జై హింద్! అనే నినాదం జాతీయమైనది. అది భారతీయులకు ఎంతో పవిత్రమైనది. ఈ పవిత్ర నినాద సృష్టికర్త మేజర్ అబిద్ హసన్ సఫ్రానీ. ఆయన హైదరాబాద్‍కు చెందిన వ్యక్తి. అబిద్ హసన్ హైదరాబాద్ నగరంలోని ఒక ఉన్నతమైన కుటుంబంలో 1912వ సంవత్సరంలో జన్మించాడు. ఆయన తల్లి ఫక్రున్నిసా బేగం. ఆమెకు సరోజిని నాయుడు సాంగత్యంలో దేశభక్తి నరనరాన జీర్ణించుకుపోయింది. విదేశీ వస్త్రాలను తగులబెట్టిన మొదటి హైదరాబాద్ మహిళగా ఆమె అందరి మన్ననలను పొందగలిగింది.
మహాత్మాగాంధీ, నెహ్రూ, ఆజాద్ మొదలైన అగ్రనాయకులు ఆమెను ‘అమ్మాజీన్’ అని పిలిచేవారు. ఆమెకు ముగ్గురు కుమారులు. అందరూ విద్యావంతులే. మత సామరస్యాన్ని కాపాడడానికి వీరంతా కృషి చేసినవారే. వీరు వార్ధాకో, సబర్మతికో పోయినపుడు ఆ విషయం ముందుగా గాంధీజీకి తెలియజేసేవారు. వీరిపై గల గౌరవం చేత తన ప్రియ శిష్యుడైన ప్యారేలాల్‍ను వారికి స్వాగతం పలకడానికి రైల్వే స్టేషన్‍కు పంపేవారు. తన సోదరులలో జేష్టుడైన ఖమరుల్ హసన్ గాంధీజీ నడిపిన ‘యంగ్ ఇండియా’ పత్రికలో పనిచేశారు.
సీనియర్ గేంబ్రిసీ పరీక్షలో ఉత్తీర్ణుడైన అబిద్ హసన్ 1931లో సబర్మతీ ఆశ్రమం చేరుకుని దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులైన ఉమాశంకర్ దీక్షిత్, వెస్లేపాటిల్‍తో స్నేహమేర్పడింది. సఫ్రానీ ఆశ్రమంలోఉన్నప్పుడు ‘రఘుపతి రాఘవ రాజారాం’ ప్రార్థనలో ‘ఈశ్వర్ అల్లా తేరేనాం’ ఉండాలని వాదించి గాంధీజీని ఒప్పించాడు.
అబిద్ హసన్ జైలు నుంచి విడుదలై రాగానే జర్మనీ వెళ్లి ఇంజనీరింగ్ చదువుకున్నాడు. అక్కడే ఆయనకు మేజర్ స్వామితో పరిచయమేర్పడింది. అప్పటినుంచి వీరిద్దరి జీవితాలు ఒకే తాటిపై నడిచాయి. వీరి విద్య పూర్తవుతున్న సమయంలో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. మిత్రులిద్దరూ అక్కడే ఉండిపోయారు. అబిద్ హసన్ జర్మనీ, ఫ్రెంచ్, ఇంగ్లీష్, అరబిక్, సంస్కృతం, పర్షియన్, హిందీ, ఉర్దూ భాషలలో ప్రవీణుడు. తెలుగు సరేసరి.
దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సుభాష్ చంద్రబోస్ 1941వ సంవత్సరం మూడో వారంలో తన కలకత్తా నివాసం నుంచి తప్పించుకునిపోయిన సంగతి తెలియగానే యావద్దేశం విస్తుపోయింది. అనేక సాహసాలతో నేతాజీ జర్మనీ చేరుకోగానే ఆయనకు ఘనస్వాగతం పలికిన వారిలో సఫ్రానీ, ఆయన మిత్రుడు స్వామీ ముందున్నారు. ఈ ఇద్దరికీ జర్మనీ యులతో పరిచయం ఉండడంతో నేతాజీకి జర్మనీ పరిస్థితులు తెలియ చేయగలిగారు. భారత స్వేచ్ఛ కోరిన పేరుతో సైనికుల అభినందనలందుకున్న సుభాష్ చంద్రబోస్‍ను ‘నేతాజీ’ అని మొదటిసారి పిలిచింది జర్మనీలోనే. నేతాజీ జర్మనీలో ఉన్నప్పుడు భారత స్వాతంత్య్ర ప్రభుత్వ స్థాపన, పతాకం మొదలైన విషయాలపై చర్చలు జరిగాయి. ఆనాడు జరిగిన చర్చల్లో ‘నస్తే’ స్థానంలో ‘జైహింద్’ ఉండాలని సూచన చేసింది సఫ్రానీయే. దీన్ని ఏకగ్రీవంగా ఆమోదిం చారు. ఆనాటి నుంచి ఇది ప్రజలకు తారకమంత్రమైంది.
దూర ప్రాచ్య భారతీయుల పిలుపు మేరకు నేతాజీ జలాంతర్గామిలో ప్రయాణమైనప్పుడు తన వెంట అబిద్ హసన్ ఒక్కడినే తీసుకువెళ్ళాడు. సుదీర్ఘ ప్రయాణం చేసుకుంటూ 40 రోజుల తర్వాత ఆ జలాంతర్గామి హిందూ మహాసముద్రంలో ప్రవేశించింది. అక్కడనే జర్మనీ జలాంత ర్గామి నుంచి నేతాజీ, అబిద్ హసన్ జపాన్ జలాంతర్గామిలోకి చేరవలసి ఉంది. రెండు జలాంతర్గాముల మధ్య దూరం ఎక్కువగానే ఉంది. రెండింటిని కలపడానికి ఒక తాడు బిగించి ఆ తాడు పట్టుకుని సఫ్రానీ రెండో జలాంతర్గామిలోకి దూకినారు. రెండు జలాంతర్గా ములను కలపడం అత్యంత సాహసమైన, ప్రమాదకరమైన కార్యం. ఈ కార్యం సాధించినందుకు జర్మనీ, జపాన్ నావికులు సఫ్రానీని ఎంతో అభినందించారు. ఆజాద్ హింద్ సైన్యంలో సఫ్రానీ కల్నల్ హోదాలో ఉండేవాడు.
భారత జాతీయ సైన్యం రంగూన్ సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించినపుడు గాంధీజీ, గౌస్‍కు సఫ్రానీ రెండో కమాండెంట్‍గా ఉండేవాడు. కోహిమా స్వాధీనం చేసుకోవడానికి ఆయన సైన్యాలు నడిపించాడు. కొన్ని గంటలలో ఇంఫాల్‍ను భారత సైన్యం హస్తగతం చేసుకుంటుందని, భారత దేశంలో బ్రిటీష్ పాలన దెబ్బతిందని అనుకున్నారు. కానీ జయాపజయాలు దైవాధీనాలు. వాతావరణం అనుకూలించనందున భారత జాతీయ సైన్యాన్ని తప్పనిసరిగా ఉపసంహరించుకోవలసి వచ్చింది.
ప్రధాని నెహ్రూ ఆహ్వానంపై స్వతంత్ర భారతదేశ ప్రభుత్వంలో సఫ్రానీ విదేశాంగ శాఖలో చేరిపోయారు. 18 సంవత్సరాలు ఆ శాఖలో వివిధ హోదాలలో పనిచేశారు. సర్దార్ ఫణిల్లాల్ చైనాలో భారత రాయబారిగా ఉన్నప్పుడు ఆ కార్యాలయంలో మొదటి కార్యదర్శిగా పనిచేశాడు. 1967 నుంచి 1969 వరకు డెన్మార్క్లో భారత రాయబారిగా పనిచేసి పదవీ విరమణ చేశాడు. అనంతరం జన్మస్థలమైన హైదరాబాద్‍కు వచ్చి సమీపంలో వ్యవసాయ క్షేత్రం పెట్టుకొని విరామ జీవితం గడిపాడు. ఆయన బ్రహ్మచారి. కుటుంబ బాదర బందీలు, బస్తీ వ్యాసాంగాలు లేవు.
సఫ్రానీ ప్రతి సంవత్సరం జనవరి నెలలో కలకత్తాలోని నేతాజీ నివాసాన్ని సందర్శించేవాడు. భగవద్గీతను ఆయన ఉర్దూ భాషలో తర్జుమా చేశాడు. చివరి రోజుల్లో ఎంతో ప్రశాంతమైన జీవితం గడిపిన సఫ్రానీ 1984 ఏప్రిల్ 11వ తేదీన తన నివాసంలో 73వ ఏట మరణించాడు. ఆయన సృష్టించిన ‘జైహింద్’ నినాదం భారత ప్రజలకు తారకమంత్రమైంది.
(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
-జి. వెంకట రామారావు