నిర్మల్‍లో ఫిరంగీల తయారి కేంద్రాలు


ప్రాచీన కాలం నుండి తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇనుము ఉక్కు తయారీ విరివిగా జరిగింది. అనేక గ్రామాలల్లో, మారుమూల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఇనుము ఉక్కు తయారీకి సంబంధించిన పరిశ్రమల ఆనవాళ్లు ఇప్పటికీ లభిస్తున్నాయి. అందునా నిర్మల్‍ జిల్లాలోని దిలావార్‍పూర్‍, కుబీర్‍, కడెం, మామడ, ఖానాపూర్‍, పెంబి తదితర మండలాల్లో విరివిగా ఇనుము, ఉక్కును మరియు వీటి ద్వారా వివిధ వ్యవసాయ పనిముట్లు యుద్ధాల కోసం ఉపయోగించే కత్తులు, బరిసెలు, బల్లెములు తదితర సామాగ్రి విరివిగా తయారు చేసినట్లు నిరూపించబడింది. కల్లెడ, చిట్యాల తదితర అనేక గ్రామాల పేర్లు ఇనుముకు సంబంధించినవి ఉండటం గమనార్హం.


కాకతీయుల నుండి వేరుపడి స్వతంత్ర రాజ్యం స్థాపించిన పద్మనాయక రాజులు నిర్మల్‍ నుండి తమ రాజ్యాన్ని విస్తరింప చేసుకున్నారు. నిమ్మనాయుడు పరిపాలించినట్లు జనబాహుళ్యంలో కథనాలు వున్నా శాసన సంబంధమైన లేదా చారిత్రక కుండాలలో ఎక్కడ రికార్డు లేక పోవడం గమనార్హం.
పద్మనాయక వంశస్థుల నుండి నిర్మల్‍ సంస్థానం ఆసప్జాహీ వంశానికి చెందిన నిజాం ఉల్‍ముల్క్ ఆధీనంలోకి వచ్చేసింది.
‘నిజాం రాజు ఔరంగబాద్‍ నుండి హైద్రాబాద్‍కు మకాం మార్చిన క్రమంలోనే 1769వ ప్రాంతంలో ఇబ్రహీంబేగ్‍ థంసాను నిర్మల్‍ పాలకుడిగా నియమించాడు. థంసా ఎనగందుల, బాలకొండ, ఇందూరు, గడ్‍చందా తదితర కోటలను పునఃనిర్మించినట్లు చరిత్రకారుల అభిప్రాయం.


రెండవ నిజాం ఆలీఖాన్‍ ఆధునిక ఫిరంగులను తయారు చేయడానికి రెండు ప్రాంతాలను ఎంపిక చేసుకున్నాడు. ఒకటి హైదరాబాద్‍లోని గన్‍ఫౌండ్రి కాగా మరొకటి నిర్మల్‍ కేంద్రంగా ఫిరంగీల తయారిని ప్రారంభించాడు. నిజాం సైన్యంలో పనిచేసే ఫ్రెంచి జనరల్‍ మూసారేమాండ్‍ ఆధ్వర్యంలో గన్‍ ఫౌండ్రీలను ఏర్పాటు చేసి ఫిరంగులను తయారు చేయడం, ఫిరంగీలల్లో పేర్చే మందుగుండు పౌడర్‍ను తయారు చేయడం జరిగేది. 1786 సం।।లో నిర్మల్‍ నాల్గు ప్రాంతాలల్లో గన్‍ ఫౌండ్రీలను నిర్మించారు. ఇందుకు ఇటుకలు, మోర్టారును వాడినారు. భాగ్యనగర్‍లో ఒకటి, మహాలక్ష్మి వాడలో రెండు మరియు ఇసురు రాళ్ళ గుట్ట మీద ఒకటి గన్‍ ఫౌండ్రీలను నిర్మించినారు. ఇవి నిర్మించినప్పుడు అక్కడ జనవాసాలు లేవు. ఇవి ఇప్పుడు జనవాసాల మధ్య చిక్కుకున్నాయి.
ఉత్తర భారతానికి, దక్షిణ భారతానికి అడ్డుగా నిర్మల్‍ గుట్టలు (సహ్యద్రి) బాసర మరియు గోదావరి ఉండటంతో నిర్మల్‍ ప్రాంతాన్ని శత్రుదుర్బేత్యంగా మలిస్తే హైదరాబాద్‍ రాజ్యం సురక్షితంగా వుంటుందని భావించివుంటారు. ఆది నుండి నిర్మల్‍ ప్రాంతం శ్రేష్టమైన ఇనుము, ఉక్కు తయారీ కేంద్రంగా నిలిచింది.


గుమ్మటాలు – వాటి విస్తీర్ణం
స్థానికంగా గుమ్మటాలుగా పిలిచే ఈ తోపుల బట్టీలు ఒక వెలుగొందిన చరిత్రకు నఖలుగా నిలిచినాయి. ‘‘తోపికా – సాంచ’’గా పిలువబడే వీటి గురించి స్థానికులకు అవగాహన, పట్టింపు లేకపోవడం గమనార్హం. నిర్మల్‍కు ఉత్తరం వైపున మహాలక్ష్మి ఆలయ శివారులో 40 పీట్ల ఎత్తు కల్గి 25 పీట్ల వ్యాసార్థం కల్గిన ఒక పెద్ద గుమ్మటం వుంది. లోపలకు వెళ్ళడానికి 4 ద్వారాలను ఏర్పర్చినారు. గుండ్రంగా వలయాకారంలో వుండే ఈ గుమ్మటాలకు నాల్గు పెద్ద కిటికీలుంటాయి. ఇదే ప్రాంతంలో మరొక తోపులబట్టీ వుంది. ఇది 35 ఫీట్ల ఎత్తు కలిగి 20 ఫీట్ల వ్యాసార్థం కల్గి వుంది. ఇవి రెండు ఒకే ప్రాంతంలో ఉండటం విశేషం. చిన్న ఫిరంగీలు తయారు చేయడానికి చిన్న బట్టీలను, పెద్దవి తయారు చేయడానికి పెద్ద బట్టీలను వాడేవారు.


భాగ్యనగర్‍ ప్రాంతంలో 48 ఫీట్లు ఎత్తు కల్గిన తోపులబట్టీ వుంది. లోపల సుమారు 30 ఫీట్ల వ్యాసార్థం కల్గి వుంటుంది. ఈ బట్టీకి నాల్గు ద్వారాలున్నాయి. నాల్గు కిటికీలు 6 ఫీట్లు ఎత్తు కల్గివున్నాయి. అదే విధంగా ధన్‍ధన్‍ గుట్టను ఆనుకుని ఇసురు రాళ్ళ గుట్ట ఉంటుంది. దీనిపై 20 ఫీట్ల ఎత్తు కల్గి లోపల 10 ఫీట్ల వ్యాసార్థం కల్గిన గుమ్మటముంది. ఇది మేకలబండ ప్రక్కన ఉంటుంది. అతిపెద్ద ఇసురు రాళ్ళు ఈ గుమ్మటంలో ఉన్నాయి. అందుకే ఇది ఇసురురాళ్ళ గుట్టగా పిలుస్తారు.


ఫిరంగుల తయారీ – తరలింపు

ఈ తోపుల బట్టీలలో తయారైన వివిధ నమూనా ఫిరంగులను బురుజుల మీదకు, కోట మీదకి, ఖిల్లా గుట్ట, శ్యామ్‍ఘడ్‍, బసేరాఫోర్ట్, బత్తీస్‍ఘట్‍ తదితర ప్రాంతాలకు ఏనుగుల ద్వారా తరలించేవారు. వందలాది ఫిరంగులు ఉండేవని కాలక్రమంలో వాటిని ఎక్కడికో తరలించారని స్థానికులంటారు. ప్రస్తుతం అన్ని కలిపి 38 ఫిరంగులను నిర్మల్‍లో వివిధ ప్రాంతాల్లో చూడవచ్చు. ఇందులో తహసిల్‍ కార్యాలయంలో వున్న ఫిరంగి పంచలోహాలతో తయారు చేసిందని అంటారు. పంచలోహ ఫిరంగిపై ‘‘రఫిక్‍ దక్కన్‍ నవాబ్‍ రుక్మదౌద్ధలా, జఫరుద్దౌల 1184 హిజరీ’’ అనే ఉర్దూ శాసనముంది. ఇదే శాసనం కల్గిన రెండు ఫిరంగులు స్థానిక టిఎన్జీఓ వారి ప్రాంగణంలో వున్నాయి. వెంకటాద్రిపేట ఓంకారేశ్వర ఆలయ ద్వారానికి పేర్చిన రెండు ఫిరంగులకు కూడా ‘‘రఫీక్‍ దక్కన్‍ నవాబ్‍ రుక్ముద్ధౌలా, జఫరుద్దౌలా 1185 హిజరి’’ అని వుంది. జూనియర్‍ కళాశాలలో వున్న రెండు ఫిరంగులపై ఇదే శాసనం అచ్చు వేయించారు. తహసిల్‍ కార్యాలయంలో ఉన్న ఒక ఫిరంగిపై
ఉర్ధూలో కాకుండా ఫారసీలో రాయబడిన శాసనముంది. ఈ శాసనంలో సర్కార్‍ ఆసఫ్‍-ఆసఫ్‍జాహిడైనాస్టి (Sarkar Asafi Asifjahi Dynasty) అని పోతపోసివుంది.


నిర్మల్‍ ప్రాంతానికి పాలకుడిగా నియమించబడిన ఇబ్రహీం బేగ్‍థంసా ‘‘నవాబ్‍ రుక్ముద్ధౌలా’’ బిరుదుతో పాలించినాడు. తన పాలనను పటిష్టపరుచుకుని స్వతంత్య్ర ర్యాంగా ఏలుకోవాలని తన పేరిట ఫిరంగులను తయారు చేసి అన్ని రక్షణ స్థావరాలకు తరలించాడు. వీరి చర్యల్ని గమనించిన నిజాం ఆలీఖాన్‍ వీరిని లొంగదీసుకుని అధికార భ్రష్టున్ని చేసినట్లు చెబుతారు. పరిపాలించిన కొద్ధి కాలంలో స్వతంత్య్ర సేనను, ఆయుధ సామర్థ్యం పెంచుకోవడం అభినందనీయం.


వారసత్వ సంపద కాపాడుకోవాలి.
ఇప్పటికీ నిర్మల్‍ కోటలు బలిష్టంగా, సజీవంగా వున్నాయి. బురుజులు, గుమ్మటాలు, రాతి పరుపులు, పరుపులపై చెక్కిన పెక్టోగ్రాఫిలను కాపాడుకోవాలి. దాదాపు 80 ఫీట్ల వైశాల్యంతో పట్టణం చుట్టూర తవ్వుకున్న నీటి కందకం అన్యాక్రాంతం కాకుండా రక్షించుకోవాలి. శిథిలావస్థకు చేరుకుంటున్న తోపులబట్టీలను మరమ్మత్తులు చేసి కాపాడుకోవాలి. మోటబావులు నీటి జలాశయాలు, గొలుసుకట్టు చెరువులు, ప్రాచీన ఆలయాలు రక్షించుకుని బావి తరాల వారికి మన వారసత్వ సంపదగా అందించాల్సి వుంది. ఎక్కడిక్కడ కంచె వేసి, బోర్డులు పెట్టి, పురావస్తు సంపదగా ప్రజలకు తెలిసేటట్లు చేయాలి. ఆ దిశగా ప్రజలు, సమాజం, చరిత్రకారులు, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రభుత్వం ఆలోచిస్తారని ఆశిద్దాం!!


తుమ్మల దేవరావ్‍, ఎ : 8985742274

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *