తెలంగాణ ఘనవారసత్వాన్ని కాపాడుకుందాం!


తెలంగాణ!
ప్రాచీన కాలం నుంచి మొదలుకొని భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడడం వరకు ఎన్నో ఘనతలు తెలంగాణ సొంతం. ఇంతటి ఘనతలు తెలంగాణ పొందడానికి ప్రధాన కారణం తరతరాలుగా వివిధ రూపాల్లో మనం పొందుతూ వచ్చిన మన ఘనవారసత్వమే. ప్రపంచంలో, భారతదేశంలో ‘తెలంగాణ’ అంటూ మనకు ఒక ఉనికి ఏర్పడిందంటే అందుకు కారణం మన వారసత్వమే. అలాంటి వారసత్వం గత ఆరు దశాబ్దాల కాలంలో గత పాలకుల హయాంలో ఎంతగానో నిర్లక్ష్యానికి గురైంది. ఈ నేపథ్యంలో మనం ‘ప్రపంచ వారసత్వ కట్టడాల దినోత్సవం’ నిర్వహించుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ‘ఇంటర్నేషనల్‍ డే ఫర్‍ మాన్యుమెంట్స్ అండ్‍ సైట్స్’గా లేదా ‘వరల్డ్ హెరిటేజ్‍ డే’గా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో వారసత్వ కట్టడాల పరిరక్షణకు సంబంధించిన సమగ్ర చట్టం తేవాలన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‍ రావు సంకల్పానికి అనుగుణంగా హెరిటేజ్‍ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ విధమైన హెరిటేజ్‍ కాంప్రహెన్సివ్‍ రెగ్యులేషన్‍ యాక్ట్ రాష్ట్రంలో వివిధ పురావస్తు, చారిత్రక ప్రాధాన్య కట్టడాల పరిరక్షణకు ఎంతో తోడ్పడగలదు. హైదరాబాద్‍లో మాత్రమే గాకుండా రాష్ట్రవ్యాప్తంగా సైతం వారసత్వ కట్టడాల పరిరక్షణకు తగు చర్యలు తీసుకునేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ఈ దేశంలోనే తొలిసారిగా ఈ తరహా చట్టం తీసుకువచ్చిన ఘనత తెలంగాణకు దక్కింది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఈ ప్రతిపాదనను ఇప్పటికే హర్షించారు. తెలంగాణలో ఈ చట్టం సమర్థంగా అమలైతే ఇతర రాష్ట్రాలకు అది ఆదర్శం కాగలదు.


మన మూలాల అన్వేషణ
వారసత్వ కట్టడాలను పరిరక్షించడం మనం మన మూలాలను అన్వేషిస్తూ, వాటిని కాపాడుకోవడమే. గత తరాల జ్ఞాపకాలను మనం వర్తమానంలో నెమరువేసుకుంటూ భావితరాల కోసం భద్రపర్చడం. ఆనాటి జ్ఞాపకాలను సజీవంగా అనుభూతి చెందడం. ఒక నాటి చరిత్ర, సంస్కృతి, కళాత్మకత, విజ్ఞానం, నిర్మాణ కౌశల్యం, విద్య, నైతిక విలువలు లాంటివన్నీ ఈ వారసత్వ కట్టడాల్లో అణువణువునా దాగి ఉంటాయి. ఒకసారి వాటిని గనుక కోల్పోతే ఇక వాటిని తిరిగి సాధించలేం. ఎంత కాలం వెచ్చించినా, ఎంత డబ్బు వెచ్చించినా వాటిని తిరిగి పొందలేం. ఆ దృష్టితో చూస్తే వెల కట్టలేని సామూహిక జ్ఞాపకాల ఖజానాలు ఆ కట్టడాలు. ఎన్నెన్నో జ్ఞాపకాలు… ఎన్నెన్నో కథలు… గాధలు… అనుభూతులు. ఎంత డబ్బు వెచ్చించినా మరో చోట మరో విధంగా వాటిని పొందలేం.
వారసత్వ కట్టడాలు ఒక పట్టణపు భౌగోళిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక చరిత్రకు దర్పణాలుగా ఉంటాయి. ల్యాండ్‍ మార్క్లుగా, ఐకాన్‍లుగా మాత్రమే గాకుండా ప్రజలు తమని ఐడెంటిఫై చేసుకునే, వాటితో వారు ఇంటరాక్ట్ అయ్యేవిగా ఉంటాయి. వాటిని చూస్తుంటే వారు తమ పాత తరంతో ముచ్చటిస్తున్న అనుభూతిని పొందుతారు. తాము స్వయంగా ఆనాటి కాలంలోకి వెళ్ళినట్లుగా అనుభూతి చెందుతారు. ఎంత వెల కట్టినా అలాంటి వాటిని మనం మరోచోట పొందలేం. మరో చోట ఉన్న సమాజం కంటే కూడా తమ సమాజం భిన్నమైందని, విశిష్ట మైందనే భావనను ఆయా కట్టడాలు అక్కడి ప్రజలకు అందిస్తాయి.


వారసత్వ కట్టడాలు ప్రజల నిత్య జీవితంలో భాగంగా మారు తాయి. వినోద, విహార కేంద్రాలుగా, పర్యాటక కేంద్రాలుగా, చారిత్రక దర్శనీయ ప్రాంతాలుగా, వివిధ కార్య కలాపాల నిర్వహణ కేంద్రాలుగా అవి విరాజిల్లుతుంటాయి. తమకు తెలియ కుండానే ప్రజలు వాటితో ఒక సన్నిహిత అనుబంధాన్ని ఏర్పరచు కుంటారు. వివిధ సామాజిక, వాణిజ్య ప్రయోజనాలకు, వివిధ సదుపాయాల కల్పనకు ఆయా కట్టడాలను వినియోగించుకునే అవకాశం ఉంది.
ఒక నగరం చారిత్రక గుణగణాలను చాటి చెప్పాలంటే ఆ పని చేసేది వారసత్వ కట్టడాలే. వాటిని చూస్తే చాలు ఆయా కాలాల్లో అక్కడి విరాజిల్లిన సంస్క•తి, నాగరికత, ఆధ్యాతికత, కళాత్మకత లాంటి వాటన్నింటినీ చెప్పవచ్చు. అవే గనుక లేకుంటే అలాంటి విశేషాలన్నీ ప్రజల మనస్సుల్లోంచి చెదిరి పోతాయి. తమ చరిత్ర ఏమిటో తమకే తెలియకుండా పోతుంది.
వారసత్వ భవనాలను వినియోగించుకోవడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మన అవసరాలకు అనుగుణంగా వాటికి మార్పుచేర్పులు చేయడం అని గాకుండా అక్కడ ఉన్న ఏర్పాట్లను మనం కొత్తగా ఎలా వినియోగించుకోవచ్చో ఆలోచించాలి. లేని పక్షంలో ఆయా కట్టడాలు అనాలోచిత, అవాంఛనీయ మార్పుచేర్పులకు గురై తమ అందచందాలను, ప్రత్యేకతను, హోదాను కోల్పోయే అవకాశం ఉంటుంది.
వారసత్వ కట్టడాల పరిరక్షణ, నగర అభివృద్ధి ప్రణాళికలు, ప్రాథమ్యాల మధ్య చక్కటి సమతుల్యత ఉండాలి. అది లోపిస్తే దాని ప్రభావం నగర అభివృద్ధిపై, చరిత్ర పరిరక్షణపై పడే అవకాశం ఉంటుంది. చారిత్రక భవనాల ప్రాధాన్యతను అర్థం చేసుకోవడం ద్వారా సమగ్ర అవగాహనతో కూడిన ప్లానింగ్‍ నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుంది. ఆయా భవనాలు ఆ ప్రాంతానికి ఒక విశిష్టతను అందిస్తాయి. వాటిని కూల్చివేయడంతో ఆ విశిష్టతను తొలగించుకున్నట్లు అవుతుంది.


పరిరక్షణ అంటే…
ఒక కట్టడం చారిత్రక, సాంస్కృ తిక ప్రాధాన్యం నిలబెట్టేందుకు తీసుకునే చర్యలన్నీ పరిరక్షణ కిందకే వస్తాయి. దాని నిర్వహణతో సహా భద్రంగా ఉంచడం, పునరుద్ధరించడం, పునర్‍ నిర్మించడం, వాడుకలోకి తీసుకురావడం అన్నీ దీని పరిధిలోకి వస్తాయి.
ఎన్నెన్నో కట్టడాలు…
హైదరాబాద్‍తో పాటుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో వార సత్వ కట్టడాలు ఉన్నాయి. ఎన్నో కోటలు, సంస్థానాధీశుల భవనాలు, గడీలు, ఆలయాలు, మసీదులు, చర్చ్లు, నవాబుల భవనాలు, స్థానిక ఆర్కిటెక్చర్‍కు అద్దం పట్టే ఇతర కట్టడాలు అనేకం ఈ వారసత్వ కట్టడాల పరిధిలోకి వస్తాయి. నిజానికి నోటిఫై కాని వారసత్వ భవనాలు సైతం అనేకం ఉన్నాయి. నోటిఫై అయినా, కాకున్నా, ఆయా వారసత్వ కట్టడాల పరిరక్షణకు దోహదపడే విధంగా చట్టం ఉండాలి.
అరవై ఏళ్ళుగా వారసత్వ కట్టడాల పరిరక్షణకు గత ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు నామమాత్రమే. స్వరాష్ట్రంలో ప్రభుత్వం ఇందుకు ముందుకు రావడం అభినందనీయం. హైదరాబాద్‍తో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్నో చారిత్రక ప్రాధాన్య వారసత్వ కట్టడాల పరిరక్షణకు ఇది వీలు కల్పించగలదు.


జాతీయ స్థాయిలో….
పురాతన, చారిత్రక ప్రాధాన్యం గల వారసత్వ కట్టడాల పరిరక్షణకు జాతీయ స్థాయిలో నేషనల్‍ మాన్యుమెంట్‍ యాక్ట్ ఉంది. ఈ చట్టం కిందనే ఆర్కియాలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా (ఏఎస్‍ఐ) ఏర్పడింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జాతీయ, అంతర్జా తీయ ప్రాధాన్యం కలవిగా భావించిన కొన్ని వారసత్వ కట్టడాలను ఈ సంస్థ పరిధిలోకి చేర్చారు. జాతీయ స్థాయిలో ఇది సాంస్కృతిక శాఖ పరిధిలో పని చేస్తుంది.


తెలంగాణపై వివక్ష
ఆర్కియాలజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా పరిధిలో ఉమ్మడి రాష్ట్రంలో 138 వారసత్వ కట్టడాలు ఉంటే, వీటిలో సీమాంధ్ర ప్రాంతంలో 131 ఉండగా, తెలం గాణ లోనివి 7 మాత్రమే. ఇందుకు ప్రధాన కారణం ఈ జాబితా కొన్ని దశాబ్దాల క్రితం రూపొందించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళలోనే ఈ జాబితా రూపొందింది. అప్పటికి తెలంగాణ ప్రాంతం అంతా కూడా నిజాం రాజ్యంలో భాగంగా ఉండింది. అందువల్ల తెలంగాణ ప్రాంతంలోని కట్టడాలకు ఆ జాబితాలో చోటు దక్కలేదు. మరో ముఖ్య కారణం గత ఆరు దశాబ్దాలుగా ఆనాటి ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతంపై కనబర్చిన నిర్లక్ష్యం. రాష్ట్ర విభజన జరిగే వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. స్వరాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఈ జాబితాలోకి మరిన్ని కట్టడాలను చేర్పించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ జాబితాలో చేర్చేందుకు అర్హత కలిగిన కట్టడాలు తెలంగాణలో సుమారుగా 100 నుంచి 300 దాకా ఉంటాయని ఒక అంచనా. ఆయా కట్టడాలను కేంద్ర జాబితాలోకి చేరిస్తే రాష్ట్రానికి వాటి నిర్వహణ, సంరక్షణ భారం తగ్గడమే గాకుండా వాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కలిగేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర జాబితాలోకి పోగా, మిగిలిన వాటిలో మరిన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జాబితాలోకి చేర్చే అవకాశం లభిస్తుంది. నిజానికి తెలంగాణ ప్రాంతంలో ఎన్నో కట్టడాలు జాతీయ స్థాయిలో వారసత్వ కట్టడాలుగా నోటిఫై కావాల్సిన అవసరం ఉంది. వాటికి అంతటి ప్రాధాన్యం కూడా ఉంది. దాన్ని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ప్రభుత్వేతర సంస్థలు కూడా కృషి చేయాలి. ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ లాంటి సంస్థలు ఈ దిశలో తమ కృషిని కొనసాగిస్తున్నాయి. (ఇంకా వుంది)


-సువేగా,
ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *