అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-8


ముదుగొండచాళుక్య కుసుమాదిత్యుని
కుక్కునూరు రాగిరేకు
తెలుగు (గద్య) శాసనం క్రీ.శ.12వశతాబ్ది


ఖమ్మం జిల్లా పాల్వంచతాలూకా కుక్కునూరులో దొరికిన ముదుగొండచాళుక్య కుసుమాదిత్యుని రాగిరేకు శాసనం, ఆ రాజ వంశానికి చెందిన రెండోశాసనం. ఇది క్రీ.శ.12వ శతాబ్ది నాటిది. కాకతీయుల కంటే ముందు తూర్పు తెలంగాణా ప్రాంతాన్ని దాదాపు రెండు శతాబ్దాలు పాలించిన ముదుగొండచాళుక్యుల వంశవృక్షాన్ని, విజయాలను, నాటి తెలుగు భాష స్వరూపాన్ని తెలియజేసే ఈ శాసనం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకొంది. 1973వ సం।।లో బి.హెచ్‍.లక్ష్మీనారాయణ అనే పరిశోధకులు, భద్రాచలంలో ఉన్న తన మిత్రుని ద్వారా సేకరించి, ఆ శాసన వివరాల్ని ఎన్‍. వెంకటరమణయ్య, పి.వి. పరబ్రహ్మశాస్త్రి, సంపాదకత్వంలో వెలువడిన ఎపి గ్రాఫియా ఆంధ్రికా-2 (పే.39-49) రాష్ట్ర పురావస్తుశాఖ, హైదరాబాదు, 1974లో ప్రచురించారు. ఈ రాగిరేకు శాసనం ఏపీ స్టేట్‍ మ్యూజియంలో ఉంది.
ఎప్పుడో 1903లో, అప్పటి నిజాం ఖజానాలో గల ఒక రాగిరేకు శాసనాన్ని రెవరెండ్‍ బెండాలీ అనే ఒక అమెరికన్‍ మిషనరీ పరిశీలించి ఇంటియన్‍ యాంటిక్వరీ-1903లో ‘గ్రాంట్‍ ఆఫ్‍ కుసుమాదిత్య-4’ పేరిట ఒక వ్యాసాన్ని ప్రచురించటంతో, అసలు తెలంగాణాలో ముదుగొండ శాఖకు చెందిన చాళుక్య వంశం గురించి పరిశోధకులకు, చరిత్రకారుల్లో ఆసక్తి పెరిగింది.


కుక్కునూరు శాసనాన్ని పి.వి. పరబ్రహ్మశాస్త్రిగారు భారతి మాసపత్రికలో ‘చాళుక్య కుసుమాదిత్యుని క్రివ్వక తామ్ర శాసనం’ పేరిట ప్రచురించారు. కుక్కునూరులో దొరికిన రాగిరేకు శాసనాన్ని విడుదల చేసిన కుసుమాదిత్యుడు, 6వ కుసుమాదిత్యుడు. ఇతడు క్రీ.శ.1140 నుంచి 1165 వరకు పాలించాడు. ఈ శాసనంలో మొత్తం 5 రేకులున్నాయి. 20×10 సెం.మీ. కొలతలతో 1.5 సెం.మీ. రంధ్రం నుంచి అన్ని రేకుల్ని కలిపిన 12 సెం.మీ. వ్యాసం గణ కడియం రాజముద్రతో ఉంది. ముద్రపై వరాహలాంఛనం, అంకుశం, మూడు కలశములున్న తోరణం, సింహాసనం, వింజామరలు, ఛత్రము, చంద్రవంక, శంఖాలున్నాయి. శాసన ప్రారంభంలోని నాలుగు పంక్తులు, చివరి 12 పంక్తులు సంస్కృతంలోనూ, మిగిలిన 50 పంక్తులు, తెలుగు వచనంలోనూ ఉండటం ఈ శాసనం ప్రత్యేకత. ఒక్కో రాగిరేకుపైన 7 నుంచి 10 పంక్తుల వరకూ గల ఈ శాసనాన్ని బయ్యన రాయగా, విశ్వకర్మ వంశానికి చెందిన బేతాచారి చెక్కినాడు.


