విపత్తుల నివారణ కోసం పటిష్టమైన భూగర్భ డ్రైనేజీ ప్రణాళిక!


హైద్రాబాద్‍ నగరం రోజురోజుకీ విస్తరిస్తున్నది. స్థానికులతో పాటు ఉపాధి కోసం నగరానికి వచ్చేవారితో జనాభా కూడా పెరుగుతున్నది. ప్రజావసరాలకు అనుగుణంగా విభిన్న వ్యవస్థలు ఎప్పటికప్పుడు రూపొంది, అభివృద్ధి చెందడం అత్యవసరం. ప్రతి వ్యవస్థకూ దానికంటూ కొన్ని ప్రత్యేక ప్రణాళికలున్నప్పటికీ ఆ వ్యవస్థలను రూపొందించడానికి, అమలు చేయడానికి, అభివృద్ధి చేయడానికి ఉమ్మడిగా సమగ్రమైన ప్రణాళికలు అవసరమవుతాయి. ఈ వ్యవస్థలన్నీ ఒకదానికొకటి ప్రభావప్రేరితాలు. ఈ వ్యవస్థల మధ్య సమన్వయమే ప్రజల అవసరాలను తీర్చడంలో కీలకమవుతుంది. ప్రజాజీవనం సుదీర్ఘమైనది. నగర భౌగోళిక విస్తృతీ సుదీర్ఘమైనదే. కనుక నగరాభివృద్ధికి అమలు చేసే ప్రణాళికలన్నీ సుదూర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించుకోవాలి.


ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‍ నగరానికి రీజనల్‍ ప్లాన్‍ లేకుండానే అప్పటప్పటి అవసరాల దృష్ట్యా లోపభూయిష్టమైన ఏడు మాస్టర్‍ప్లాన్‍లు ఆయా ప్రభుత్వాలు తయారు చేశాయి. అవేవీ నగరాభివృద్ధికి, ప్రజల అవసరాలను తీర్చడానికి ఉపయోగపడలేక పోయాయి.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్టప్రభుత్వం గత ప్రభుత్వాల తప్పిదాలకు చోటివ్వక ప్రజాసంక్షేమమే ధ్యేయంగా వివిధ పథకాలతో కృషి చేస్తుంది. పట్టణ ప్రణాళిక (అర్బన్‍ ప్లానింగ్‍) రచనలో రవాణా, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్‍, విద్య, వైద్య, ఐటి, పరిశ్రమలు, విపత్తుల నివారణ, సుందరీకరణ, పర్యావరణ పరిరక్షణ, వారసత్వ సంపద పరిరక్షణ, కాలుష్యరహిత వాతావరణం వంటి అనేక అంశాలపై దృష్టిసారించింది.


రవాణా అంటే ప్రజలు ఒక చోటు నుండి మరో చోటుకి ప్రయాణించడమొక్కటే కాదు. వివిధ రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సాంకేతిక యిత్యాది రంగాల అభివృద్ధికి కీలకమైనది. అందుకనుగుణంగా ఔటర్‍ రింగ్‍ రోడ్లను, ఇన్నర్‍ రింగ్‍ రోడ్లను అనుసంధానం చేస్తూ రేడియల్‍ రోడ్లను, సర్వీస్‍ రోడ్లను, జంక్షన్‍లను, ప్లై ఓవర్లను నిర్మించడం ద్వారా ట్రాఫిక్‍ రద్దీ నివారణతోపాటు ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, నివాస, కమ్యూనిటీల అభివృద్ధి సాధ్యమవుతుంది. జీహెచ్‍ఎంసీ & హెచ్‍ఎండీఏ దీనికోసం కృషి చేయవలసి వుంది.


విపత్తుల నివారణ కోసం పటిష్టమైన భూగర్భ డ్రైనేజి వ్యవస్థను బలోపేతం, 2017లో ఏర్పడిన మూసీ రివర్‍ డెవలప్‍మెంట్‍ కార్పొరేషన్‍ 1669 కోట్ల నిధులు కేటాయింపుతో చేపట్టిన మూసీనది ప్రక్షాళన, వంతెనల ఏర్పాట్లు, సుందరీకరణ కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేయాల్సిన ప్రణాళికను వెంటనే క్రమబద్ధకంగా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
హైద్రాబాద్‍ నగరానికి అక్కంపల్లి నుండి కృష్ణా జలాలు, కాళేశ్వరం జలాలతోపాటు ఉస్మాన్‍సాగర్‍, హిమాయత్‍సాగర్‍, సింగూర్‍, మంజీరా ప్రాజెక్టుల నుండి నీటిని తరలింపుతో పాటు, భవిష్యత్‍ తరాల అవసరాల కోసం నీటిని పొదుపు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలను అమలుపరుస్తుంది.


పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యరహిత నగర నిర్మాణానికి ఆటంకం లేని విధంగా పారిశ్రామిక విధానం, ప్రజా సంక్షేమం ఇంటిగ్రేటెడ్‍ ప్రణాళికకు ముఖ్య లక్ష్యం కావాలి. ఈ ప్రణాళిక రూపొందించడంలో సామాజిక, రాజకీయ, సాంకేతిక, పర్యావరణ శాస్త్రవేత్తలకు, వారసత్వ సంపదపై పట్టు వున్న చరిత్రకారులు, భూ శాస్త్రవేత్తలు, సాంస్కృతిక మేధావులు ఇతర అన్ని రంగాల నిపుణులు – ప్రభుత్వం, ప్రజలు భాగస్వామ్యులు కావాలి. వారసత్వ, పర్యావరణ, సామాజిక, సహజ వనరులు, జీవ వైవిధ్య పరిరక్షణ వెరశి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జరిగే ప్రతి ప్రయత్నంలో దక్కన్‍లాండ్‍ తోడుగా వుంటుందని తెలియజేస్తూ…


(మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *