కట్టగూరు జమిలి శాసనాలు, శిథిల దేవాలయాల చరిత్ర


కట్టగూరు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం, కట్టకూరు గ్రామంలోని పొలాలలో దొరికిన ఒకే శిలాశాసనంపై ఇద్దరు కాకతీయ మహారాజుల రెండు దానశాసనాలు లిఖించి వున్నాయి. కట్టగూరు ఊరి మొదట్లోనే కాలువ ఒడ్డున ఒక నంది విగ్రహం, అటువైపు చెరువు కట్టమీద పానవట్టం, మరికొన్ని శిథిలశిల్పాలు కనిపిస్తున్నాయి. ఈ శిథిల శివాలయ అవశేషాలు కాకతీయుల కాలం నాటివి. కట్టగూరులోనే మరో కాకతీయ శాసనంకూడా ఉందని తెలుస్తున్నది. ఇటువంటి జమిలి శాసనాలు ముత్తాత గణపతిదేవుడు, మనవడు ప్రతాపరుద్రునివి జనగామ జిల్లా వనపర్తిలో, తాతామనవలు మల్లారెడ్డిలవి బెక్కల్లులో, తండ్రీ, కొడుకులు చెరకు బొల్లయరెడ్డి, ఇమ్మడి విశ్వనాథరెడ్డిలవి జలాలుపురంలో వేయబడినవి చరిత్రలో ఉన్నాయి. ఇంకా మరెన్నో జమిలి శాసనా లున్నాయి.


హైద్రాబాద్‍ ఆర్కియాలజికల్‍ సిరీస్‍ లో భాగంగా 1956లో ప్రచురించబడిన 19వ సంపుటం ‘A Corpus of inscriptions in the Telingana Districts (of Andhra Pradesh)’లో కట్టగూరులోని మూడు శాసనాలు కనిపిస్తున్నాయి. వీటిలో మొన్నీమధ్య కొత్తతెలంగాణ చరిత్రబృందం చరిత్రకారుడు కట్టా శ్రీనివాస్‍ వెతికి, అచ్చుతీసి వెలుగులోనికి తెచ్చిన కాకతీయపాలకులు ముత్తాత-మనవల జంట శాసనాలలో శ్రీగోపీనాథ స్వామి ఆలయదానాల విశేషాలు వున్నాయి. ఒకదానిలో ముత్తాత అనుమ కొండపుర వరాధీశ్వరుడు కాకతి గణపతిదేవ మహారాజులు కట్టగూరులో క్రీ.శ.1258లో ఆలయానికి తిరుప్రతిష్ట చేయించిన విషయం తెలిపితే, అదే శిలాస్తంభంపై మునిమనవడు ఓరుగంటి పురవరాధీశ్వరుడు కాకతి ప్రతాపరుద్రదేవ మహారాజులు 45 ఏళ్ళ తర్వాత క్రీ.శ.1303లో అదే దేవుని నగరిభోగానికి చేసిన దానం వివరాలతో మరో శాసనం వున్నాయి. గణపతిదేవుని మొదటి శాసనం మంథని అగ్రహారంలో అగుపిస్తుంది. అది కూడా గోపీనాథుని పేరన వేయబడ్డ శాసనమే. పై రెండు శాసనాలలో దానాలుచేసిన వివరాలు, పాటించిన నియమాలు కాకతీయుల కాలంనాటి దేవాలయ నిర్వహణ, పన్నుల పద్ధతి, సామాజిక నిర్మితిని తెలియ జేస్తున్నాయి. తాత, మనవల కాలాలకు మధ్య మత, సాంస్కృతిక విశేషాలను వివరిస్తున్నాయి శాసనాలు.


తెలుగుభాషలో, తెలుగులిపిలో చెక్కబడిన కట్టగూరు మూడో శాసనంకూడా ప్రతాపరుద్రుని కాలందే. ఈ శాసనం ఇపుడెక్కడుందో తెలియదు. గోపీనాథ శాసనం వేసిన ఏడేళ్ల తర్వాత క్రీ.శ.1310లో వేయబడింది. శక సంవత్సరం 1232, సాధారణనామ సంవత్సర శ్రావణ శుద్ధ అష్టమి, సోమవారంనాడు మహామండలేశ్వరుడు కాకతీయ ప్రతాపరుద్రదేవ మహారాజులు రాజ్యం చేస్తున్నపుడు, అష్టాదశప్రజల ఆస్థానం కట్టంగూరిలోని మల్లేశ్వర దేవరకు, కేశవదేవరకు భోగాలకు నగరికి సిద్ధాయాల పుట్టుబడికి ఒక్కొక్క మాడ (మాడకు 5రూకలు)కు 5వీసాలు(రూకలో 16వ వంతు) చొప్పున ఆచంద్రార్కం చెల్లేటట్లు, పన్ను విడిచి(పన్నులు లేకుండా) ధారవోసింది. ఈ దానశాసనాన్ని పాటించిన వారికి మొక్కుతానని ఓరుగంటిదాసుడు(?) విన్నవించు కున్నాడు. దాస శబ్దం వైష్ణవంతో ముడిపడి వుంటుంది కనుక ఈ దాత వైష్ణవభక్తుడై వుండాలి. ఈ దానాన్ని అష్టాదశప్రజలు తమ ఆస్థానంలో (కొలువు) నిర్ణయించారు. నగరం నుంచి లభించే (పుట్టుబడి) సిద్ధాయం(శాశ్వతమైన పన్నువిధానం) నుంచి ఇద్దరు దేవరల భోగాలకు చెల్లేటట్లు కట్టుబాటు చేయబడ్డది. ముందటి జంట శాసనాలలోని ప్రతాపరుద్రుని శాసనంలో కూడా మహాజనులు(బ్రాహ్మణులు), నగరము(నకరం వ్యాపారుల సంఘం), కాపులు, బలంజి సెట్టిలతోపాటు 18జాతుల (అష్టాదశ) ప్రజలు పెట్టిన దత్తి(దానం) ప్రస్తావించబడ్డది. అయితే ముత్తాత గణపతిదేవుని కాలంలో వేయబడిన బుఱ్ఱసుంకం (తలపన్ను – Poll tax అంటే స్థానికసేవలు పొందుతున్న పౌరులు చెల్లించాల్సిన సుంకం) మనవని శాసనంలో లేదు. తాతకాలంలో ఇచ్చిన విత్తులు (జీవనాధారం కొరకు చేసిన దానాలు) దేవరసేవలో ఉన్నవారికి, అయితే మనవనికాలంలో అవి ప్రత్యేకంగా బ్రాహ్మణ విత్తులుగా పేర్కొనబడ్డాయి.


కట్టగూరు శాసనాలు ఒకటి కాదు మూడున్నాయి. ముగ్గురు గోపీనాథ, మల్లేశ్వర, కేశవ దేవరలున్నారు. తాత మనవల శాసనాల స్తంభం దొరికిన పరిసరాల్లోనే దేవాలయ శిథిలాలున్నాయి. వాటిలో కాకతీయశైలి చతురస్రాకారపు పానవట్టం ఉంది. ముఖపట్టం, వీపున అలంకరించిన గజ్జెలపట్టెడలను కట్టిన దర్భముడితో ఎర్లీ కాకతీయ శైలి నంది ఉంది. దేవాలయ ద్వారబంధపు రాతిస్తంభఫలకం వుంది. కాకతీయులకు పూర్వకాలానికి అంటే రాష్ట్రకూట శైలి నాగశిల్పం
ఉంది. దేవాలయశిథిలాలలో ఒక భగ్నశిల్పాన్ని తాత, మనవల శాసనంలో పేర్కొనబడిన గోపీనాథుని విగ్రహంగా గుర్తించాను. ఈ శిల్పంలో రెండువైపుల ఇద్దరు స్త్రీమూర్తులు కుడి, ఎడమ చేతులలో పద్మాలను ధరించి, పరివారంతో భూదేవి, శ్రీదేవిల వలె ఉన్నారు. వారి మధ్య విరిగిన ఎడమ పాదం, దానికి ఎడమవైపు మరొకపాదం ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇది ఎడమకాలికి అడ్డంగా కుడికాలును అవతలపెట్టి నిల్చుని వేణువాదన చేస్తున్న గోపాలకృష్ణుని స్థానకభంగిమ అవశేషం. కనుక ఇది ఖచ్చితంగా శాసనంలో ప్రధానంగా ప్రస్తావించబడిన గోపీనాథుని విగ్రహమని చెప్పవచ్చు. అంటే ఈ జంటశాసనాల స్తంభాలున్న చోటే గోపీనాథదేవాలయ ముండేదన్న మాట.


కట్టగూరులో మిగిలిన దేవా లయాల శిథిలాలు ఎక్కడున్నాయి? ఒకనాటి చారిత్రక వైభవ శిల్పసంపద లేమైనాయి? కాకతీయులనాటి పాలనను, సాంఘికచరిత్రను వివరించే ఈ శాసనాలతో కట్టగూరు మట్టిలో నిక్షిప్తమైన చరిత్రను తవ్వి బయటికి తీయాలి. చరిత్రను, సాంస్కృతిక పరిణామ విశేషాలను అన్వేషించాలి.
ఖమ్మం జిల్లా శాసనాల సంపుటి నేటికి ఇంకా ప్రచురించబడనే లేదు. ఎన్ని శాసనాలు సేకరించబడ్డాయన్న లెక్క పురావస్తుశాఖకే తెలియాలి. వెతికినకొద్ది శాసనాలు దొరుకుతున్న పాతఖమ్మం జిల్లా పరిధిలో వెలుగు చూడాల్సిన తెలంగాణ చరిత్ర ఎంతో వుంది. మా కొత్తతెలంగాణ చరిత్రబృందం అన్వేషణలో ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, రాజేశ్వరపురం, కూసుమంచి, చొప్పకట్లపాలెం, సంకీసపురం శాసనాలు కొత్తగా వెలుగుచూసాయి. ముదిగొండ చాళుక్యులు ఒకప్పటి విసురునాడును, ముదిగొండ విషయాన్ని మూడువందలేండ్లకు మించి పరిపాలించినా ముదిగొండచాళుక్యుల గురించి తెలిపే శాసనాలు అన్నీ కలిపి ఏడే ఉన్నాయి. కొత్త శాసనాలు దొరుకుతాయేమోనన్నది పెద్దఆశ. ముదిగొండ చాళుక్యుల ఒకప్పటి రాజధాని ముదిగొండకు పరిసరాల్లోనే ఈ చారిత్రక ప్రాధాన్యమున్న ప్రదేశాలున్నాయి.


ముత్తాత కాకతీయ గణపతిదేవుడు, మునిమనవడు కాకతీయ ప్రతాపరుద్రుల జమిలి శాసనం:
రాజ్యం : కాకతీయ
శాసన లిపి : తెలుగు
శాసన భాష : తెలుగు
కాలం : శాలివాహన శకం రౌద్రి నామ సంవత్సరం 1180 వైశాఖ మాసం శుద్ద 1 (గణపతిదేవ మహారాజు కాలం గోపీనాథుని తిరు ప్రతిష్ట జరిగింది) అంటే అది క్రీ.శ 1258 ఏప్రియల్‍ నెల 21వ తారీఖు ఆది వారం
కాలం : శాలి వాహన శకం శోభక్రుతు నామ సంవత్సరం 1225 శావణ మాసం శుద్ద 11 గురువారం (ప్రతాప రుద్రుని కాలంలో నగరి భోగానికై దానం) అంటే క్రీ.శ 1303 అగష్టు నెల 2వ తారీఖు గురువారం
రెండు శాసనాల మధ్య 45 సంవత్సరాల ఐదు నెలల పైగా విరామం ఉంది.
మొదటి వైపు : హనుమంతుడు, రెండవ వైపు : గరుడుడు, మూడవ వైపు : శంఖు చక్రాలు, నాల్గవ వైపు : సూర్యచంద్రులున్న వైపు శాసనం లేదు. ఖాళీగా వుంది.
మొత్తం శాసన పంక్తులు: 47ం38ం14 – 101


శాసనపాఠం:
మొదటివైపు (హనుమంతుని శిల్పం)

  1. స్వస్తి శ్రీ విజయాభ్యుదయశ్చ
  2. భవతు స్వస్తి సమధిగత
  3. పంచ మహాశబ్ధ మహా
  4. మండలేశ్వర అనమకొం
  5. డ పురవరాధీశ్వర పరమ
  6. మాహేశ్వర వీరలక్ష్మీ నిజేశ్వ
  7. ర పతిహిత చరితం పరహి
  8. (త) సాధక వినయ విభూషణ
  9. (శ్రీ) మన్మహా మండలేశ్వర కాక
  10. (తీయ) గణపద్దేవ మహా
  11. (రాజు)లు విజయ ముత్తరో
  12. (త్తరా) భి వ్రిద్ధి ప్రవద్ధ మాన మా
  13. (చం)ద్రాతారముగానుం బ్రి
  14. (ధి)వి రాజ్యంబు సేయుచుండ
  15. స్వస్తి శ్రీ జయాభ్యుదయ శ
  16. క వర్షంబులు 1120 యగు
  17. నేంటి రౌద్రి సంవత్సర వైశాఖ
  18. శుద్ధ 1 గు ll కట్టంగూరను ఇట్టి
  19. కాల్వ మశ్యటి శ్రీ గోపీనాథని
  20. తీ(తే)రు ప్రతిష్ట సేయించి ఆ
  21. కాలమందు పెట్టించిన వ్రిత్తు
  22. లు పెద్ద చెఱువు వెనక దామపెది
  23. వెరితమ అంద తాటి కాల్వ
  24. ను మ 1 ll కుంటల మయపూ
  25. పుందోంట బుఱమింకను …
  26. … మడి చహారమందు మాడన
  27. సగ్గంపలిని ఈందుల తోంట
  28. ఇల్ల్యు? పట్టే వారు ధారవోసిన
  29. (వె)లి వొలమున 17 అపటి చ
  30. వుటి పడెరే 1 తలదేవర పళని వెలి
  31. (వొ)లమున 10 కాదింజిఱ పడిద
  32. (ము) వెనుకరే 1 అంద వెలివొల
  33. ముఖ 1 తదనంతరంబ 1 గరగ
  34. ….. డి గూన అల్లడ దాసులకాట
  35. …లు ఎల్లయ గోపయ అల్లాడ
  36. …… దండును వీరల చేసిన …
  37. 0ఱనులు క్రయధారాలు వోఇ
  38. 0చిన వ్రిత్తులు కట్టంగూరనె ఆ
  39. చెఱ్వు వెనక కాంటి కాల్వను రే1
  40. అందవేము కాల్వమర్‍ ఎవో ఆ తూ
  41. ప్పునర్‍ః = అంద గుంటఱర్‍ 10
  42. బేతరాజు వ్రంత కాల్వను మూగ
  43. వాతర్‍ ll గోసగి చేను కందల
  44. ఆకుర్‍ ఎ = అంద చదురము కా
  45. ల్వను కోటచేమర్‍ ఎ గానుగులు
  46. రెండు 2 తాంటి కాలువ
  47. మేగ వ(నా)తనుర్‍


రెండవ వైపు (గరుడుని శిల్పం)

  1. స్వస్తశ్రీ విజయాభ్యు
  2. దయశ్చ భవతు స్వ
  3. స్తి శ్రీ శక వరుషం
  4. బులు 1225 అగుం
  5. నేంట్టి శోభక్రుతు సం
  6. 0వత్సర శ్రావణ
  7. శు 11 గురువారా
  8. న స్వస్తి శ్రీ మన్మహా మ
  9. 0డలేశ్వర కాకతీయ
  10. ప్రతాపరుద్ర దేవ మ
  11. హా రాజులు ప్రిథివీ రా
  12. జ్యము సేయుచుండ
  13. 0గాను కట్టంగూరి
  14. శ్రీ గోపీనాధ దేవర
  15. నగరి భోగానకు ప్ర
  16. తాప రుద్రదేవ మహా
  17. రాజులక పుణ్యము
  18. గాను అందుల మహాజ
  19. నాలును నగరమూను
  20. oపులూను బలంజి
  21. సెట్టికాండ్రూ సైతమయి
  22. న పదునెన్మిది జాతుల ప్ర
  23. జాను బెట్టిన దత్తి కట్టంగూ
  24. రాను కాత్తీన్క వైశాఖాలు
  25. నీర్నేల అచ్చుకట్టు దుక్కి వడ్డపొ
  26. లమున కెల్లాను దేవరా
  27. యము కారు ఒకటికి
  28. ముఱ్తురు మాడబడి
  29. చిన్నము లెక?ను కారు
  30. గారున కిస్తిమి మహా
  31. లింగ్గస్థానాల వ్రిత్తుల
  32. కెల్లాను దేవరాయము
  33. తరి మడి దున్నినా లేదు కా
  34. 0పు దున్నినా లేదు గోపి
  35. నాథుని వ్రిత్తుల
  36. కెల్లా [qT] నంధు
  37. లు దున్నినలేదు కాంపు
  38. దున్నినం బెట్టేది.


మూడవ వైపు (శంఖు, చక్రాల చిహ్నాలు)

  1. బ్రాహ్మణ వ్రిత్తులు తమ
  2. తమ చేల్లుతారే దున్ని(న)
  3. 0దారే దేవరాయని
  4. టేది బ్రాహ్మణ వ్రిత్తి ఱే(గ)
  5. డవడికు దేవరాయుండు (దు)
  6. న్నిన కాంపెడి పెట్టిన గాని ఆ వ్రి
  7. త్తి కాని మీందం గూడ
  8. గొనలేదు ఈ దత్తి ఆ (చ)
  9. 0ద్ర స్థాయిగాని (స్తి)
  10. మిః స్వదత్తం ద్విగుణ
  11. 0 పుణ్యం పరదత్తా
  12. ను పాలినాం పరద
  13. త్తాపహారేణ స్వ(ద)
  14. త్తం నిష్ఫలం భవేతు
    క్షేత్రపరిశోధన, సమాచార సేకరణ, ఫోటోగ్రఫీ:
    కట్టా శ్రీనివాస్‍, 9885133969
  • శ్రీ రామోజు హరగోపాల్‍,
    ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *