అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాదీలు చూపిన ప్రతిభ, తెగువ చరిత్రలో అంతగా రికార్డు కాలేదు. తెలంగాణ గడ్డమీద పుట్టిన వాళ్లు ప్రాణాలకు తెగించి కొట్లాడిన విషయమూ అందరికీ తెలియదు. ఇట్లా విస్మరణకు గురైన వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే ఇవ్వాళ ఇక్కడ పక్కా హైదరాబాదీ వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ గురించి తెలుసుకుందాం. మాతృదేశ విముక్తి కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యూరప్ కేంద్రంగా విప్లవోద్యమాలు చేసిండు. రహస్యంగా విప్లవకారుల మద్ధతు కూడగడుతూ అంతర్జాతీయ స్థాయిలో భారతీయుల వాణిని వినిపించిన విప్లవ వీరుడు వీరేంద్రనాథ్. హైదరాబాద్, కలకత్తాల్లో చదువుకున్న వీరేంద్రనాథ్ ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్ళి అక్కడ భారత విద్యార్థులను విప్లవ పోరాటాలకు సన్నద్ధం చేసిండు. అట్లాగే యూరప్ అంతటా రహస్యంగా తిరుగుతూ బ్రిటిష్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిండు. జర్మనీలో మకాం వేసి ‘బెర్లిన్ కమిటీ’ని ఏర్పాటు చేసిండు. సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ‘లీగ్’లో నెహ్రూ చేరడానికి ప్రధాన కారకుడు వీరేన్. ఈ కమిటీ తరపున విప్లవ కార్యక్రమాలు చేపట్టిండు. గదర్ ఉద్యమకారులు ఆయుధాలు సరఫరా చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం ‘అక్టోబర్ రెవల్యూ షన్’లో భాగమయిండు. 1917లో మాస్కోలో లెనిన్‍ని కలిసిండు. నిజానికి లెనిన్‍ని కలిసిన తొలి భారతీయుడు వీరేంద్రనాథ్. కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా చేరిండు. విప్లవకారులతో కలిసి పత్రికలు నిర్వహించిండు. జర్నలిస్టుగా, విప్లవవాదిగా, రచయితగా, సుప్రసిద్ధ రచయిత్రి ఎగ్నెస్ స్మెడ్లీ సహచరుడిగా, సరోజిని నాయుడు తమ్ముడిగా, బహుభాషావేత్తగా ఉర్దూ ప్రొఫెసర్‍గా, తెలంగాణ, హైదరాబాద్ తెహజీబ్‍ని, పోరాటాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన యోధుడుగా బహుముఖాలుగా పరిచయమైన వ్యక్తి వీరేంద్రనాథ్. మిత్రులు, దగ్గరి వారందరూ ఆయన్ని ‘చట్టో’ అని పిలిచేవారు. ఇంట్లో అంతా చిన్నప్పుడు బిన్ని అని పిలిచేవారు. హైదరాబాద్‍లోనే పుట్టి పెరిగిండు.
జీవితం చివరి వరకూ మాతృదేశ విముక్తి కోసం పోరాటం జేసిండు. ప్రపంచ దేశాల్లోని విప్లవకారులను సంఘటితపరిచిండు. అట్లాంటి ఈ అవిశ్రాంత విప్లవయోధుడి గురించి చాలా మందికి తెలియదు. నీరద్ బారువ ఈయన జీవిత చరిత్రను రాసినప్పటికీ తెలుగువారికి అందులోని విషయాలు అంతగా తెలియవు. నిజానికి తెలంగాణ చరిత్రలో గౌరవప్రదమైన స్థానం ఆయనకు దక్కాల్సి ఉన్నది. అయితే ఇన్నేండ్లు తెలంగాణ చరిత్రను రాసింది పరాయివారు కావడంతో ఇక్కడివారి త్యాగాలకు, పోరాటాలకు విలువ లేకుండా పోయింది. అట్లా స్మరణకు నోచుకోకుండా పోయిన స్వాతంత్య్ర సమరయోధుడు వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ.
1880 అక్టోబర్ 31న హైదరాబాద్‍లో అఘోరనాథ్ చటోపాధ్యాయ, వరదాదేవి దంపతుల ఎనిమిది మంది సంతానంలో రెండో వాడిగా వీరేంద్రనాథ్ జన్మించిండు. అంతకుముందు అక్క సరోజిని నాయుడు జన్మించింది. ఈ కుటుంబంలో జన్మించిన వీరేంద్రనాథ్ సోదరుడు సుప్రసిద్ధ కవి, సినిమా నటుడు, సంగీతకారుడు హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, చెల్లెండ్లు సుహాసిని, మృణాళినిలు కూడా స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇట్లాంటి ఉద్యమకారుల కుటుంబంలో జన్మించిన వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ కలకత్తాలో బిఎ చదివిన తర్వాత ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్‍కు వెళ్ళిండు.
చట్టో తన 22వ యేట అంటే 1902లో ‘లా’ చదవడం కోసం ఇంగ్లండ్‍కు వెళ్ళిండు. మొదట అక్కడి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరిండు. ఆ తర్వాత మిడిల్ టెంపుల్‍లో (మధ్యప్రాచ్యం) ‘లా’ కోర్సులో చేరిండు. అక్కడే ఇండియన్ సివిల్ సర్వీసెస్‍లో ఉద్యోగం కోసం కొంత ప్రయత్నం చేసిండు. అయితే ఇండియాలో బ్రిటీష్‍వారి దోపిడీ, వలసాధి పత్యం నచ్చలేదు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవోద్యమం చేసేందుకుగాను ఇంగ్లండ్ వస్తున్న ఇండియన్ విద్యార్థుల మద్దతు కూడగట్టేందుకు గట్టి ప్రయత్నం చేసిండు. ఈ విప్లవోద్యమంలో భాగంగా వి.డి. సావర్కర్, బిపిన్ చంద్ర పాల్, లాలా హరదయాల్, మదన్‍లాల్ దింగ్రా, భయంకరా చారి, నంబియార్, పిళ్ళై తదితరులతో కలిసి పనిచేసిండు.
తాను ఇంగ్లండ్‍లో ఉంటున్న సమయంలోనే లండన్‍లో ఇండియాకు చెందిన శ్యామ్‍జీ కృష్ణవర్మ ‘ఇండియన్ సోషియాలజిస్టు’ అనే పత్రికను నడిపేవారు. ఆ పత్రికలో క్రమం తప్పకుండా చట్టో ‘కాలమ్’ రాసిండు. ఈ కాలమ్ ద్వారా విద్యార్థుల్లో చాలా పాపులర్ అయిండు. 1905లో వి.డి. సావర్కర్‍తో వీరేన్‍కు లండన్‍లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాతి సంవత్సరం ఇండియాని దోచుకుంటున్న బ్రిటిష్‍వారిని చంపేయాలని సావర్కర్ పిలుపునిచ్చిండు. ఈ పిలుపుతో ప్రభావితుడైన మదన్‍లాల్ దింగ్రా అనే విప్లవకారుడు లండన్‍లో విలియమ్ కర్జన్‍ని 1909లో హత్య చేసిండు. అయితే ఈ విషయంలో వీరేంద్రనాథ్ ‘టైమ్స్’ పత్రికలో సావర్కర్‍ని, హత్యనూ సమర్ధిస్తూ ఒక వ్యాసం రాసిండు. దీంతో ఇంగ్లండ్ ప్రభుత్వం ఆయన బారిస్టర్ అడ్మిషన్ (మిడిల్ టెంపుల్) కాన్సిల్ చేసింది. అంతేగాదు ఆయనపై నిఘా పెంచింది.
1907 ఆగస్టు 18-24 మధ్య కాలంలో జరిగిన ‘స్టట్‍గార్ట్ కాంగ్రెస్ ఆఫ్ సోషియాలజిస్ట్ ఇంటర్నేషనల్’ సదస్సులో పాల్గొన్నాడు. ఈ సదస్సులో ఇండియా నుంచి వచ్చిన మేడమ్ బికాజీ కామా, సర్దార్‍సింగ్ రావ్‍జీ రాణా కూడా పాల్గొన్నారు. ఈ సదస్సులో లెనిన్‍తో పాటుగా, బ్రిటన్‍కు చెందిన రామ్‍సె మెక్‍డొనాల్డ్, రొసా లక్సెంబర్గ్, హిండ్మాన్, జీన్ జారెస్ లాంటి ప్రపంచంలోని మహామహులు హాజ రయిండ్రు. ఈ సమయంలో వీరేంద్రనాథ్ ‘ఇండియన్ సోషియాలజిస్టు’ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా, కాలమిస్ట్గా ఉన్నాడు. ఈ దశలో బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కువ కావడంతో ఇండియాలోని చటో బంధువుల ఇళ్ళపై కూడా నిఘా పెరిగింది. సోదరి సుహాసిని చేస్తున్న కళాశాల అధ్యాపకురాలి ఉద్యోగం పోయింది. ఇంగ్లండ్‍లో నిఘా పెరగడమే గాకుండా తన అరెస్టుకు వారెంటు కూడా జారీ కావడంతో వీరేంద్రనాథ్ మకాంని 1909లో పారిస్‍కు మార్చిండు. ఇదే సమయంలో పారిస్‍లో బికాజీ కామా ‘తళ్వార్’, ‘వందేమాతరం’ అనే విప్లవ పత్రికలను నడిపించింది. ఈ పత్రికల నిర్వహణలో కూడా చట్టో చురుగ్గా పాల్గొన్నాడు. ఫ్రెంచ్ సోషలిస్టు పార్టీలో చేరిండు. ‘అంతేకాదు ఇండియాలో విప్లవ కార్యకలాపాలకు ఊతమిచ్చే విధంగా వార్తలు, వ్యాసాలు రాసి అచ్చేసిండు. అందులో భాగంగా ‘మర్యాదస్తులతో మర్యాదగా ఉండొచ్చు’, ‘స్కౌండ్రల్స్తో స్కౌండ్రల్స్’గానే వ్యవహరించాలని పరుషమైన వ్యాఖ్యలు రాసి అచ్చేసిండు. 1909-1914 మధ్యకాలంలో యూరప్ అంతటా తిరుగుతూ బ్రిటన్‍కు వ్యతిరేకంగా ప్రచారం చేసిండు. మరోవైపు పారిస్ నుంచి పత్రికలు తీసుకురావడం, వాటిని ప్రచురించి, పంపిణీ చేయడం పనిగా పెట్టుకున్నాడు.
1914లో మొదటి ప్రపంచ యుద్ధ ఛాయలు కమ్ముకుంటున్న సమయంలో ఇంగ్లండ్ మిత్రదేశమైన ఫ్రాన్స్లో నివసించడం శ్రేయస్కరం కాదని భావించిండు. అందుకే యుద్ధంలో ఇంగ్లండ్ ప్రత్యర్థి జర్మనీకి చేరుకుండు. బ్రిటన్‍కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే పనిచేసిండు. అందులో భాగంగానే 1917లో జర్మనీలో ‘బెర్లిన్ కమిటీ’ని ఏర్పాటు చేసిండు. ఈ బెర్లిన్ కమిటీ విప్లవ భావజాలాన్ని ప్రచారం చేయడంలో కీలక భూమిక పోషించింది. అయితే యుద్దం ముగిసిన తర్వాత జర్మనీ మీద బ్రిటిష్ ప్రభుత్వం వత్తిడి తీసుకొచ్చింది. చట్టోని దేశం నుంచి బహిష్కరించాలని సలహా ఇచ్చింది. జర్మన్ గడ్డపై ఎలాంటి బ్రిటిష్ వ్యతిరేక చర్యలకు స్థానం ఉండకూడదని హెచ్చరించింది. దీంతో జర్మనీలో కూడా వీరేంద్రనాథ్ కార్యకలాపాలపై ఆంక్షలు మొదలయ్యాయి. దీంతో తటస్థ దేశాలుగా ఉన్నటువంటి స్విట్జర్లాండ్, స్వీడెన్ దేశాలకు మకాం మార్చి తమ కార్యకలాపాలను నిర్వహించారు. స్టాక్‍హోమ్‍లో తటస్థ దేశాల సోషలిస్టులు నిర్వహించిన సదస్సులో పాల్గొంటూ భారతదేశ స్వయం పాలన కోసం పోరాటం చేయవల సిందిగా వీరేన్ పిలుపునిచ్చిండు. ఈ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన బోల్షవిక్ త్రొవాన్‍స్కితో పరిచయం పెంచుకున్నాడు. ‘అక్టోబర్ విప్లవం’ (1917) తర్వాత మాస్కో వెళ్ళి అక్కడ లెనిన్‍ని కలిసిండు.
1919 మేలో బెర్లిన్‍లో రహస్యంగా భారత విప్లవకారుల సమావేశాన్ని నిర్వహించాడు. తిరిగి 1920లో మాస్కో వెళ్ళి తాము చేస్తున్న ఉద్యమానికి ఆర్థిక సహకారాన్ని కమ్యూనిస్టుల నుంచి ఆశించిండు. 1921, 22 జూన్ 12 జూలై మధ్య కాలంలో మాస్కోలో జరిగిన మూడో అంతర్జాతీయ కమ్యూనిస్ట్ కాంగ్రెస్‍లో కూడా వీరేంద్రనాథ్ పాల్గొన్నాడు. ఈయనతో పాటు డాక్టర్ భూపేంద్రనాథ్ దత్తా, జిఎకె లూహాని, పి. కంకోజ్‍లతో పాటుగా అంతకుముందు సంవత్సరం నుంచే తాష్కెంట్‍లో ఉంటున్న ఎం.ఎన్.రాయ్, అబాని ముఖర్జీ, అబ్దుల్ రబ్, బర్కతుల్లా తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిజానికి ఎం.ఎన్.రాయ్ కన్నా ముందునుంచే కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నవాడిగా ఈయనకు గుర్తింపు దక్కాల్సి ఉన్నది. 1923లో ఇండియన్ న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్యూరోను బెర్లిన్‍లో ఏర్పాటు చేసిండు. దీని ద్వారా భారతదేశంలో జరుగుతున్న పోరాటాలను జర్మనీలో విద్యార్థులకు తెలియజేయడమే గాకుండా ఎప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా కర్తవ్య నిర్దేశాలు కూడా ఈ బ్యూరోద్వారా చేసేవారు. అంతేగాకుండా బెర్లిన్ కేంద్రంగా అమెరికా, అఫ్ఘనిస్తాన్, జపాన్‍లలో భారతీయులు నిర్వహిస్తున్న విప్లవ కార్యకలాపాలకు అండగా నిలిచిండ్రు. నిజానికి అమెరికా లోని గదర్ పార్టీకి ఆయుధాలు చేరవేసే పని కూడా ఈ సంస్థ చేపట్టింది. కానీ మధ్యలోనే రహస్యాలు వెల్లడి కావడంతో ఆయుధాలు గదర్‍పార్టీకీ చేరలేదు. ఇది ఇలా ఉండగా చటోపాధ్యాయ 1923లో జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీలో చేరిండు. 1930-33 సంవత్సరాల మధ్య కాలంలో హిట్లర్ వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిం చిండు. ఏషియన్ విప్లవకారుల సంఘం సభ్యుడిగా బెర్లిన్ నుంచి జపాన్, కొరియన్ విప్లవకారులతో కలిసి పనిచేసిండు.
వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ తన తండ్రి నుంచి విప్లవ భావాలను పుణికి పుచ్చుకున్నాడు. వీరేంద్రనాథ్ తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ నిజాం ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా, చాందా రైల్వే స్కీమ్ ప్రజాహితం కాదన్నందుకు దేశ బహిష్కరణకు గురయ్యిండు. భారతదేశం మొత్తంగా మొట్టమొదటి పిహెచ్‍డి గ్రహీత అయిన అఘోరనాథ్ నిజాం కళాశాల ప్రిన్సిపాల్‍గా కూడా పనిచేసిండు.
తాను పుట్టి పెరిగిన తెలంగాణ ప్రాంతంలోని తెలుగు, ఉర్దూలతో పాటుగా మాతృభాష బెంగాలీ, ఇంగ్లీషు, తమిళం, పర్షియన్, హిందీ భాషలతో పాటుగా విదేశాల్లోని ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మన్, డచ్, రష్యన్, స్కాండనేవియన్ దేశాల భాషలను అవపోసన పట్టిండు. వీరేంద్రనాథ్ తమ్ముడు హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, మరదలు కమలా దేవి ఛటోపాధ్యాయ, సోదరి సుహాసిని, ఆమె భర్త ఎసిఎన్ నంబియార్ ఇట్లా ఎందరో ఆయన పోరాటాలకు ఇండియా లోనూ, విదేశాల్లోనూ మద్ధతుగా నిలిచిండ్రు. వీరితో పాటు ఆనాడు హైదరాబాద్ నుంచి జర్మనీ,యూరప్ దేశాల్లో విద్యాభ్యాసం కోసం పోయిన రాయ్ శ్రీకిషన్ లాంటి అనేక మంది హైదరాబాదీలను కూడా విప్లవోద్యమంతో మమేకం చేసిండు.
చటోపాధ్యాయ అమెరికన్ జర్నలిస్టు ఎగ్నెస్ స్మెడ్లీని పెండ్లి చేసుకున్నడు. అంతకు ముందు ఐర్లాండ్ అమ్మాయి రినాల్డస్ని వివాహమాడిండు. అయితే ఆమె పూర్తిగా కాథలిక్ మతానికి అంకితం కావడంతో విడిపోయిండ్రు. ఇంత పోరాటం చేసిన వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ స్టాలిన్ ప్రభుత్వ హత్యాకాండకు బలయిండు. గూఢచారిగా వ్యవహరిస్తున్నాడు అనే ఆరోపణ చేస్తూ స్టాలిన్ ప్రభుత్వం అతన్ని 1938 సెప్టెంబర్ రెండున కాల్చి చంపింది.
-సంగిశెట్టిశ్రీనివాస్, ఎ:98492 20321