శాసనంలోని వివరాలు:
కుసుమాదిత్యుడు క్రీ.శ. 12వ శతాబ్దిలో విడుదల చేసిన ఈ శాసనపొందికలో అనేక వ్యాకరణ, భాషాపరమైన తప్పులున్నాయి. శాసనంలో, ప్రఘట్టంబు, బొట్టున, బల్లి తొంగడ్లు, ద్రింటమెట్ట, తురియ అనేపదాల అర్థాలు తెలియకున్నాయి. ఈశాసనంలో ఇప్పటి ఖమ్మం, వరంగల్‍ ప్రాంతాలను పాలించిన ముదుగొండ చాళుక్య బేతన కుమారుడైన కుసుమాదిత్యుడు తన ప్రధానులు శ్రీకరణం ఇందపరాజు, రేమరాజులను, మహామండలేశ్వరులను గావించి, రాజలాంఛనాలతోపాటు, విసురునాడులోని క్రివ్వక గ్రామాన్ని అగ్రహారంగా ప్రకటించి, గోదావరీ తీరంలోనున్న ఆ గ్రామ సరిహద్దులను కూడా పేర్కొనటమైంది.


శాసన పాఠం
మొదటిరేకు – రెండోప
క్క
  1. శ్రిధామ్నః పురుషోత్తమస్య మహతో నారాయనస్య ప్రభోఃనాభీ పం
  2. కరుష బబ్బభూప జగతః స్రష్టా స్వయంభూస్తథాః జెజ్జెమానస
  3. సూను రతి రితియః తస్మాన్మునే రత్రితః సోమోవంస కరస్సు
  4. ధాంసు రుథితః శ్రీకంట చూడామణిః (।। ^।।) ఇట్లుంగాబరమేస్వ
  5. రు జటా కలాపంబుల కాభరణం బై వెలుంగుచు
  6. న్న నిషాక రావ్వయంబునం బుట్టిన చాలుక్యావయులు
  7. యెకోన షష్టి సింహసనంబులు రాజ్యంబులు సేసినతద
  8. నాన్తరంబునం గొరవిపుర వల్లభుణ్డయిన కరియ గొన
  9. గొణ్డు మదాన్ధగన్ధ సిన్దురంబుల నిష్టసిష్టాత్థులకు వా
  10. యనంబులిచ్చి మహా విభూతితో నవమి నొంచి నెగ

రెండోరేకు – మొదటిపక్క
  1. డి నట్టి కరియగొనగని సహోదరుణ్డయ్న విజ్జయ రాజున
  2. కు గుసుమాయుధుణ్డు పుట్టె నట్టి కుసుమాయుధునకు బె
  3. తరాజు పుట్టెనట్టి బెత న్రిపతికి ముట్టానెగల్లుణ్డై కుసుమా
  4. యుధుణ్డు దియించె నట్టి కుసుమాయుధునకు వినిత జ
  5. నాస్రయుణ్డైన బొట్టు బెత భూపాలుణ్డు జనిమి
  6. ంచెనట్టి బెతరాజు నకుం నభినవ గవిరి యైన శ్రీమ
  7. హ దేవికి మాబ్బ ల కేసరి యయ్నకుసుమాదిత్యుణ్డును వి
  8. వెక నారాయనుణ్డైన నాగతి రాజునుం బుట్టి రయ్యిద్దఱిలోన
  9. గుసుమాదిత్యుణ్డు జెష్ట పుత్రుణ్డై రాజ్యలక్ష్యి దాల్చి ని

రెండోరేకు – రెండో పక్క
  1. ల్చి నాతని ప్రథమ రాజ్యంబున భూమి ప్రఘట్టంబు పుట్టి
  2. న యవసరంబున బొట్టున వాని ప్రధానులు శ్రికరణా
  3. ధిపతి యైన యిందపరాజును అతని తమ్ముణ్డైన రెమ రా
  4. జును సమస్త వస్తు వాహనంబులనుం గుల ధన
  5. ంబులనుం జెకొని కుసుమాదిత్యుతొడన పర మ
  6. ణ లాభిముఖులై కందమూల పల సాఖాదు లహారంబు
  7. గా ద్వాదస వరుషంబులు నవసి కాయ్య ఖఱ్గసహాయు
  8. లై నిజుదెసం బెన విసుఱునాణ్డు సకలమును గు

మూడోరేకు – మొదటిపక్క
  1. సుమాదిత్యునెలించి యాచద్రక్క oబుగా బ్రతిష్టించి
  2. న కుసుమాదిత్యుణ్డు యిందన రెమనల భ్రిత్య భావంబున
  3. కుం దన్నుం జెకాని ప్రతిష్టించిన ప్రధానత్వంబునకు న
  4. త్యన్తం బైన కారుణ్యంబు గలిగి మకర తోరణంబు
  5. లుం బల్లి తొంగొడ్లునుం సలికి కూంకట్లులునుం బ
  6. డి డక్కలుం బల్లియందలంబును యెలపునం
  7. న్ను పిడి యెక్కను వెంజామరాలునుం దలవుగా మహామణ్డ
  8. లెస్వర పదవీ విరాజమన మానోణన్‍త ప్రభు మంత్రోత్సా
  9. హసక్తి సమస్థాలంకారంబును నిచ్చి మఱియన్ను ప

మూడోరేకు – రెండో పక్క
  1. ద్మగచ్ఛస్త థా పుత్ర యాజ్ఞ వల్కీ మహాత్మనాం రిషివ్వి ప్ర
  2. కులాన్వా (స్వ) యం ఇతిఃకౌణ్డల్య గొత్రతః అనంగా నుభయ
  3. కులసుద్దులయిన యాయ్తన పెగ్గ డ్ల పుత్రులు శ్రీకర
  4. ణము నిందపరాజునకు వారి సహోదరుణ్డయిన రే
  5. మరాజునకు నిట్టి మహా మహిమలిచ్చి విసుఱు
  6. నాంట మహాసారా(ర)o బైన క్రివ్వక యగ్రహారంబుగాను
  7. త్తరాయన నిమిత్యంబున ధారాపూవ్వoబు సెసి యా
  8. దిత్యంచంద్రుల కలయన్తగాలంబునకు సాసా

నాలుగోరేకు – మొదటి పక్క
  1. నంబుగా నిచ్చె ఆవత్సంద్రస్యా సూయ స్యయా
  2. వత్తిష్టతిమేదిని యావద్రామకథాలోకేతావర
  3. ద్రజ్యం విభిషణః ఇది దివనాత్థoబువరమా
  4. త్థoబు గావించి యిచ్చె నియ్యగ్రహారంబు
  5. సీమ సన్దిః పువ్వ తః గోదావరి తీరంబున పసి
  6. వ్రిక్షంబును కుంటయు లెల్ల ఱాలును ద్రింట మె
  7. ట్టయు దక్షిణతః యారిలోవ పశ్చిమతః మ

నాలుగోరేకు – రెండోపక్క
  1. ర డుంబాక తుఱియ యుత్తరతః గోదావరినది
  2. యిదివొలము సిమము దీని సీమలంఘనము సే
  3. సిన వారు పంచమహాపాతకు లగుద్రు బహువ్వ
  4. సుద్దన్‍త్తా బహుభి శ్చాను లేపని సష్టిం వరు
  5. ష సహస్రాణి స్వగ్గ మోధపి భూమిపు
  6. ఎస్య యెస్య యెతాభూమి తాస్యతస్యతథాపల
  7. o(।।)స్వదత్తం పరదత్తంవాయో హరేతి వసున్దర

ఐదోరేకు – మొదటి పక్క
  1. సష్టి వరుష సహస్రణ విష్టాయాం జాయతే
  2. క్రిమి(।।) నవిషం విషమిత్యాహు బ్రహ్మస్వం విషము
  3. చ్యతే విషమే కాకనీ హన్తి బ్రహ్మస్వం పుత్రప
  4. వితత్రికం ఆయు శ్రయం బలమానంత విలాస
  5. మాజ్ఞాం వెదొ హరిశ సురపాః క్రమసో రవిశ్చ
  6. మద్భక్తి మానితి విచింత్య దదంతు సవ్వ బయ్యాహ్వయ
  7. స్య భువి భూసుర పంగవస్యం ఇతిఃకటవిలాస స్రుతినం
  8. విస్వకమ్మ రిషినాం బెతాచారి లిఖతం


లక్ష్మీనిలయుడు, పురుషోత్తముడు, నారాయణుని నాభికములం నుంచి జగత్తును సృష్టించిన స్వయంభూబ్రహ్మ పుట్టాడు. అతని నుండి అత్రిముని, అతని నుండి శివుని శిరోభూషణుడు, అమృత కిరణుడైన చంద్రుడూ పుట్టారు. అలాంటి చంద్రవంశమున పుట్టిన చాళుక్య వంశరాజులు 50 సింహాసములు రాజ్యం చేశారు. తరువాత కొరవిపుర వల్లభుడైన కరియగొణగుడు, ఇష్టులకు, పండితులకు అనేక ఏనుగుల్ని దానం చేస్తూ, భూమిని పాలిస్తున్నాడు. ఆ కరియగొణగుని తమ్ముడైన విజ్జయ రాజుకు, కుసుమాయుధుడు, అతనికి బేతరాజు, అతనికి ‘ముట్టానెగల్ల’ బిరుదాంకితుడైన కుసుమాయుధుడు, ఇతనికి వినీత జనాశ్రయుడైన బొట్టుబేత అనే రాజు, బొట్టుబేత, అతని భార్య అభినవ గౌరి బిరుదాంకిత మహాదేవికి మార్బలకేసరి అనే బిరుదుగల కుసుమాదిత్యుడును, వివేక నారాయణుడైన నాగతిరాజు పుట్టారు. వీరిలో పెద్దవాడైన కుసుమాయుధుడు రాజై పాలిస్తున్న మొదటి సం।।లో ఒక ఉపద్రవం పుట్టుకురాగా, ప్రధానులు, శ్రీ కరణాధిపతి అయిన ఇందపరాజు, అతని తమ్ముడు రేమరాజులు, సమస్త వస్తువాహనాలు, కులధనాలతో కుసుమాయుధుని, శతృరాజుకు ఎదురుగా తరలించగా, అడవిలో 12 సం।।లపాటు కందమూలాలతో జీవించారు. తరువాత శౌర్యపరాక్రమాలతో, కుసుమాయుధుణ్ణి, అతని నిజదేశమైన విసురునాడులో ప్రవేశింపజేసి, అతనితో రాజ్యాన్ని పాలింపజేశారు. తనకు కార్య, ఖడ్గ సహాయులై రాజ్యప్రాప్తికి తోడ్పడిన తన ప్రధానులైన ఇందప, రేమనలకు కృతజ్ఞతగా, కుసుమాదిత్యుడు, మహామండలేశ్వర పదవిని, మకర తోరణంబులు, బ(జ)ల్లి తొంగొట్లు, సలికి కూకట్లును, పది ఢక్కలను, దంతపు పిడిగల వింజామరలను తగురీతిలో, సర్వాంలంకారాలతో సమర్పించి, అయతనప్రెగ్గడ పుత్రులైన శ్రీకరణము ఇందప రాజు, ఆయన సోదరుడైన రేమరాజుకు విసురునాడులో మహాసారవంతమైన క్రివ్వక అగ్రహారాన్ని ఉత్తరాయణ పుణ్య కాలాన ధారా పూర్వకంగా సూర్యచంద్రులుండేంత వరకు దానం చేశాడు. ఆ తరువాత, దానమిచ్చిన అగ్రహారం తూర్పున గోదావరి తీరాన పసి వృక్షం, కుంట, వెల్లరాళ్లు, క్రిందమెట్ట, ఉత్తరాన గోదావరి నది, దక్షిణాన ఆరిలోవ, పశ్చిమాన మరడుంబాక తురియ, హద్దులుగా చెప్పబడినవి. ఈ శాసనాన్ని ఉల్లంఘించినవారికి మహాపాతకం చుట్టుకుంటుందన్న శాపనార్థాలు, శాసన రచయిత బయ్యన, శిల్పి బేతాచారి ప్రస్తావనతో శాసనం ముగుస్తుంది.


కొరవి శాసనం, మొలకలచెరువు శాసనాల కంటే, ఈ కుకునూరు శాసనం వల్ల మరో నలుగురు ముదుగొండ చాళుక్యరాజులు కొత్తగా వెలుగు చూశారు. ఈ శాసనం ప్రకారం, ముదుగొండ చాళుక్య వంశరాజులు వరుసగా, కరియగొణుగుడు, నిజ్జయరాజు, కుసుమాయుధుడు, బేతరాజు, కుసుమాయుధుడు, బొట్టుబేత, కుసుమాయుధుడు (ఇతడే శాసనదాత), చివరగా నాగతి రాజులు పేర్కొనబడినారు. కొరవిపాలకుడైన కరియగొణగుడు, అతని తమ్ముడు (నిజ్జయ) విజ్జయరాజు (నిరవద్యుడు)లు, ఈ శాసనంలో పేర్కొన బడిన వారూ ఒకరేనా కాదా అన్న పరబ్రహ్మశాస్త్రిగారి సంశయానికి తెరదించవచ్చు. శాసనాన్ని సంక్రాంతి సందర్భంగా ఇచ్చినట్లుందేగానీ సం।। లేకపోవటం చేత, ఈ చివరి కుసుమాయుధుడు తన పాలనా కాలం క్రీ.శ.1140-65 మధ్యలో అనగా ఒక సం।। పాలించి, 12 సం।।లు అడవిలో గడిపి, మళ్లీ పాలన ప్రారంభించిన సందర్భంగా 13 సం।।లు తరువాత అంటే క్రీ.శ.1153వ సం।।లో ఈ శాసనాన్ని విడుదల చేశాడని చెప్పొచ్చు.
ఇక శాసనంలోని అప్పటి తూర్పు తెలంగాణంలోని వాడుక భాష, పలుకుబడులను పరిశీలిద్దాం. భాష, లిపి, క్రీ.శ.12వ శతాబ్దికి చెందినవే. చాలా వరకు అక్షరాలు అంతకు ముందటి శాసనాక్షరాలను పోలి ఉన్నాయి. అందుకు ‘అ,చ,భ,హ’ అక్షరాలే ఉదాహరణ. ‘డ’కు బదులు ఱను, కొన్ని చోట్ల వట్రు సుడి బదులు, ఇకార గుడికి క్రావడి ఇవ్వటం (నృపకు బదులు న్రిప,) అలాగే మకారాన్ని రెండు రకాలుగానూ, సున్నను విలక్షణంగా చూపారు. చాలా పదాలు తప్పులు, వ్యాకరణ దోషాలతో ఉన్నాయి.


మొదటిరేకు రెండో పక్క :
శ్రీధామ్నః = శ్రీధామ్నః, పురుషోత్తమస్య = పురుషోత్తమస్య
నారాయనస్య = నారాయణస్య, ప్రభొ = ప్రభో
నాభి పంకరుషబ్బభూవ= నాభీపంకురుహోద్బభూవ
స్వయంభూస్థథాః స్వయంభూస్తతాః, జెజ్ఞె=జజ్ఞే,
న్ముని = న్మునే; వంసకరస్సుధాంసురుధితః =వంశకరస్సు
థాంశురుదితః; శ్రీకంట = శ్రీకంఠ, బరమెస్వరు =
బరమేశ్వరు, నిషాకరాన్వయంబునం = నిశాకరాన్వయంబు
నం; వంసులు=వంశ్యులు, యెకూనషష్టి సింఘసనంబులు =
యేకోనషష్టి సింహానంబులు, తదనాన్తరంబునం =
తదనస్తరంబున, సిన్దూరంబుల = సినురంబుల, నవమి=అవని
రెండోరేకు : మొదటి పక్క :
బెత = బేత, బెతన్రిపతి= బేతనృపతి, కుసుమయుధుణ్డు =
కుసుమాయుధుణ్డు, ఉదియించే = ఉదయించె,
వినిత= వినత, జనాస్రయుణ్డైన = జనాశ్రయుణ్డైన
బొట్టుబెత = బొట్టుబేత , జనమించె = జన్మించె
గవిరి = గౌరి, మహదెవికి = మహాదేవికి, మాచ్ఛలకేసరి =
మార్బల కేసరి, వివెక = వివేక, రయ్యిద్దొఱిలోన = రయ్యిద్దఱి
లోన, జెష్ట = జ్యేష్ఠ
రెండో రేకు : రెండో పక్క :
నిల్చి = నిల్చె, ప్రధానులు = ప్రథానులు, శ్రికరణ = శ్రీకరణ
రెమరాజు = రేమరాజు, జెకొని = జేకొని, తొడ = తోడ
పల = ఫల, సాఖాదులహారంబు = శాకాదులాహారంబు,
ద్వాదస = ద్వాదశ, నిజుదెసం = నిజదేశం,
మూడోరేకు : మొదటిపక్క :
నెలించి = నేలించి, యాచద్రర్కంబుగా = యాచంద్రార్కంబు
గా, భ్రిత్య = భృత్య, జెకాని = జేకొని, తొరణంబులు
తోరణంబులు, మణ్డలెస్వర = మణ్డలేశ్వర, మానోణ్నత =
మానోన్నత, మంత్రోస్సాహసక్తి = మంత్రోత్సాహశక్తి,
మూడో రేకు : రెండో పక్క :
యాజ్ఞవలికి = యాజ్ఞవల్కి, రిషి = ఋషి
కొణ్డల్య = కౌణ్డిన్య, కులసుద్ధులైన = కులశుద్ధులయిన,
యగ్రహారంబగా = యగ్రహారంబుగా, నిమిత్యంబున =
నిమిత్తంబున, ధారా ప్రవ్వ oబుసెసి = ధారాపూర్వంబు
జేసి, చంద్రుల = చంద్రులు, సాసానంబు = శాసనంబు
నాలుగోరేకు : మొదటి పక్క :
సూయ స్య= సూయ శ్చ, మదిని = మేదిని, విభిషణః= విభీష
ణః, పువ్వ తః = పూవ్వత : , తిరంబున=తీరంబున
వ్రిక్షంబు=వృక్షంబు, యారిలోవ=యూరిత్రోవ? ఆరిలోవ
నాలుగోరేకు : రెండోపక్క
బహువ్వ సుద్దాత్తా = బహుభివ్వ సుధాదత్తా
వరుష = వర్ష, స్వగ్గ మోధపి భూమిఘ = స్వగ్గే
మోదతి భూమిదః, యెస్యయెతాభూమి = యస్యయస్య
యదాభూమిః, వసున్ధరః= వసున్దరాం
ఐదోరేకు : మొదటి పక్క
సహస్రనా = సహస్రాణి, విషమిత్యాహు = విషమిత్యావరుః
కాకిని = కాకినం, పుత్రపవితత్రికం = పుత్రపాత్రికమ్‍,
వెదొ = వేధా, సవ్వ = సవ్వ , బయ్యాహ్వయస్య = బయ్యా
హ్వయాయ, పంగవస్య = పుంగవాయ, స్రుతిన=సుతేన,
విస్వకమ్మ రిషి = విశ్వకమ ఋషి
బెతాచారి = బేతాచారి


ఇలా శాసనంలోని లేఖక దోషాల్ని సవరించుకోవచ్చు. తెలంగాణా పాలకులైన ముదుగొండచాళుక్య వంశంలో నలుగురు కొత్త రాజుల నందించటమే కాక, ఆ వంశం కాకతీయ గణపతి దేవుని కాలం వరకూ కొనసాగిందనీ, కాకతీయ బేత, బొట్టుబేత ఒకరేనన్న అపోహ తొలిగేట్లుగా, బొట్టుబేత, ముదిగొండచాళుక్య రాజేనని తేల్చి చెప్పటం, ఇంకా ఆనాటి లిపి, భాష విశేషాలను (తప్పులను మినహాయించి) అందిస్తూ, తెలంగాణ చరిత్ర, పునర్నిర్మాణానికి తోడ్పడిన ఈ శాసనం, అలనాటి మేటి తెలంగాణ శాసనాల్లో ఒకటి. ఈ శాసనాన్ని ఇంతకుముందే ప్రకటించిన శ్రీ భాగవతుల లక్ష్మీనారాయణ, మరిన్ని వివరాలందించిన శ్రీపి.వి.పరబ్రహ్మశాస్త్రి, శ్రీకొల్లూరు సూర్యనారాయణగార్లకు, ఎపి గ్రాఫియా ఆంధ్రిక-2 సంపాదకులు శ్రీ నేలటూరు వెంకటరమణయ్యగారికి, భారతి మాసపత్రిక యాజమాన్యానికి, భద్రాచలానికి దిగువన గోదావరి తీరానున్న క్రివ్వక, కుక్కునూరు గ్రామాలకు నా కృతజ్ఞతలు.


ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *