విరియాల కామవసాని గూడూరు
కన్నడ-తెలుగు శాసనం (క్రీ.శ.1124)
నిజానికి ఈ శాసనం విరియాల కామవసానిది కాదు. ఆమె విడుదల చేయలేదు. అయితే ఈ శాసనంలో ఆమె చేపట్టిన ఒక ఘనకార్యం కాకతీయుల చరిత్రను ఒక మలుపు తిప్పింది. కాకతీయులు కేవలం సామంతులుగానే మిగిలిపోకుండా, వారు స్వతంత్ర రాజులుగ నిలిదొక్కుకొని, తరువాతి కాలంలో ఒక విశాల సామ్రాజ్యాన్ని పాలించటానికి దోహదపడిన సంఘటనకు నాంది పలికింది. మరి ఇంతకీ ఈ శాసనం ఎవరిది? జయన్తీపురం నుంచి పాలిస్తున్న కళ్యాణ చాళుక్య ప్రభువు, ఆరో విక్రమాదిత్యుని (క్రీ.శ.1076-1127) కుమారుడు, కొలనుపాక నుంచి పాలిస్తున్న యువరాజు కుమార సోమేశ్వరుని దండనాయకుడైన స్వామిపయ్య విన్నపమున్న శాసనం. కాబట్టి ఇది స్వామిపయ్య శాసనమనవచ్చు. విరియాల వంశీకుడైన మల్లుడు, గుముడూరులో నిర్మించిన శివాలయాన్ని ప్రస్తావిస్తున్న శాసనంగాబట్టి, విరియాల మల్లుని శాసనమని కూడా అనవచ్చు. కళ్యాణ చాళుక్య ప్రభుత్వాన్ని కీర్తిస్తున్న శాసనం, గాబట్టి ఇది వారి శాసనమనవచ్చు. కానీ ఒక చారిత్రక అవసరంగా, కాకతీయ గరుడ బేతరాజును అనుమకొండ సింహాసనంపై కూర్చొండ బెట్టటానికి మరో రాజు సహకారంతో, సార్వభౌముని ఒప్పించిన రాజకీయ చతుర కామవసాని. అందుకని, విరియాల కామవసాని శాసనమంటేనే సరిపోతుంది.
మునుపటి వరంగల్ జిల్లా, జనగామ తాలూకాలోని గూడూరు శాసనం క్రీ.శ.1124 నాటిది. ఈ శాసనాన్ని 1966వ సం।।లో అప్పటి ఆంధప్రదేశ్ పురావస్తు ప్రదర్శన శాలల శాఖ నకలు తీసి, ఆ సం।।పు వార్షిక శాసన నివేదికలో 321వ శాసనంగా క్లుప్త వివరణనిచ్చింది. ఆ తరువాత, డా. ఎన్. వెంకటరమణయ్యగారి సంపాదకత్వం, డా.ఎన్. రమేశ్‍న్‍గారి ప్రధాన సంపాదకత్వంలో అదేశాఖ 1974లో ప్రచురించిన ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఆంధప్రదేశ్ – వరంగల్ డిస్ట్రిక్టు హైదరాబాదు, పుస్తకంలో 27వ శాసనంగా (పే.76-82) మొత్తం శాసనం, ముద్రలతో సహా ప్రచురించింది. ఈ శాసనం మొదటి మూడు వైపులూ కన్నడ భాషలో 111 పంక్తులు, నాలుగోవైపున తెలుగు భాషలో 36 పంక్తుల్లో, తెలుగు – కన్నడ లిపిలో చెక్కబడింది. శాసన స్థంభం మొదటి వైపు పైన సూర్య చంద్రులు, శివలింగం, ఆవు దూడ బొమ్మలు కళ్యాణచాళుక్య శిల్ప శైలిలో చెక్కబడినాయి. ఇదే శాసనం పి.వి. పరబ్రహ్మశాస్త్రిగారి తెలుగు శాసనాలు, ప్రపంచ తెలుగు మహాసభలు (1975 మళ్లీ 2012) సందర్భంగా ప్రచురించిన పుస్తకంలో గూడూరు శాసనము (చాళుక్య విక్రయ శకము 49, క్రీ.శ.1124) అన్న శీర్షిక (పే.78-85)న వివరణలతో, కేవలం తెలుగు పద్యాల వరకే ఉంది. శ్రీ బి.ఎన్. శాస్త్రిగారి భారతదేశ చరిత్ర : ఆరో సంపుటం, ‘కాకతీయ యుగం’లో విరియాల వంశం వారి వివరాల్లో ఈ శాసనాన్ని ప్రస్తావించారు. భారతీయ భాషా సంస్థ, మైసూరు 2019లో ప్రచురించిన ఈమని శివనాగిరెడ్డిస్థపతి, కొండా శ్రీనివాసులు (సంకలనం), రచన తెలుగు వారి శాసనాలు (క్రీ.పూ.3వ శతాబ్దం – క్రీ.శ.18వ శతాబ్దం)లో ‘కళ్యాణ చాళుక్య త్రిభువన మల్ల ఆరో విక్రమాదిత్యుని, గూడూరు (విరియాల కామసాని) శాసనం (క్రీ.శ.11-12 శతాబ్దం) పేరిట పాఠకుల సౌలభ్యం కోసం కొంత కన్నడ భాగం, మొత్తం తెలుగు భాగాన్ని చూడొచ్చు. ఇలా ఈ శాసనం డా. బి. మనోహరిలాంటి ఇంకా చాలా మంది పరిశోధకుల దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఈ శాసనానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ శాసనం చాళుక్య విక్రమ సంవత్సరం 49, (క్రోధి నామ సం।।) పుష్య బహుళ పాడ్యమి, బుధవారం క్రీ.శ.1124 డిసెంబర్ 24న విడుదల చేయబడింది. శ్రీ పృధ్వీవల్లభ ముహారాజాధిరాజ పరమేశ్వర, పరమభట్టారక, సత్యాశ్రయకులతిలక, చాళుక్యాభరణ, శ్రీమత్ త్రిభువనమల్లదేవర (ఆరోవిక్రమాదిత్యుని పుత్రుడు) యువరాజు కుమార సోమేశ్వరుడు కాలనుపాక రాష్ట్రానికి మహామండలేశ్వరునిగ ఉన్నపుడు, అతని దండనాయకుడు స్వామిపయ్య చేసిన విన్నపం మేరకు, గుముడూరు (గూడూరు)లో, విరియాల వంశానికి చెందిన మల్లడు నిర్మించిన మల్లేశ్వరాలయానికి, బమ్మరిగె (బమ్మెర) గ్రామాన్ని దానం చేసిన సందర్భంలో ఈ శాసనం విడుదల చేయబడింది. ఈ విషయాలన్నీ, కన్నడ శాసనం, మొదటి రెండు బాగాల్లో ఉన్నాయి. ఇందులో ఇంకా చోళ, గంగరాజ్యాలపై సాధించిన విజయాలు, త్రికళింగరాజులపై తన కోపాగ్నిని ప్రదర్శించిన వాడుగానూ అతని మహాప్రధాని సావిపయ్య (స్వామిదండనాథ, సావిదేవ, స్వామిదండాధి ప్ర గుణగణాల వివరాలున్నాయి.
మూడో భాగంలో, విరియాల సూరడు, అతని కుమారుడు బేతన (భార్య బెజ్జమాంబిక), వారి కుమారుడు మల్లుడు (కటక మున్నిరువ బిరుదాంకితుడు), గుముడూరులో శివునికి మల్లేశ్వరుని పేరిట ఒక గుడిని కట్టించి, చెరువు, బావులను తవ్వించాడన్న వివరాలున్నాయి.
ఇక నాలుగో భాగమైన తెలుగు శాసనంలో, దుర్జయ వంశానికి చెందిన పోరంటి వెన్నని ప్రస్తావన ఉంది. అతనికి ఎర్రభూపతి, అతనికి పాండవ మధ్యముడైన భీమునిలాంటి పరాక్రమం గల
శాసనం పాఠం మొదటి వైపు
- స్వస్తి శ్రీ సమస్త భువనాశ్రయ
- శ్రీ ప్రిథ్వీవల్లభ మహారాజాధిరా
- జ పరమేశ్వరం పరమ భట్టారకం
- సత్యాశ్రయ కుళతిళకంచాఱుక్యా
- భరణం శ్రీమతృభువనమల్లదేవర
- విజయరాజ్య ముత్తరోత్తరాభివృద్ధి ప్రవద్ధ •మా
- నమాచంద్రాక్క తారంబరం సలుత్తం జయన్తీ
- పురద నెలెవీడి నోళుసుఖసంకథా వి
- నోదదిం రాజ్యంగెయ్యత్తమిరె।। తదాత్మజ।।
- ఏ స్వస్తి సమధిగత పంచమహాశబ్ద మహా
- మణ్డళేశ్వరం వీరమాహేశ్వరం విజయలక్ష్మీనివా
- సం రక్షదక్షదక్షిణ దోద్ద ణ్డం ద్వాదశ మణ్డ
- ళిక (రోళ) మాత్త ణ్డం ప్రతాపాక్రాశ నవఖండ భూమణ్డళం
- రాజలీలా చమత్కృతాఖండళం కోదణ్డ చతుభ్భు
- జం శృంగార మకరధ్వజం త్రిభువనరంగ ప్రవత్తి త
- కీత్తి న నత్త కీ నత్త న సూత్రధారం శరణాగత వజ్ర
- ప్రాకారం మూఱురాయ కలికువర బిరుద హృ
- దయాకంపం త్యాగజగఝ(రు?)ంప నత్థి జన చిన్తి తాత్థ చిం
- (తి) తామణి సుభట మండళిక మకుట చూడా
- మణి కు న్తళ రాజ్యాభ్యుదయయ్క కారణం బప్ప
- న గంధవారణం శ్రీమచ్చాళుక్య గంగపెమ్మా డి
- కుమారం సోమేశ్వర దేవ।। వృత్త।। మోళెవెత్తెత్తి
- దతోళబాళ జళధిం మెయ్గొండ మిత్రాంగనా
- కుళ బాఱ్పద్రవదిం తళిత్తు •రిపు సేనా చక్ర
- రక్తాంబుధిం బళెదత్తీ గళు పాహితాహిత గళ
- త్కాళింగ మాతంగ సంకుళ దాన (ప్ల)వదిం పరాక్రమ వ
- నం సోమేశ్వరోర్వీశన।। ప్రకటాటోపద చోళగంగ
- దనుజాధీశం తెరళ్దోడె సైనిక వీరామరకోటి
- కోటి విధదిం కొండాడె కోపాగ్నియిందె కళింగత్ర
- య(మం) పురతృతెయమం సుట్టంతె సుట్టిట్టళం త్రి
- కళింగ త్రిపుర తృణేత్ర నెనిపం సోమేశ్వరోబ్బీ శ్వర।
విరియాల భీముడు, అతనికి ఎర్రనరేంద్రుడు పుట్టారు. విరియాల భీమునికి మాండలికాభరణ బిరుదుంది. అతడు తన శతృవుని జయించి, బొట్టు బేతరాజును, కొరవి రాజ్యానికి అధిపతిగా పట్టం గట్టి, ప్రతిఫలంగా మొగుడుపల్లి-12ను పొందాడు.
విరియాల ఎర్రనృపుని భార్య, విరియాల కామ(వ)సాని, బల్లాహ (పల్లవరాయని)నియోగంలో ప్రవేశించి, చక్రవర్తిని కలసి, ఆయన అనుగ్రహంతో పిన్నవయస్కుడైన కాకతి (గరుడ) బేతరాజును, కాకతీయ ర్యాంపై నిలబెట్టిన ఒక గొప్ప చారిత్రక ఘట్టాన్ని నెలకొల్పింది. తరువాత సూరడు కాటయనాయకుని చంపి, రవ్వనృపుని వేల్పుగొండపై నిలిపి, ప్రతిఫలంగా మూడ-30, నేరెడు, బోటిపాడు, బేకుమావిడ్లు, ఇంకా రెండెయ రాజు సంగడ్లను పొందిన వివరాలున్నాయి. ఈ శాసనం చెక్కిన సూత్రధారి కొమ్మోజు పేరుతో పాటు అడపగట్టు సుంకం దేవునికే చెందుతుందని ముగుస్తుంది.
పి.వి. పరబ్రహ్మశాస్త్రి గారి పరిశోధన ప్రకారం, క్రీ.శ.1000 సం।।నకు కొంచెం ముందుగా విరియాల ఎర్రడు కాకతీయ పిండిగుండణ్ణి, బొట్టుబేతని కోసం చంపి, అతన్ని (బొట్టుబేతన్ని) అంతకు ముందు అతడు (బొట్టుబేత) పోగొట్టుకొన్న కొరవిరాజ్యపాలకునిగా చేశాడు. విరియాల ఎర్రడు, తన బావమరిది
నాలుగో వైపు
- అనుపమ దుజ్జ యాన్వయ సు
- ధాబ్ది ననేకులు రాజనందనులు సని
- న బొఱంటి వెన్న డనుసంభ(వు)డయ్యె నతి
- ప్రసిద్ధుడై వినుత విరోధి మణ్డళిక
- వెన్నడు వెన్నుడై వోలెవానికిని ఘను
- డగు నెఱ భూపతి జగద్వినుతండు (ద)లి
- యించె గీత్తి తోను।। భావిత కీత్తి నాథ (ని-) (నాథుడు?)
- పాండవమధ్యమ భీముడోయనంగా (విలి)
- రియాల భీమ న్రిప ఘస్మరుడై (యు)
- దియించె వానికిను భూవినుతుణ్డు
- మండళిక భూషను డెఱనరేంద్రుడు (త్త)
- మ శ్రీవినుతుండు బంధుజన సేవ్యుండు
- దా నుదయించె నున్నతిని। అతణ్డని బొ
- ట్టుబేతె వసుధాధిపు జేకొని వాని వై (రి)
- నుద్ధ్రితమున జంపియ కొరవి దేశ
- మున(ం)దు ప్రతిష్ట జేసి తత్తనెయురు
- పేరు పొడగల దాయము బి
- ట్టఱగద్యనంబు నప్రతిముడువాని
- (చే) మొగడుపల్లియు పండ్రడు నేలు
- (చొనొ?)ప్ప డే।। అరుదగునట్టి ఎఱన్రిపు
- (నం?)గన గామవసాని యొక్క మే
- (ల్గ)రుండని బేతభూవిభుని గాక
- తి వల్లభు బింన్న వాని దా బరగంగ జేత
- బట్టి ఘను బల్లవరాయని యో
- గి జొచ్చి భాస్కరవిభు చక్రవత్తి
- గని కాకతి నిల్పుట గోటి సేయదే।।
- కారక కాలుడై పడసె గాడయ
- నాయకు జంపి సూర డవ్వేలుపు
- గొండ రవ్వన్రిపు వేలుపుగొండ
- న నిల్పి వానిచే మేలుగ మూడ
- ముప్పయిని మేలుగ నేరెడు
- బోటిపాడునుం మేలుగ బే
- కు మావిడ్లు మేలుగ రెండెయ
- రాజుసంగడ్లు ।। సూత్రధారి
- కొమ్మోజన బరహ శ్రీశ్రీశ్రీ ఏ
- అడపగట్టు దేవరకు జను।।
అయిన కాకర్త్య పిండిగుండణ్ణి చంపి, కాకతీయ వంశానికి హాని చేశాడు. పిండిగుండడు చనిపోయినపుడు, అతని కుమారుడైన గరుడ బేతడు పిన్నవయస్కుడు. అతడు నిస్సహాయుడు విరియాల కామవసానికి మేనల్లుడు. తనకు దక్కాల్సిన కాకతిరాజ్యం గురించి ఏమీ చేయలేని దశలో, కామవసాని పూనుకొని, ఒక బల్లవ రాజు సాయంతో, చాళుక్య చక్రవర్తిని కలిసి, ఆ పిల్లవాణ్ణి చూపించి, అతన్ని ఒప్పించి, అతనికి అనుమకొండ రాజ్యాన్ని ఇప్పించి, కాకతీయ వంశాన్ని నిలబెట్టింది. అందువల్ల ఈ శాసనానికి అంతటి ప్రత్యేకత.
ఇక శాసనాన్ని పరిశీలిద్దాం. లిపి, దాదాపు కన్నడ లిపి, భాష మాత్రమే మారింది. రాసిన లేక చెక్కిన కొమ్మోజు, కన్నడ, తెలుగు భాషల్లో వృత్తాల్లో (చంపకమాల) పద్యాలు రాయగల దిట్ట. అక్షరాలు క్రీ.శ.12వ శతాబ్ది పొందికతో, ఇంకా తెలుగు అక్షరా లుగా రూపురేఖలు సంతరించు కోలేదని చెప్పొచ్చు. అక్షరాల మొదలు, తలకట్టు ఇంకా కన్నడరీతిలోనే కొనసాగాయి.
భాషపరంగా, శాసనంలోని కొన్ని తెలుగు పదాలు తప్పులు దొర్లాయి. మొదటి పద్యంలో సుదాబ్ధి = సుదాబ్ది, రెండో పద్యంలో ఘస్మరుడై(యు) ది(ద) యించె=ఘస్మరుడై యుదయించె, మండళిక = మాండలిక, మూడో పద్యంలో, పండ్రడు = పండ్రెండు (పన్నెండు), నాలుగోపద్యంలో బింన్న= పిన్న, బల్లవ=పల్లవ (పరబ్రహ్మ శాస్త్రిగారు గరెండయ రాజు అంటే కాకతీయ మొదటి బేతరాజని చెప్పిన విషయంలో మేలుగ రెండెయరాజును మేలుగ, రెండెయ రాజుగ గమనించాల్సిన విషయాలు.
క్రీ.శ.1000 నాటి విషయాన్ని, క్రీ.శ.1124లో అంటే దాదాపు 125 సం।।ల తరువాత అప్పటి సూరన్ని ఈ శాసనంలో పేర్కొనటం వల్ల, పిన్న వయసులో తండ్రిని, తద్వారా కాతి రాజ్యాన్ని పోగొట్టుకొన్న (గరుడు) బేతరాజుకు. తన రాజకీయ చతురతతో, మళ్లీ కాకతి రాజ్యాన్ని పొందేట్లు చేసిన విరియాల ఎఱనృపుని భార్య కామవసాని గొప్పతనాన్ని నమోదు చేసి కాకతీయుల చరిత్ర రచనకు ఉపకరించిన ఈ శాసనం అలనాటి మేటి శాసనాల్లో ఒకటి. విరియాల కామవసాని విగ్రహాన్ని, వరంగల్‍లో ప్రతిష్టించినపుడే తెలంగాణ చరిత్ర మరింత పరిపుష్టమౌతుందని నా అభిప్రాయం. ఈ శాసనాన్ని గతంలో పరిశీలించి, ప్రచురించిన శాసన పరిశోధ కులందరికీ, ఇటీవలి చరిత్రకారులకు శ్రీ రామోజు హరగోపాల్‍గారికి నా కృతజ్ఞతలు.
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446