యంత పురాతనమైనదని పరిశోధకులు తేల్చినారు. గ్వాలియర్‍ ఘరానా మొఘల్‍ పాదుషా అక్బర్‍ పాలనా కాలంలోనే ప్రారంభం అయ్యిందని సంగీత పరిశోధకులు భావిస్తారు. అక్బర్‍ దర్బారులో బాబా గోపాల్‍ దాస్‍, స్వామి హరిదాస్‍, తాన్‍ సేన్‍, బైజు బావ్రా మొదలైన సంగీత విద్వాంసులు ఉండేవారు. వారి వారసత్వం గ్వాలియర్‍ సంస్థాన పాలకుడైన రాజా మాన్‍ సింగ్‍ తోమర్‍ పరిపాలనా కాలంలో ఉచ్చ దశకు చేరుకొని అదొక ఘరానాగా స్థిరపడిందని పరిశోధకులు నిర్ధారించారు. భారతీయ సంగీతం కొనసాగింపు వారి గురు శిష్య పరంపరతో ముడిపడి ఉన్నది. అది భారతీయ శాస్త్రీయ సంగీతం అప్రతిహాతంగా కొనసాగటానికి కారణమైంది. ఆ వివరాలు చూస్తే భారతీయ సహజీవన సంస్కృతి మతాలకు అతీతంగా మన జీవితాల్లో ఎట్లా పెనవేసుకు పోయిందో తెలుస్తుంది. ఇప్పుడు హిందుస్తానీ ఘరానాల్లో మూల పురుషులు ఎవరు? వారి శిష్యగణంలో ఎవరు ఉన్నారు అనేది చూద్దాం.


గ్వాలియర్‍ ఘరానా :

గ్వాలియర్‍ ఘరానా వ్యవస్థాపకులుగా అన్నదమ్ములైన ఉస్తాద్‍ హస్సు ఖాన్‍, ఉస్తాద్‍ హద్దు ఖాన్‍, ఉస్తాద్‍ నత్తు ఖాన్‍లను పరిశోధకులు గుర్తించారు. వీరి శిష్య పరంపరలో బాల కృష్ణ బువా ఇచల్‍ కరంజీకర్‍, వినాయక రావ్‍ పట్వర్ధన్‍, విష్ణు దిగంబర్‍ పలుస్కర్‍, డి.వి పలుస్కర్‍, నారాయణ్‍ రావ్‍ వ్యాస్‍, ఓంకార్‍ నాథ్‍ ఠాకూర్‍, మాలినీ రాజుర్కర్‍ మొదలైన వారు ప్రసిద్ది గాంచిన హిందుస్థానీ గాయకులు. గ్వాలియర్‍ ఘరానా గాయన శైలిని ఈనాటి తరంలో వీణా సహాస్ర బుద్ది, సునంద పట్నాయక్‍, రాజూభయ్యా పూచ్‍ వాలే,  కృష్ణారావ్‍ శంకర్‍ పండిట్‍, ఉల్లాస్‍ కషాల్కర్‍ మొదలైన వారు ఇంకా సమున్నతంగా కొనసాగిస్తునారు.


కిరాణా ఘరానా :
కిరాణా ఘరానా వ్యవస్థాపకులు అబ్దుల్‍ కరీం ఖాన్‍ మరియు అబ్దుల్‍ వహీద్‍ ఖాన్‍ సోదరులు. అబ్దుల్‍ కరీం ఖాన్‍ శిష్య గణంలో సవై గంధర్వ, సురేష్‍ బాబు మానే, హీరాబాయి బరోడేకర్‍, రోషనారా బేగం, రామకృష్ణ శిరోద్కర్‍, ప్రభ ఆత్రే ఉన్నారు. సవై గంధర్వ శిష్యులలో గంగూబాయి హంగల్‍, భీమ్‍ సేన్‍ జోషి, బసవరాజ్‍ రాజ్‍ గురు మొదలైన గాయకులు ప్రసిద్ది గాంచినారు. హిందీ సినిమా గాయకుడు మహమ్మద్‍ రఫీ ఉస్తాద్‍ వహీద్‍ ఖాన్‍ శిష్యుడే. అందువల్లనే బైజు బావరా లాంటి సంగీత ప్రధాన చిత్రాల్లో కూడా శాస్త్రీయ సంగీత బాణీల్లో రఫీ గొప్పగా పాటలు పాడి సంగీత ప్రియుల మన్ననలు పొందాడు. కిరాణా ఘరానా గాయకుల్లో పండిత్‍ భీమ్‍ సేన్‍ జోషి దేశ వ్యాప్తంగా విస్తృత ప్రజాదరణ పొందిన కళాకారుడు. తన పరమ గురువు అబ్దుల్‍ కరీంఖాన్‍ లాగా పాడాలని తపించి 11 ఏండ్ల వయసులోనే ఇంటి నుంచి పారిపోయి కలకత్తా, డిల్లీ, పాటియాలా తిరిగి అష్ట కష్టాలు పడి ఆఖరుకు ఉస్తాద్‍ అబ్దుల్‍ కరీంఖాన్‍ శిష్యుడైన పండిత్‍ సవై గంధర్వ వద్ద శిష్యరికం చేసి గురువులను మించిన శిష్యుడైనాడు. 13, 14 శతాబ్దాలలో మహారాష్ట్రలో వెల్లి విరిసిన భక్తి ఉద్యమానికి ఆద్యులయిన సంత్‍లు జ్ఞానేశ్వర్‍, ఏక్‍ నాథ్‍, నాందేవ్‍, తుకారాం తదితరుల సంతవాణీ లేదా అభంగాలను పాడి వారిని అజరామరం చేసినాడు. హిందుస్తానీ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో భారత రత్న పురస్కారాన్ని పొందిన తొలి గాయకుడు బీమ్‍ సేన్‍ జోషి. (గాత్ర సంగీతంలో మొదటి భారత రత్న పురస్కారం పొందిన గాయని ఎం.ఎస్‍.సుబ్బులక్ష్మి. అయితే ఆమె కర్నాటక గాయన శైలికి చెందిన కళాకారిణి) ఆయన కిరాణా ఘరానా కీర్తి ప్రతిష్టలనే కాదు హిందుస్తానీ సంగీతానికి గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టాడు..

పాటియాలా ఘరానా :
పాటియాలా ఘరానా వ్యవస్థాపకులు ఉస్తాద్‍ ఫతే అలీ ఖాన్‍ మరియు ఉస్తాద్‍ అలీ బక్ష్. ఉస్తాద్‍ అలీ బక్ష్ కుమారుల్లో ఇద్దరూ.. బడే గులాం అలీ ఖాన్‍, బర్కత్‍ అలీ ఖాన్‍ తండ్రి నుంచి గాయన రీతులను, రాగాలను నేర్చుకున్నారు. ఉస్తాద్‍ బడే గులాం అలీ ఖాన్‍ కుమారుడు మునవ్వర్‍ అలీ ఖాన్‍, మనవడు రజా అలీ ఖాన్‍ పాటియాలా ఘరానా శైలిని కొనసాగించినారు. మునవ్వర్‍ అలీ ఖాన్‍ శిష్యుడు అజోయ్‍ చక్రబర్తి, ఆయన శిష్యురాలు కౌశికి చక్రబర్తి పాటియాలా ఘరానా గాయన శైలిని కొనసాగి స్తున్నారు. బడే గులాం అలీ ఖాన్‍ హిందుస్తానీ సంగీత ప్రపంచంలో మేరు నగధీరుడు. పాటియాలా ఘరానాలో ఖయాల్‍ గాయనంతో పాటూ టుమ్రీలు పాడే సంప్రదాయం కూడా ఉన్నది. బడే గులాం అలీ ఖాన్‍ టుమ్రీలు దేశ వ్యాప్తంగా ప్రజాదరణ పొందినాయి. దేశంలోని అన్నీ ప్రాంతాల్లో ఉస్తాద్‍ బడే గులాం అలీ ఖాన్‍ సంగీత కచేరీలు జరిగేవి. దేశానికి స్వాతంత్య్రం రాక మునుపే ఉస్తాద్‍ సంగీత ప్రావీణ్యత సంగీత రసజ్ఞులకు తెలిసింది. ఒకసారి మద్రాస్‍ నగరంలో ఆయన సంగీత కచేరీ జరిగినప్పుడు కార్యక్రమ నిర్వాహకుడైన కర్నాటక సంగీత విద్వాంసుడు జిఎన్‍ బాలసుబ్రమణ్యం ఉస్తాద్‍కు సన్మానం చేసి పాదాభివందనం చేసాడట. సద్బ్రాహ్మణుడైన ఆయన ఒక ముసల్మాన్‍కు పాదాభివందనం చేయడం పట్ల విమర్శలు చెలరేగినవి. నేను ఆయనలో మూర్తీభవించిన సంగీత సరస్వతికి పాదాభివందనం చేశానని వినమ్రంగా జవాబు ఇచ్చాడట జి.ఎన్‍ బి.ఉస్తాద్‍ సంగీత కచేరీ ముగిసిన తర్వాత ఆయన గాయనానికి పరవశం చెందిన సభాసదులు కూడా ఉస్తాద్‍ లోని సంగీత సరస్వతికి నమస్కారం చేశారట. ఈ ఉదంతాన్ని సామల సదాశివ గారు స్వరలయలు పుస్తకంలో ప్రస్తావించినారు. కర్నాటక సంగీత విదుషీమణి ఎం.ఎస్‍ సుబ్బులక్షి ఉస్తాద్‍ను తన సోదర సమానుడిగా భావించేది. ఆయన మద్రాస్‍ నగరం వచ్చిన ప్రతీసారి సుబ్బులక్ష్మి ఆతిథ్యం తప్పక స్వీకరించేవాడు. దేశ విభజన తర్వాత ఉస్తాద్‍ లాహోర్‍ వదలి భారత దేశానికి వచ్చాడు. ఆనాటి ప్రధాన మంత్రి జవహర్‍ లాల్‍ నెహ్రూ ఉస్తాద్‍కు భారత పౌరసత్వాన్ని ఇచ్చి గౌరవించినారు. ఉమ్మడి బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్‍ ఉస్తాద్‍కు ముంబాయిలో మాహీమ్‍ సముద్ర తీరాన ఒక బంగాళా సమకూర్చి ఆ మహా కళాకారునికి సముచిత గౌరవాన్ని యిచ్చినాడు. ఆనాటి నుంచి దేశమంతా తిరిగి వందలాది సంగీత కచేరీలు నిర్వహించి, పదుల సంఖ్యలో శిష్యులను తయారు చేసి పాటియాలా ఘరానా గాయన శైలిని అజరామరం చేసినాడు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న పాకిస్తానీ గజల్‍ గాయకుడు ఉస్తాద్‍ గులాం అలీ బడే ఖాన్‍ సాహెబ్‍ శిష్యుడే. ఉస్తాద్‍ బడే సాహెబ్‍ పాడిన హంసద్వని రాగం వినడం ఒక అద్భుతమైన అనుభవం. ఆఫ్ఘనిస్తాన్‍ రాజు ఉస్తాద్‍ బడే సాహెబ్‍ సంగీతానికి ముగ్ధుడై తన ఆస్థాన సంగీత విద్వాంసుడిగా ఉండి పోవలసిందిగా ఆయనను కోరినాడట. కానీ భారత దేశం పట్ల ప్రేమతో ఆ పదవిని నిరాకరించాడు ఉస్తాద్‍. తాను జన్మించినది భారత దేశంలో, సంగీత విద్యలో పాండిత్యాన్ని గడించింది భారత దేశంలో. అందు వలన భారత దేశానికి సేవ చేస్తూ ఈ నేల మీదనే కన్ను మూయాలని ఆయన భావించాడు. అదే జరిగినది కూడా.


భేండి బాజార్‍ ఘరానా :
భేండి బాజార్‍ ఘరానా వ్యవస్తాపకులు ఉస్తాద్‍ దిలావర్‍ హుస్సేన్‍ ఖాన్‍ కుమారులైన ఉస్తాద్‍ ఛజ్జు ఖాన్‍, ఉస్తాద్‍ నజీర్‍ ఖాన్‍, ఉస్తాద్‍ ఖాదిమ్‍ హుసేన్‍ ఖాన్‍లు. వీరి పూర్వీకులు ఉత్తరప్రదేశ్‍ లోని మొరాదాబాద్‍ దగ్గర ఉన్న బిజనౌర్‍కు చెందినవారు. వీరు 1870 లో తమ నివాసాన్ని బొంబాయి నగరానికి మార్చినారు. వీరు ఉండే ప్రదేశం బొంబాయి కోట వెనుక ఉంటుంది. బ్రిటిష్‍ వారు ‘‘behind the bazar’’ అనేవారు. జనం నోళ్లలో అది కాస్తా భేండి బాజార్‍ గా మారిపోయింది. ఈ ముగ్గురు సోదరులు సంగీతాన్ని తమ తండ్రి దిలావర్‍ హుస్సేన్‍ ఖాన్‍ నుంచి నేర్చుకున్నారు. ఆ తర్వాత వారు తమ స్వంత గాయన శైలిని రూపొందించుకొని దాన్ని భేండి బాజార్‍ ఘరానాగా అభివృద్ది చేశారు. బొంబాయి నగరంలో నివసించే శాస్త్రీయ సంగీత ప్రేమికులు వారి వద్ద శిష్యరికం చేశారు. రెండో తరంలో ఛజ్జు ఖాన్‍ కుమారుడైన ఆమన్‍ అలీ ఖాన్‍, ఉస్తాద్‍ షామీర్‍ ఖాన్‍ (ఇండోర్‍ ఘరానాకు పితామహుడిగా ప్రఖ్యాతి గాంచిన ఉస్తాద్‍ అమీర్‍ ఖాన్‍ తండ్రి), చాంద్‍ ఖాన్‍, ఖాదర్‍  బక్ష్, మమ్మన్‍ ఖాన్‍, జందె ఖాన్‍, అంజనీబాయి మాల్పేకర్‍, మూడో తరంలో ఆమన్‍ అలీ ఖాన్‍ శిష్యులు లతా మంగేష్కర్‍, అమీర్‍ ఖాన్‍ (ఇండోర్‍ ఘరానా పితామహుడు), నిసార్‍ బజ్మీ, వసంత రావ్‍ దేశ పాండే,వలి అహ్మద్‍ ఖాన్‍, చైతన్య దేవ్‍, పురుషోత్తమ్‍ బువా పర్సేకర్‍, మాస్టర్‍ నవరంగ్‍ తదితరులు భేండి బాజార్‍ గాయన శైలిని కొనసాగింప జేసినారు. నాల్గవ తరంలో అంజనీ బాయి మాల్పేకర్‍ దగ్గర శిష్యరికం చేసిన వారిలో కుమార్‍ గంధర్వ, కిశోరి ఆమోన్కర్‍, బేగం అఖ్తర్‍, నైనాదేవి మొదలైన వారు భేండి బాజార్‍ గాయకులుగా చరిత్రలో నిలచి పోయారు. మాస్టర్‍ నవరంగ్‍ వద్ద శిష్యరికం చేసన వారిలో ఆశా భోంస్లే, పండిత్‍ జితేంద్ర అభిషేక్‍, పండిత్‍ విఆర్‍ అత్వాలే, సుమన్‍ కళ్యాణ్‍ పురి, పంకజ్‍ ఉదాస్‍ మొదలైన వారు శుద్ద శాస్త్రీయ గాయనం లోనూ, ఉప శాస్త్రీయ గాయనంలో, సినిమా సంగీతంలో కూడా రాణించినారు. పంకజ్‍ ఉదాస్‍ గజల్‍ గాయనంలో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించినాడు.


జైపూర్‍ ఘరానా :
జైపూర్‍ ఘరానా వ్యవస్థాపకుడు ఉస్తాద్‍ అల్లాదియా ఖాన్‍. జైపూర్‍ ఘరానాలో కేషరీబాయి కేర్కర్‍, మోగుబాయి కుర్దీకర్‍, మల్లికార్జున్‍ మన్సూర్‍, వినాయక రావ్‍ కుల్కర్ణి, అశ్విని భిడే, పద్మావతి గోఖలే, ఆరతి అంకాలీకర్‍,  శృతి సడోలికర్‍,పద్మ తల్వాల్కర్‍ మొదలైన వారు జైపూర్‍ ఘరానా గాయన శైలిని ముందు తరాలకు అందిస్తున్నారు.


