గోపాలురు – భూపాలురు


అనగనగా ఐదు వేల సంవత్సరాల క్రితం మధ్య ఆసియా నుండి గుర్రాల నధిరోహించిన కొన్ని గుంపులు మన దేశానికి ‘‘మిడతల దండులా’’ వలస వచ్చారు. వారందరు ‘‘పీతకేశులు’. అనగా బంగారు రంగు జుట్టు గలవారు. నీలి కన్నుల వారు. వారి కనులలో నీలిసముద్రాల నీలినీడలు కదలాడేవి. వారు రాగి వర్ణపు శరీరాల వారు. స్థానికులైన ‘‘ద్రావిడులు’’ వారిని ‘‘ఆర్యులు’’ అన్నారు. ఆర్యుల నాయకుడు ‘‘ఇంద్రుడు’’. ద్రావిడుల నాయకుడు ‘‘దివోదాసు’’. ఆర్యద్రావిడ సంగ్రామాలు, సంఘర్షణలు జరిగిజరిగి చివరికి వర్ణ సంక్రమణాలతో, సమ్మేళనాలతో పాలునీళ్లలా, ‘‘పాన్‍సుపారీ’’లా కలిసిపోయారు. ఈ కథ అంతా మనం మహామహాపాధ్యాయ్‍ పండిత్‍ రాహుల్‍ సాంకృత్యాయన్‍ రాసిన ‘‘ఒల్గాసే గంగా’’లో చదవవచ్చు.


మరి ఆర్యులు భారతదేశానికి ఎందుకు వచ్చినట్టు? వందల వేలున్న తమ ఆలమందల పచ్చగడ్డికోసం, విశాలమైన పచ్చిక మైదానాల అన్వేషణలో సంచలిస్తూ సంచరిస్తూ సారవంతమైన సింధూ, గంగా- యమున తీరమైదాన ప్రాంతాలకు వచ్చి స్థిరపడినారు. జలం జీవం కదా! ఒకవైపు స్థిర నివాసాలు మరోవైపు గలగలా పారుతున్న గంగాజలాలు. మరింకేం? పశుపోషణ కాస్తా వ్యవసాయానికి దారి తీసింది. నదీ- నాగరికతలు ఏర్పడినాయి. రాజులు రాజ్యాలు అవతరించాయి. అట్లా అట్లా ‘‘గోపాలురు భూపాలురు’’ ఐనారు. గోపాలులను ‘‘గొల్లవారు’’ అని కూడా అన్నారు. వెన్నను దొంగిలించిన ఒక చిన్న చిలిపి నల్ల గొల్ల పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యి శ్రీకృష్ణుడుగా మారి ‘‘యాదవుల’’ కులానికి పేరు ప్రతిష్టలు సంపాదించి ‘‘గీతాకారుడు’’ ఐనాడు.


అగ్గో! అటువంటి గొల్ల కులం నుండి వచ్చిందే ఒక గొల్లరాణి. ఆమె అసలు పేరేమిటో ఎవరికి తెలియదుగాని అందరూ ఆమెను గొల్లరాణి అనేవారు. ఆమె పరిపాలించిన ప్రాంతం పేరు, రాజ్యం పేరు ‘‘గొల్లకొండ’’. కాకతీయుల కాలంలో గొల్లకొండ రాజ్యం ఒక చిన్న సామంత రాజ్యం. ఆ యాదవ రాణి ప్రతి ఏటా ఓరుగల్లులోని కాకతీయ రాజులకు కప్పం చెల్లించేది. అడివిలో పశువులను మేపుతూ గొల్లలు కనుక్కున్న ఒక గుండ్రటి కొండ మీద ఆ రాణి ఒక మట్టి కోటను నిర్మించింది. అందరూ దానిని ‘‘గొల్లకొండ’’ అనసాగారు. కాకతీయ రాజ్యపతనానంతరం బీదర్‍ నుండి వచ్చిన బహమనీ నవాబు గొల్లకొండను ఆక్రమించుకున్నాడు. కొండ గుండ్రంగా ఉందనో లేక సరిగ్గా పలుకరాకనో ‘‘గోల్‍కొండ’’ అన్నాడు. అట్లా గొల్లకొండ గోల్కొండ అయిపోయింది. ఇప్పుడు మనకున్న అన్ని పేర్లు అపభ్రంశపు పేర్లే కదా!


బహుమనీ నవాబు తన ‘‘తరఫ్‍దార్‍’’గా (గవర్నర్‍) మొదటి కులిఖుతుబ్‍ షాను గోల్కండకు పంపగా కుతుబ్‍షా హీ నవాబుల పరిపాలన ప్రారంభమయ్యింది. ఆ బంగారు దినాలలో ముచికుందా నది (మూసి) ఒక జీవనదిలా పుష్కలమైన నీటి సంపదతో గలగలా ప్రవహించేది. ప్రతి వర్షాకాలంలో వరదలు వచ్చేవి. నగరంలో నదీ తీర ప్రాంతాలలో పచ్చగడ్డి సమృద్ధిగా దొరికేది కావున గొల్లవారందరూ అక్కడే తమ ఆలమందలతో స్థిరనివాసాలు ఏర్పరచుకున్నారు. అట్లా గౌలిగూడ, గౌలిపురా, గొల్లకిడ్కీ, గౌలిదొడ్డి బస్తీలు ఏర్పడినాయి. అక్కడ ఉండే గొల్లభామలు తమ తలలపై పాల కుండలను, పెరుగు కుండలను పెట్టుకుని నగరంలోని వాడవాడలా తిరిగి అమ్ముకునేవారు. అరవైఏండ్ల క్రితం నగరంలో ఉషోదయాన ఎక్కడ చూసినా ‘‘మథురా నగరిలో చల్లనమ్మబోదు’’ అన్నట్లు ఆ దృశ్యాలే కమనీయంగా కనబడేవి. ఆ తర్వాత సీసాపాలు, పాకెట్‍పాలు, డెయిరీఫాంలు, కార్పొరేట్‍ సంస్థలు వచ్చి స్థానికులైన గొల్లల నోటిలో మట్టిగొట్టారు. అంతరించిన అన్ని కులవృత్తుల్లాగే అది కూడా ఒక కన్నీటి కథ.


హైద్రాబాద్‍ నగరానికి పన్నెండు దర్వాజాలు, పన్నెండు కిటికీలు ఉండేవి. అందులో ఒక కిడ్కీ పేరే ‘‘గొల్లకిడ్కీ’’. ఇది పాతనగరం హుసేనీ ఆలం పక్కన ఉంటుంది. గొల్లకిడ్కీ బస్తీలో ఒక భాగమే ‘‘ఖబూతర్‍ ఖానా’’. పావురాలను ఖబూతర్లు అంటారు. ముస్లిం సంస్కృతిలో ఖబూతర్లను పెంచటం ఒక హాబీ, ఒక వినోదం. మార్వాడీలు, జైనులు దయాదృష్టితో వాటికి గూడు లను, స్తంభాలను నిర్మించి వాటికి గింజలను వెదజల్లుతారు. పన్నెండు దర్వాజాలలో ఒక దర్వాజా పేరు ‘‘గౌలిపురా దర్వాజా’’. 1950లలో వీధులను విశాలం చేసే కార్యక్రమంలో ఈ దర్వాజా కాలగతిలో కనుమరు గయ్యింది. కాలవాహిని అలల వాలున నగరంలోని దర్వాజాలు, కిటికీలు కొట్టుకపోయాయి. గౌలిపురా చౌరాస్తాలో జానకిరాం అనే పాత హోటల్‍ ఇప్పటికీ ఉంది. అందులో ఒక పెద్ద నలుపుతెలుపుల తస్వీర్‍ (ఫోటో) ఉంది. అప్పటి ఆ దర్వాజా వైభవం, అప్పటి మనుషులు, వారి కట్టుబొట్టు జుట్టు ముఖ కవళికలన్నీ ఆ తస్వీర్‍లో చూసి ఒక నోస్టాల్జియా, ఒక మెలాంకలీ అనబడే చిదానందస్థితిలోకి మనం వెళ్లిపోవచ్చు. ఆసక్తికలవారు గుజ్రేజమానా, పురానా జమాను యాది చేసుకోవచ్చు.


ఇకపోతే గౌలిపురా ‘‘మేకల మండి’’ మహామశూర్‍ ఐత్వారం నాడు (ఆదివారం) అందరికీ తాతీల్‍ కదా! (సెలవు దినం) ఆ దినం పొద్దుపొద్దుగాల్నే లేసి చలిచలి చిరుగాలులల్ల గజగజ వొణుకుకుంట, బట్టసంచీ చేతుల పట్టుకుని నడుచుకుంట మేకల మండీకి పోతే కాళ్లు, తలకాయలకూర, కలేజా, బేజా, బోటీ, నల్ల అన్నీ అగ్గువ సగువకు తక్కువ ధరకు దొరికేయి. మండీలో పరిచిన షాబాద్‍ బండల మీద తడితడిగా పారే రక్తం మడుగల మీద నడుస్తుంటే కాల్జారేది. అదొక భీభత్సరస (క్త) ప్రధాన దృశ్యం. గదరు గదరు నెత్తురు వాసన అంతటా గుభాళించేది. కండ్లు మూసుకుని జ్ఞాపకంచేసుకుంటే ఇప్పటికీ ఆ గదరు గదరు వాసన మన ముక్కుపుటాలకు సోకుతుంది.


సూర్యచంద్రుల్లాగే మేకల మండి పక్కన కల్లు కాంపౌండ్‍. మేకల మండి వైభవాన్ని ఉదయం పూట తిలకిస్తే కల్లు కాంపౌండ్‍ వైభవాన్ని సాయంత్రం చూసి తరించాలె. హరివంశ్‍రాయ్‍ బచన్‍ భాషలో అది ‘‘మధుశాల’’. దువ్వూరి రామిరెడ్డి కవిత్వంలో అది ‘‘పానశాల’’. గాలిబ్‍ షాయరీలో ‘‘షరాబ్‍ఖానా’’. మోదుగాకులతో కుట్టిన దొప్పలల్ల గరం గరం ‘‘చాక్నా’’ షోర్వా నంచుకుంటనో, లేక బాగా కాలిన కబాబు సీకులను కొంచెం కొంచెం కొర్కుతింటనో కడుపుల తియ్యటి పుల్లటి తాటి కల్లో ఈత కల్లో పడంగానే లల్లాయి పదాలు అక్కడ జాలువారేవి. సారాను చెప్టి, రాసి, దుబారా అని సీసలల్ల అమ్మేవారు. కల్లు కాంపౌండ్‍లల్ల తడకలు కట్టి ఆడోల్లకు మోగోల్లకు సపరేట్‍ సపరేట్‍ సెక్షన్లు ఉండేటివి. కడుపుల చుక్క పడేసరికి కష్టాలు కన్నీళ్లు కవిత్వరూపంలో ఇవతల బడేవి.
‘‘పీనా బురా నహీఁ హై దోస్‍
పీనేకే బాద్‍ హోష్‍ మే ఆనా హీ బురాహై’’

అని అక్కడే సొక్కిసోలి తూలి క్రిందపడి నిద్రపోయే వారు చాలా మంది. క్లబ్బులు, పబ్బులు ఇంకా పుట్టని ఆ రోజులల్ల పాతనగరంలోని గాజీబండ, పీసల్‍ బండ, లాల్‍దర్వాజ, గౌలిపురా కల్లు కాంపౌండ్లు బాగా మషూర్‍.


దీపావళి తెల్లారి యాదవుల ‘‘సదర్‍’’ ఉత్సవం చాలా ప్రత్యేకమైనది. దున్న పోతులను బాగా అలంకరించే వారు. కొమ్ములకు రంగులు పూసి చెమ్కీ దండలు కట్టేవారు. కొండొకచో కాళ్లకు గజ్జెలు కూడా! యాదవులందరూ తలలకు రంగురంగుల శమ్లాలు చుట్టుకుని, చేతులల్ల లంభాచౌడా లాఠీలు పట్టుకుని డప్పులు కొట్టుకుంట, ‘‘దద్దడ్‍ కీ దద్దడా’’ దరువులకు అనుగుణంగా లయబద్దంగా అడుగులు వేసుకుంట నాట్యం చేసేవారు.
ఇక గొల్లవారి గొల్లసుద్దుల గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎర్రంచులున్న నల్ల గొంగళ్లి బుజాలపై వేసుకుని కాళ్లకు గజ్జెలు కట్టుకుని ‘‘గొర్రెల గోత్రాలు గొల్లోలకు ఎరిక’’ అని మొదలు బెట్టి ‘‘అమ్మ భారతి అమ్మమ్మ భారతి అమ్మోభారతాంబ’’ అని కథలు చెప్పేవారు.
తెలంగాణా ప్రజలకు ‘‘జ్ఞానభిక్ష’’ ప్రసాదించిన ఘనత వహించిన ‘‘గౌలిగూడ’’ గురించి ఇంకా తెలుసుకుందామా?


(షహర్‍ నామా (హైద్రాబాద్‍ వీధులు – గాథలు) పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్‍,
ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *