(గత సంచిక తరువాయి)
పశువుల ఫారాల నిర్మాణం ఎలా ఉండాలి?
ఫారం నిర్మాణం : పశువుల ఫరాల్ని ఎంపికచేసిన స్థలంలో ఇ, యు, ఎల్, సి, ఎఫ్ అక్షరాలలాగా నిర్మించుకుంటే, పర్యవేక్షణ సులభంగా ఉంటుంది.
పశువుల ఫారాల్ని సూర్యకిరణాలు డైరక్టుగా పడకుండా తూర్పు-పడమర దిశలో నిర్మించాలి. కొన్నిసార్లు వాతావరణం, ప్రాంతాన్ని దృష్టిలో వుంచుకొని కూడా దిశను మార్చుకోవచ్చును. తీరప్రాంతాలలో గోడ, గాలివీచే దిశకు అడ్డుగా, ఎక్కువ తేమ ఉండే ప్రాంతాల్లో నేల తొందరగా ఆరడానికి ఉత్తర-దక్షిణ దిశల్లో, అధిక ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో తూర్పు, పడమర దిశల్లో పారాల్ని నిర్మించు కోవడం మంచిది.
ఎంపిక చేసిన స్థలం, నిర్మించే ఫారాల మధ్య కనీసం 25 మీ. దూరం ఉండేలా జాగ్రత్త వహిస్తే, అగ్ని ప్రమాదాలు సంభవించినా, అంత సమస్య ఉండదు. అంటు వ్యాధుల వ్యాప్తి అంత వేగంగా ఉండదు. పశుపోషకులు ఆర్థిక పరిస్థితి, పశువుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని పాకల్ని గాని, షెడ్డుని గానీ నిర్మించుకోవాలి. ఒక్కొక్క పాకలో 50 పశువుల వరకు పెంచుకోవచ్చును.
పశుపోషకులు ప్రారంభంలో షెడ్డు, పరికరాలపై ఎక్కువ వ్యయం చేయడం కంటే, పాడి పశువులపై వెచ్చించండం శ్రేయస్కరం. స్థానికంగా చౌకగా లభించే వస్తువులతో కొట్టాల్ని ఏర్పాటు చేసికుంటే నిర్మాణపు ఖర్చు తగ్గుతుంది. రేకులతో నిర్మాణం ఖర్చు ఎక్కువ. మన్నిక కూడా ఎక్కువే. తాటాకుతో కొట్టాల నిర్మాణం ఖర్చు తక్కువైనప్పటికీ, మన్నిక రేకుల షెడ్‍లాగా ఎక్కువకాలం ఉండదు. కానీ పశువులకు సౌకర్యంగా వుంటుంది.
పశువులు ఒకే వరుసలో లేదా రెండు వరుసల్లో ఉండేలా పాకల్ని నిర్మించుకోవచ్చును. రెండు వరుసల్లో అంటే రెండు వరుసల్లోని పశువుల తలలు గానీ, తోకలు గానీ ఎదురెదురుగా ఉంటాయి. 20 పశువులు పైగా ఉన్న రైతులు 2 వరుసల్లో పశువులు ఉండే విధంగా షెడ్ / పాక నిర్మించుకుంటే చౌకగా పూర్తవుతుంది. అనుకూలంగా వుంటుంది.
పాక కంటే ముందే, పాక కంటె 3 రెట్ల ఎక్కువ స్థలం ఉండాలి.
స్థలం : ప్రతి పశువుకు 3 చ.మీ. (1.5×2), పెయ్యలు, పడ్డలకు 2 చ.మీ. దూడలకు 1 చ.మీ. చొప్పున పాకలో స్థలం వుండేలా చూసికొని విడివిడిగా ఫారాల్ని నిర్మించాలి. అలాగే చాఫ్ కట్టర్, దాణా నిలువ, ఆఫీస్, సిబ్బంది నివాసాలకు కూడా నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవాలి.
పాక ఎత్తు: పశువుల పాక ఎత్తు 10-12 లేదా 14-16 అడుగులు ఉండేలా నిర్మించాలి. తద్వారా వెంటిలేషన్ బాగుంటుంది. వెంటిలేషన్ సరిగ్గా లేకుంటే, గేదెల చర్మం క్రమక్రమంగా గోధుమరంగులోకి మారుతుంది. క్రిమికీటికాల బెడద, అంటువ్యాధుల తీవ్రత ఎక్కువ అవుతుంది.
పైకప్పు (రూఫ్) : పశువుల పాక పైకప్పు ఏటవాలుగా వుంటే, వర్షపు నీరు సులభంగా జారి పోతుంది. సిమెంట్ / ఇనుప రేకుల్ని రూఫ్‍గా వాడిన సందర్భంలో రేకుపైన తెలుపు, లోపలివైపు నలుపు రంగు పెయింట్ వేయించాలి. పైకప్పు చూరులు 50 సెం.మీ. ఉంటే వర్షపు జల్లులు లోపల పడకుండా ఉంటాయి.
నేల (ఫ్లోరింగ్) : పశువుల పాకలో నేల (ఫ్లోరింగ్)ను సిమెంట్ కాంక్రీట్ చేయించడం గానీ, మొరంతోగానీ, నాపరాళ్ళతోగానీ నిర్మించాలి, పశువులు జారిపోకుండా నేల గరుకుగా ఉండేలా శ్రద్ధ తీసుకోవాలి. ఫ్లోరింగ్ ప్రతి మీటర్‍కు 3 సెం.మీ. వాలుంటే, మలమూత్రాలు వెంటనే జారిపోయి, పాకలు పొడిగా, శుభ్రంగా వుంటాయి. పాకనేల ఎత్తు, పరిసరాల కంటే ఎత్తులో ఉండాలి. తద్వారా నీరు సులభంగా జారిపోతుంది.
మేతగాడి : పాకల్లో పశువుల్ని కట్టివేసేందుకు ఇనుప పైపులతో ఫ్రేములు తయారుచేసి బిగించవచ్చు. త్రాగే నీళ్ళకు, మేతకు విడివిడిగా ప్రక్కప్రక్కనే తొట్లు నిర్మించాలి.
పేడ కుప్పలు, మురుగుకాలువ: పేడ కుప్పలను షెడ్డు / పాకలకు 12 మీ. దూరంలో ఏర్పాటు చేసుకోవాలి. అందుకుగాను గుంతలు తవ్వి ఉంచుకోవాలి. పేడ శుభ్రం చేయడానికి, త్రాగే నీళ్ళు, మేత ఏర్పాటుకు, పాలు పితికే యంత్రాల పైపులు అమర్చడానికి ఆటోమేటిక్ మెనైజెడ్ షెడ్‍లను నిర్మించుకుంటే, ఖర్చు ఎక్కువైనా లేబర్‍పై ఆధారపడటం తగ్గుతుంది. మల మూత్రాలు వెంటనే జారిపోయేలా మురుగు కాలువను 30 సెం.మీ. వెడల్పుగా, 7.5సెం.మీ. లోతుతో నిర్మించాలి.
పశువులకు గృహవసతి – వివిధ పద్ధతులు
పశువులను 2 రకాలుగా పోషిస్తుంటారు. స్వేచ్ఛగా వదిలివేసే విధానం, పశువుల్ని కట్టివేసి మేపు అందించే విధానం. పశువుల్ని స్వేచ్ఛగా వదిలినప్పుడు, కట్టివేయడానికి వీలు లేకుండా ‘లూజ్ హౌసింగ్’ పద్ధతిలో షెడ్లు నిర్మించాలి. ఈ పద్ధతిలో పాలు తీసేందుకు మాత్రమే పశువుల్ని కట్టివేస్తారు. రాత్రి, పగలు పశువులు ఫెన్సింగ్ లోపల తిరుగుతుంటాయి. ఖాళీ స్థలంలో ఒకవైపు నివాసం ఏర్పాటు చేస్తారు. అక్కడ పశువుల వేడి, చలి, వర్షంల నుండి విశ్రాంతి తీసుకుంటాయి. ఒకే నీళ్ళ ట్యాంకు, మేత తొట్టి వుంటుంది. దాణాను పాలు తీసేముందు, పశువులకు ఒక గదిలో అందిస్తారు. ఈ పద్ధతిలో పెంచవచ్చు. కొండ ప్రాంతాలు, అధిక వర్షాలున్న ప్రాంతాల్లో తప్ప, వెచ్చని ప్రాంతాల్లో ఈ పద్ధతి బావుంటుంది.
ఇక పశువుల్ని కట్టివేసే పద్ధతిలో పాకల్ని ‘టైస్టాల్స్ స్ట్రాంచియన్’ పద్ధతిలో నిర్మిస్తారు. స్ట్రాంచియన్ పద్ధతిలో పశువుల్ని ఒకే వరుసలో లేదా రెండు వరసుల్లో పెంచు కోవచ్చును. పశువులన్నింటిని ఒకే దగ్గర మెడకు త్రాడు/చైనుతో కట్టివేసి, మేపు అందించడం, పాలు పితకడం ఇక్కడే చేస్తారు. ఈ పద్ధతిలో పశువులు వాతావరణ తీవ్రతకు గురికావు. వ్యాధుల నివారణ సులభం, పశువులను శుభ్రపరచటం కూడా తేలికగా వుంటుంది. చలిగాలులు, వర్షాలుండే ప్రాంతాల్లో ఈ పద్ధతి బావుంటుంది.
పంజాబ్ రాష్ట్రంలో పాడిపశువుల షెడ్‍కు ఒక ఆధునిక మోడల్‍ను రూపొందించారు. ఈ మోడల్ ప్రకారం షెడ్ నిర్మించే రైతులకు నిర్మాణపు ఖర్చులో 25% సబ్సిడీ అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఈ ఆధునిక పశువులశాలలో వెంటిలేషన్ బాగుండటం వలన పశువులకు అత్యంత సౌకర్యంగా ఉండటం వల్ల పాడి పశువుల నుండి అధిక పాల దిగుబడి పొందుతున్నారు.
సురక్షితమైన భవిష్యత్తుకు వెలుగుబాటగా జీవిత భీమాను మనం ఎలా ఆదరిస్తున్నామో, పశువులకు కూడా భీమా చేయించవచ్చు. భీమా వల్ల ప్రమాదవశాత్తు పశువులు చనిపోతే, రైతులు నష్టపరిహారం పొందే వీలుంటుంది. విలువైన పశువుల్ని భీమా చేయడంవల్ల రైతులు ధీమాగా ఉండే అవకాశం ఉంటుంది.
ఓరియంటల్, న్యూఇండియా, యునైటెడ్ ఇండియా, నేషనల్ మొదలగు 4 కంపెనీలు జనరల్ ఇన్సురెన్సు చేస్తున్నాయి. రైతులు స్వయంగా తమ పశుసంపదకు ఇన్సూరెన్సు చేయించుకోవచ్చును. ప్రభుత్వపరంగా సబ్సిడీతో కూడిన రుణం ద్వారా పంపిణీ చేసే పశువులను తప్పనిసరిగా భీమా చేస్తారు.
పాడిగేదెలు, పాడి ఆవులు, దూడలు, పడ్డలు, పెయ్యలు, ఎడ్లు మొ।। పశువులన్నింటిని భీమా చేయించుకోవచ్చు.
ప్రీమియం రేట్లు భీమా చేసే విలువను పశువైద్యులు నిర్ణ యిస్తారు. పశువు విలువలో 4-5% ప్రీమియం, చెల్లించాల్సి ఉంటుంది. మూడు సంవత్సరాల ప్రిమియం ఒకేసారి చెల్లిస్తే, ప్రీమియంలో 25% తగ్గిస్తారు. రైతులు డైరెక్టుగా ఇన్సురెన్సు కంపెనీ ద్వారా పశువుల్ని ఇన్సురెన్సు చేయించుకుంటే 15% తగ్గింపు చేస్తారు. అలాగే ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఋణం పొందిన సందర్భాల్లో కూడా ప్రీమియం రేటు కొంత తగ్గిస్తారు. ప్రీమియం తిరిగి వాపసు ఇవ్వడమంటూ ఉండదు.
పశువు విలువ ఆధారంగా ప్రీమియం చెల్లించగానే, పశువు చెవికి గుర్తుగా నెంబర్ టాగ్ (పోగు) వేస్తారు. పశువు జాతి, వయస్సు, గుర్తులు, చెవిపోగు నెం. ఈతల సంఖ్య, పాల దిగుబడి, మార్కెటు విలువ, చెల్లించిన ప్రీమియం భీమా ప్రారంభమైన తేది, ముగింపు తేదీ మొ।। వివరాల్తో కూడిన పాలసీ ఇవ్వబడుతుంది.
ఇన్సురెన్సు కవర్ చేసే అంశాలు :
ప్రమాదాల వల్ల, వ్యాధి సోకడం వల్ల, ఆపరేషన్ చేయించిన తర్వాత, సమ్మె దోపిడి, అగ్నిప్రమాదాలు, పిడుగులు, వరదలు, భూకంపాలు, కరువు కాట కాలు, తుఫానులు మొ।। సందర్భాల్లో పశువులు మరణిస్తే నష్టపరిహారం లభిస్తుంది. పశువు మరణించే ముందు పశువు విలువ, రైతుకు కలిగిన నష్టం ఆధారంగా పశువు విలువలో 75-100% నష్టపరిహారం చెల్లిస్తారు.
పశువు మరణించకుండా ఉండి శాశ్వతంగా వంధత్వానికి గురైనా, పొదుగు సమస్యవల్ల శాశ్వతంగా పాలివ్వకపోయినా, అంబోతు సంభోగానికి పనికి రాకుండా పోయినా, ఎద్దులు అంగవైకల్యం వల్ల శాశ్వతంగా పనికి ఉపయోగపడకపోయిన సందర్భాల్లో పశువుల రవాణా సమయంలో ప్రమాదాల సందర్భంగాకూడా రైతులు నష్టపరిహారం పొందే వీలుంటుంది. ఇందుకుగాను భీమా చేయించే సమయంలో అదనంగా 1% ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇన్సురెన్సు చేసిన పశువులకు యుద్ధం వల్ల నష్టం జరిగినా, అంటువ్యాధులు సోకి మరణించినా, ఉద్దేశ్యపూర్వకంగా వ్యాధికి గురైన చికిత్స, ఆహారం అందించకున్నా ఒక పశువు చెవి పోగు మరొక పశువుకు మార్చినా, ఎక్కువ బరువు లాగించినా, తెలిసి తెలియని వైద్యం చేయించినా ఇన్సూరెన్సు కంపెనీలు నష్టపరిహారం అందించవు. బీమా గడువు పూర్తి కావడం, ధృవపత్రాలు సరిగ్గా లేకపోవడం, చెవిపోగు లేకపోవడం మొ।। సందర్బాల్లో కూడా నష్టపరిహారం అందకుండా పోతుంది.
(తరువాయి వచ్చే సంచికలో)
- ఆనబోయిన స్వామి
ఎ : 9963 87 2222