మేవాటి ఘరానా :

మేవాటి ఘరానా వ్యవస్థాపకుడు ఉస్తాద్‍ ఘగ్గే నజీర్‍ ఖాన్‍. వీరి పూర్వీకులు గ్వాలియర్‍కు చెందినవారే. తండ్రి మరణం తర్వాత నజీర్‍ ఖాన్‍ జైపూర్‍ సంస్థానంలో జోద్‍పూర్‍కు తన నివాసాన్ని మార్చినాడు. ఆయన రూపొందించిన గాయన శైలి మేవాటి జైపూర్‍ ఘరానాగా పేరుగాంచింది. రెండో తరంలో పండిత్‍ చిమన్‍ లాల్‍, పండిత్‍ నత్తులాల్‍, మునవ్వర్‍ అలీ ఖాన్‍, మూడో తరంలో పండిత్‍ నత్తులాల్‍ మేనల్లుళ్లు పండిత్‍ మోతీరామ్‍, పండిత్‍ జ్యోతిరామ్‍, నాల్గవ తరంలో పండిత్‍ మోతిరామ్‍ కుమారులు మణిరామ్‍, ప్రతాప్‍ నారాయణ్‍, జ్యోతిరామ్‍ కుమారుడు పండిత్‍ పూర్ణచంద్ర, ఐదవ తరంలో పండిత్‍ మోతిరామ్‍ చిన్న కుమారుడు పండిత్‍ జస్‍రాజ్‍ తదితరులు మేవాటి జైపూర్‍ ఘరానా గాయన శైలికి ప్రతినిధులుగా చరిత్రలో నిలచిపోయారు. పండిత్‍ జస్‍ రాజ్‍ ఆగమనంతో జైపూర్‍ ఘరానాకు ప్రపంచ వ్యాప్త ప్రాచుర్యం లభించిందని పరిశీలకుల భావన. పండిత్‍ జస్‍ రాజ్‍ తండ్రి పండిత్‍ మోతీరాం కొద్ది కాలం హైదరాబాద్‍ సంస్థానంలో కూడా నివసించాడు. ఇక్కడ ఉండగానే పండిత్‍ మోతీరాం దివంగతుడైనాడు. ఆయన అంత్యక్రియలు కూడా హైదరాబాద్‍ లోనే జరిగాయి. హైదరాబాద్‍ లో ఒక రోడ్డుకు పండిత్‍ మోతీరాం పేరు పెట్టడం జరిగింది. తన తండ్రి స్మారకార్థం పండిత్‍ జస్‍ రాజ్‍ ప్రతి ఏటా హైదరాబాద్‍ నగరంలో పండిత్‍ మోతీరాం స్మారక సంగీతోత్సవాలను నిర్వహించాడు.


ఆగ్రా ఘరానా :
ఆగ్రా ఘరానా గాయకుల మూలాలు 13వ శతాబ్దానికి చెందిన నౌబర్‍ బాణీ తో ముడిపడినవి. నౌబర్‍ బాణీ మూలపురుషుడు నాయక్‍ గోపాల్‍ దాస్‍. ఈయన ప్రఖ్యాత ఉర్దూ కవి అమీర్‍ ఖుస్రూ సమకాలికుడు. అక్బర్‍ పాదుషా కాలంలో హాజీ సుజాన్‍ ఖాన్‍ నుండి ఇది ఆగ్రా ఘరానాగా స్థిరపడింది. ఈయన అక్బర్‍ దర్బారులో ఉన్న తాన్‍ సేన్‍ సమకాలికుడు. ఆ తర్వాత తరం నుంచి తరంకు కుటుంబ వారసత్వంగా లేదా శిష్య పరంపరగా ఆగ్రా ఘరానా గాయన శైలి వ్యాప్తి చెంది ఈనాటికీ నిలచి ఉన్నది. ఉస్తాద్‍ ఘగ్గే ఖుదా బక్ష్, ఫయ్యాజ్‍ ఖాన్‍, లతాఫత్‍ హుస్సేన్‍ ఖాన్‍, జొహరా బాయి, వసీం అహ్మద్‍ ఖాన్‍, భారతి ప్రతాప్‍, దినకర్‍ కైకిని, లలిత రావ్‍ మొదలైన వారు ఆగ్రా ఘరానా గాయకులుగా ప్రసిద్ది పొందినారు. తొలి తరం సినిమా గాయకుల్లో ప్రసిద్దుడైన కుందన్‍ లాల్‍ సైగల్‍ ఉస్తాద్‍ ఫయ్యాజ్‍ ఖాన్‍ శిష్యుడే,


రాంపూర్‍ సహస్వాన్‍ ఘరానా :
ఉత్తర ఉత్తరప్రదేశ్‍కు చెందిన రాంపూర్‍ మరియు సహాస్వాన్‍ పట్టణాలకు ఈ ఘరానా గాయకులతో సంబంధం ఉన్నందున ఆ పేరు స్థిరపడింది. ఈ ఘరానా ఇటీవలి కాలంలోనే ప్రాశస్త్యం పొందడం మొదలయ్యిందని సంగీత పరిశీలకులు భావిస్తారు. ఈ ఘరానాకు ఆద్యుడు ఉస్తాద్‍ ఇనాయత్‍ ఖాన్‍. నిసార్‍ హుస్సేన్‍ ఖాన్‍, గులాం ముస్తఫా ఖాన్‍, రషీద్‍ ఖాన్‍, సులోచనా బృహస్పతి, పండిత్‍ గణపత్‍ రావ్‍, అరుణ్‍ భాదురి మొదలైన వారు ఈ ఘరానా గాయకులుగా వెలుగొందినారు.


ఇండోర్‍ ఘరానా :
భేండి బాజార్‍ ఘరానా గాయకుడిగా శిక్షణ పొందిన అమీర్‍ ఖాన్‍ ఇండోర్‍ ఘరానాకు పితామహుడిగా సంగీత పరిశీలకులు భావిస్తారు. అమీర్‍ ఖాన్‍ తనదైన ప్రత్యేక గాయన శైలిని రూపొందించి దాన్ని ఇండోర్‍ ఘరానాగా స్థిరపరచినాడు. అమీర్‍ ఖాన్‍ శిష్యులలో సుల్తాన్‍ ఖాన్‍, సింగ్‍ బంధు, పండిత్‍ అమర్‍ నాథ్‍ ఇండోర్‍ ఘరానా గాయన శైలిని కొనసాగిస్తున్నారు.
ఈ ఘరానాల గురు శిష్య పరంపరను చూసినప్పుడు మతాల ప్రసక్తి లేకుండానే ఆయా ఘరానాల సంగీత వారసత్వం తరం నుంచి తరానికి అందుతూ వస్తున్నదని తెలుస్తున్నది. ఈ ఘరానాల వ్యవస్థాపకులు లేదా మూల పురుషులు అందరూ ముస్లింలే కావడం గమనార్హం. వారి శిష్యగణంలో ముస్లింలు, హిందువులు కూడా ఉన్నారని తెలుస్తున్నది. ముస్లింలు అయినా కూడా భక్తిరస ప్రేరితమైన భజనలు, టుమ్రీలు, అభంగాలు నిరభ్యంతరంగా గాయనం చేసినారు. హిందుస్తానీ సంగీతంలో కృష్ణ ప్రేమ ఒక ప్రధానమైన స్రవంతిగా ఉన్నదని సామల సదాశివ గారు స్వరలయలు పుస్తకంలో రాసినారు. పర్వీన్‍ సుల్తానా నొసటిపై రూపాయంత బొట్టుపెట్టుకొని, కళ్ళకు కాటుక పెట్టుకొని, సిగలో మల్లె పూలు తురుముకొని కచేరీలో ‘‘రసియా మోహె బులాయే- నైనా నీర్‍ బహాయే’’ అంటూ కృష్ణుడిని తలచు కుంటూ గోపిక విరహ తాపాన్ని వర్ణిస్తూ టుమ్రీ పాడుతున్నప్పుడు ఆమె ఈ లోకంలో ఉండదు. యమునా తీరంలో కృష్ణుడి కోసం పరితపించే గోపికగా మారిపోతుంది. ఆమె చెంపల వెంబడి కన్నీరు ధారలు కడుతుంది. టుమ్రీ గాయనంలో ఆమె తాదాత్మ్యం అటువంటిది అని సదాశివ గారు వర్ణన చేశారు. ఈ గురు శిష్య పరంపర మతాలకు అతీతంగా కొనసాగడమే కాదు కళాకారుల మధ్య వైవాహిక సంబంధాలు కూడా జరిగేవి.


వాద్య కళాకారుల గురు శిష్య పరంపర :
వాద్య సంగీత కళాకారుల్లో ఉస్తాద్‍ అల్లాఉద్దీన్‍ ఖాన్‍ సుప్రసిద్దులు. కలకత్తాలో రామక్రిష్ణ పరమహంస వద్ద ఆశ్రయం పొందాడు. అల్లావుద్దీన్‍ ఖాన్‍ అన్నీ రకాల వాద్యాలు.. రబాబ్‍, సితార్‍, సరోద్‍, ఫ్లూట్‍ తదితర సంగీత వాద్యాలను సాధికారికంగా వాయించే వాడు. ఉస్తాద్‍ మహమ్మద్‍ అలీ వద్ద సరోద్‍ వాదన నేర్చుకొన్నాడు. అయితే ఆయనకు అన్ని వాద్యాలలో ప్రావీణ్యం ఉండటం విశేషం. అతని కొడుకు ఉస్తాద్‍ అలీ అక్బర్‍ ఖాన్‍ కూడా సరోద్‍ వాద్య కళాకారుడిగా ఎదిగినాడు. అతని శిష్యుడు పండిత్‍ రవిశంకర్‍ ప్రఖ్యాత సితార్‍ వాద్య కళాకారుడిగా ఎదిగి భారత రత్న పురస్కారాన్ని పొందినాడు. అల్లా ఉద్దీన్‍ ఖాన్‍ను బీహార్‍ రాష్ట్రంలో ఉన్న మైహర్‍ సంస్థాన పాలకుడు మహారాజా బ్రజ్‍ నాథ్‍ సింగ్‍ తన దర్బారులో ఆస్థాన విద్వాంసుడిగా నియమించుకున్నాడు. అల్లా ఉద్దీన్‍ ఖాన్‍కు కుమార్తె పుట్టినప్పుడు బ్రజ్‍ నాథ్‍సింగ్‍ ఆమెకు అన్నపూర్ణ అని పేరు పెట్టాడు. కూతురు అన్నపూర్ణను తన శిష్యుడురవిశంకర్‍ కు ఇచ్చి వివాహం జరిపించాడు. ఒక కుమారుడు కలిగినాక వారు విడిపోయి నారు. ఆమె కూడా తండ్రి నుంచి అన్నిరకాల వాద్యాలను నేర్చుకున్నది. ఫ్లూట్‍ కళా కారుడు హరిప్రసాద్‍ చౌరాసియా ఆమె శిష్యుడే. సుధీర్‍ ఫడ్కే ఆమె వద్ద గాత్ర సంగీతం నేర్చుకున్నాడు. దేశంలో వాద్య సంగీత కళాకారులందరూ ఉస్తాద్‍ అల్లాఉద్దీన్‍ ఖాన్‍, ఉస్తాద్‍ అలీ అక్బర్‍ఖాన్‍, పండిత్‍ రవిశంకర్‍, అన్నపూర్ణా దేవి శిష్యులే కావడం గమనార్హం. సరోద్‍ వాదనంలో గ్వాలియర్‍కు చెందిన ఉస్తాద్‍ హఫీజ్‍ అలీఖాన్‍ కూడా ప్రసిద్దుడు. ఆయన పెద్ద కుమారుడు ముబారక్‍ అలీ ఖాన్‍ కూడా సరోద్‍ వాదనంలో తండ్రిని మించిన వాడు. చిన్న కుమారుడు మనమందరం ఎరిగిన ఉస్తాద్‍ అంజద్‍ అలీ ఖాన్‍ సరోద్‍ వాదనంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినాడు. జైపూర్‍ ఘరానా వ్యవస్థాపకుడు ఉస్తాద్‍ ఇనాయత్‍ ఖాన్‍ పెద్ద కొడుకు ఉస్తాద్‍ విలాయత్‍ ఖాన్‍ సితార్‍ వాద్య కళాకారుడిగా ఎదిగినాడు.

అతని తమ్ముళ్ళు ఇమ్రత్‍ ఖాన్‍, ఇర్షాద్‍ ఖాన్‍లు కూడా సితార్‍ విద్వాంసులుగా ప్రసిద్ది పొందినారు. విలాయత్‍ ఖాన్‍ కొడుకు షాహిద్‍ పర్వెజ్‍ కూడా సితార్‍ వాదనంలో ఆరితేరిన కళాకారుడు. తబలా కళా కారుల్లో ఉస్తాద్‍ అహమద్‍ తిరఖ్వా, అతని కొడుకు అల్లారఖా, అతని కొడుకు జాకీర్‍ హుస్సేన్‍ (వహతాజ్‍ ప్రకటనలో కనిపించేది ఇతనే) ప్రసిద్దులు. షేక్‍ దావూద్‍, పండిత్‍ సామ్తా ప్రసాద్‍, పండిత్‍ కిషన్మహారాజ్‍ మొదలైనవారు తబలా వాదకులుగా ప్రసిద్దమైనారు. షహనాయి వాద్య కళాకారుడు ఉస్తాద్‍ బిస్మిల్లా ఖాన్‍ గురించి మొదట్లో కొంత చెప్పుకున్నాము. శుభ కార్యాలలో, పూజా కార్యాలలో, వివాహ సమయాల్లోనే వాయించే షహనాయి వాద్యానికి శాస్త్రీయ సంగీత వాద్య దర్జాను కలిగించడంలో ఉస్తాద్‍ బిస్మిల్లా ఖాన్‍ కృషి వెలకట్టలేనిది. ఆయన అన్నీ రకాల వాద్య కళాకారులతో.. ఉస్తాద్‍ విలాయత్‍ ఖాన్‍ (సితార్‍), పండిత్‍ వి జి జోగ్‍ (వయొలిన్‍), ఉస్తాద్‍ అంజద్‍ అలీ ఖాన్‍ (సరోద్‍), గంగూ బాయి హంగాల్‍ (గాత్రం) మొదలైన వారితో జుగల్‍ బందీలు నిర్వహించి శ్రోతలను అలరించినాడు. హిందుస్తానీ వాద్య సంగీత కళాకారుల్లో భారత రత్న పురస్కారం పొందిన వారిలో బిస్మిల్లా ఖాన్‍ రెండో వాడు. మొదటి పురస్కారం సితార్‍ వాదకుడు పండిత్‍ రవిశంకర్‍ కు దక్కింది.


మధ్య యుగాల్లో ప్రభవిల్లిన భక్తి ఉద్యమం – సూఫీయిజం :

12, 13వ శతాబ్దాలలో దేశంలో భక్తి ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఈ ఉద్యమానికి ఆద్యులు శూద్ర కులాలకు చెందిన సంత్‍లు. వీరు బ్రాహ్మణీయ కుల అణిచివేతకు, వివక్షకు వ్యతిరేకంగా ఉత్తర భారతంలో కబీర్‍ (ముస్లిం), గురునానక్‍ (సిక్కు), తులసీదాస్‍, రవిదాస్‍ (దళిత) తదితరులు, దక్షిణాదిన బసవడు, బ్రహ్మంగారు, వేమన, దున్న హనుమద్దాసు, తూము నరసింహదాసు, రామదాసు తదితరులు గళం ఎత్తారు. అట్టడుగు కులాల నుంచి వచ్చిన వీరు తమ సాహిత్యంతో, ఉపదేశాలతో, సంగీతంతో సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. మహారాష్ట్రలో భక్తి ఉద్యమానికి ఆద్యులైన సంత్‍ లు జ్ఞానేశ్వర్‍, నాందేవ్‍, ఏక్‍ నాథ్‍, తుకారాంమొదలైన వారు శూద్ర కులాలకు చెందినవారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో విఠల లేదా విఠోబ కల్ట్ ఈ భక్తి ఉద్యమానికి చోదక శక్తిగా పని చేసింది. ఇది వార్కరీ సంప్రదాయంగా మహారాష్ట్రాలో పర్గానచ్చింది. వీరు శాస్త్రీయ సంగీత రాగాలలో వేల సంఖ్యలో అభంగాలు రచించి గానం చేశారు. ఈ అభంగాలు విఠోబా కల్ట్లోకి కుల మతాలకు అతీతంగా విస్తృత ప్రజానీకాన్ని సమీకరించడానికి దోహదం చేసినాయి. వార్కరి సాంప్రదాయంలోకి స్త్రీలు, శూద్రులు, ముస్లింలు, అంటరాని కులాల ప్రజలు పెద్ద ఎత్తున చేరినారు. వార్కరి భక్తి ఉద్యమంలో సంత్‍ నాందేవ్‍ ఇంట్లో పని మనిషిగా ఉన్న జానాబాయి, సేనా (మంగలి), నరహరి (అవుసలి), గోరా (కుమ్మరి), సవట (తంబలి), చోఖామేల (మహార్‍), షేఖ్‍ మహమ్మద్‍ (ముస్లిం) కూడా విఠోబా కీర్తనలు రాసి, పాడి వార్కరీ ఉద్యమానికి దోహదం చేసినారు. బ్రాహ్మణీయ కుల వివక్షను అధిగమించనికి వార్కరి ఉద్యమం ఆనాటి ప్రజానీకానికి ఆలంబనగా మారింది. మహారాష్ట్రలో శాస్త్రీయ సంగీతం ఈనాటికీ నిలదొక్కు కోవడానికి వార్కరీ ఉద్యమకారుల కృషి దోహదం చేసినదని సదాశివ గారు అభిప్రాయపడినారు.


దాదాపు అదే సమయంలో ఉత్తర భారతంలో సూఫీ ఋషులు ఇస్లాం మత ప్రచారాన్ని ప్రారంభించారు. సూఫీలదీ పూర్తి భక్తి భావన, సేవా భావనతో కూడిన ప్రచారం. సంగీత రస ప్రధాన బోధనలతో కుల మతాలకు అతీతంగా మనుషుల మధ్య ప్రేమ భావనలను, సమానత్వ భావనలను ప్రోధి చేసారు. ప్రజల మధ్యనే సాదాసీదా జీవనంతో, వారికి వైద్య సేవలు, ఆధ్యాత్మిక బోధనలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందినారు. ఖ్వాజా మొయినుద్దీన్‍ చిస్తి ద్వారా ఆజ్మీర్‍లో స్థిరపడిన సూఫీ సంప్రదాయం ఆయన శిష్యుల ద్వారా దేశమంతా వ్యాపించింది. మొయినుద్దీన్‍ శిష్యుడు బాబా ఫరీదుద్దీన్‍ ద్వారా సూఫీ భక్తి ఉద్యమం పంజాబ్‍ హర్యానా ప్రాంతాలకు వ్యాపించింది. బాబా ఫరీదుద్దీన్‍ శిష్యుడు నిజాముద్దీన్‍ ఔలియా ఢిల్లీలో ఆశ్రమం స్థాపించి సూఫీ తత్వాన్ని ప్రచారం చేశాడు. నిజాముద్దీన్‍ ఔలియా శిష్యులు దక్షిణ భారతంలో సూఫీ తత్వాన్ని ప్రచారం చేశారు. సూఫీ రుషులు దేశంలో అనేక ప్రాంతాల్లో.. పాట్నా, లక్నో, భోపాల్‍, అహేమదా బాద్‍, ఔరంగాబాద్‍, గుల్బర్గా, హైదరాబాద్‍ తదితర ప్రాంతాల్లో ఆశ్రమాలు స్థాపించి వారి శిష్యులను దేశంలో ఇతర ప్రాంతాలకు పంపి సూఫీయిజాన్ని ప్రచారంలో పెట్టారు. వారి బోధనలకు ప్రభావితం అయి లక్షలాది మంది శూద్ర కులాల ప్రజలు ఇస్లాం మతాన్ని స్వచ్ఛందంగా స్వీకరించారని సామాజిక, చరిత్ర పరిశోధకులు నిర్ధారించినారు. దీన్ని బలవంతపు మత మార్పిడిగా చిత్రీకరించే ప్రయత్నం ఇటీవలి కాలంలో ఉదృతం అయ్యింది. అది చారిత్రిక అవాస్తవం. దేశంలో సూఫీ ఋషుల దర్గాలు వేల సంఖ్యలో ఉన్నాయి. అట్లే తెలంగాణలో సూఫీ ఋషుల దర్గాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. హైదరాబాద్‍లో జహాంగీర్‍ పీర్‍ దర్గా, నల్లగొండలో జాన్‍ పాడ్‍ దర్గా, నిర్మల్‍ ఘాట్ల వద్ద షేక్‍ సాబ్‍ దర్గా మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఈ దర్గాలకు హిందువులు ముస్లింలు మతాలకు, కులాలకు అతీతంగా మొక్కులు చెల్లించుకోవడానికి వెళతారు. దేశంలో సూఫీ ఋషుల ప్రభావం అపారం. తెలంగాణ ప్రాంతంలో కూడా సూఫీల ప్రభావం సుస్పష్టంగా ప్రజల జీవన విధానంలో కనిపిస్తుంది. అమీర్‍ ఖుస్రూ లాంతో సూఫీ కవులు ప్రేమ భావనలను ప్రచారం చేశారు. దేశంలో ప్రభవిల్లిన భక్తి ఉద్యమం, సూఫీయిజం రెండు మతాల మధ్య ఉన్న శత్రు భావనలను పూర్తిగా కాకున్నా చాలా మట్టుకు తగ్గించాయని చరిత్రకారుల అభిప్రాయం. రెండు మతాల మధ్య సోదర భావాన్ని, సహజీవన సంస్కృతిని పెంపొందించాయని వారు విశ్లేషిస్తున్నారు. మధ్య ఆసియా ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లింల దాడుల కారణంగా తలెత్తిన తొలినాటి శతృత్వాలు, వ్యతిరేకతలు, అపనమ్మకాలు ఈ భక్తి ఉద్యమాల ప్రభావాల ఫలితంగా తగ్గుముఖం పట్టాయి. రెండు మతాల ప్రజలు ఈ నేలపై కలసి జీవించే పరిస్థితి తప్పనిసరి అయినప్పుడు సోదర భావంతో సహజీవనం చేయడం తప్పదన్న చైతన్యాన్ని ఈ భక్తి ఉద్యమాలు ప్రజల్లో ప్రోది చేసినాయి. ఈ రెండు రకాలైన భక్తి ఉద్యమాల కారణంగా దేశంలో పరస్పర ప్రేరితమైన ఒక హిందుస్తానీ సంస్కృతి రూపొందినదని వారి అభిప్రాయం. అదే గంగా జమునా తెహజీబ్‍గా ప్రసిద్ది చెందినది. హిందుస్తానీ సంగీత స్రవంతులు రూపుదిద్దు కోవడానికి ఈ భక్తి ఉద్యమాలే ప్రేరణగా నిలచినాయి.


ఏకత్వంలో భిన్నత్వం :
ఇవి రేఖా మాత్రంగా ప్రస్తావించిన సహజీవన సాంస్కృతిక మూలాలు. భారత దేశ సంస్కృతి అంటే భిన్న మతాల, భిన్న భాషల, భిన్న ప్రాంతాల ప్రజల సంస్కృతి. ఆ భిన్నత్వమే ఈ దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టింది.1968లో హైదరాబాద్‍లో ఉస్తాద్‍ బడే గులాం అలీ ఖాన్‍ మరణించినప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికలో శ్రీ నార్ల వేంకటేశ్వర రావు సంపాదకీయంలో ఈ మాటలు రాశారు. ‘‘హిందూ మహమ్మదీయ మతాలు భిన్నమైనవి కాబట్టి, ఆ సంస్కృతులు భిన్నమైనవి కాక తప్పదని వాదించింది ఒక్క మహమ్మదలీ జిన్నామాత్రమే కాదు, ఒక వినాయక్‍ దామోదర్‍ సావర్కార్‍ మాత్రమే కాదు, అట్టివారు పెక్కు మంది ఇది వరలో ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. ఈ వాద తిరస్కృతికి ప్రధానంగా పేర్కొనదగింది హిందుస్తానీ సంగీతమే. కర్నాటక సంగీతం అన్య ప్రభావాలను కొన్నింటిని అంతర్లీనం చేసుకొనడం ద్వారా రూపొందినట్టిదే హిందుస్తానీ సంగీతం. హిందువుల వలె మహమ్మదీయులు భక్తి శ్రద్దలతో పరిపోషించడం ద్వారా పరిఢవిల్లినట్టిదే హిందుస్తానీ సంగీతం. కేవలం సంగీతంలోనే కాదు చిత్ర వాస్తు కళల్లో కూడా హిందూ ముస్లిం ప్రభావాల సమ్మేళనం ద్వారా కొత్త బాణీలు తలయెత్తాయి. ఇట్టి పరిణామాలకు దోహదం కూర్చినప్పుడే జాతి, మత, కుల, విభేదాలకు అతీతమైన సర్వాంగ సుందర భారతీయ సంస్కృతి పెంపొందుతుంది. మనం లక్షించవలసిన, సాధించ వలసిన ఈ సర్వాంగ సుందర భారతీయ సంస్కృతి పరిపోషణకై తన జీవితాన్ని సంగీత కళా రంగంలో ధారవోసిన మహనీయుడు ఉస్తాద్‍ బడే గులాం అలీ ఖాన్‍.’’ 1968లో రాసిన నార్ల వారి మాటలకు ఇప్పుడు కూడా ప్రాసంగికత మరింత పెరిగింది. ఎంత విషాదం!


భారత దేశం రంగు రంగుల పూలతో అల్లిన ఒక గుల్‍ దస్తా లాంటిది. ఇంకా అందంగా చెప్పాలంటే వివిధ రంగుల పూలతో నిర్మించే తెలంగాణ బతుకమ్మలాంటిది. ప్రముఖ చరిత్ర కారుడు, సామాజిక విశ్లేషకుడు శ్రీ రామచంద్ర గుహ ‘‘Impurity of Cultures’’ అనే వ్యాసంలో సుప్రసిద్ద కన్నడ రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ శివరామకారంత్‍ భారతీయ సంస్కృతిపై వెల్లడించిన అబిప్రాయాలను ప్రస్తావించినారు. ‘‘భారతీయ సంస్కృతి అనే కంటే సంస్కృతులు అంటేనే ఈ దేశ వైవిద్యాన్ని ప్రతిబింబిస్తుంది. పురాతన కాలం నుంచి కూడా భిన్నభిన్నదేశాలు, మతాలు, జాతుల ప్రజలతో సంబంధాలు, అనుబంధాలతో ఈ భిన్నత్వం భారత దేశంలో అబివృద్ది చెందింది. ఇందులో ఏది దేశీయం ఏది విదేశీయం అని చెప్ప లేనంతగా ఈ దేశ సంస్కృతిలో కలసిపోయినాయి.’’ నోబెల్‍ పురస్కార గ్రహీత, జాతీయ ప్రార్థనా గీతం రాసిన రబీంద్రనాథ్‍ టాగోర్‍ కూడా దాదాపు ఇదే రకమైన అభిప్రాయాలు వెల్లడించినారని రామచంద్ర గుహా పేర్కొన్నారు. ‘‘సుదూర ప్రాంతాల నుంచి భిన్న జాతుల ప్రజలు అలలు అలలుగా ఈ దేశానికి వచ్చారు.ఆర్యులు, ఆర్యేతరులు, ద్రావిడులు, చైనీయులు, శకులు, హూణులు, పఠాన్‍లు, మొగలులు ఈ పుణ్య గడ్డకు తరలి వచ్చారు. దీన్ని తమ జన్మభూమిగా గౌరవించారు. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఈ భిన్న జాతుల వారందరూ ఈ పుణ్య గడ్డపై ఏకమై ఒకే జాతిగా వర్ధిల్లుతున్నారు’’. శివరామ కారంత్‍, రబీంద్రనాథ్‍ టాగోర్‍ వర్ణించిన ఈ భిన్నత్వంలో ఏకత్వం హిందుస్తానీ సంగీత స్రవంతిలో మనం ప్రభలంగా చూడగలం. దీనినే ‘‘గంగా జమునా తెహాజీబ్‍’’గా అభివర్ణించారు సామాజిక విశ్లేషకులు. అది ధ్వంసం అయితే ఈ దేశ ప్రజల ఐక్యత, భారత దేశం యొక్క అస్తిత్వం దెబ్బ తింటుంది. మన దేశ ఏకత్వంలో ఉండే ఈ భిన్నత్వాన్ని కాపాడు కోవలసిన బాధ్యత ఈ దేశ పౌరులుగా మనందరిది. (గురు సమానులు కీ.శే సామల సదాశివ గారికి ప్రణామాలతో..)

శ్రీధర్‍రావ్‍ దేశ్‍పాండే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *