మే 18 ఇంటర్నేషనల్‍ మ్యూజియం డే


వారసత్వ సంపద


ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మ్యూజియమ్స్ను ప్రోత్సహించడానికి, అంతర్జాతీయ సమాజ వృద్ధిలో మ్యూజియంల పాత్ర గురించి అవగాహన కల్పించడానికి మ్యూజియం డే ముఖ్యమైనది.


మ్యూజియాలు మౌనముద్ర దాల్చినట్లుగా కనిపిస్తాయి. నిజానికి అవి నిరంతరం మాట్లాడుతూనే ఉంటాయి. అవి ఉబుసుపోని మాటలు కాదు. కళాతత్వాన్ని గురించి విడమరచి చెప్పే మాటలు. చరిత్రను కళ్లకు కట్టినట్లుగా వ్యాఖ్యానించే మాటలు. కొన్ని మాటలు మాటలుగా మాత్రమే ఉండవు. అవి వెలుగుదీపాలై దారి చూపుతాయి. మ్యూజియంలోకి అడుగుపెట్టడం అంటే గంభీరమైన పాతభ వనంలోకి అడుగుపెట్టడం కాదు. ఒక కొత్త దారిని వెదుకుతూ వెళ్లడం. జర్మనీలో ఎన్నో ప్రసిద్ధ మ్యూజియాలు ఉన్నాయి.


‘కవులు, ఆలోచనావాదుల భూమి’గా పిలవబడే జర్మనీ కళా, సాంస్కృతిక మేధా వికాసం ఆ దేశంలో కొలువుతీరిన మ్యూజి యాల్లో వెయ్యివెలుగులై కనిపిస్తుం టుంది.
‘ఇంటర్నేషనల్‍ మ్యూజియం డే’ సందర్భంగా కొన్ని మ్యూజియాల గురించి సంక్షిప్తంగా…
స్పేస్‍ ట్రావెల్‍ మ్యూజియం: స్పేస్‍ టెక్నాలజీకి అద్దంపట్టే ఈ మ్యూజియం ప్రాన్‍కోనియన్‍ నగరంలో ఉంది. భవిష్యత్‍ దార్శనికుడు, రాకెట్‍ సాంకేతిక జ్ఞాన మార్గదర్శిగా పేరున్న హెర్మన్‍ ఒబెర్త్ జ్ఞాపకాలకు సంబంధించిన వస్తువులతో పాటు క్యుములస్‍ రాకెట్‍, సిర్రస్‍ రాకెట్‍లాంటి రకరకాల రాకెట్లు ఇక్కడున్నాయి. మ్యూజియం ముందు కనిపించే స్విస్‍ జెనిట్‍ సౌండింగ్‍ రాకెట్‍ ప్రత్యేక ఆకర్షణ.


బవేరియన్‍ నేషనల్‍ మ్యూజియం: మ్యూనిచ్‍లో ఉన్న ఈ మ్యూజియం జర్మనీలోని అతి పెద్ద మ్యూజియంగా పేరు గాంచింది. డెకొరేటివ్‍ ఆర్టస్కు సంబంధించిన ఈ మ్యూజియాన్ని 1885లో నిర్మించారు. ఆర్ట్ హిస్టారికల్‍, ఫోక్‍లోర్‍ కలెక్షన్‍ అనే రెండు విభాగాలుగా ఉన్న ఈ మ్యూజియంలో ఎన్నో అపురూపమైన వస్తువులు ఉన్నాయి.


మ్యూజియం ఫైవ్‍ కాంటినెంట్స్:
మ్యూనిచ్‍లో ఉన్న ఈ మ్యూజియంలో నాన్‍-యురోపియన్‍ ఆర్ట్వర్కస్ ఉన్నాయి. 1859లో నిర్మించిన ఈ మ్యూజియం జర్మనీలో రెండవ అతి పెద్ద మ్యూజియంగా పేరు గాంచింది. రెండు లక్షలకు పైగా కళాకృతులు ‘మ్యూజియం ఫైవ్‍ కాంటినెంట్స్’లో ఉన్నాయి.


జర్మన్‍ స్టీమ్‍ లొకోమోటివ్‍ మ్యూజియం:
ఫ్రాంకోనియాలో ఉన్న ఈ మ్యూజియాన్ని 1977లో నిర్మించారు. ఈ మ్యూజియం ఉండే స్థలంలో 1895లో నిర్మించిన లొకోమోటివ్‍ షెడ్‍ ఉండేది. దాదాపు 30 స్టీమ్‍ లొకోమోటివ్‍లు ఈ మ్యూజియంలో ఉన్నాయి.


టాయ్‍ మ్యూజియం: ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ టాయ్‍ మ్యూజియం నురెంబెర్గ్లో ఉంది. 1971లో నిర్మితమైన ఈ మ్యూజియంలో ప్రాచీన చరిత్ర నుంచి ఆధునిక చరిత్ర వరకు కళ్లకు కట్టే బొమ్మలు, కళాకృతులు ఉన్నాయి.


మ్యూజియం బ్రాండ్‍హోస్ట్: 2009లో మ్యూనిచ్‍లో నిర్మించిన ఈ మ్యూజియంలో ఆధునిక కళకు అద్దం పట్టే అపురూప కళాకృతులు ఉన్నాయి. విజువల్‍ ఆర్ట్ మూమెంట్‍లో కీలక పాత్ర వహించిన అమెరికన్‍ ఆర్టిస్ట్ ఆండీ వర్హాల్‍కు చెందిన వంద చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. అమెరికన్‍ పెయింటర్‍, ఫొటోగ్రాఫర్‍ టుంబ్లీ సృజనాత్మక చిత్రాలు 60 వరకు ఉన్నాయి.


మ్యూజియం ఐలాండ్‍: బెర్లిన్‍లో ఉన్న మ్యూజియం ఐలాండ్‍ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్‍ సైట్స్ జాబితాలో చోటు చేసుకుంది. మ్యూజియం ఐలాండ్‍లో ఐదు మ్యూజియాలు ఉన్నాయి. పెర్గమన్‍, బోడ్‍, న్యూయిజ్‍, అల్టే, ఆల్టేస్‍… అనే ఈ ఐదు మ్యూజియాలను వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుంచి సందర్శకులు వస్తుంటారు. ప్రాచీన చిత్ర, శిల్ప కళాసంపదకు ఈ మ్యూజియాలు అద్దం పడతాయి.


బ్రైత్‍-మలి-మ్యూజియం: దక్షిణ జర్మనీలోని బెబైరక్‍ నగరంలో ఉన్న ఈ మ్యూజియంలో పురాతత్వ, చరిత్ర, కళలకు సంబంధించిన రకరకాల వస్తువుల కళాకృతులు ఉన్నాయి.


విశ్వనగరిలో అడవి అందాలు
ప్రకృతితో గిరిజనులది విడదీయరాని బంధం. ప్రకృతినే ఆరాధ్య దైవంగా కొలుస్తూ అందులో మమేకమవుతారు గిరిజనులు. వారి జీవనశైలి ప్రకృతిలాగే రమణీయంగా ఉంటుంది. వారి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు చూపరులను కట్టిపడేస్తాయి. సామాన్య జనానికి దూరంగా తమదైన లోకంలో జీవించే అడవిబిడ్డలను చూడాలంటే కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి వెళ్లాల్సిన అవసరమే లేదు. మన భాగ్యనగరంలో గిరిజనులను దర్శించ వచ్చు. వారి ఆటపాటలను, వారు చెప్పే ముచ్చట్లను మాసబ్‍ట్యాంక్‍ సంక్షేమ భవన్‍ ట్రైబల్‍ మ్యూజియంలో ఎంచక్కా ఆస్వాదించవచ్చు.


గ్రౌండ్‍ ఫ్ల్లోర్‍లో: గిరిజన సమాచారం తెలిపేలైబ్రరీ, ఆదివాసీల కాల చక్రం తెలిపే చిత్ర పటం ఉంది.
మినీ ఆడిటోరియంలలో: మానవుని పరిణామక్రమాన్ని తెలిపే మ్యూజియం ఉంది. 12 రకాల గిరిజన సంస్కృతులను చూడవచ్చు.
మొదటి అంతస్తులో: గిరిజనుల జీవన విధానం ఉట్టిపడేలా గిరిజనుల ప్రతిమలను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక గ్యాలరీలో గిరిజనుల సంగీత పరికరాలు, దృశ్యశ్రవణ విభాగంలో లఘుచిత్ర ప్రదర్శనశాల ఏర్పాటు చేశారు. 18 రాష్ట్రాల్లో ఉన్న గిరిజన సంగ్రహాలయాల్లో ప్రదర్శనకు ఉంచిన వస్తు విశేషాలను టచ్‍స్క్రీన్‍ కంప్యూటర్‍లో చూసుకునే వెసులు బాటు కల్పించారు.


రెండో అంతస్తులో…
కులదేవతల ప్రతిమలు, వేటకు, వ్యవసాయానికి ఉపయో గించే పనిముట్లను వీక్షించవచ్చు. పండుగలకు చేసే నృత్య ప్రతిమలు, వాయిద్య పరికరాలు, యానాది, ఎరుకల, కోయ, లంబాడీ, చెంచుల, సవరల ఇళ్లు విశేషంగా ఆకట్టు కుంటాయి.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఖమ్మం మరియు ఆదిలాబాద్‍ జిల్లాల నుండి వచ్చిన గిరిజన వర్గాలకు సంబంధించిన కళాఖండాలను ప్రదర్శించే గ్యాలరీలతో, ఈ గిరిజన వర్గాల జ్ఞానం మరియు కథలను మరియు వారి తరచుగా పట్టించుకోని జీవన విధానాన్ని అందుబాటులో ఉంచడానికి మ్యూజియం ప్రయత్నిస్తుంది. ఈ ప్రదర్శనలలో జీవన నిర్మాణాలు, వ్యవసాయ పరికరాలు, వేట సాధనాలు, సంగీత వాయిద్యాలు, యెరుకులస్‍, గోండ్స్, కోయాస్‍, సవారస్‍ మరియు లంబాదాస్‍ వంటి గిరిజన వర్గాల నుండి టేబుల్‍యాక్స్ మరియు డయోరమాలు ఉన్నాయి.
ఇతర సదుపాయాలలో గిరిజన సంస్కృతి మరియు అభివృద్ధిపై చిత్రాలను ప్రదర్శించే మినీ ఆడిటోరియం, భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గిరిజన వర్గాలపై 14,500 పుస్తకాలతో కూడిన లైబ్రరీ ఉన్నాయి.


పద్మపురా బొటానికల్‍ గార్డెన్స్ సమీపంలో అరకు లోయలో ఉన్న గిరిజన మ్యూజియాన్ని 1996లో ఆంధప్రదేశ్‍ టూరిజం డెవలప్‍మెంట్‍ కార్పొరేషన్‍ స్థాపించింది. గిరిజన సంస్కృతిని పరిరక్షించడం, ప్రదర్శించడం అనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. ఆభరణాలు, వేట సాధనాలు మరియు వంటగది ఉపకరణాలు వంటి రోజువారీ ఉపయోగం యొక్క వస్తువులను ప్రదర్శించడం ద్వారా వివిధ దేశీయ జీవన విధానాలను మ్యూజియంలో ప్రదర్శిస్తారు. కోటిడియన్‍ జీవిత దృశ్యాలు జీవిత-పరిమాణ విగ్రహాల అమరిక మరియు నిర్మాణం ద్వారా ప్రదర్శించబడతాయి.


హైదరాబాద్‍లోని సాలార్‍ జంగ్‍ మ్యూజియంలో అనేక చారిత్రక వస్తువులు వున్నాయి. మ్యూజియాలను విద్యాత్మకంగా, వినోదాత్మకంగా అభివృద్ధి పరుస్తూ, సాధారణ ప్రజానీకాన్ని మ్యూజియం సందర్శనలో భాగస్వాములను చేయాలి. మన దక్కన్‍ పీఠభూమిలో వెలుగుచూస్తున్న పురాతన వస్తువులు కూడా చేర్చి తెలంగాణ ప్రతిష్టను పెంచాలి. అంతేకాకుండా కొత్తగా మరెన్నో మ్యూజియాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణలో ఎంతోమంది కవులు, కళాకారులు, రచయితలు ఉన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన మన కళాకారులు, కవులు, రచయితల కోసం ఓ మ్యూజి యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రాబోయే తరాల కోసం మరెన్నో మ్యూజి యాలను ఏర్పాటు చేసి తెలంగాణ చరిత్రను, ప్రతిష్టలను అందరికీ తెలియ జేయాల్సిన అవసరంకూడా ఉంది.


గొప్ప చరిత్రకు కేంద్రాలుగా మ్యూజియంలను ఎందరో చరిత్రకారులు అభివర్ణించారు. మ్యూజియంల స్థాపనకే బాధ్యత పరిమితమైపోయిందనకుండా వాటి పరిరక్షణకు కూడా మనమందరం ముందుండాలి. రాబోయే తరాలకు చారిత్రక వారసత్వ సంపద అందాలంటే – మ్యూజియంలే మంచి మార్గంగా ఉపయోగపడతాయి. ప్రత్యక్ష సందర్శనతో చరిత్రను ఒడిసిపట్టే జ్ఞానాన్ని అందించే పురాతత్వ విజ్ఞాన కేంద్రాలు మ్యూజియంలు. చారిత్రక జ్ఞానం తగ్గిపోతున్న పరిస్థితులు క్రమంగా ఏర్పడుతుండడంపట్ల చరిత్రకారులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన తరువాతి తరాలవారికి విజ్ఞాన, వినోద, సాంస్కృతిక అవసరాలకోసం మన వారసత్వ సంపదను కాపాడు కోవడం మనందరి బాధ్యత.


-సువేగా,
ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *