కళ్ళెంలో కళ్యాణి చాళుక్యుల కొత్తశాసనం


రాష్ట్రకూటులకాలంలో కొలనుపాక ప్రాంతంలో విరివిగా జైనబసదులు నిర్మాణమైనాయి. రాష్ట్రకూట చక్రవర్తి అమోఘవర్షుని బంధువు, పాణూర వంశానికి చెందిన శంకరగండరస మహామండ లేశ్వరుడిగా కొలనుపాక-20,000లనాడు పాలించేవాడు. శంకర గండరస దిగంబరజైనానికి చెందినవాడు. శంకరగండరస శాసనాలు వేలుపుగొండ (జాఫర్‍ గడ్‍), ఆకునూరు, ఇంద్రపాల నగరం, మల్లికార్జునపల్లి, ఆమనగల్లులలో లభించాయి. ఈ స్థలాలలో కొన్నింటిలో జైనబసదు లున్నాయి. ఇతని ఏలుబడిలో కొలనుపాక కేంద్రంగా ఈ ప్రాంతంలో జైనం విస్తరించింది. రాష్ట్రకూటుల తర్వాత పాలకులైన కళ్యాణీ చాళుక్యరాజులలో కొందరు జైనాన్ని అభిమానించారు. పోషించారు కూడా. ఈ ప్రాంతమంతా జైన మునులతో, శ్రావకులతో నిండి వుండేదనిపిస్తుంది. అంతకు ముందు ఇక్కడ బౌద్ధం ఆనవాళ్ళు స్తూపాలజాడల రూపంలో, శిల్పాల రూపంలో అగుపిస్తున్నాయి. శైవ, వైష్ణవమతాలకు సంబంధించిన దేవాలయవాస్తు నిర్మాణాలు ఈ ప్రాంతంలో విరివిగానే ఉన్నాయి. ఒక మతం తర్వాత మరొక మతం తన స్థానాన్ని పదిలపరచుకుంటు వస్తూనే వుంది. జైనం ఈ ప్రాంతంలో ఎంతో విస్తరించివున్నా జైనమతగ్రంథాలు, రచనలు దొరకలేదు. జైనం మీద కొలనుపాక కేంద్రంగా ప్రబలిన కాలాముఖుల దాడి తీవ్రంగానే ఉండేదనిపిస్తుంది. కొలనుపాకలో గుర్తించిన ఒక వీరగల్లులో జైనులవధ చెక్కబడివుంది. ఆలేరులోని పోచమ్మగుడిలో అరుదైన కాలాముఖాచార్యుని శిల్పం లభించింది. కొలనుపాక, సిద్దెంకి, ఆలేరు, రాయగిరి, సైదాపురం, రఘునాథ పురం, ఇక్కుర్తి, ముస్త్యాలపల్లె, కొన్నె, పెంబర్తి, ఎల్లెముల, మాణిక్యపురం, సిరిపురం, జనగామలలో జైనం విస్తరించిన ఆధారాలు లభిస్తూనే వున్నాయి. జనగామ జైనగ్రామం అని చెప్పడానికి మా చరిత్ర బృందానికి 2016 జనవరి 31న జైనమునుల స్తంభం ఒక్కటి లభించింది. మాకు దొరికిన ఈ ఆధారం తొలిసారి వెలుగులోకి వచ్చిన అన్వేషణ. జనగామ ప్రాంతం జైనమత ప్రాధాన్యం కలిగిదని చెప్పడానికి మాకు లభించిన కళ్ళెం గ్రామశాసన మొక సాక్ష్యం.


ప్రస్తుత జనగామ జిల్లా కేంద్రానికి 5 కి.మీ.ల దూరంలో ఉన్న కళ్ళెం అనే గ్రామం ఒక ప్రాచీన జైనబసది. ఒకప్పుడు కళ్యాణపురంగా పిలువబడిన నేటి కళ్ళెం గ్రామానికి ఆగ్నేయంగా మామిడితోటలో కళ్యాణి చాళుక్యుల నాటి శాసనం లభించింది.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణచరిత్రపై పరిశోధన చేస్తున్న చరిత్రబృందం సభ్యులు వేముగంటి మురళీకృష్ణ, సహాయకుడు చంటిలతో ఈ శాసనాన్ని పరిశీలించాను. ఈ శాసనాన్ని చంటి సహాయంతో అచ్చుతీసి, శాసనపాఠాన్ని పరిష్కరించాను. ఈ శాసనాన్ని నేలలోంచి బయటికి తీయడానికి శ్రమతీసుకుని గ్రామసర్పంచ్‍ మార్పు శ్రీనివాస్‍ రెడ్డి, ఎస్‍ లక్ష్మారెడ్డి, ఎం.వీరస్వామి, రాపాక విష్ణువర్ధన్‍, మల్లేశం, శ్రీను, నర్సయ్య, ఐలయ్య సహకారమందించారు. మరియు మిత్రుడు నట్వాప్రభాకర్‍ చరిత్రబృందం సభ్యుడు అరవింద్‍ ఆర్య ఈ సమయంలో తోడ్పడ్డారు. ఈ శాసనం జాడ చూపినవారు చరిత్ర పరిశోధకులు రత్నాకర్‍ రెడ్డి.
కళ్ళెం శాసనం శక సంవత్సరం 928, చైత్రశుద్ధ పౌర్ణిమ రోజున అంటే క్రీ.శ.1006లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి ఇరివబెడెంగ సత్యాశ్రయుని కాలంలో వేయబడింది. లిపి తెలుగు. భాష తెలుగన్నడం. 10 అడుగుల ఎత్తు, 2 అడుగుల వెడల్పున్న నాలుగు పలకల తెల్లరాతి స్తంభానికి ఏడడుగుల ఎత్తున నలువైపుల 80 పంక్తులలో ఈ శాసనం రాయబడింది. దీనిపై ఏ దేవతల శిల్పాలు లేవు.


దీనిలో కళ్ళెంలోని శ్రీమాతృప్రభ (జైన)బసది ఆచార్యమణి సువ్రతభట్టారకుని సమక్షంలో ఆయా గ్రామాల గావుండాలు (గ్రామాధికారులు) రేచనసెట్టి, పడ్వనసెట్టి, శ్రావక వామిసెట్టి మొదలైన వారు రాజమానము (ఆనాటి ప్రభుత్వ కొలత) ప్రకారం పది మర్తురుల నీర్నేల (తఱి పొలము)ను దానమిచ్చినట్టు తెలుప బడింది. ఈ శాసనంలోనే పరరిగేర్పళ వరదకరు బసదికి కూడా అనేకమంది సెట్టిగావుండాలు కొంతభూమిని, కొన్ని ద్రమ్మాలను (ఆనాటి నాణేలు) సర్వసిద్ధాయంగా దానం చేసినట్లు తెలుస్తున్నది.


రాజవంశం: కళ్యాణీ చాళుక్యులు
రాజు: పేర్కొనబడలేదు (ఇరివబెడెంగ సత్యాశ్రయుడి కాలం)
కాలం: శక సం.లు 928-క్రీ.శ.1006 విశ్వావసు చైత్ర శుద్ధ…
భాష: తెలుగన్నడం, లిపి: తెలుగు (10వ శ.)
స్థలం: కళ్ళెం గ్రామ పరిధిలో జనగాం, కళ్ళెం గ్రామాల మధ్య


శాసనపాఠం:
మొదటి వైపు:

  1. స్వస్తి సక నృప కాలాతీ
  2. త సంవత్సర శతగ
  3. (ళు) 928 నేయ విశ్వవసు
  4. సంవత్సరద చైత్ర సుద్ధ
  5. 15..0ళ శ్రీ మాతృప్రభ
  6. బసదియ ఆచార్య
  7. మ్ముని సువ్రత భట్టారక
  8. రు అల్లయస్వానిగ్పరు
  9. గళ్మేఘనంది భ..ర
  10. కు శ్రావకరు రేచన సె
  11. ట్టియు పద్వని సెట్టియు
  12. మామి సెట్టియు శ్రావ
  13. వ వామిసెట్టియు బ
  14. సవయ్య నూక..పా
  15. య కమనీను మయ్దు
  16. ను సూరయ్యను పళ
  17. నే సురయ్యను…మి……
  18. ళగేపనీరేళు కళ్ళమో
  19. ర్యోళ్యయ సెట్టిగే
  20. కఱ..యనగ.ఱి.ల్కే అ
  21. ల్లియ గావున్డీ రేవ
  22. య్యను మగ పుగ్గయ్య
  23. ను మిఱివయంగిద్ద స్వి
  24. తియన్తెనె కఱైయ
    రెండో వైపు:
  25. పెఱగె రాజమాన
  26. పత్తు మత్త న్నీర్నేల
  27. నిర్పసల్ప సర్వ ప
  28. రిహారతమ్ము ళేదో
  29. యాళే ఎన్బోటఱిళే
  30. దేయాళ భళారరిగె
  31. పళ వరదకరు బస
  32. దియ మాన్నికు వీర్గా
  33. వున్డీంగే గన్డీ మగ
  34. ఆయము ..గెరొక
  35. కాళ గణ… వ్యదన్డో
  36. సద్దికుళ మత్తినయ
  37. రాటెనాల పిగేయ్దొకు
  38. జళ ప్రమాన బదుదు
  39. శ గాట్ట సలసెట్టి
  40. యోదనొ…నే జకు
  41. టిఱ్తొళ మోదే అ
  42. యభైఱే ఎనబి ఈ
  43. ఱ్తొద మోళేయాయ
  44. కఱియోళేరభమా
  45. పలుమాడిసలు సె
  46. ట్టి గల్లదే గావుండీ భ
    మూడో వైపు:
  47. టరరిగ మాదలమా
  48. దిసల సల్లళ సిద్ధ
  49. య మత్తరోలోపు ద్ర
  50. మ్మ మానికవ స్సె
  51. ట్టి గావుళు గన్గీ మో
  52. ఠ బుమనే పరిహా
  53. ర మత్తావ..ఱదు
  54. ది దొపనుదియ
  55. రెఱైయషుతే
  56. యుబళియు కెఱు
  57. గళ నగఱిస్సల్లక
  58. స్థితి యోళే చంద్రా
  59. ర్కతారక బరసలి
  60. సు వీర్గాతి రాజా
  61. న్నగా మాచనమ
  62. రాజాను గోవప
  63. య్యను నలియ్య
  64. దినలప్ప రాజా
  65. ను వాసుదేవ
  66. య్యను జువ్వికు
    నాలుగో వైపు:
  67. న్టీయ రాలపయ్యను
  68. సిరిపురద కామోయ
  69. గావున్డీను దాసేయ గా
  70. వున్డను పేబాఱి గున్డొ
  71. య గావున్డను పొల్ల
  72. య గావున్డను సాక్షి
  73. గావున్డనుయ తప్పిద
  74. వును…యు……
  75. యాగేయుక్త ఈశ్వడ్ర…
  76. మమేన..డ సాహ…
  77. సామాన్యోయ ధర్మ స
  78. తు నృపళా……
  79. ట నియా……….
  80. నేతాను చాపి……..
  81. వన్దన………….
  • శ్రీ రామోజు హరగోపాల్‍,
    ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *