ఎవరైనా గొప్పలు చెప్పుకుంటే ‘‘ఏంరా నిన్ను నువ్వు తురుంఖాన్ అనుకుంటున్నవా?’’ అనటం మనకు తెలిసిన సంగతే. మరి ఇంతకూ ఆ తురుం ఖాన్ ఎవరు? తుర్రేబాజ్ ఖాన్! వీరత్వానికి, త్యాగానికి మారుపేరు అతను. 1857 సిపాయిల తిరుగుబాటు హైద్రాబాద్ రాజ్యంలో కూడా జరిగింది. నగరంలో దానిని ‘‘జిహాద్’’ అన్నారు. దాని నాయకుడే తుర్రేబాజ్ ఖాన్.
ముస్లింలలో ఇతను రొహిల్లా తెగకు చెందిన వాడు. షాద్ నగర్ దగ్గరి కుందుర్గ్ ఇతని స్వగ్రామం. ఇతని ముఖ్య అనుచరుడు సయ్యద్ మౌల్వీ అల్లా వుద్దీన్. పాతనగరంలో మొగల్ పురా నివాసి. అక్కడ అతను కట్టించిన మసీదు ఇప్పటికీ ఉంది. ప్రజలు దానిని సయ్యద్ మౌల్వీ అల్లా వుద్దీన్ మసీద్ అనే పిలుస్తారు. చీతాఖాన్, అబ్బెన్ సాబ్‍లు మరో ముఖ్య అనుచరులు. కోఠీ బ్యాంకు స్ట్రీట్‍లో ఇప్పటికీ ఉన్న మసీదు పేరు ‘‘అబ్బెన్‍సాబ్’’ మసీదు. ఈ తిరుగు బాటులో ముస్లింలతో పాటు హిందువులు కూడా ఉన్నారు. నగరంలో ప్రముఖ ధనిక వర్తకులైన సేఠ్ జయగోపాల్ దాస్, పూరణ్‍మల్ సేఠ్‍లు వారిలో ముఖ్యులు. 1857లో హైద్రాబాద్ రాజ్యంలో ఫిరంగీలకు (అంగ్రేజ్‍లు) వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు హిందూ ముస్లిం ఐక్యతకు ‘‘గంగా జమునా తహెజీబ్’’కు మంచి ఉదాహరణ.
వీరందరూ కోఠీలో ఉన్న రెసిడెంట్ (ప్రస్తుతం మహిళా కళాశాల) భవనంపై దాడి చేసారు. రెండు రోజులు సంకుల సమరం జరిగింది. కోఠీ బ్యాంక్ స్ట్రీట్‍లో రక్తం ఏరులై పారింది. ఆ వీధిలో ఉన్న సేఠ్ జయగోపాల్ దాస్ భవనంపై తిరుగుబాటు దారులు ఆశ్రయం పొంది రెసిడెంటు భవనంపై కాల్పులు జరిపారు. కాని ఏం ఫాయిదా? ఫిరంగుల బలం ముందు వారు ఓడిపోయారు.
బేగం బజారులోని హిందూ వర్తకుల సహాయంతో వారు బెంగుళూరుకు పారిపోయారు. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో వారిని బంధించి నగరానికి తీసుకు వచ్చారు. విచారణ జరుగుతున్న సమయంలో తుర్రేబాజ్‍ఖాన్ మళ్లీ తప్పించుకుని మెదక్‍జిల్లా తూప్రాన్ వద్ద పోలీసులతో జరిగిన ముఖాముఖి కాల్పులలో వీరమరణం చెందాడు. అతని శవాన్ని నగరానికి తీసుకొచ్చి కోఠీ చౌరస్తాలో మూడురోజులు వ్రేలాడదీసారు. సయ్యద్ మౌల్వీ అల్లా వుద్దీన్‍ను అండమాన్ జైలుకు పంపగా 27 సం।।ల తర్వాత 1885లో అక్కడే అల్లాకు ప్రియమైనాడు. కాకతాళీయంగా అదే సంవత్సరంలో దేశంలో కాంగ్రేసు పార్టీ ఆవిర్భవించింది. సేఠ్ జయగోపాల్‍దాస్, పూరణ్‍మల్ ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వారికి కూడా జీవితఖైదు విధించింది.
రెసిడెన్సీ – కోఠీ – బ్యాంకు స్ట్రీట్‍లోని ప్రతి రాయి, రప్పా ఇప్పటికీ ఆ వీరోచిత పోరాటాన్ని ‘‘మౌనగానం’’ చేస్తూనే ఉన్నాయి. చారిత్రిక స్పృహ ఉన్న వారికి ఇప్పుడు కూడా వినబడుతూనే ఉంది.
బ్రిటిష్ రెసిడెంట్ నివసిస్తున్నందున ఆరోజులలో ఆ ప్రాంతాన్ని రెసిడెన్సీ బజార్ అనేవారు. రాజా ప్రతాప్ గిర్‍జీ ‘‘కోఠీ’’ ఉన్నందున ప్రజలు ఆ వీధిని తర్వాత కాలంలో కోఠీ అన్నారు. కోఠీ అంటే భవనం అని అర్థం. ఆధునిక కాలంలో అనేక బ్యాంకులు అదే వీధిలో ఉండటం వలన ప్రస్తుతం బ్యాంక్ స్ట్రీట్ అని పిలుస్తున్నారు. నగర పాలక సంస్థ కోఠీ చౌరస్తాకు తుర్రేబాజ్ ఖాన్ రోడ్ అని నామకరణం చేసినా ఆ సంగతి ఎవరికి తెలియదు. చాలా కాలం పాటు ఆంధ్రా బ్యాంకు భవనం ముందు పసుపు పచ్చబోర్డుపై నల్లని అక్షరాలతో ఆ పేరు ఉండేది కాని ఇప్పుడు అది కూడా కనుమరుగు అయ్యింది.
ప్రస్తుతం ఇఎన్‍టి ప్రభుత్వ ఆసుపత్రి ఈ రాజాప్రతాప్ గిర్‍జీ కోఠీలోనే ఉన్నది. యూరోపియన్ వాస్తు శైలిలో ఉన్న అందమైన భవనం ఇది. లోపలి అలంకరణ అంతా నిలువెత్తు పాలరాతి శిల్పాలతో సజీవంగా ఉంటుంది. తొలుత ఈ భవనం వికాజీ- పెస్తోంజీ అను ఫార్సీ సోదరులకు సంబంధించింది. వీరి తండ్రి మొహర్జీ. వీరికి పెస్తోంజీ అండ్ సన్స్ అని ఒక బ్యాంకు మరియు ఒక కాటన్ మిల్లు ఉండేది. అంతేగాక నిజాంకు సంబంధించిన ‘‘బెరార్’’ ప్రాంతపు రెవెన్యూ వ్యవహారాలను వీరు పర్యవేక్షించేవారు. తర్వాత కాలంలో ఈ భవనాన్ని రాజా ప్రతాప్ గిర్జీ కొన్నాడు. ఆంధప్రదేశ్ రాష్ట్రం అవతరించిన తర్వాత ఈ భవనాన్ని ప్రభుత్వాసుపత్రికి ఆయన దానం చేసాడు.
1953 డిసెంబర్ పదమూడవ తేదీ ఆదివారం రోజు ఈ ప్రాంగణంలో శ్రీశ్రీ అధ్యక్షతన తెలుగు రచయితలు, కవుల సభ జరిగింది. సురవరం ప్రతాపరెడ్డి ద్వారం నిర్మించబడింది. ఆరుద్ర, ఇంద్రగంటి, పుట్టపర్తి నారాయణాచార్యులు, అభినవపోతన వానమామలై వరాదాచార్యులు, దాశరథి కృష్ణమాచార్య మొదలగు వారు హాజరైనారు.
ఈ బ్యాంక్ స్ట్రీట్ వీధిలోని అనేక అందమైన భవనాలు రాజా భగవాన్ దాస్‍కు సంబంధించినవి. ఆంధ్రాబ్యాంకు ఎదురుగా కోఠీ చౌరాస్తాలో ఉన్న మూడంతస్తుల భవనంలో ఈయన నివసించేవాడు. ఆ పక్కనే ఉన్న తాజ్‍మహల్ హోటల్ భవనం కూడా ఈయనదే. అది చాలా అందమైన పాలరాతిభవనం. 1970లలో దానిని కూల్చి షాపింగ్ కాంప్లెక్సు చేసారు. వీరి పూర్వీకులు గుజరాత్‍లోని మొరేరా గ్రామస్థులు. మొగల్ చక్రవర్తుల కాలంలో ఢిల్లీకి వచ్చి వజ్రాల వ్యాపారం మరియు బ్యాంకు లావాదేవీలు నడిపేవారు. రాజా హరిదాస్ అన్నతను మొదటి నిజాం వెంబడి 1728లో హైద్రాబాద్ నగరానికి వచ్చి కార్వాన్ ప్రాంతంలో స్థిరపడి వజ్రాల వ్యాపారమే కాక నవాబులకు వడ్డీలకు అప్పులిచ్చేవాడు. అతని నలుగురు కొడుకులలో ఒకతనే రాజా బహద్దూర్ భగవాన్ దాస్. ఇతను తన పూర్వీకుల వ్యాపారమే గాక మచిలీపట్నం ఓడరేవు నిర్మాణంలో తెలంగాణా అడవుల నుండి కలపను సరఫరా చేసి కోట్లు గడించాడు. మచిలీపట్నం ఓడరేవును కుతుబ్‍షాహీ నవాబులు నిర్మించారు. ఆ కాలంలో గోల్కొండ నుండి మచిలీపట్నానికి చక్కటి రహదారి ఉండేది. నిజాంల పరిపాలనలో రాజా చందూలాల్ ప్రదానమంత్రి కాలంలో ప్రభుత్వ ఖజానా దివాలా తీసినపుడు ఈ భగ్‍వాన్‍దాస్ కుటుంబానికి సంబంధించిన ‘‘సేట్లు’’ అప్పులిచ్చి ఆదుకున్నారు. కార్వాన్ ప్రాంతంలో వీరికి విలాసవంతమైన అందమైన భవనాలు ఉండేవి. అందుకే వీరిని షావుకార్లు, సేట్లు అనేవారు. 1908లో పురానాపూల్ తెగిపోయి వరదలు వచ్చి కార్వాన్ అంతా మునిగిపోగానే షావుకార్లందరూ భయపడి కోఠీలోని ‘‘గుజరాతీ గల్లీ’’లో నివసించసాగారు. ఆ విధంగా కోఠీ బ్యాంక్‍స్ట్రీట్‍లోని భవనాలన్నీ రాజా భగవాన్‍దాస్ కుటుంబ సభ్యులవే! గుజరాతీ గల్లీలో ఉన్న ప్రగతి మహా విద్యాలయం, గుజరాతీ బాలబాలికల పాఠశాల వీరు నిర్మించినవే.
ఆంధ్రాబ్యాంకు ఎదురుగా నీలకంఠం నర్సిమ్ములు బట్టల దుకాణం యాభై సంవత్సరాల క్రితం చాలా ఫేమస్. పెళ్లిళ్లకు సంబంధించిన పట్టుచీరెలు, పట్టుబట్టలు గ్రామాల నుండి వచ్చి ఇక్కడే కొనేవారు. తర్వాత వలసల వరదలో చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్, కళానికేతన్లు వచ్చి స్థానికుల దుఖాణాలన్నీ దెబ్బతిన్నాయి. ఆ పక్కనే తాజ్‍మహల్ హోటల్. ఆ విశాలమైన భవనం పాలరాతి మెట్లు ఎక్కి కమ్మని మసాలా దోసె ఘుమఘుమలతో లోపలికి ప్రవేశిస్తుంటేనే తభ్యత్ ఖుష్ ఐపోయేది. ఈ హోటల్‍లో ప్రతి సాయంత్రం ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు కలుసుకుని జాతీయ అంతర్జాతీయ రాజకీయాలపై చర్చించేవారు. ఇప్పటి కాంగ్రేసు నాయకుడు జైపాల్‍రెడ్డి అప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షుడు క్రమం తప్పకుండా వచ్చేవాడు. ఇప్పుడు ఆ వైభవం మాయమై అగ్గిపెట్టె లాంటి తాజ్‍మహల్ మిగిలిపోయింది.
ఇంకొక నాలుగడుగులేస్తే అక్కడ వేణీ చిత్రశాల అనే ఫోటోస్టూడియో ఉండేది. అది కూడా ఒక చరిత్ర శకలమే. 1947 డిసెంబరు నాల్గవ తేదీన కింగ్‍కోఠీలో నిజాం కూర్చున్న కారుపై ముగ్గురు విప్లవ వీరులు బాంబు వేసారు. వారు నారాయణ్‍రావ్ పవార్, జగదీష్‍ఆర్య, గండయ్యలు. ఆ ముందురోజు ముగ్గురు తమ మైత్రీ చిహ్నంగా ఈ స్టూడియోకు వెళ్లి ఫోటో దిగారు. ఒకవేళ తాము ఉరికంభం ఎక్కితే ఈ ఫోటో పనికి వస్తుందనుకుని విజయవాడలోని పత్రికా కార్యాలయాలకు పోస్టు చేసారు. అదృష్టం కొద్దీ ఆ ముగ్గురు బ్రతికి బట్ట కట్టినారు.
కొంచెం దూరంలో దానికి ఎదురుగా ఫిరోజ్ గాంధీ పార్కు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భర్త పేరుతో వెలిసింది. ఇప్పటి•కీ చమన్ ఉంది కాని ఆ పేరు ఎవరికీ తెలియదు. తర్వాత నాలుగడుగులు నడిస్తే ఎడమవైపు చింతలూరి ఆయుర్వేదం వైద్యశాల. దీని పక్కన సెంట్రల్ బ్యాంకులోపల రావూస్ ట్యుటోరియల్. దానికి సరిగ్గా ఎదురువైపు మేడమీద యస్.యస్.ఆర్ ట్యుటోరియల్. నగర ప్రజలకు అక్షర భిక్ష పెట్టిన ట్యుటోరియల్స్ ఇవి. యస్.యస్.ఆర్. ట్యుటోరియల్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావ్. జాతీయోద్యమంలో పాల్గొన్న దేశభక్తుడు. సుల్తాన్ బజార్ ప్రభుత్వ పాఠశాలకు హెడ్‍మాస్టర్‍గా పనిచేసాడు. వీటన్నింటినీ దాటి ఆబిడ్స్ వైపు కొంచెం ముందుకెళ్తే కుడివైపున్న భవనంలో రుస్తుం బార్ అండ్ రెస్టారెంట్ ఉండేది. అది 1885లో ప్రారంభం అయ్యింది. ఆంగ్లేయుల కోసం అది స్థాపించబడి నాలుగైదేళ్ల క్రితం వరకు నడిచి ఇప్పుడు మూలబడింది. దీని ప్రత్యేకతలు చాలా ఉండేవి. మైనర్లకు అందులో అనుమతి లేకపోకపోయేది. మేలిమి రకాలైన విదేశీ మద్యాలు సరసమైన ధరలకు సరఫరా అయ్యేవి. కౌంటర్లో యజమానే స్వయంగా కూచునేవాడు. ఎవరైనా మూడోపెగ్గు దాటితే ఇక వారికి మళ్లీ ఇచ్చేవాడు కాదు. ఎవరైనా అతిగా తూలుతుంటే లేదా స్పృహ తప్పే దశలో ఉంటే రిక్షా పిలిపించి అందులో కూచోబెట్టి జాగ్రత్తగా ఇంటికి చేర్చేవాడు.
రుస్తుం బార్ దాటితే ఎడమ వైపు ట్రూప్స్ బజార్ చౌరాస్తాలో అబ్బెన్ సాబ్ మసీద్. 1857 విప్లవ వీరుడు. కట్టించిన మసీదు అది. కొంచెం ముందుకు పోతే సాగర్ టాకీస్. (అది ఇప్పుడు లేదు) ఆ తర్వాత ఆబిడ్స్ చౌరాస్తా. రెసిడెన్సీ బజార్ – కోఠీ – బ్యాంక్ స్ట్రీట్ ఇవన్నీ కాదని ఇప్పటికైనా ‘‘తుర్రేబాజ్ ఖాన్ రోడ్’’ అని పిలుద్దామా?
(షహర్ నామా (హైద్రాబాద్ వీధులు – గాథలు) పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్,
ఎ: 91606 80847