అపరిమిత జనాభా వల్ల తగ్గుతున్న వనరులు


పెరుగుట విరుగుట కొరకే!
జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం


గత 30ఏళ్లుగా మనం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో జనాభా ఏడాదేడాదికి పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో జనాభా పెరుగుదల వలన జరిగే పరిణామాలపై చర్చించుకునేందుకు 1989లో ఐక్యరాజ్యసమితి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1987 జూన్‍ 11న ప్రపంచ జనాభా 500కోట్లు దాటగా.. దానిపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం.


2010లో ప్రపంచ జనాభా 700 కోట్లు దాటింది. ప్రస్తుతం భూమిపై 800 కోట్లకు పైగా ప్రజలున్నారు. వీరిలో చైనా, ఇండియా కలిపి… 250 కోట్ల మందికి పైగా ఉన్నారు. ఐతే… 2050 నుంచీ ప్రపంచ జనాభా సంఖ్య తగ్గుతుందనే అంచనాలున్నాయి. ముఖ్యంగా చైనా, ఇండియాలో అభివృద్ధి, విదేశీ సంస్కృతుల కారణంగా… ప్రజలు పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపరనీ, ఇప్పటికే ఆ పరిస్థితి కనిపిస్తోందనీ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో… ఈ ఆలోచనా ధోరణి మరింత ఎక్కువై… జనాభా పెరుగుదల తగ్గి… తిరోగమనంలోకి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే… అందరికీ మంచిదే.


జనాభా పెరుగుదలపై చర్చించేందుకు ఓ రోజు ఉంటే మంచిదే. మన అభివృద్ధీ, ప్రపంచ గమనం, ప్రాజెక్టులు, కార్యక్రమాలూ అన్నీ ఆధారపడేది జనాభా పైనే. అపరిమిత జనాభా వల్ల వనరులు తగ్గిపోతున్నాయి. అయితే ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే.. మానవ వనరులు చాలా అవసరం. కానీ జనాభా పెరిగితే వనరులు తగ్గిపోతాయి.
ఏ దేశమైనా పెరిగిన జనాభాకు తగిన ఉద్యోగాలు, ఆహారం, ఆవాసం, సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. వీటిలో ఏవి తగ్గినా… పరిస్థితి అల్లకల్లోలంగా తయారవుతుంది. జపాన్‍ లాంటి ఎక్కువ భూమి లేని దేశాలకు జనాభా ఎప్పుడూ భారమే. చైనాలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నప్పటికీ… అందుకు తగినంత భూమి, వనరులు ఉండటం… మానవ వనరుల్ని ఆ దేశం సక్రమంగా వినియో గిస్తుండటంతో… చైనాకు జనాభా కలిసొస్తోంది. ఇండియా కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతూ… మానవ వనరుల్ని సక్రమంగా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఐతే… ఇండియా ఈ దిశగా చేయాల్సింది చాలా ఉందన్నది నిపుణుల అభిప్రాయం.


జనాభా పెరిగితే… వనరులు తగ్గిపోతాయి. ఇప్పటికే చాలా దేశాల్లో చమురు నిల్వలు అడుగంటి పోయాయి. నీటికి విపరీతమైన కొరత ఏర్పడుతోంది. కరవు, కాటకాల్ని చూస్తున్నాం. ఆఫ్రికా దేశాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. అంతర్యుద్ధాలు, ఆక్రమణలు ఉండనే ఉన్నాయి. ఇక ఉగ్రవాదం ప్రపంచానికి పెనుముప్పుగా మారింది. ఇవన్నీ అశాంతి వల్ల తలెత్తే పరిణామాలు. ఈ అశాంతికి కారణాల్లో జనాభా పెరుగుదల కూడా ఒకటిగా కనిపిస్తోంది. ప్రపంచ దేశాలు జనాభా సంఖ్య పెరుగుదలపై దృష్టి సారిస్తూనే… వనరుల్ని సక్రమంగా వినియోగించే అంశాలపైనా ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది.


ప్రస్తుతం 2021లో… కరోనా సమస్య ప్రపంచ జనాభాను పట్టి పీడిస్తోంది. మరో రెండేళ్ల పాటు ఈ సమస్య కొనసాగుతుందనే అంచనా ఉంది. కరోనా కారణంగా చాలా మంది పిల్లల్ని ఇప్పుడు కనేందుకు సిద్ధపడట్లేదు. ప్రెగ్నెన్సీలను వాయిదా వేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి… 2021ని మహిళలు, బాలికల ఆరోగ్యం, వారి హక్కుల రక్షణ సంవత్సరంగా చెప్పింది. తద్వారా మహిళల రక్షణకు చర్యలు తీసుకుంటోంది. ఏది ఏమైనా ఈ కరోనా పోతే తప్ప ప్రపంచగమనం ముందుకుసాగే పరిస్థితి లేదు. అప్పటివరకూ అన్ని కార్యక్రమాలకూ ఆటంకాలు తప్పేలా లేవు.


భారతదేశం & ప్రపంచం :

ప్రతి ఒక్కరూ వేదికలపై మనం ఎదుర్కొంటున్న వివిధ విపత్తులపై మాట్లాడుతుంటారు. ముఖ్యంగా మనం నిత్యం ఎదుర్కొనే నీరు, పర్యావరణ పరిరక్షణ వంటివి – అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే – ఏ ప్రభుత్వం కూడా అతి ముఖ్యమైన పెరుగుతున్న జనాభా విపత్తు గురించి మాట్లాడటం లేదు.
20వ శతాబ్దం మొదట, ప్రపంచంలో160 కోట్ల జనాభా ఉండేది. నేడు, ఒక శతాబ్దం తరువాత, జనాభా 730 కోట్లకు చేరింది. ఐక్యరాజ్య సమితి చూపుతున్న లెక్కల ప్రకారం 2050 నాటికి జనాభా 980 కోట్లకు వరకు చేరుతుంది. ఇది బాధ్యతా రాహిత్యమైన మానవ పునరుత్పత్తి. భారత దేశంలో 1947 నాటికి 33 కోట్ల మంది జనాభా వుండేది. ఈరోజు, మన జనాభా 130 కోట్లు. జనాభా నియంత్రణ చేయకపొతే – మనం ఎన్ని చట్టాలు మార్చినా, ఎంత గొప్ప టెక్నాలజీ అందు బాటులోకి తెచ్చినా ఏ ప్రయోజనమూ లేదు.


ఈ భూమి కేవలం మానవుని కోసం కాదు

‘ఈ భూమి కేవలం మానవుల కోసమే’ అన్న ఆలోచన చాలా పెద్ద స్వార్థపరమైన ఆలోచన. మీరు ‘దేవుని ఆకారంలోస•ష్టించ బడ్డారు’ అనేది ప్రజల మనస్సుల్లో బాగా నాటుకొనిపోయింది. కాని ఒక చిన్న పురుగు, క్రిమి కూడా దేవుడు తమలాగే ఒక పెద్ద పురుగులా వుంటాడని అనుకుంటుంది.
కేవలం పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల విషయంలోనే కాకుండా – మానవ మనుగడ కోసం మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ భూమిపై ప్రతి ప్రాణికీ ఒక పూర్తి జీవితం వుంటుంది. ఒక చిన్న క్రిమికి కూడా తనకంటూ ఒక పూర్తి జీవితం
ఉంటుంది. దాని జీవితంలో కూడా అనేక విషయాలు ఉంటాయి. అవి మీకంటే చిన్నగాను లేదా చూడటానికి వేరుగా వున్న కారణంతో వాటికి ఇక్కడ జీవించడానికి ఎలాంటి హక్కు లేదని, కేవలం మానవునికి మాత్రమే ఇక్కడ జీవించడానికి హక్కు వుందని ఆలోచిస్తే అది మనం మానవత్వం లేకుండా ఘోరంగా జీవించడం అవుతుంది.


నాభా నియంత్రణ ఎలా ?
ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. కానీ కేవలం చట్టాలు సరిపోవు. ప్రజాస్వామ్యంలో చట్టాలు అమలు చేయలేము. దీనిపై సరైన అవగాహన వచ్చేలా ప్రచారం చేసినప్పుడు మాత్రమే ఇటువంటి చట్టాలు పనిచేస్తాయి. ఇందుకు ప్రభుత్వంలోని వారు బాగా ఆలోచించాలి. ప్రైవేటు వ్యవస్థలు, ఎన్జీవోలు కొన్ని పనులు మాత్రమే చేయగలరు, ఇటువంటి విషయాలలో ప్రభుత్వ జోక్యం అవసరం. జనాభా నియంత్రణ వదిలిపెట్టి పర్యావరణ, భూమి, నీటి పరిరక్షణ వంటి విషయాలు మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనమూ వుండదు, ఎందుకంటే సైన్స్, టెక్నాలజీ మనిషిని అతి క్రియాశీలంగా చేస్తుంది.


జననాలను నియంత్రించడం!
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం ఇవన్నీ ఖచ్చితంగా చేయ వలసినవే. కానీ గుర్తు చేసుకోవలసిన ప్రాథమిక విషయం ఏమిటంటే, మన సంఖ్య నాలుగు రెట్లు అయింది. మనం దానిపై ఎలాంటి చర్యా తీసుకోలేదు. ఇంకా ఇప్పటికి మన జనాభా పెరుగుతూనే ఉంది, అదే పెద్ద సమస్య.
1947లో, సగటు భారతీయుడి ఆయుర్దాయం 32 సంవత్సరాలు. ఈరోజు, 65 సంవత్సరాలు దాటుతోంది. అంటే మరణాల రేటుపై మనం సాధికారత సాధించాం. అందుకే జననాల రేటుపై కూడా మనం నియంత్రణా బాధ్యత తీసుకోవాలి. నేడు 130 కోట్ల జనాభాకు సరిపోయేటంత ఆహారం, వసతి, బస్సులు, భూమి, టాయిలెట్లు కనీస అవకాశం కూడా లేదు. మనం చేయగలిగిన పని ఏమిటంటే – మనకున్న వనరులకు తగ్గట్టు మనం జనాబా నియంత్రణ చేయగలమా? ప్రతి ఒక్కరికి కావలసిన సరైన అవగాహన అందించగలిగితే అది సాధ్యపడుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకొని, అందుకు ఏది అవసరమో అది చేయాలి.


చైనాను దాటనున్న భారత్‍ జనాభా
ప్రపంచ జనాభా అంతకంతకు పెరిగిపోతోంది. తాజాగా అమెరికా జనాభా గణాంకాల సంస్థ ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది. జూలై నెలాఖరు కల్లా ప్రపంచ జనాభా 7.58 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది. అదే సమయంలో 2020-21 సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకుంటే వార్షిక జనాభా వృద్ధి కూడా 1.0శాతానికి పడిపోనుందని చెప్పింది. ఇదే జరిగితే 1950 తర్వాత ఇలా పడిపోవడం ఇదే తొలిసారి అవుతుందని పేర్కొంది.
ప్రపంచ జనాభా దినోత్సవంలో భాగంగా పెరుగుతున్న జనాభాతో ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది గత 32 ఏళ్లుగా జరుగుతున్నదే. అయినప్పటికీ ప్రతి ఏటా జనాభా పెరుగుతోందే తప్ప ఎక్కడా తగ్గిన దాఖలాలు లేవు. జనాభాతో పాటే తద్వారా వచ్చే సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. భారత్‍నే తీసుకుంటే ప్యూ రీసెర్చ్ సెంటర్‍ ఇచ్చిన నివేదిక ప్రకారం 2100 నాటికి జనాభా 1450 మిలియన్‍ తాకుతుందని అంచనా వేసింది. 2100 నాటికి చైనా జనాభాను కూడా భారత్‍ దాటుతుందని ప్యూ రీసెర్చ్ సెంటర్‍ తన నివేదికలో వెల్లడించింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత జనాభా ఉన్న 10 దేశాల్లో ఒక్క ఆఫ్రికా దేశాలే ఐదుగా ఉన్నట్లు రిపోర్టు పేర్కొంది.


ప్రపంచ జనాభాలో 16శాతం భారత్‍లోనే ఇక ప్రపంచ జనాభాపై ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రతి ఏటా దాదాపు 83 మిలియన్‍ పెరుగుతోంది. 2030 నాటికి ప్రపంచ జనాభా 8.6 బిలియన్‍ మార్కును తాకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. ప్రపంచ భూభాగంలో కేవలం 2శాతం భూమిని మాత్రమే కలిగి ఉండే భారత దేశం… జనాభా విషయానికొచ్చేసరికి దాదాపు 16 శాతం అకామొడేట్‍ చేయడం విశేషం. ఇక భారత్‍లో 35శాతం జనాభా బీహార్‍, ఉత్తర్‍ ప్రదేశ్‍, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనే ఉన్నట్లు సమాచారం. అత్యధిక జనాభా ఉండటం వల్ల సమస్యలు కూడా అధికంగానే ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. అందులో ప్రధానమైన సమస్య పేదరికం అని వెల్లడిస్తున్నారు.


2021 థీమ్‍ ?
COVID-19 మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికల ఆరోగ్యం, అలాగే హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకోవాలని ఐరాస సూచిస్తుంది. లాక్డౌన్‍ 6 నెలలు కొనసాగితే, ఆరోగ్య సేవలకు పెద్ద అంతరాయం ఏర్పడి తక్కువ మధ్య-ఆదాయ దేశాలలో 47 మిలియన్ల మంది మహిళలు ఆధునిక గర్భనిరోధక మందులను పొందలేరని ఇటీవలి యుఎన్‍ఎఫ్పిఎ పరిశోధన గుర్తు చేసింది.
ఇది 7 మిలియన్ల అనాలోచిత గర్భాలకు దారితీస్తుంది. ఇదే జరిగితే హింస, మహిళలకు అనారోగ్య సమస్యలు, పెరిగే ప్రమాదం వుందని ఐరాస హెచ్చరిస్తోంది. ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా ప్రతి దేశం జనాభా నియంత్రణకు నడుం బిగించాలని ఐరాస పిలుపునిస్తోంది. అంతేగాకుండా భారత్‍, చైనా దేశాలు జనాభా నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచిస్తుంది.


-సువేగా
సెల్ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *