నా ‘మాల్గుడి డేస్‍’ అలియాబాద్‍ దర్వాజా


ముచికుందా నదికి దక్షిణ భాగాన కుతుబ్‍షాహీ నవాబులు నగర ప్రాకారాన్ని నిర్మించటం ప్రారంభించారు. కాని అది ఔరంగాజేబు దండయాత్రల వలన పూర్తి కాలేదు. ఆ తర్వాత వచ్చిన ఆసఫ్‍జాహీల కాలంలో ముఖ్యంగా రెండవ నిజాం కాలంలో 1802లో నగర ప్రాకారం – గోడ – పూర్తయ్యింది. ‘‘రంగ్‍మహల్‍ కే దస్‍ దర్వాజే’’ అన్నట్లు ఆ ప్రాకారానికి పన్నెండు తలుపులు. అందులో ఒకానొకటి ‘‘అలియాబాద్‍ దర్వాజా’’. రెండవ నిజాం పేరు ‘‘అలీఖాన్‍’’. ఆయన పేరు మీదనే అలియాబాద్‍ దర్వాజా, అలియాబాద్‍ మొహల్లా (బస్తీ) ఏర్పడింది. ఈ దర్వాజాకు ఆవల విస్తరించిన ప్రాంతాన్ని బేరూన్‍ అలియాబాద్‍ అని లోపల వెలసిన నగరాన్ని అందరూన్‍ అలియాబాద్‍ అని పిలిచేవారు. చార్మినార్‍ నుండి ఫలక్‍నుమాకు వెళ్లే దారిలో అలియాబాద్‍ ఇప్పటికీ ఉంది కాని ఆ దర్వాజా మాత్రం లేదు. జ్ఞాపకాల స్వర్ణపేటికలో అదొక అపురూప నెమిలి పింఛంలా ఇప్పటికీ మెరుస్తూనే ఉంటుంది.


చార్మినార్‍, మక్కామసీదు దాటగానే మొగల్‍ఫురా తర్వాత శాలిబండ ఛడావ్‍ వస్తుంది. అతి కష్టంతో ఆ ఎత్తు ప్రాంతం ఎక్కి దిగగానే సయ్యద్‍ అలీ చబూత్రా వస్తుంది. అక్కడ నుండి కొంచెం దూరం నడుస్తే అలియాబాద్‍ శురు అయితది. రోడ్డుకు రెండు వైపులా రాతి నిర్మిత సత్రపు గదులు. వాటికి తలుపులు ఉండవు. అలిబాబా నలభై దొంగలు సిన్మాలో మాదిరిగా అర్ధచంద్రాకారపు గుహల్లా ఉంటాయి. ఒకప్పుడు దర్వాజాలు దాటి వచ్చిన ముసాఫిరులందరూ వాటిల్లో బస చేసేవారు. అందుకే ఒకప్పుడు అలియాబాద్‍ను అలియాబాద్‍ సరాయి అనేవారు. ఇప్పుడవన్ని చిన్నా, చితక దుకాణాలుగా మారిపోయినాయి.
అలియాబాద్‍ దర్వాజ దగ్గర ఒక పెద్ద బురుజు ఉండేది. క్రింది నుండి పైకి వెళ్లటానికి రాతి మెట్లు ఉండేవి. బురుజుపైన విశాలమైన గుండ్రటి స్థలం మధ్యలో ఒక తోప్‍ (ఫిరంగి) ఉండేది. అది నల్లటి కొండ చిలువలా ఎర్రటి ఎండలో మిలమిలా మెరుస్తుండేది. శత్రుసైన్యాలు నగర ప్రాకారపు అవతల మోహరించినపుడు ఈ ఫిరంగీని అటువైపు తిప్పి గురిచూసి కొట్టేవారు. ఆ ఫిరంగీపై అతి నాజూకుగా, కళాత్మకంగా చెక్కిన ఆకులు, పువ్వులు, పూలతీగలు ఉండేవి. యుద్ధ కళ, శిల్పకళల సమ్మేళనానికి సంకేతమే ఆ ఫిరంగి.


మేము పిల్లలం బడి నుండి వచ్చేటపుడు సరదాగా ఆ బురుజుపై వరకు ఎక్కేవారం. ఆ ఫిరంగి వద్ద నిలుచుంటే అక్కడ వీచే ఈదురుగాలికి బక్క ప్రాణాలైన మేము గడ్డిపోచల్లా ఎగిరిపోతామేమో అని భయం వేసేది. తర్వాత రోజులలో ప్రజలు ఆ బురుజును కొంచెం కొంచెం కూలగొట్టి ఆ రాళ్లను, రాతిమెట్లను తమ ఇళ్ల నిర్మాణానికి వాడుకున్నారు. దాంతో ఆ ఫిరంగి ఎడారిలో కాళ్లు విరిగి నేల కూలిన ఒంటరి ఒంటెలా మిగిలిపోయింది.


అలియాబాద్‍ దర్వాజా దగ్గర ‘‘పూల తుర్కాయన’’ అనే ఒక ముసలాయన ఉండేవాడు. అతని పేరు ఎవరికీ తెలియదు. ఆయనకు శాలిబండ ఉతార్‍లో ఒక దర్గా పక్కన తెల్ల మల్లెలు, ఎర్ర గులాబీల పూల దుకాణం ఉండేది. కావున ఆయనకు ‘‘పూల తుర్కాయన’’ అని పేరు వచ్చింది. అతను తెల్ల పొడుగు గడ్డంతో తలపై తెల్లటి జాలీటోపీతో, చేతులలో హమేషా తస్బిహ (జపమాల) తిప్పుతూ అతి పవిత్రంగా కనిపించేవాడు. ప్రతి ఉదయం ఎండ రాక ముందే ఆయన ఇంటి ముందున్న తడకల పందిళ్ల క్రింద రోగులు జమ అయ్యేవారు. అతను క్రింద ఈత చాపమీద మోకాళ్లు మడిచి వజ్రాసనంలో కూచునేవాడు. అతని ఎదురుగా తళతళా మెరిసే ఇత్తడి తాంబాళంలో సున్నం కలిపిన నీళ్లు ఉండేవి. రోగులు తమ రెండు అరచేతులు ఆ నీళ్లల్లో ప్టెగానే ఆ ముసలాయన ఒక మంత్రం చదువుతూ అప్పుడే తెచ్చిన ఆకుపచ్చ, తాజా వేపాకు మండలతో తల నుండి కాళ్ల వరకు స్పృశించి రోగి మెడలో ఎర్రదారంతో కలిపిన ఒక తావీజ్‍ (తాయత్తు) కట్టేవాడు. ఎటువంటి దవా లేకుండానే ఆయన దువాతో రోగుల బాధలు దూరం అయ్యేవి. అతను ఒక్క పైసా కూడా తీసుకునేవాడు కాదు. మాకు చిన్నప్పుడు కొంచెం జ్వరం వచ్చినా ఆ పూల తుర్కాయన దగ్గరికి వెళ్లి మెడలో ఎర్రదారం కట్టించుకునేవారం. పిల్లల మెడలో ఎర్రదారం కనబడితే ‘‘బడికి ఎందుకు రాలేదు’’ అని సార్‍ కూడా అడగకపోయేది. ఆ ఎర్రదారం మెడికల్‍ సర్టిఫికేట్‍గ పని చేసేది. అదీ ఆ తావీజ్‍ మహత్తు.


అలియాబాద్‍ కూరగాయల మార్కెట్‍లో ‘‘రెడ్డి జనసంఘం’’ భవనం ఉండేది. అందులోనే ఒక గ్రంథాలయం కూడా ఉండేది. హైద్రాబాద్‍ నగరంలో ఆంధ్ర మహాసభ, ఆంధ్ర జనసంఘం, రెడ్డి హాస్టల్‍ లాంటి సంస్థలు స్థాపించబడిన తర్వాత వాటి ప్రేరణతోనే పాతనగరం అలియాబాద్‍లో 1940లలో ఈ భవన నిర్మాణం జరిగింది. ఈ గ్రంథాలయం ద్వారా ప్రజలలో నూతన చైతన్యం వెల్లివిరిసింది. నారాయణగూడాలోని ‘‘మాడపాటి బాలికల పాఠశాల, రెడ్డి మహిళా కళాశాల’’ ప్రేరణతో అలియాబాద్‍లో శ్రీ ప్రసన్న గజానన శారదా బాలికల పాఠశాల 1940లలో స్థాపించబడి స్త్రీవిద్యకు, మహిళా చైతన్యానికి పునాదులు వేసింది. ‘‘ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు’’ అన్నట్లు చదువుకున్న స్త్రీలు ఉద్యోగాలు చేసి ఆర్థికంగా స్వతంత్రులైనారు. నగరంలోని మహారాష్ట్రుల ప్రభావంతో ఈ శారదా పాఠశాలలో ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలు, గణేషుడి మంటపాల స్థాపన ప్రారంభమై ఈనాడు జంట నగరాలలో అదొక హిందూ సంస్కృతిగా స్థిరపడింది. వారం రోజులపాటు సాంస్కృతిక ప్రదర్శనలు జరిగేవి. ప్రజా ఆరోగ్య, విద్యావైజ్ఞానిక డాక్యుమెంటరీ సీన్మాలు చూపించేవారు. సీన్మాలు టి.వి.లు లేని ఆ అమాయకపు కాలంలో ప్రజలంతా ఆ వారం రోజులు అక్కడ గుమికూడేవారు.


అలియాబాద్‍ దాటాక జహాఁనుమా అనే ప్రాంతంలో ఒక సీన్మా స్టూడియో ఉండేదన్న సంగతి ఈ తరం వారెవరికీ తెలియదు. దాని పేరు ‘‘లలితా శివజ్యోతి స్టూడియో’’. ఎఎన్‍ఆర్‍, ఎన్‍టిఆర్‍, బి.సరోజాదేవిలు నటించిన ‘‘రహస్యం’’ సీన్మా ఈ స్టూడియోలోనే నిర్మించబడింది. తర్వాత కాలంలో దీని పేరు ‘‘సదరన్‍ మూవీటోన్‍’’గా మార్చారు. దారాసింగ్‍, షకీలాలు హీరో, హీరోయిన్‍లుగా నటించిన ఫౌలాద్‍, బాద్షా హిందీ సీన్మాలు కూడా ఇక్కడే తీసారు. మేం పిల్లలం స్కూలు డుమ్మాకొట్టి దారాసింగ్‍ పహిల్వాన్‍ను చూడటానికి ఆ స్టూడియో చుట్టు చక్కర్లు కొట్టేవారం. తర్వాత ఆ స్టూడియో మూతబడింది. కారణాలు తెలియవు. కొంత కాలం తర్వాత అది రైస్‍ మిల్లుగా మారిపోయింది. బియ్యం బస్తాలు నిల్వ ఉంచే గోదాం (గోడౌన్‍)గా మిగిలి పోయింది. రామానాయుడు, పద్మాలయ స్టూడియోలు ప్టుని కాలంలో పాతనగరంలో ఒక స్టూడియో ఉండేదని అందులో రహస్యం లాంటి భారీ చిత్రం నిర్మించబడిందన్న సంగతి గుర్తుకొస్తే గుండె బరువెక్కి కళ్లల్లో కన్నీరు
ఉబుకుతుంది. గతమెంతో ఘనకీర్తి కలిగిన పాతనగరం!


అలియాబాద్‍కు జహాఁనుమాకు మధ్యలో ఇంజన్‍బౌలీ బస్తీ వస్తుంది. 1880లలో సర్‍ వికారుల్‍ ఉమ్రా కోహెతూర్‍ అన్న కొండమీద ‘‘ఫలక్‍నుమా’’ అనే ఒక ఆకాశ హర్మ్యాన్ని నభూతో నభవిష్యత్తుగా 1883లో నిర్మించాడు. అది చాలా ఎత్తైన కొండ ప్రాంతం కావున మంచినీటి సౌకర్యం లేదు. కొండ క్రింద ఒక లోత్తైన బావిని తవ్వించి శక్తివంతమైన హెచ్‍.పి. ఇంజన్‍ ద్వారా నీళ్లుతోడి సరఫరా జరిగేది. ఆ ఇంజన్‍ను లండన్‍ నుండి తెప్పించటం ఆ రోజులలో ఒక విశేషం. హైద్రాబాద్‍ నగరంలో ఒక బావికి మొదటిసారి ఇంజన్‍ను అమర్చటం ఒక అరుదైన విశేషం కావటం వలన ప్రజలు ఆ ప్రాంతాన్ని ‘‘ఇంజన్‍బౌలి’’ అని పిలవసాగారు.
అలియాబాద్‍ నుండి ఇంజన్‍బౌలికి పోతుంటే కుడివైపు ‘‘పెద్దపులితోట’’ వస్తుంది. ఇదొక వాటర్‍ ఫిల్టర్‍ ఏరియా. నైజాముల కాలంలో మీరాలం చెరువు నుండి పాతనగరానికి త్రాగునీరు సరఫరా అయ్యేది. ఇక్కడ ఆ నీటిని శుభ్రపరచేవారు. అప్పుడు అదంతా జంగల్‍ ఏరియా. అడివిలో హాయిగా బ్రతికే ఒక పెద్దపులి పట్నం చూద్దాం అన్న కుతుహలంతో పొరపాటున ఈ తోటలోకి వచ్చింది. వాటర్‍ వర్కస్ సిబ్బంది దానిని పట్టుకుని నాంపల్లిలోని బాగే ఆం జంతు ప్రదర్శనశాలకు తరలించి యావజ్జీవ శిక్షగా దానిని జీవితాంతం అక్కడే బంధించారు. ‘‘టౌను పక్కకెళ్లొద్దురో డింగరి, డంగైపోతావురో డింగరీ’’ అన్న తెలుగు సీన్మాపాట వినని ఆ పెద్దపులి చివరికి చెరసాల పాలైయ్యింది. అప్పట్నుంచి ప్రజలు ఆ ప్రాంతాన్ని పెద్దపులితోట అని పిలవసాగారు.


మళ్లీ అలియాబాద్‍ దర్వాజా దగ్గరికి పోదాం పదండి. అక్కడి సత్రాలలో ఒక సత్రపు గదిలో ఒక ‘‘కాన్గీ వీధి బడి’’ నడిచేది. అంటే ప్రైవేటు బడి అన్న మాట. అక్కడి ముసలి కోపిష్టి పంతులు ఆర్‍కె నారాయణ్‍ నవల ‘‘స్వామి స్నేహితులు’’లో మిడిగుడ్ల వేదనాయగం పంతులు లాగే ఉండేవాడు. (ఆ కారికేచర్‍ గీసింది ఆర్కే లక్ష్మణ్‍) అతను ఒకవైపు పాఠాలు చెపుతూనే మరోవైపు తన కులవృత్తిఐన కమ్మరి కొలిమి పని కూడా చూసుకునేవాడు. ఆ వీధిబడి చిత్రహింసల కొలిమిలా ఉండేది. ఎక్కాలు, పద్యాలు సరిగ్గా అప్పచెప్పని మొద్దు శిష్యులకు కాళ్లకు బేడీలు, మెడలో ఒక గుదిబండ వేసేవాడు. కొందరేమో కోదండానికి వేలాడుతుండేవారు. మరికొందరు గోడకుర్చీ పొజీషన్‍లో ఉండేవారు. ఒకరిద్దరు కోడిలాగా కాళ్ల సందుల్లో నుండి చేతులు దూర్చి చెవులు పట్టుకుని వొంగి ఉండేవారు. మరికొందరు విద్యార్థులు వంతుల వారిగా కొలిమి తిత్తిని ఊదుకుంటూ కనబడేవారు. పిల్లల వీపులపై చింతబరిగెలు విరుగుతుంటే వారి శోకాలతో ఆ సడక్‍ మొత్తం దద్దరిల్లి పోయేది. దారినపోయేవారు ఎవరు కూడా ఆ పంతులును ప్రశ్నించక పోయేది. దేహశుద్ది జరిగితే కాని చదువురాదని నమ్మే అమాయకపు కాలం అది. ఆ పంతులు శిక్ష(ణ) పుణ్యమా అని పాపం ఎంతమంది పసిపిల్లలు చదువుకు దూరం అయ్యారో!


అలియాబాద్‍ చౌరాస్తాలో ఒక చిన్న ఇరానీ హోటల్‍ ఉండేది. దేవానంద్‍ సీన్మాలలో మహమ్మద్‍ రఫీ పాడిన పాటలు వీనుల విందుగా గాలిలో అలలు అలలుగా తేలి మమ్మల్ని పలకరించేవి. ‘‘తస్వీర్‍ తెరీ దిల్‍మే’’ అన్న పాట మా చెవులకు అలవోకగా సోకగానే మా కాళ్లు మంత్రించినట్లు టక్కున ఆగిపోయేవి. పాట సాంతం అయిపోయినాకనే అక్కడ్నుంచి భారంగా కదిలేవారం. ‘‘దిల్‍ తేరా దీవానా హై సనమ్‍’’ అన్న పాట వింటుంటే మాత్రం నిజంగా వర్షంలో తడుస్తున్నట్లే అనిపించేది.
నా ‘‘మాల్గుడి డేస్‍’’ ముచ్చట్లు మాల్గాడి గూడ్స్ ట్రైన్స్ అంత పొడుగ్గా ఉంటవి. మోఖ (అవకాశం) దొరికితే మళ్లెప్పుడైనా చెప్త!
అంతవరకూ ఖుదా హాఫీజ్‍.


(షహర్‍ నామా (హైద్రాబాద్‍ వీధులు – గాథలు) పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్‍,
ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *