న్యాయవాదులూ న్యాయమూర్తుల్లో కవులూ రచయితలూ తక్కువ. కానీ చాలా మంది న్యాయవాదులకి న్యాయమూర్తులకి సాహిత్యం అంటే మక్కువ. సాహిత్యం మీద ఇష్టం వున్న న్యాయ వాదులు కోర్టుల్లో వాదనలు చెప్పేటప్పుడు కొన్ని సందర్భాలలో కవితా చరణాలను ఉదహరిస్తూ వుంటారు. మరి కొంతమంది చిన్న కథలనూ ఉదహరిస్తూ వుంటారు.
వానదల్లోనే కాదు, న్యాయమూర్తులకి, న్యాయవాదులకి మధ్యన జరిగే సంభాషణల్లో కూడా కథలూ కవిత్వమూ అప్పుడప్పుడూ వస్తుంది.
ఓ చిన్న కథ, కవిత్వం చేసే పని ఓ గంట ఉపన్యాసం కన్నా ఎక్కువ. ఒక గంట ఉపన్యాసంలో చెప్పే విషయాన్ని హృదయానికి హత్తుకునేట్టుగా ఓ చిన్న కథలో చెప్పవచ్చు. కథకి కొంత సమయం పడుతుంది. కవిత్వానికి అంత సమయం పట్టదు.
ఏ విషయం గురించైనా ఎంత సూటిగా, శక్తివంతంగా చెప్పామనేది ముఖ్యం. అందుకోసం కొంతమంది కథను ఎంచు కోవచ్చు. మరికొంతమంది కవితా చరణాలని ఎంపిక చేసుకోవచ్చు.
న్యాయమూర్తులు కూడా ఒక విషయాన్ని బలంగా చెప్పడం కోసం కవితా చరణాలను ఎంపిక చేసుకుంటారు. న్యాయమూర్తులకి కూడా భావోద్వేగాలు వుంటాయి. అవి మాటల రూపంలోనే కాదు, తీర్పుల్లో కూడా వ్యక్తం అవుతూ వుంటాయి. అందుకు వారు ఎంపిక చేసుకునే పక్రియ కవితా చరణాలు. కొన్ని సందర్భాలలో ఓ కథలోని కొన్ని పేరాలు, వాక్యాలు. తీర్పుల్లో కవితా చరణాల గురించి మరోసారి చర్చిద్దాం. ఈ సారి కోర్టుల్లో వాదనలు జరిగే క్రమంలో జరిగిన కవితా చరణాలని, కథలని, వాక్యాలని పరిశీలిద్దాం.
కోర్టుల్లో కథల్లోని వాక్యాలని, కవితా చరణాలని ఉదహరించే టప్పుడు న్యాయవాదులు తీసుకునే సమయం తక్కువగా వుండాలి. అంతేకాదు అవి విషయానికి దగ్గరగా వుండాలి. సూటిగా కూడా వుండాలి. అప్పుడే వాటిని న్యాయమూర్తులు వినడానికి ఇష్టపడతారు. వాళ్ళకేసుకి సంబంధించిన అంశానికి సంబంధించినదై వుండాలి.
కవితా చరణాలకు చెప్పి తమకి అనుకూలంగా వున్న
ఉత్తర్వులని పొందే అవకాశం వుంటుంది. ఢిల్లీ హైకోర్టులో ఓసారి జరిగిన ఓ సంఘటనని ఉదహరిస్తాను. భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ అప్పుడు ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. నాజిమ్ వాజిరి న్యాయవాది. ఆయన కేసులో చాలా దూరంగా తేదీని ఇచ్చి న్యాయమూర్తి లంచ్‍కి బెంచి దిగి వెళ్తున్న క్రమంలో ఆ న్యాయవాది ఓ ఉర్దూ కవితలోని రెండు చరణాలని ఇలా చదివాడు.
‘‘కౌన్ జీతా హై
తేరీ జుల్ఫ్ సర్ హోనే తక్’’
‘‘నీ ప్రతి స్పందన కోసం అంతకాలం నేను వేచి వుండలేను’’ అన్నది దాని సారాంశం.
న్యాయమూర్తి ఠాకూర్ మళ్ళీ బెంచి మీదకు వచ్చి ఆ కవితలోని మొదటి చరణాలను చదవమని అడిగారు. అతను ఇలా చదివాడు.
‘ఆకో బాహీయే
ఇక ్ర అసర్ హోనే టక్’
‘ప్రియురాలి నుంచి ప్రేమ పూర్వకమైన జవాబు రావడానికి చాలా సమయం పడుతుంది.’ అన్నది తెలుగు సారాంశం.
ఈ కవితా చరణాలని విన్న న్యాయమూర్తి కేసుని దగ్గరగా అంటే ఆ వచ్చేవారానికి వేశాడు.
అదే విధంగా ఓసారి ఓ న్యాయమూర్తి ఓ న్యాయవాది అప్పీలుని వింటూ షేక్షిపియర్ హెన్రీ 6 లోని వాక్యాలని ఉదహరించాడు. ఆ న్యాయవాది చెడు ప్రవర్తన గురించిన అప్పీలు అది. ఆ న్యాయవాది ప్రవర్తన నుంచి విసుగు చెందిన న్యాయమూర్తి ఇలా అంటాడు.
‘‘మనం చెయ్యాల్సిన మొదటి పని న్యాయవాదులని చంపి వేయడం. ఇది షేక్షిపియర్ మాట.
న్యాయమూర్తులు, న్యాయవాదులు వాదనలు చెబుతున్న క్రమంలో, వింటున్న క్రమంలో కవితలని, వాక్యాలని ఉదహరిస్తూ వుంటారు. ఈ విధంగా ఉదహరించడం వల్ల న్యాయవాదులు న్యాయమూర్తుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. అదే విధంగా ఒక విషయంలో న్యాయమూర్తుల దృక్పథాలని మార్చే అవకాశం కూడా ఉంది. కథల్లోని వాక్యాలు చెప్పినప్పుడు పేచీ లేదు. అవి సులువుగానే అర్థమవుతాయి. కవిత్వం అలా కాదు. అందుకని స్పష్టత వున్న కవితా చరణాలని ఉదహరించాల్సి వుంటుంది.
అయితే అందరు న్యాయ మూర్తులు ఈ కవితా చరణాలు వినడానికి ఇష్టపడతారని కూడా చెప్పలేం. కొంత మంది ఇష్టపడక పోవచ్చు.
చాలా మంది న్యాయమూర్తులకి ఉర్దూ భాష పట్ల ఇష్టం ఎక్కువ. తెలుగు రాష్ట్రాలలో తెలుగుని, తెలుగులోని కవిత్వాలని, కథలని వాక్యాలని
ఉదహరించి న్యాయమూర్తుల దృష్టిని ఆకర్షించవచ్చు. అయితే అలాంటి సందర్భాలు నా దృష్టికి తక్కువగా వచ్చాయి. ఉర్దూ కవితలని, ఇంగ్లీషు కవితలని ఉదహరించిన చాలా తీర్పులని నేను చూశాను. అదేవిధంగా తమిళ సినిమా పాటలని ఉదహరించిన తీర్పులని చూడటం జరిగింది. కానీ తెలుగు కవితలని, తెలుగు కథల్లోని వాక్యాలని ఉదహరించిన తీర్పులు నా దృష్టికి రాలేదు. కానీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ హైదరాబాద్‍లో పనిచేస్తున్నప్పుడు నా కథలోని చివరి వాక్యాలని బెంచి మీద రెండు మూడు సందర్భాలలో ఉదహరించారు. ఈ విషయం ఆయనా చెప్పారు. అదే విధంగా న్యాయవాద మిత్రులూ చెప్పారు. ఆ కథ పేరు ‘మొన్న నిన్న నేడు రేపు’.
మద్యపాన నిషేధం వున్న రోజుల కాలం కథ అది. ఓ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎల్లయ్య హోటల్ వుంటుంది. అప్పటికింకా మద్యపాన నిషేధం రాలేదు. తెలంగాణ ప్రాంతంలో సారా అమ్మకాలు చేపట్టవద్దనని నక్సలైట్లు ఓ ఫర్మానాని జారీ చేశారు. నక్సలైట్లకి భయపడి సారా అమ్మడాన్ని అందరూ ఆపేశారు. ధిక్కారాన్ని సహింతునా అని ప్రభుత్వం పోలీస్ స్టేషన్లలో సారా పొట్లాలు పెట్టి అమ్మించింది. సారా అమ్మడమే తమ జీవిత ధ్యేయంగా పోలీసులు మారిపోయినారు. ఎల్లయ్యకి ఇవ్వాల్సిన డబ్బుకి గానూ సారా పొట్లాలు ఇచ్చేవాళ్లు పోలీసులు. ఆ విధంగా సారాకి అలవాటైనాడు ఎల్లయ్య. ఎల్లయ్య హోటల్ కాస్త రెడ్డి మిలటరీ హోటల్‍గా మారిపోయింది.
సంపూర్ణ మధ్యపాన నిషేధం అమల్లోకి వచ్చింది. తాగుడుకు అలవాటైన ఎల్లయ్య ఉరఫ్ ఎల్లారెడ్డికి ఏమీ ఫరక్ పడలేదు. డబ్బులిచ్చి డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్ సంపాదించి త్రాగేవాడు. చిన్నల్లుడు అధికారం చేపట్టిన తరువాత లైసెన్స్లు కూడా రద్దుచేస్తాడు. ఎల్లారెడ్డికి కష్టకాలం మొదలవుతుంది. పోలీసులకీ అయనకూ పడదు. మందుబాటిల్లు దొరికాయన్నకేసులో ఎల్లారెడ్డి ఇరుక్కొని జైలుకి వెళ్తాడు. ఆ తరువాత మందు మానేస్తాడు. ఆ తరువాత నిషేదం ఎత్తేస్తారు.
‘మందు కొనండి – ప్రభుత్వాన్ని రక్షించండి’ అన్న ప్రకటనలు వచ్చేస్తాయి.
ఈ మార్పులన్నింటినీ చూసిన ఎల్లారెడ్డి మనస్సు బుడ్డీ వైపు లాగడం మొదలవుతుంది. కానీ జైలు జీవితం గుర్తు కొస్తుంది.
మొన్న అలవాటు లేనప్పుడు బలవంతంపెట్టి కొనిపిచ్చారు అలవాటు చేశారు.
అన్ని అలవాటైన తరువాత చాటుకు తాగినా కూడా కేసు పెట్టారు. డబ్బులు గుంజారు.
ఈ రోజు మానేద్దామనుకుంటే నేరం కాదంటున్నారు.
మొన్న నేరం కాదు. నిన్న నేరం. ఈ రోజు నేరం కాదు. ఇదేమీ న్యాయమో ఎల్లారెడ్డికి అర్థం కాదు.
రేపు సీసా దగ్గర లేకపోతే నేరం అంటారేమోనని భయం వేస్తుంది. ఎందుకైనా మంచిదని తన హోటల్‍ని అక్కడి నుంచి వేరే సుదూర ప్రాంతానికి తరలిస్తాడు. ఇదీ కథ.
ఈ కథని క్లుప్తంగా చెప్పి చివర వాక్యాలను జస్టిస్ చలమేశ్వర్ రెండు మూడు సందర్భాలలో కేసు వాదనల సందర్భాలలో
ఉదహరించారు.
కవితా చరణాలు గానీ కథల్లోని వాక్యాలు గానీ కేసు వాదనల్లో ఉపయోగపడతాయి. తీర్పుల్లో కూడా ఉదహరించవచ్చు.
ఓ విషయాన్ని బలంగా చెప్పటానికి ఇవి ఉపయోగపడతాయి. అదీ సాహిత్యానికి ఉన్న శక్తి.
-మంగారి రాజేందర్ (జింబో)
ఎ : 9440483001