గలగలా పారే ముచికుందా నది తీరాన పుష్కలంగా లభించే పచ్చగడ్డి భూములలో గొల్లల ఆవాస నివాసాలు ఏర్పడేసరికి ఆ ప్రాంతం గొల్లగూడెం నుండి గౌలిగూడాగా మారింది.
‘‘ఒకే ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్లకు కదలిక’’ అన్న కవిత్వం కార్యాచరణకు దిగింది ఈ గౌలిగూడాలోనే. అక్కడి రామమందిరం వీధిలో సుబ్బారావు హోటల్ ఉండేది. ఈ హోటల్ 1920లలో ప్రారంభమయ్యింది. ఇరవయ్యవ దశకంలోనే నగరంలో హోటళ్లు ప్రారంభం అయినవి. నగరానికి ఎవరైనా కొత్తగా వస్తే అన్నదాన సత్రాలలో ఉచిత భోజనాలు చేసేవారు. లేదా బంధువుల ఇళ్లల్లో చేసేవారు. ధనికుల ఇళ్లల్లో యాభై, వంద విస్తర్లు లేచి పంక్తి భోజ నాలు జరిగేవి. ఇంటికి ఎవరైనా చుట్ట మొస్తే ‘‘తలకాయ కోసి పీట వేసే’’ సంస్కృతి ఆ రోజులలో అంతటా ఉండేది.
తొలి దశలో ‘‘చాయ్ ఖానా’’లు ప్రారంభమైనాయి. అందులోకి వెళ్లటానికి చాలా మంది సారా దుకాణానికి వెళ్లి సారా తాగినట్టు సిగ్గుపడేవారు. గౌలి గూడా రాంమందిర్ గల్లీలో సుబ్బారావు హోటల్ నగరంలో మొదటి హోటల్. అక్కడ నగరవాసులకు అంత వరకు తెలియని కాఫీ, టీ, ఇడ్లీ, వడ, దోసెలు దొరికేవి. ఇదే వీధిలో నరసింహాచార్యుల వారి పూటకూళ్ల సత్రం ఒకటి ఉండేది. యాత్రికులు వచ్చి ముందుగానే పైసలు ఇస్తే ఉప్పులు, పప్పులు, కూరగాయలు తెప్పించి వంట చేసేవారు. వైష్ణవులందరూ అక్కడే భోజనాలు చేసి విశాలమైన హాలులో పడుకునేవారు.
గౌలిగూడాలో గురుద్వారా దాటినాక శంకర్‌శేర్ హోటల్ ఉండేది. ఇది మహా మషూర్ హోటల్. ఏకానేకో మలయ్దార్ చాయ్. దానిని పౌనా అని కూడా అనేవారు. అనగా మూడొంతులు చిక్కని మీగడ తేలుతున్న మరిగిన పాలు. ఒక వంతు డికాషన్ మూడు పైసలకు సింగల్ చాయ్. ఒక పైసకు లవంగం గుచ్చిన పాన్. ఒక పైసకు నాలుగు చార్మినార్ సిగరెట్లు. ఇక్కడ ఉత్తర భారత పద్దతిలో పూరీ, సాగ్బాజీ, ప్యాజ్ పకోడా, భాజీ పకోడాలు లభించేవి.
సరే మళ్లీ మనం సుబ్బారావు హోటల్లోకి వెళ్లుదాం. అక్కడ కడుపు ఆకలి తీరటమే గాక మెదడుకు మేత కూడా దొరికేది. అదే అణా గ్రంధమాల పుస్తక ఉద్యమం. ఏ పుస్తకం తీసుకున్నా ధర మాత్రం ఒక్క అణా – ఏకానా మాత్రమే! ప్రతి పుస్తకం క్రౌన్ సైజులో ఎనభై పేజీలు ఉండేది. ఒక దోసె తిని, కమ్మటి కాఫీ త్రాగి, పుస్తకం ఒకటి తీసుకుని పావలా (చారానా బిళ్ల) ఇస్తే ఒక ఏకానా (అణా) వాపస్ ఇచ్చేవాడు. ఈ అణా గ్రంధమాల పుస్తక ప్రచురణ కర్త కె.సి.గుప్త గారు. సంపాదకుడు వెల్దుర్తి మాణిక్యరావు. వీరు ప్రచురించిన వీర సావర్కార్ జీవిత చరిత్ర నిషేధానికి గురైంది. ‘‘రైతు’’ అన్న పుస్తకం కూడా అంతే. సురవరం ప్రతాప రెడ్డి రాసిన ‘‘మొగలాయీ కతలు, కాళోజీ కథలు కూడా ప్రచురించారు. మగ్ధూం రాసిన ఉర్దూ కవితా సంపుటిని కూడా ప్రచురించారు. అణా గ్రంధమాల కార్యాలయం ట్రూప్స్ •జారులో ఉండేది. చందా దారులకు ఐదు రూపాయలకు నూరు పుస్తకాలు లభించేవి. అనగా 20% డిస్కౌంట్ అన్నమాట. ఈ అణా గ్రంధమాల ఉద్యమం తెలంగాణాలో అక్షర విప్లవానికి దారి తీసి నిజాం నవాబును గడగడ లాడించింది.
పుస్తకాలను ముద్రించే అచ్చు యంత్రాలు (ప్రింటింగ్ ప్రెస్) కూడా ఈ గౌలిగూడాలోనే ప్రారంభ మైనాయి. ఇప్పటికీ చాలా ప్రింటింగ్ ప్రెస్సులను మనం ఇక్కడ చూడ వచ్చు. వీటన్నింటిలో మొదటిది చందక్రాంత ప్రింటింగ్ ప్రెస్. దీనిని స్థాపించిన వారు, ప్రముఖ సంఘ సేవకుడు శ్రీకృష్ణస్వామి ముదిరాజ్. ఇతను చాలా పేద కుంటుంబంలో జన్మించినా స్వయం కృషితో అనేక భాషలను నేర్చుకున్నాడు. కొంత కాలం పోలీసు జవాన్‌గా ఉద్యోగం చేసినా చదువుమీది మమకారంతో దానికి రాజీనామా ఇచ్చి ఇతరుల సహకారంతో ఇంటర్ వరకు చదివి టైపు, షార్ట్‌హాండ్ పరీక్షలలో పాస్ అయ్యి హైద్రాబాద్ ప్రధానమంత్రి మహారాజా కిషన్ పర్షాద్ వద్ద అంతరంగిక కార్యదర్శిగా పనిచేసి ఆయన వెంబడి అనేకసార్లు ఉత్తర భారతదేశమంతా పర్యటించాడు. ఆ తర్వాత ఎ.జి.ఆఫీసులో ఉన్నతాధికారిగా పది సంవత్సరాలు పనిచేసి ఆ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి బొంబాయి వెళ్లి ప్రింటింగ్ మరియు పబ్లిషింగ్ కోర్సులో శిక్షణ పొంది హైద్రాబాద్‌కు తిరిగి వచ్చి గౌలిగూడా రాంమందిర్ వీధికి ఎదురుగా ‘‘చందక్రాంత ప్రింటింగ్ ప్రెస్’’ను స్థాపించాడు. చందక్రాంత ఆయన ముద్దుల కూతురు. ఆమె పేరుతోనే ఆ ప్రింటింగ్ ప్రెస్సును ప్రారంభించి తనకున్న యావదాస్తిని హారతి కర్పూరంలా అక్షర సరస్వతికి అర్పించాడు. నాణ్యమైన ఆధునిక ప్రింట్ యంత్రాన్ని లండన్ నుండి దిగుమతి చేసుకున్నాడు. ఒక హైద్రాబాద్‌లోనే గాక మొత్తం దక్షిణ భారతదేశంలోనే చందక్రాంత ప్రెస్సు ప్రఖ్యాతిగాంచింది. ఇందులో 1929లో ‘‘పిక్టోరియల్ హైద్రాబాద్’’ మొదటి భాగాన్ని 1934లో రెండవ భాగాన్ని ప్రచురించారు. తెలంగాణా ప్రజలకు అదొక గొప్ప కానుక. కనీవినీ ఎరుగని గొప్ప గ్రంధం – బోలెడన్ని ఫోటోలతో బోలెడంత సమాచారం. ఒక గొప్ప ఎన్క్లోపీడియా విత్ రేర్ ఫొటోస్. ఇప్పటి వరకు అటువంటి పుస్తకాన్ని ఎవరూ ప్రచురించలేక పోయారు. ఆనాటి ప్రముఖులందరూ ఆ ప్రచురణాలయాన్ని సందర్శించి పరవశించి పోయేవారు. దక్కన్ స్టార్, ది న్యూ ఎరా, మసావత్ అన్న పత్రికలకు తనే సంపాదకుడుగా ఉండి ప్రచురించి తెలంగాణా ప్రజలకు అక్షరభిక్ష ప్రసాదించాడు. ఆయన చుడీబజార్ నివాసి. అక్కడున్న ఇంద్రభవనం లాంటి నివాసాన్ని అమ్మి కష్టకాలంలో ‘‘చందక్రాంతకు’’ చందన తాంబూలంలా సమర్పించాడు. 1933లో చుడిబజార్ నుండి మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికై 1955లో నగరపాలక సంస్థకు ఉపమేయర్‌గా 1957లో మేయర్‌గా ఎన్నికైనాడు. జీవితం చివరిదశలో అతిథులు వస్తే అన్నం పెట్టే స్థితిలో కూడా లేక తన తొలినాటి దరిద్రదేవత దగ్గరికే చేరుకున్నాడు. అయితేనేం నగర ప్రజలకు ‘‘పిక్టోరియల్ హైద్రాబాద్’’ అను అమూల్యమైన కానుక అందించి తాను మాత్రం ఆకాశానికి అవతలి వైపు వెళ్లిపోయాడు.

వివేకవర్దనీ బాలురు, బాలికల పాఠశాలలు, వివేకవర్దని కళాశాలల వ్యవస్థాపకుడు ధర్మవీర్ వామన్ నాయక్, కేశవరావ్ కోరాట్కర్ల గురించి చెప్పకపోతే గౌలిగూడకు అన్యాయం చేసినట్లే! ఎందుకనగా వీరిద్దరూ అక్కడ నివసించిన ప్రముఖులే. వీరిద్దరూ మహారాష్ట్రులే. వామన్ నాయక్ పూర్వీకులు మరాఠా దేశం నుండి తెలంగాణాకు కుతుబ్‌షాహీల కాలంలో వలస వచ్చిన వారు. వీరు బ్రహ్మ క్షత్రీయులు. ఆచారాలన్నీ బ్రహ్మణులవే అయినా క్షత్రీయుల గుణాలు కూడా కల్గి ఉండేవారు. వీళ్ల పూర్వీకుడు వెంకోబా నాయక్ వనపర్తి సంస్థానంలో ప్రధాన మంత్రిగా పనిచేసాడు. ఇతని మునిమనుమడు వాసుదేవ్ నాయక్ గౌలిగూడాలో స్థిరపడినాడు. ఈయన ఇంట్లో ప్రతిరోజూ రెండు మూడు వందల మంది పంక్తి భోజనాలు చేసేవారు. ఇతను గొప్ప భక్తుడు. చేతులలో తంబూర పట్టుకుని మరాఠా సంగీత సంప్రదాయంలో పండరిపురంలోని పాండురంగడిని కీర్తిస్తూ భజనలు చేసేవాడు. ఇతని సంతతి వారే గోవింద్ నాయక్. హైద్రాబాద్ సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఉత్తీర్ణుడై కలెక్టర్‌గా పనిచేసాడు. రామచంద్రనాయక్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసాడు. ఇక ధర్మవీర్ నాయక్ సార్థక నామధేయుడు. గౌలిగూడా చుట్టుపక్కల ఉన్న తన స్థలాలన్నీ విద్యాసంస్థలకు 1906లో దానం చేసాడు. ఫలితంగానే ‘‘వివేక వర్ధని’’ స్కూళ్లు, కాలేజీలు నగరంలో నెలకొల్పబడినాయి. కేశవరావ్ కొర్హాట్కర్ ప్రముఖ విద్యావేత్త. తొలిరోజులలో ఆ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా పనిచేసాడు. నైజాం కాలం నుండి హైద్రాబాద్‌లో జరిగిన అనేక
ఉద్యమాలకు వి.వి. కాలేజీ వేదికగా పనిచేసింది.
‘‘నాయక్’’ కుటుంబాల వాళ్లు అగర్బశ్రీమంతులు. వారి స్త్రీలందరికీ ఏడు వారాల నగలు ఉండేవి. హైద్రాబాద్ ప్రజా ఉద్యమాలకు వామన్ నాయక్ మూల పురుషుడు. 1938లో సుల్తాన్ బజార్లో జరిగిన మొదటి సత్యాగ్రహ ఉద్యమంలో ఆయన పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు. తర్వాత కొంత కాలం కాంగ్రేసు అధ్యక్షుడుగా పనిచేసి బూర్గుల రామకృష్ణారావు మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేసాడు.
ప్రముఖ హృద్రోగ నిపుణుడు డా.సుధీర్ నాయక్ ఇతని పుత్రుడే. ఇతని క్లినిక్ ఇప్పటికీ వారి స్వగృహం గౌలి గూడాలోనే ఉన్నది.
1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి గౌలిగూడ ప్రధాన కేంద్రం. తెలంగాణా ప్రజాసమితి కార్యాలయం గౌలిగూడా చమన్ దగ్గరే ఉండేది. మర్రిచెన్నారెడ్డి, మల్లికార్జున్ లాంటి అతిరథ మహానాయకులందరూ ప్రతి సాయంత్రం అక్కడ చేరి భవిష్యత్ ఉద్యమానికి వ్యూహరచనలు చేసేవారు. పోలీసు కాల్పులలో అక్కడి ప్రజలు చాలా మంది అమరులైనారు.
పదేళ్ల క్రితం గౌలిగూడ చమన్ చౌరాస్తాలో తెలంగాణా పబ్లిక్ మీటింగ్ జరిగింది. అక్కడికి చాలా మంది కాళ్లు, చేతులు తెగిపోయిన వారు వచ్చారు. వారందరు వయస్సు మళ్లిన వారే. ఒకొక్కరికి ఒక్కొక్క కన్నీటి కత. వేయి యుద్ధముల ఆరితేరిన వీరయోధులన్నట్లు అరవై తొమ్మిది ప్రత్యేక తెలంగాణా ఉద్యమంల తుపాకీ తూటాలకు గురైన క్షతగాత్రులట! వారందరూ గౌలిగూడా నివాసులే!
అప్పుడు నాకొక పాత హిందీ సీన్మాపాట జ్ఞాపకం వచ్చింది.
‘‘ఇస్ మిట్టీసే తిలక్ కరో
ఏ ధర్తీ హై బలి దాన్ కీ’’
(షహర్ నామా (హైద్రాబాద్ వీధులు – గాథలు) పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్,
ఎ: 91606 80847