ఆవరణ వ్యవస్థల పునరుద్ధరణ – అవగాహనా చైతన్యం


రాచెల్‍ కార్సన్‍ తన ‘సైలెంట్‍ స్పింగ్‍’ అనే గ్రంథంలో మూడవ అధ్యాయం పేరు ‘Elixirs of Death’. ప్రపంచ చరిత్రలో ప్రతి మనిషీ రసాయనిక పదార్థాల సంబంధంలోకి వచ్చాడని, గర్భస్థ శిశువు మొదలుకొని మరణం వరకు ఈ రసాయనాల ప్రభావానికి గురికాకుండా వుండటం దాదాపు సాధ్యం కాదంటుంది. రసాయనిక పదార్థాలు క్రిమి, కీటక నాశినులుగా మనకు ఇంచుమించు రెండవ ప్రపంచ యుద్ధకాలం నుండి వినియోగంలోకి వచ్చాయి. కృత్రిమ రసాయనాలు సజీవ, నిర్జీవ ప్రపంచం అంతటా పంచబడి ఉన్నాయని అంటుంది. అవి ప్రధాన జీవనదీ వ్యవస్థలు మొదలుకొని భూగర్భ జలాల నీటి పాయలలోకి భూమి ద్వారానే ప్రవహిస్తున్నాయని పేర్కొంటుంది. ఈ రసాయన అవశేషాలు భూమిలోకి, చేపలు, పక్షులు, సరీసృపాలు, పెంపుడు జంతువులు, వన్య ప్రాణులు మొదలైన వాటి శరీరాల్లోనూ కనిపిస్తాయని సార్వత్రికంగా పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు చెపుతున్నమాట. వీటిపై ప్రయోగాలు చేసే శాస్త్ర పరిశోధకులు రసాయన కాలుష్యానికి గురి కాకుండా మిగిలిన ప్రాణికోటి అంటూ ఏదీ లేదని చెపుతున్నారు. ఇవి మారుమూల పర్వత ప్రాంతాలలోని కొలనులు, సరస్సులలోను, చేపల్లో, భూమి పొరల్లోని వాన పాముల్లో, పక్షుల గుడ్లల్లో, అంతెందుకు మనుష్యుల్లోనూ, వారి శరీరాల్లోనూ చేరాయి. ఇవి ఇప్పుడు మానవ దేహాలలో నిల్వలుగా మారాయి. ఈ రసాయనాలు తల్లి పాలు మొదలుకొని ఇంకా పుట్టని పిల్లల కణాలలోకి ప్రాకింది. ఇంతగా ఇది పెరగడానికి రసాయనిక పరిశ్రమలు పెరగడమేనని, కీటకాలను నాశనం చేసే రసాయనిక ధర్మాలు గల రసాయనాలు కృత్రిమంగా రసాయన పరిశ్రమలు ఉత్పత్తి చేస్తున్నాయని ఆమె పేర్కొంది. ఆమె అధ్యయనం వల్ల ప్రపంచానికి అనేక చేదు నిజాలు కటువైన వాస్తవాలు కూడా తెలిసొచ్చి అర్థశతాబ్ది కాలం గడిచింది. అయినా పరిస్థితులలో ఏ విధమైన మార్పు లేదు కదా అసలు ఈ రసాయన పరిశ్రమలనేవి రెండవ ప్రపంచ యుద్ధానికి పుట్టిన బిడ్డగా పేర్కొనటం పరిపాటి.


ఆనాడు భూమండలం ఎదుర్కొంటున్న ప్రకృతి, పర్యావరణ సమస్యలు, సంక్షోభాలకు మూలాలు ఈ కృత్రిమ రసాయనిక పదార్థ ఉత్పత్తిలో ఉందని అర్థం చేసుకోవాలి. మనిషి చేసే కార్యకలాపాల ద్వారా భూమిపై ‘జీవం’ భారీ ఎత్తున అంతరింపుకు గురవుతూ ఉంది. కొన్ని అధ్యయనాల అంచనా ప్రకారం సగటున రోజుకు ఒక వంద చొప్పున జీవజాతులు అంతరిస్తూ ఉన్నాయి. రానున్న కాలంలో ఈ అంతరింపుల వృద్ధిరేటు మరింత మరింతగా పెరిగే అవకాశం ఉంది. భూమి మీద ప్రాణాన్ని, జీవాన్ని కాపాడు సహజ వనరులైన గాలి, నీరు, భూమి కాలుష్యానికి గురవుతున్నాయి. క్షీణతను పొందుతూ ఉన్నాయి. మానవాభివృద్ధి అంతకంతకు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూ వస్తున్నది. రెండువేల సంవత్సరానికి ఆరు బిలియన్ల ప్రపంచ జనాభా ఉండగా 2010 నాటికి అదనంగా మరొక బిలియన్‍కి చేరింది. మరి 2021 నాటికి ప్రపంచ జనాభా కనీసంగానైనా బిలియన్‍ పెరిగి ఉంటుంది. ఈ లెక్కలు ఎందుకు పేర్కొనటమంటే వనరుల క్షీణత, తరిగిపోవటం అనేది పెరిగిన జనాభాను బట్టి అది మరి రెండింతలు మూడింతలు కావటం సహజమే కాదు. జనాభా పెరిగే కొద్దీ తరుగుదల, క్షీణతలు వృద్ధి పొందుతూ
ఉంటాయి. 2021 ప్రపంచ జనాభా 7.9 బిలియన్లు ప్రపంచ వ్యాప్తంగా విష పదార్థాలు పోగుపడుతూ భవిషత్‍ తరాలను బాధించడానికి తయారుగా ఉన్నాయి. అడవులు, చిత్తడి నేలలు, పర్వతాలు, పచ్చిక బయళ్లు వృద్ధి చేయక అతిగా వినియోగింపబడ్డాయి. ఓజోను పొర క్షీణత గ్రీన్‍హౌస్‍ వాయువుల ప్రభావం ఏదైతేనేం మానవ కార్యకలాపాలు భూగ్రహంమీద వాతావరణానికి హాని కారకంగా మారాయి.


మన సంస్కృతిలో ఉన్న ఒక ధోరణి ఏమంటే ఇటువంటి వన్నీ శాస్త్ర సంబంధ సమస్యలని, సాంకేతికమైనవో లేదా రాజకీయమైన సమస్యలుగా చూడటానికి మాత్రమే అలవాటు పడ్డాం. ఈ సమస్యలను, సంక్షోభవాలను పరిష్కరించే శక్తి సామర్థ్యాలు మనకు లేవని భావిస్తూ ఉంటాం. ప్రకృతి, పర్యావరణ సంబంధ సమస్యలను, సంక్షోభావాలను అవగాహన చేసుకోవటం ఒక ఎత్తు. వాటిని పరిష్కరించటంలో, అధిగమించడంలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవటం మరొక ఎత్తు.
పర్యావరణ సమస్యలు ఏవైనా మానవాళి ముందు పెట్టే ప్రశ్న ఒక్కటే. మనం ఎటువంటి మానవులం? వేటికి విలువను ఇస్తాం? ఎటువంటి జీవితాలను గడుపుతున్నాం? జీవన విధాన విలువల మాట ఏమిటి? ప్రకృతిలో మనుషులుగా మనస్థానం ఏమిటి? ఎటువంటి ప్రపంచాన్ని లేదా ప్రపంచంలో మనం మనుగడ సాగించాలనుకుంటున్నాం?


భారతీయ చింతనలో ‘ధర్మం’ అనే భావన లేదా మాట ఉంది. ఈ పదంలో వ్యక్తి విధి, నైతికత, బాధ్యత, చట్టం, న్యాయం లాంటివన్నీ ఇమిడిపోయి కనిపిస్తాయి. ధర్మమనేది వాస్తవికత కుండే నిర్మాణాన్ని సూచిస్తుంది. ఇదొక విశ్వసూత్రం. ముఖ్యంగా న్యాయబద్ధ చట్టబద్ధ జీవన విధానాన్ని అభివృద్ధిని సూచిస్తుంది. ఇది సనాతనం శాశ్వతం. సమస్త విశ్వానికి ఇదొక ఆసరా. ధర్మం యొక్క ప్రయోజనం ఏమంటే సమాజాన్ని నడపటం, ప్రపంచాన్ని నిర్వహించటం. ధర్మమనేది స్థల, కాల, పరిస్థితులను బట్టి మార్పులకు లోనవుతుంది. అయినప్పటికీ ఒక సంతులనాన్ని అది కలిగి ఉంటుంది.
ధర్మం అనేది సమాజంలోని ప్రతి విడి వ్యక్తి జీవనంలో అంతర్భాగమవుతూ మానవాళి సంక్షేమానికి దోహదకారిగా నిలవాలి. వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు కాదు ధర్మం ఉపకరించాల్సింది. ధర్మ శాస్త్రాలుగా పిలవబడేది వ్యక్తి నైతిక ప్రవర్తనావళిని నిర్దేశించాయి. సమస్త జీవరాశికి, సమస్త మానవాళికి సంక్షేమాన్ని కోరేవి. నాటి సురక్షిత జీవనానికి ఉపయోగపడే మానవ చర్యలే విలువైనవి, ప్రయోజన భరితమైనవని శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధిస్తాడు. సమృద్ధి, సంతోష సౌఖ్యాలనేవి క్రమబద్ధమైన సమాజం మీద ప్రజలు ఏమేరకు ఆధారపడి ఉంటారనే దానిని బట్టి నిర్ణయమవుతుంది. ప్రకృతిని విధేయంగా అనుసరించటం ద్వారానే అభ్యుదయం పొందటం జరుగుతుంది. ప్రకృతి పట్ల అవిధేయత, ఆధిప్యతభావం ఎప్పుడూ వినాశనానికే దారి తీస్తుంది.


భారతీయ సాంఖ్య దర్శనం ప్రకారం మౌలిక పదార్థం అనేది ఒక శక్తి పొట్లం. దీనిలో ధన, ఋణ, తటస్థ శక్తులుంటాయి. ఇవి నిరంతరం ప్రవాహ స్థితిలో ఉంటాయి. ప్రతి ఒక్కటి మరొక దాని ఆధిక్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటాయి. వీటినే ప్రకృతి గుణాలు అంటాం. చైతన్యం గల మానవులలో ఇవి ఎంతో విలువను కలిగి
ఉన్నటువంటివి. ప్రకృతి సంద్వంతు, సమృద్ధం కూడా. ప్రకృతి శక్తివంతమైనది. భయావహమైంది. ప్రకృతి దయగలది. సున్నితమైనది. ప్రకృతిని దోపిడీ చేసినా, దుర్వినియోగం చేసినా అది దూరమవుతుంది. ప్రకృతిని ఎంతో ప్రేమ ఆదర, గౌరవ భావంతో చూడవలసి ఉంటుంది. ప్రకృతి మనకు తన వనరుల ద్వారా సేవ చేసే మాట నిజమే కాని, సద్వినియోగం చేసుకో పోతే ప్రతి స్పందిస్తుంది. ప్రతి చర్యకు పూనుకుంటుంది. ప్రగతికి, సమృద్ధికి ప్రకృతిని ఎంతో వివేకవంతంగా, విచక్షణా పూరితంగా, న్యాయ సమ్మతంగా వాడుకోవలసి ఉంటుంది. విచక్షణ, వివేక రహితంగా ప్రకృతిని అతిగా శాసిస్తే తొలుత అవి మన తప్పిదాలకు హెచ్చరికలు చేసి సరిదిద్దుకునేలా చేస్తుంది. మనం ప్రకృతిని లక్ష్య పెట్టని పక్షంతో తీవ్రంగానే ప్రతి స్పందిస్తుంది.


మన పర్యావరణంలో పంచభూతాలు ప్రకృతిలోంచి ఉద్భవించినదే. మౌలిక శక్తి సంపుటిలోని ప్రత్యేక విస్తరణ రూపాలే పంచభూతాలు. అయితే వీటికి దేనికదిగా జీవం, రూపం, స్థానం విడిగా ఉన్నప్పటికనీ, ఇవి ఒకదానికొకటి సంబంధం కలిసి ఒకటి మరొకదానిపై ఆధారపడేటువంటివి.
ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి మొదలైన పంచ భూతాల గురించి నారాయణ ఉపనిషత్‍ చెబుతుంది. ఉపనిషత్తులు పంచభూత సిద్ధాంతం గురించి సమగ్ర పద్ధతిలో వివరిస్తున్నాయి. వీటికి బ్రహ్మనికి మధ్య సంబంధాన్ని కూడా చెబుతాయి. తైత్తిరీయోపనిషత్‍ ఒకదాని నుంచి ఒకటి ఉద్భవించినట్లుగా పేర్కొంటుంది. సృష్టి లేదా ప్రకృతి పంచభూతాత్మకం అంటూ ఉండటం దీనివల్లనే.
పంచభూతాత్మక సృష్టి లేదా ప్రకృతిని అర్థం చేసుకోవడంలోనే మనిషి వివేకం దాగి ఉంటుంది. అందుకే ప్రకృతిని అర్థం చేసుకోవటం అంటే ప్రజల సంస్కృతిని అర్థం చేసుకోవటం. సంస్కృతిని అవగతం పరచుకోవటం ద్వారా జీవన విధానం బోధ పడుతుంది. జీవన విధానం బోధపడటం ద్వారా దానిని నడుపుతూ ఉన్న విలువలు, ఆదర్శాలు అవగతమవుతాయి. తద్వారా ప్రకృతి – సంపర్కము మధ్య నుండే చర్యాపచర్యలు, సంవాద సంపర్కాలను స్పష్టంగా గుర్తించటం సాధ్యపడుతుంది.


ప్రొసొపిస్‍ సినరేరియా (Prosopis Cineraria) అనే వృక్ష జాతికి, బిష్ణోయీ తెగకు ఉన్న అనుబంధం మనమందరమూ ఎరిగి ఉన్నదే. రాజస్థాన్‍ ఎడారి ప్రాంతం. రాజస్థాన్‍ రాష్ట్ర వృక్షం ఖేజ్రి. తెలంగాణ ప్రాంతంలో ఇదే వృక్షాన్ని జమ్మిగా వ్యవహరిస్తాం. 1739 ADలో రాజస్థాన్‍లోని జోద్‍పూర్‍ సమీప గ్రామమైన ఖేజల్లిలో హింసాత్మకమైన పర్యావరణ ప్రతిఘటన సన్నివేశం చరిత్ర నమోదు చేసింది. అమృతాదేవి అనే మహిళ తన ఇద్దరు కూతుర్లతో ఖేజ్రి వృక్షాలను కాపాడబోయి తమ ప్రాణాలనే అర్పించారు. తన రాజ ప్రసాదానికి మార్గం కోసం అడ్డుగా ఉన్న ఖేజ్రి వృక్షాలను నరికి వేయమని మహారాజా అభయ్‍ సింగ్‍ ఫర్మానా జారీ చేశాడు. ఇది పెద్ద సంఘర్షణకు దారి తీసింది. 363 మంది ఈ చెట్లను కాపాడు కునేందుకు తమ ప్రాణాలను ఇచ్చారు. 1970లలో మొదలైన చిప్కా ఉద్యమానికి మూలం ఈ ప్రాణత్యాగం చేసిన ప్రజలే. ఎందుకు వారు ఈ చెట్లను కాపాడాలనుకున్నారు. ఎడారిలో నీడను ఇచ్చే చెట్లు ఇవే. రాముడు లంకా విజయం కోసం శమీ వృక్షాన్ని పూజించాడని రామాయణం చెపుతూ ఉన్నది. పాండవులు వనవాసం, అజ్ఞాత వాసాల సందర్భంలో తమ శస్త్రాలను శమీ వృక్షంపైన భద్రపరిచినట్లు, అందువల్ల జమ్మి వృక్ష పూజ జరుగుతున్నట్లు ఇతిహాస, కావ్యాలు తెలుపుతూ ఉన్నాయి. విజయ దశమి రోజు క్షత్రియ అస్త్ర, శస్త్రాలకు పూజలు చేస్తే, బ్రాహ్మణులు శమీ వృక్ష పూజ సల్పుతూ ఉండటం మన సంస్కృతిలో ఉన్నటువంటిదే. ఖేజ్దాలి గ్రామ సంఘటన గురించి రామచంద్రగుహ లాంటివారు రాశారు కూడా. గ్రహించ వలసిందేమంటే స్థానిక పర్యావరణ వ్యవస్థలతోటి ప్రజలు ఎంత సామరస్యంలో జీవించే విధానాలు, ఆదర్శాలలో ఉన్నారనేది. వాల్మీకి రామయాణంలో ప్రకృతి ఆకర్షణీయంగా వర్ణించబడింది. అంతటి లంకలో దుష్టరావణుడు కూడా ప్రకృతి పట్ల ప్రేమ ఉన్నవాడుగానే కనిపిస్తాడు. అతడు సీతాదేవిని ఉంచింది అశోక వనంలోనే కదా! అదెలా ఉందో వాల్మీకి చెప్పనే చెప్పాడు. ఆవరణ వ్యవస్థల గురించి ఇతిహాస, కావ్య, ప్రబంధాలు ఏవో ఒక మేరకు చిత్రించాయి. వాటిని నేటి కాలానికి అన్వయిస్తూ అర్థం చేసుకోవటం ఎంతయినా అవసరం.


2021 సంవత్సరానికి గాను ఐక్యరాజ్య సమితి ‘ఆవరణ వ్యవస్థల పునరుద్ధరణ’ అనే అంశాన్ని థీమ్‍గా ప్రకటించింది. మనం, మన సంస్కృతికి పర్యావరణ వ్యవస్థలకు మధ్యగల సంబంధాన్ని మునపటికంటే అధికంగా, విస్తృతంగా అధ్యయనం చేయవలసిన అగత్యంలో ఉన్నాం. వినిమయ సంస్కృతి విపరీతంగా పెరిగిన ప్రస్తుత సమయంలో వినిమయ సంస్కృతిని పెంచిపోషిస్తూ ఉన్న విలువలను, ఆ విలువలను నిర్దేశిస్తున్న పెట్టుబడి ధోరణులను, వైఖరులను నిశితంగానే పరిశీలించాలి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక జరిగిన చెరువుల పునరుద్ధరణ ఆవరణ వ్యవస్థల పునరుద్ధరణ పక్రియలో ఒక మేలైన అడుగు. అదే విధంగా ‘హరితహారం’ కూడా సతత హరితత్వాన్ని ఆకాంక్షిస్తున్నది. ప్రకృతి – సంస్కృతుల మధ్య తలెత్తే వైషమ్య, వైరుధ్యాలను రెంటినీ పర్యావరణ దృక్పథంలో బోధపరచు కున్నప్పుడే సరైన చైతన్యం కలిగి ఉండగలం. ప్రకృతిని పరిరక్షించడమంటే సంస్కృతిని సంరక్షించుకోవటం. సమృద్ధిపరచుకోవటమే.

డా।। ఆర్‍. సీతారామారావు
ఎ : 9866563519

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *