వనరులున్నచోటనే జీవరాశుల మనుగడ సాధ్యం. నీటి పరివాహక ప్రాంతాలలోనే సహజంగా జనవాసాలు ఏర్పడతాయి. ప్రకృతిలో గల కార్యచరణ సంబంధాలను అర్థం చేసుకొని, ఆ అవగాహనతో మనిషి జీవించాలి. రానురాను మనిషికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. భూమిపై వున్న వనరుల సమతుల్యతను కాపాడుకోవటం, సమర్థవంతంగా ఉపయోగించుకోవడంపైన మన భవిష్యత్తు ఆధారపడి వుంటుంది. రోజురోజుకీ జనాభా పెరిగిపోతుంది. అపరిమిత జనాభా వల్ల వనరులు తగ్గిపోతున్నాయి. ఇది ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో పరిమితమైనది కాదు. 1987లో ప్రపంచ జనాభా 500 కోట్లు కాగా ప్రస్తుతం 800 కోట్ల పై మాటే. ఈ పెరుగుదలపై అవగాహన కలిగించి, జనాభా నిరోధించే చర్యలవైపు ఆలోచించేందుకు జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
1947లో నాటికి 35 కోట్ల మంది వున్న మన భారత దేశ జనాభా ప్రస్తుతం 130 కోట్లకు పైగా చేరింది. 60శాతం భూమి ఆహారపంటల కోసమే వినియోగించబడుతుంది.
జనాభా పెరుగుదల వల్ల నివాస, ఉపాధి, ఆహార, పారిశుద్ధ్య, ట్రాఫిక్ రద్దీ, నేరాల కట్టడి, విద్యావకాశాలు, కాలుష్యం, సాంద్రతతో ఒత్తిడి వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి. పెరుగుదలను అరికట్టే చర్యలతో పాటు ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రణాళికలు తయారు చేసుకొని చిత్తశుద్ధితో అమలు చేయాలి.
ఈ రోజు మన హైద్రాబాద్ నగరం ఉపాధి కేంద్రంగా మారింది. కరోనా వంటి విపత్కరస్థితిలో కూడా మన ఐటి రంగం విజయపథంలో నడుస్తుంది. ఫార్మావంటి పరిశ్రమలు ఇతోధికంగా పురోగమిస్తున్నాయి. భవన నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇవన్నీ ఉపాధికి భరోసా యివ్వడం వల్ల వలసలు పెరిగాయి. రాష్ట్రజనాభాలో 43 శాతం పట్టణ ప్రాంతాల్లో నివశిస్తున్నారు. ఉపాధి, విద్య, వైద్య సదుపాయాల కోసం ప్రజలు గ్రామాల నుండి పట్టణాలకు చేరడం సహజమే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరమైన మౌలిక వసతుల కల్పనతో ఆధునిక పట్టణాల నిర్మాణాలవైపు అడుగులు వేస్తుంది. పౌరకేంద్రీకృత మున్సిపల్ చట్టం ద్వారా 142 మున్సిపాలిటీలలో 1326 నర్సరీలు, 197 డ్రైరిసోర్స్సెంటర్లు, 140 కంపోస్ట్ యార్డులతో రాష్ట్రాభివృద్ధితోపాటు, బడ్జెట్ 10శాతం కేటాయించడం ద్వారా పచ్చదనానికి శ్రీకారం చుట్టింది. పట్టణ ప్రగతికింద 1,122 కోట్ల రూపాయలు వీటికి కేటాయించింది. కొత్త జిహెచ్‍ఎంసి 5,600 కోట్ల బడ్జెట్‍తో నగరాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించింది. ట్రాఫిక్‍రద్దీ నివారణకు 158 కి.మీ. రింగ్‍రోడ్ చుట్టూ 13 ప్రాంతాల్లో రవాణా ఆధారిత అభివృద్ధి కేంద్రాలు అమలు చేస్తుంది. మెట్రో, శాటిలైట్‍బస్‍బే, స్కైవాక్‍ల ద్వారా రవాణా సౌకర్యాలు పెరిగాయి. నగరంలో 3,42,645 సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటైంది. 13,236 నేరాలను పోలీస్‍శాఖ గుర్తించింది. ఇవన్నీ పెరిగిన జనాభాకి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు.
తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‍ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వం 153 ఇండస్ట్రియిల్ పార్క్లను అభివృద్ధి చేసింది. ప్రధానంగా కరీంనగర్ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్, వరంగల్ టీ-వర్కస్, టీ-హబ్ హైద్రాబాద్, ఈ-సిటీ, రావిర్యాల ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ వంటి వాటిని పేర్కొంది. ఇవన్నీ ఆయా ప్రాంత అర్హులకు ఉపాధినిస్తాయి. అధికార వికేంద్రీకరణతోపాటు హైద్రాబాద్ ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడి ప్రజలకు అక్కడ ఉపాధి అవకాశము, విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరచడం ద్వారా వలసలను నిరోధించి నగరం మీద జనసాంద్రత ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనికోసం సమగ్ర మాస్టర్‍ప్లాన్, పట్టణ అభివృద్ధి ప్లానింగ్, నూతన పంచాయితీచట్టం దోహదం చేస్తున్నాయి. ఈ చర్యలన్నీ జనాభా పెరుగుదల వల్ల ఎదురవుతున్న సవాళ్లకు జవాబుగా నిలుస్తాయి.
(మణికొండ వేదకుమార్)
ఎడిటర్