కొత్తూరు సీతయ్య గుప్త


శంనోమిత్రః శంవరుణ।। శంనో భవత్పర్యమా
శంనో ఇండ్రో బృహస్పతిః।। శంనో విష్ణు
విష్ణురురుక్రమః

దేశభక్తి, ప్రజాహిత చింతన మూర్తీభవించిన నిస్వార్థ నిరాడంబర ప్రజా సేవకులు శ్రీ కొత్తూరు సీతయ్య గుప్త. వారు పుట్టింది అతి సామాన్య కుటుంబంలో, ఒక చిన్న వ్యాపార సంస్థలో ఉద్యోగిగా జీవితం ఆరంభించారు. ఏ వ్యాపార సంస్థలో పనిచేసినా లక్షలు ఆర్జించే వ్యవహారదక్షులు. వృత్తిని బట్టి వ్యాపారస్తులైనా, ప్రవృత్తిని బట్టి దేశభక్తుడు. జాతీయవాది, గాంధీతత్వాభిమాని, ప్రజాహిత చింతనగల సంఘ శ్రేయోభిలాషి, నిజాం నిరంకుశ పరిపాలనకు వెరవని ధైర్యశాలి. ఆర్యసమాజ్‍ నిర్మాణానికి, ప్రచారానికి తన జీవితం అంకితం చేసిన చైతన్యశీలి. అనేక సాంఘిక, సాంస్కృతిక సేవా సంస్థల స్థాపనలో, నిర్వహణలో క్రియాశీల ప్రోత్సాహమిచ్చిన సంఘ సేవా పరాయణులు. ముఖ్యంగా హైదరాబాద్‍ నగరంలో ప్రజాసేవా రంగంలో వీరు ప్రముఖంగా కనిపిస్తారు.


పూర్వపు హైదరాబాదు సంస్థానంలో తెలుగు ప్రజల అభ్యున్నతికి వారి న్యాయమైన హక్కులు, అధికారాలను సాధించడానికి అవిరళకృషి చేసిన జాతీయవాదులలో పేర్కొనదగిన ప్రజా సేవా తత్పరులు శ్రీ సీతయ్య గుప్త గారు. నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన వివిధ ఉద్యమాలలో ఆయన నిర్వహించిన పాత్ర శ్లాఘనీయ మైనది. నిజాం నిరంకుశ పరిపాలనను అంతరింపచేసి హైదరాబాదు భారత యూనియన్‍లో విలీనమైన తరువాత రాష్ట్ర నిర్మాణానికి నిర్విరామ కృషి సలిపి తన ఆకాంక్షను సాధించగలిగిన ప్రముఖులు శ్రీ సీతయ్య గుప్త హైదరాబాదు నగరంలో అనేక సామాజిక, సాంస్కృతిక, విద్యావిషయక, వాణిజ్యవర్తక, నిర్మాణ సేవా సంస్థల స్థాపనలోనూ, వాటి నిర్వహణలోనూ సీతయ్యగారు నిర్వహించిన పాత్ర అమోఘమైనది. జంట నగరాలలోని వర్తక ప్రముఖులలో వీరికి గల స్థానం విశిష్టమైనది. వర్తక, వాణిజ్య సంస్థలు నెలకొల్పటంతోపాటు, కార్మిక సంఘాలు కూడా స్థాపించి యజమానులు, కార్మికులు మధ్య సామరస్య సహృద్భావాలను నెలకొల్పటానికి కృషి చేసిన నిర్మాణ కార్యకర్త, గాంధేయవాది సీతయ్యగారు.


శ్రీ సీతయ్యగారు తది 10-8-1911న హైదరాబాదు నగరానికి 20 మైళ్ళ దూరంలో ఉన్న బహదూర్‍ గూడలో జన్మించారు. వీరి తండ్రి శ్రీ కొత్తూరు రామన్న, తల్లి శ్రీమతి అన్నమ్మ. అయిదుగురు అన్నదమ్ములలో సీతయ్యగారు నాల్గవవారు. వీరు శంషాబాద్‍ వీధి బడిలో చదువుకున్నారు. వేంకటస్వామి గారనే ఉపాధ్యాయులు ఈయన గురువుగారు. తెలుగుతోపాటు ఆనాటి రాజభాష అయిన ఉర్దూ భాష నేర్చి, హిందీ ప్రావీణ్యత పొంది, సిద్ధాంత శాస్త్రి (బి.ఏ)తో సమానము అగు డిగ్రీని పొందినారు. భారత, భాగవతాది గ్రంథాలు, సుమతి శతకం, దాశరథి, వేమన శతకాలు కంఠస్థం చేశారు. అమరమూ, ఆంధ్రనామ సంగ్రహం వంటి నిఘంటు గ్రంథాలు అధ్యయనం చేశారు. మరియు వ్యాపార సంబంధమైన లెక్కలు, గణిత శాస్త్రం నేర్చుకొన్నారు.


శ్రీ సీతయ్య గుప్తగారు తల్లిదండ్రులను వారి చిన్నతనంలోనే కోల్పోయారు. 1928లో కుటుంబ బాధ్యత వారి భుజస్కందములపై పడుటవలన వారు
ఉద్యోగము చేయవలసి వచ్చింది. అందుకే వారు శంషాబాదు నుండి హైదరాబాదు నగరమునకు తరలివచ్చి ఉస్మాన్‍గంజ్‍లో శ్రీ కొడారపు లక్ష్మీనర్సయ్యగారి వ్యాపార సంస్థలో చిన్న గుమస్తాగా చేరారు.
సీతయ్యగారి పని చూచి సేట్‍గారు సంతృప్తి చెందారు. సంవత్సరమునకు రెండు వందల రూపాయలు వేతనం ఇస్తామన్నారు. ఉద్యోగం ఖాయపరచుకొని ఉద్యోగంలో చేరి జాగ్రత్తగా కష్టపడి పనిచేసేవారు. కొద్దిరోజుల్లోనే ఆ సంస్థలో అన్ని విభాగాలలో జరిగే వ్యాపార కార్యకలాపాలు ఆయనకు కరతలామలక ములైనవి. అకౌంట్సు, అజమాయిషీ తదితర వ్యాపార సంబంధ వ్యవహారాలలో వారు బాగా ఆరితేరారు. వీరికి ఏ పని అప్పగించినా ఆ పని అత్యంత బుద్ధికుశలతతో, విశ్వాసము, నిజాయితీతో నిర్వహించి యజమాని మన్ననలకు పాత్రులైనారు. ఏ పనిచేసినా ఒకరు తప్పుపట్టడానికి వీలు లేకుండా సమర్థతతో దానిని నిర్వహించే వ్యక్తి అని పేరు తెచ్చుకున్నారు సీతయ్య గుప్తగారు. ఉన్న ఉద్యోగ సంస్థ భాగస్వాములు విడిపోవటం వలన తదుపరి సొంత వ్యాపార సంస్థను స్థాపించి వర్తక ప్రముఖునిగా ప్రసిద్ధి చెందారు. 1930లో సీతయ్యగారికి వివాహం జరిగింది. వారికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. హైదరాబాదు విమోచన ఉద్యమంలో పాల్గొని స్వాతంత్య్ర సమరయోదునిగా పరిగణింపబడిరి.


వీరు తల్లిదండ్రులను కోల్పోయినను అధైర్యము చెందక కష్టపడి పనిచేయటం ప్రారంభించిరి. ఆహార ధాన్యముల కమీషన్‍ వ్యాపారము చేయ మొదలిడి అందు గణనీయమైన స్థానము సంపాదించిరి వీరు. ఆం.ప్ర. ధాన్య వ్యాపార సంఘమునకు పన్నెండు సం।।లు కార్యదర్శిగాను, తదుపరి పదకొండు సం।।లు అధ్యక్షులుగాను పనిచేసి సంఘమునకు ఎనలేని సేవ యొనర్చిరి. వీరు కొంతకాలము చాంబర్‍ ఆఫ్‍ కామర్స్ అండ్‍ ఇండస్ట్రీస్‍లో కార్యనిర్వాహక సభ్యులుగా ఉండి, ఆం.ప్ర. వ్యాపార సమాఖ్యకు అధ్యక్షులై ఆ సంస్థల అభ్యుదయమునకు పలు విధములుగా పాటుపడిరి.


శ్రీ సీతయ్యగారు బాల్యము నుండియు సంఘ సేవా కార్యములందధికమైన శ్రద్ధ వహించుచు, పేదలను, దీనులను, కష్టముల నుండి కాపాడుటకు అవిరళమైన కృషి చేయుచుండిరి. వారి కార్య నిర్వహణ శక్తి అప్రతిమానమైనట్టిది. వీరు గుమస్తాగా పనిచేయు కాలమున తోటి గుమస్తాల ఇబ్బందులను తొలగించుట కొరకు గుమస్తాల సంఘమును స్థాపించి, యజమానులతో సంప్రదించి, గుమస్తాలకు అనేక సౌకర్యములను కల్గించియుండిరి. హైదరాబాదు పురపాలక సంఘమునకు మేయరుగా నుండిన శ్రీ ధరణిధర్‍ సంఘ్వీ, శ్రీ బాల్‍ రెడ్డి మున్నగు పెద్దల సహకారముతో గుమస్తాలకు వారపు సెలవుల సౌకర్యమును కలిగించారు. గుమస్తాల సంఘం పటిష్టంగా వించి యుండిరి. తరువాత వారి విషయములు తను ఎం.ఎల్‍.ఏ.గా ఉన్న కాలంలో ప్రభుత్వ దృష్టికి తెచ్చి షాప్స్ అండ్‍ ఎస్టాబ్లిష్‍మెంట్‍ చట్టమును అమలుపర్చునట్లు ప్రయత్నించి కృతార్థులైరి. వీరి కృషి వలన చాలా కాలము నుండి ఎదుర్కొను సమస్యలు పరిష్కరింపబడుట సంభవించెను.
సంఘ సేవా పరాయణులైన శ్రీ గుప్తగారు క్రమంగా రాజకీయ రంగమున కూడా ప్రవేశించుట సంభవించెను. నిజాం ప్రభుత్వ కాలమున ఏర్పరచిన ఆంధ్ర మహాసభలో చేరి హైదరాబాదు జిల్లా మహాసభకు ఆరు సంవత్సరములు ఉపాధ్యక్షులుగా పనిచేసిరి. శ్రీ రామానంద తీర్థగారి ఆధ్వర్యమున రాష్ట్ర కాంగ్రెస్‍ ప్రతినిధుల సమావేశమునకు సంబంధించిన ఆహ్వాన సంఘమునకు వారు కార్యదర్శులుగా నియమింపబడిరి. సత్యాగ్రహోద్యమమును ఉధృతపరచినందులకు నిజాం ప్రభుత్వం వారు వారెంట్‍ జారీ చేసిరి. అప్పుడు వీరు బెజవాడ సరిహద్దుల్లో ఉండి నైజాం ప్రభుత్వమునకు విరుద్ధంగా పనిచేసిరి. వీరు హైదరాబాదు పట్టణ కాంగ్రెస్‍ సంఘమునకు కార్యదర్శిగాను, రాష్ట్ర కాంగ్రెస్‍ సంఘమునకు కోశాధ్యక్షులుగాను రెండు సంవత్సరములు పనిచేసిరి.


హైదరాబాదు పట్టణ పురపాలక సంఘంలో వీరు ఏడు సంవత్సరములు కౌన్సిలర్‍గా ఉండిరి. తరువాత ఆం.ప్ర. రాష్ట్ర శాసనభకు హిమాయత్‍నగర్‍ నియోజకవర్గం నుండి వరుసగా రెండు పర్యాయములు శాసన సభ్యులు (ఎమ్‍.ఎల్‍.ఏ)గా ఎన్నుకొనబడిరి. తన నియోజకవర్గము అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేసిరి. హైదరాబాదు వ్యవసాయ మార్కెటింగ్‍ కమిటీ అధ్యక్షులుగా పదకొండు సం।।లు మరియు హైదరాబాదు నగర కాంగ్రెస్‍ సంఘమునకు అధ్యక్షులుగా ఎన్నుకొనబడిరి.


శ్రీ సీతయ్య గుప్తగారు సాంఘిక, రాజకీయ వ్యవహరములందే గాక, సారస్వత విద్యారంగములందు కూడా సాటిలేని సేవలందించారు. హైదరాబాదు నందలి ఆంధ్రసారస్వత పరిషత్తుకు వారు నాలుగు సంవత్సరములు కోశాధికారిగా ఉండి తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేసిరి.
శ్రీ సీతయ్య గుప్తగారు తెలుగు భాషకు వలెనే హిందీ భాషకు కూడా ప్రాముఖ్యతనిచ్చి హైదరాబాదులో దక్షిణ హిందీ ప్రచార సభ స్థాపించిన సభ్యులలో ఒకరు. హిందీ ప్రచార సభకు శాశ్వత సభ్యులుగా ఎన్నుకోబడినారు. హిందీ ఆర్టస్ కళాశాల, కేశవ మెమోరియల్‍ ఉన్నత పాఠశాల, మహరాజ్‍గంజ్‍లో ప్రాథమిక పాఠశాల వృద్ధికి కృషి చేస్తూ వివిధ పదవులను అలంకరించారు. శ్రీ గుప్తగారు ధూల్‍పేటలోని ప్రభాత్‍ హిందీ విద్యాలయమునకు అధ్యక్షులుగా ఉండిరి. ఈ విధముగా శ్రీ గుప్తగారు హైదరాబాదు నందలి పెక్కు విద్యా సంస్థలకును, గ్రంథాలయములకును అందించిన సేవలు ప్రశంసనీయమైనవి.


శ్రీ గుప్త గారు ఖైరతాబాదు నందలి వాసవీ సేవా కేంద్రమును 1971లో స్థాపించి దానికి అధ్యక్షునిగాను మరియు వాసవీ ఫౌండేషన్‍కు అధ్యక్షులుగా ఉండిరి. వైద్య రంగంలో ప్రజలకు సేవలదించే ఒక ఆశయంతో 1984లో వాసవీ మెడికల్‍ & రీసెర్చ్ సెంటర్‍ అను ట్రస్టును నెలకొల్పి దీనికి 2000 చదరపు గజాల స్థలమును కేటాయించిన ఘనత వారికి దక్కింది. ఈ సెంటర్‍లో హాస్పిటల్‍ నిర్మించి అన్నిరకాల వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచింది. ఈ సెంటర్‍లో ఎక్స్రే మొదలుకొని అన్ని ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి.


1982లో వాసవీ కో-ఆపరేటివ్‍ అర్బన్‍ బ్యాంకును స్థాపించారు. దానికి రెండు పర్యాయములు చైర్మన్‍గా, పొట్టి శ్రీరాములు స్మారక సమితి, ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ, సర్దార్‍ వల్లభాయ్‍ పటేల్‍ స్మారక సమితికి కార్యకర్తగా ఉండి ఆ మహనీయుని స్మారక సభలను ఘనంగా నిర్వహించారు. మహిళల అభివృద్ధి కొరకు మహిళా సంఘాలను ఏర్పరచుటయేగాక కాచిగూడలో వైశ్యవిద్యార్థిని (బాలికలు) వసతిగృహమును స్థాపించి సకల సౌకర్యములన్నింటిని కల్పించారు. అలాగే వైశ్యజాతిలో కవులను ఒక దగ్గరకు చేర్చుటకు ‘‘వాసవీ సాహిత్య పరిషత్తు’’ 13-7-1977లో ఏర్పాటు చేసి, రాష్ట్రంలోని కవులను, రచయితలను, కళాకారులను, పండితులను సంఘటితపరచి తెలుగు భాషను అభివృద్ధిపరచుటయే పరిషత్తు యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సంస్థకు శ్రీ సీతయ్య గుప్తగారు గౌరవ అధ్యక్షులుగా ఉండి ఎన్నో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.


శ్రీ సీతయ్యగారు దళిత పక్షపాతి. అందుకే వీరు హైదరా బాదులోని బోరబండ గ్రామంలో ‘‘కొత్తూరి సీతయ్య నగర్‍’’ అని నామకరణం చేసి అనేకమంది హమాలీలకు గృహనిర్మాణం చేయించి సమాజంలో సేవాజ్యోతిగా నిలిచారు. ఆయన 87వ యేట శ్రీ ఈశ్వర నామ సం।।ర. శ్రావణ శుద్ధ పాడ్యమి, సోమవారం 04-08-1997లో తనువు చాలించారు. వారి స్ఫూర్తి మనందరిని ముందుకు నడిపిస్తుందని విశ్వసిస్తున్నాము.


(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
-డా।। కర్నాటి లింగయ్య

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *