సూర్యమండలంలో కేంద్రమైన భానుడికి దగ్గరగా ఉన్న రెండవ గ్రహం శుక్రుడు. చంద్రుడి తరువాత శుకగ్రహం కూడా రాత్రివేళ ఆకాశంలో ప్రకాశవంతంగా వెలుగులు పంచగలుగుతుంది. సూర్యుడి చుట్టు ఒకసారి తిరగడానికి శుకగ్రహానికి 224.7 రోజులు పడుతుంది. ఆకారం, ద్రవ్యరాశి, సూర్యుడి నుండి దూరం మరియు సంఘటనలలో శుకగ్రహం మరియు భూగ్రహం ఒకేలా ఉన్నందున శుక్రుడిని భూమి ‘సోదర గ్రహం (సిస్టర్ ప్లానెట్)’ అంటారు. భూగ్రహం కోట్ల జీవులకు నెలవుగా ఉంది. శుకగ్రహంపై కూడా జీవుల ఉనికి ఉందనే ఆధారాలను 14 సెప్టెంబర్ 2020 రోజున అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల జట్టు వ్యక్తం చేసింది. శుకగ్రహం వాతావరణంలో ఆసక్తికలించే అరుదైన రసాయన అణువు ‘‘ఫాస్ఫీన్’’ ఉందని గుర్తించారు. సాధారణంగా జీవులు మాత్రమే ఉత్పత్తి చేయగల ఫాస్ఫీన్ ఉండడంతో శుక్రుడిపై ‘గ్రహాంతరవాసులు లేదా ఏలియన్స్ లేదా ఎక్స్ట్రా టెరెస్టియల్ జీవులు’ ఉండవచ్చనే దిశలో పరిశోధనలు సాగుతున్నాయి. ప్రత్యక్షంగా శుక్రుడిపై జీవి ఉనికి గుర్తించినప్పటికీ, దాని వాతావరణంలోని ఆమ్ల మేఘాల సమీపాన రసాయన ఫాస్ఫీన్ ఉండడం ఆశ్చర్యాన్ని మరియు ఆసక్తిని రేకెత్తిస్తున్నదని పరిశోధకులు అంటున్నారు. భూమిపైన ఫాస్ఫీన్‌ను బ్యాక్టీరియా లేదా అసాధారణ పరిస్థితుల మధ్య పరిశ్రమలు మాత్రమే ఉత్పత్తి చేయగలవు. జీవులు మాత్రమే ఉత్పత్తి చేయగల ఇలాంటి రసాయన అణువులను శుకగ్రహ వాతావరణం కలిగి ఉండటమే ప్రాణుల ‘ జీవ-సంతకం (బయో-సిగ్నేచర్)’ వైపుకు మన దృష్టిని ఆకర్షిస్తున్నాయి. శుకగ్రహ జీవుల ఉనికి పట్ల లోతైన అన్వేషణ చేస్తున్న అమెరికాలోని యంఐటి మాలిక్యులార్ ఆస్ట్రోఫిజిస్ట్ ‘క్లార సౌసా-సిల్వా‘ అభిప్రాయం ప్రకారం ఫాస్ఫీన్ ఉనికి మరే ఇతర పద్దతిలో తయారుకాదని, ప్రాణులకు మాత్రమే దీనిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంటుందనే వాదన వినిపిస్తున్నారు. శుకగ్రహ ఉపరిత వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, కాని గ్రహ ఉపరితలానికి 50 కిమీ ఎత్తున ఉన్న పొరలలో సాధారణ ఉష్ణోగ్రతాపీడనాలతో పాటు సల్ఫ్యూరిక్ ఆమ్లం, కార్బన్‌డైఆక్సైడ్ మరియు స్వల్ప నీటి ఆవిరి ఉండడంతో సహ సూర్యరశ్మి తీవ్రత తక్కువగా నమోదవుతుందని తెలుపుతున్నారు. ఈ వాతావరణ పరిస్థితులలో ప్రాణులు ఉండే సంభావ్యతలను కొట్టిపారేయలేమని నిర్థారణకు వస్తున్నారు. ఇలాంటి పరిశోధనా ఫలితాలు అమెరికా ‘నాసా’ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించి మరింత లోతైన పరిశోధనలను చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. రాబోయే రోజుల్లో శుకగ్రహం పైకి వెళ్ళగలిగే రోవర్ మిషన్లు కార్యరూపం దాల్చి, అక్కడి సాంపుల్స్ తేగలిగితే ఈ విషయంలో మరింత స్పష్టత రానుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫాస్ఫీన్ వాయువు విషపూరితమైనదని, రసాయన ఆయుధాల తయారీలో వాడుతారని మనకు తెలుసు. అసాధారణ పరిస్థితులలో మాత్రమే పరిశ్రమలలో తయారు చేయగల దుర్వాసనగల ఫాస్ఫీన్ అణువులో ఫాస్పరస్ పరమాణువుతో మూడు హైడ్రోజన్ పరమాణువుల కలిసి బంధాలు ఏర్పరచుకొని పిరమిడ్ ఆకృతితో ఫాస్ఫీన్ (PH3) ఏర్పడుతుంది. శుక్రుడిపై గ్రహాంతరవాసులు ఉన్నారనే రుజువులు ఖచ్చితంగా లేకపోయినా ఫాస్ఫీన్ వాయు ఉనికి ద్వారా జీవం ఉందనే వాదన బలపడుతోంది. ఈ ఆసక్తికర అంశాన్ని లోతైన పరిశోధనలతో సత్వరమే శుకగ్రహంపై జీవ-సంతకం నిర్థారించ బడాలని అందరం ఆశిద్దాం.
-డా।। బుర్ర మధుసూదన్ రెడ్డి
99497 00037