(గత సంచిక తరువాయి)
గేదెజాతి పశుజాతులు :
ముర్రా :
దేశంలోని గేదెజాతుల్లో ‘‘ముర్రా’’ అత్యంత శ్రేష్ఠమైన జాతి. పాడికి, ఎక్కువ వెన్న శాతానికి పేరెన్నికగాంచినది. దేశవాళి గేదెజాతులనుండి అధిక పాల దిగుబడి పొందడానికి, వాటిని అప్‌గ్రేడ్ చేయడానికి ముర్రాజాతి వీర్యాన్ని దేశమంతటా విరివిరిగా వినియోగిస్తున్నారు. హర్యానా దక్షిణప్రాంతంలోని రోమతక్, కర్నాల్, హిస్సార్, జిండ్ గార్గాన్ జిల్లాల్లో, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాలు ముర్రాజాతి పుట్టినిల్లు. ముర్రాజాతి గేదెలు భారీగా ఉంటాయి. తల, మెడ తేలికగా, చిన్నగా ఉంటుంది.
కొమ్ములు పొట్టిగా, గట్టిగా లోపలి వైపు తిరిగి స్పైరెల్గా ఉంటాయి. ముర్రా అంటే అర్థం. ‘మెలివేయబడిన’ అని అర్థం. ముర్రాజాతి గేదెలకు కొమ్ములు ఈ విధంగా ఉండడం జాతి ప్రత్యేకలక్షణం. తుంటి నడుము వెడల్పుగా ఉంటుంది.
తోక పొడువుగా ఉండి, కుచ్చులు తెలుపుగా ఉంటాయి. శరీరం రంగు అత్యంత నలుపుగా ఉంటుంది. ముర్రాజాతి దున్నలు సుమారు 570 కిలోల శరీర బరువు కలిగి ఉంటాయి. గేదెల్లో పొదుగు బాగా అభివృద్ధి చెంది విశాలంగా, పెద్ద చన్నులతో ఉంటుంది. ముర్రా పాడి గేదెలు సుమారు 450 కిలోల శరీర బరువుంటాయి. గేదెలల్లో ఒక పాడి కాలంలో 1400-2300 కిలోల పాలదిగుబడి ఉంటుంది. వెన్నశాతం 7 ఉంటుంది. హర్యానా, ఫరీదాబాద్ జిల్లాలోని నిమ్మా గ్రామానికి చెందిన భరంపాల్ అనే రైతు పాడి ముర్రాగేదె 1 రోజు 31.32 లీటర్ల పాలిచ్చి రాష్ట్రంలో కొత్త రికార్డు నెలకొల్పింది.
జాప్రాబాది :
ఈ జాతి గేదెలు పెద్దగా వుంటాయి. ఇవి కథియావార్‌లోని గీర్ అడవిలో మరియు గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతం జాప్రాబాద్ ప్రక్కప్రాంతాల్లో కనబడతాయి. గీర్ ప్రాంతంలో ఈ జాతి పశువులను కేవలం నెయ్యి ఉత్పత్తి కొరకు ఎక్కువగా పోషిస్తుంటారు. ఈ పశువులకు అధిక మొత్తంలో పశుగ్రాసాలు అవసరం. పాల దిగుబడి, వెన్నశాతం ఎక్కువగా ఉంటుంది.

తలముందు భాగం చాలా పెద్దగా వుంటుంది. కొమ్ములు మెడకు రెండు వైపుల వ్రేలాడుతూ వుంటాయి. కొమ్ములు ముర్రా గేదెలలాగా అంతగా వడితిరిగి వుండవు.
సాధారణంగా నలుపు రంగులో వుంటాయి. ఈ జాతి సగటు గేదె బరువు 600 కిలోలు, దున్న బరువు 800-900 కిలోలు ఉంటుంది.
కళ్ళు తల ముందుభాగానికి క్రింద, అతుక్కుని వున్నట్లు కనబడతాయి. తోకపొడువుగా నేలకు అనుకునేట్లు వుంటుంది. పాడి కాలంలో పాలదిగుబడి 2000 నుండి 2200 లీటర్లు ఉంటుంది.
మెహసానా :
ఈ జాతి గేదెలు గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా జిల్లాలో, మహారాష్ట్ర చుట్టుపక్కల ఉంటాయి. ఈ జాతి సుర్తి మరియు ముర్రా గేదెలకు మధ్యస్థంగా ఉంటుంది.
కొమ్ములు వడివడి ఉంటాయి. రంగు నలుపు ఫౌన్గ్రే రంగులో వుంటుంది. ముఖం, కాళ్ళు, తోక చివర తెల్ల గుర్తులుంటాయి.
ఇవి త్వరగా యుక్తవయస్సుకు వస్తాయి. పునరుత్పత్తి సక్రమంగా వుంటుంది.పాల ఉత్పత్తి నిలకడగా వుంటుంది. సైజు మధ్యస్థంగా వుంటుంది. మేపు ఖర్చు తక్కువ. సగటు మోహసానా జాతి గేదె బరువు 400-500 కిలోలు, దున్నపోతు బరువు 600 కిలోలుంటుంది. పాల దిగుబడి 300 రోజుల పాడి కాలంలో 1800లీటర్ల నుండి 2360, వెన్న 7% ఉంటుంది.

సుర్తి :
గుజరాత్ రాష్ట్రంలోని చరోత్తర్ ప్రాంతంలో కనబడు తుంది. స్వచ్ఛమైన సుర్తి జాతులు ఆనంద్, కైనా, బోర్సాద్, నదియాడ్‌లో కనబడ్తాయి. ఈ జాతి పశువులు చౌకగా పాలనుత్పత్తి చేస్తాయి. ఈ జాతి పశువులు మధ్యస్థ సైజులో ఉంటాయి. కళ్ళు ఉబ్బెత్తుగా వుంటాయి.
కొమ్ముల పొడవు మధ్యస్థంగా వుండి, కొడవలి ఆకారంలో వుంటాయి. శరీర రంగు బ్రౌన్‌గా వుంటుంది. నడుము తిన్నగా వుంటుంది. రెండు తెలుపు కాలర్లు, ఒకటి దవడ చుట్టూ, మరొకటి బ్రిస్కెట్ చుట్టూ ఉంటాయి.
పొదుగు పింక్ రంగులో వుంటుంది. చన్నులు మధ్యస్థ సైజులో ఉంటాయి. చర్మం మందంగా, సున్నితంగా వుంటుంది. 300 రోజుల పాడికాలంలో 1655 కిలోల సగటు పాలదిగుబడి వుంటుంది. 7.5% వెన్న వుంటుంది. రికార్డయిన ఒకరోజు అత్యధిక పాల దిగుబడి 15 లీటర్లు.
పాడికి ప్రసిద్ధి చెందిన విదేశీ జాతులు :
మన దేశంలో దేశవాళి ఆవుల్లో పాల ఉత్పాదకశక్తిని అభివృద్ధి చేయడానికి విదేశీ జాతుల పశువీర్యాన్ని ఉపయోగించి సంకర జాతి పశువులను అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఉధృతంగా నడుస్తున్నాయి. మనదేశంలో సంకరజాతి పశువుల అభివృద్ధికి ఉపయోగించే మేలురకం విదేశీ జాతులు కొన్నింటికి గురించి తెలుసు కుందాం.
జెర్సీ :
భారతదేశంలోని వాతా వరణ పరిస్థితులు జర్సీ పశువుల పోషణకు అనుకూలంగా ఉంటాయి. అందుకే ఈ జాతి దేశవాళీ పశుసంతతిని సంకర పరచడానికి విరివిగా వాడుతున్నారు. తక్కువ మేపు ఖర్చుతో, అధిక పాలివ్వగల శక్తి జర్సీ ఆవులకు ఉంటుంది. జర్సీ గోజాతికి పుట్టినిల్లు ఫ్రాన్సు, ఇంగ్లాండ్ మధ్యలోని జర్సీ ద్వీపం.
జెర్సీ పాలిచ్చే విదేశీ జాతుల్లో అతిచిన్న పరిమాణం గల జాతి. శరీరం పొందికగా మూలలు సరిసమానంగా ఉంటాయి.

రంగు లేత ఎరుపు నుండి నుదురు గోధుమరంగు ఉంటుంది.జర్సీ పెయ్యలు త్వరగా ఎదిగి, తొందరగా పొర్లుతాయి. 24 మాసాల వయస్సులోనే మొదటిసారి ఈనుతాయి. జర్సీ ఆవులు 450 కిలోల శరీర బరువుంటాయి. పొదుగు ఆకారం చక్కగా ఉండి సరిగ్గా అమర్చబడి ఉంటుంది. పాడికాలంలో సుమారు 3000-4000 లీటర్ల పాలదిగుబడి ఉంటుంది. వెన్నశాతం 3.5 ఉంటుంది. జర్సీ ఆవులు తక్కువ పాలిచ్చినా, వెన్నశాతం ఎక్కువగానే ఉంటుంది. పాలు పసుపు పచ్చ రంగులో ఉంటాయి.

హొలిస్టిన్ -ఫ్రీజియన్ (హెచ్.ఎఫ్) :
ప్రపంచంలో అత్యధికంగా పాలిచ్చే విదేశీ జాతి హొలిస్టిన్ ఫ్రిజియన్. ఆ జాతి ఊష్ణదేశాల్లో ఎక్కువగా విస్తరించి ఉంది. నెదర్లాండ్ ఉత్తర ప్రాంతాల్లో ఈ జాతి వృద్ధి చెందినది. హెచ్.ఎఫ్. అంత నాజూకుగా ఉండదు. శరీరంపై తెలుపు మరియు నలుపు రెండు పెద్ద మచ్చలుంటాయి.శరీరం లావుగా, భారీగా, పొడవుగా ఉంటుంది.తోక తెలుపురంగులో ఉంటుంది. పొదుగు పెద్దగా ఉంటుంది. హెచ్.ఎఫ్. పశువులు సుమారు 700 కిలోల బరువుంటాయి. పాల దిగుబడి, పాడికాలంలో 6-7 వేల లీటర్లు ఇస్తాయి. ఇతర విదేశీ జాతుల్లో కంటె హెచ్.ఎఫ్. ఆవుల పాలల్లో వెన్నశాతం తక్కువగా (3.5%) ఉంటుంది.
దేశీయ పశుజాతులు – పరిరక్షణ
దేశానికి చెందిన అనేక దేశీయ జాతులు మనకు తరతరాల నుండి సంక్రమించిన జన్యుసంపద. ఈ సంపద పశుగణాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి దేశీయ పశుసంపద కనుమరుగైపోకుండా, పరిరక్షించి, భవిష్యత్తు తరాలకు ఈ సంపదను అందించాల్సిన కర్తవ్యం మనందరిపై ఉంది.