ఏది న్యాయం? ఏది అన్యాయం?


‘‘త్వరగా మాట్లాడకండి
చక్రం ఇంకా తిరుగుతూనే వుంది
ఏదీ చెప్పలేం
ఏం పేరు పెట్టాలో తెలియదు
ఇప్పుడు ఓటమి చెందిన వ్యక్తులు
ఆ తరువాత విజేతలు కావొచ్చు
అలా కావడం
మారుతున్న సమయాలకు కారణం’’


‘ది టైమ్స్ దే ఆర్‍ ఎ-చేంజిన్‍’ అన్న కవితలోని చరణాలు. తొందరగా ఓ నిర్ణయానికి వచ్చి తుపాకులని గురిపెట్టకండి అంటూ నోబెల్‍ బహుమతి గ్రహీత బాబ్‍ డిలాన్‍ రాసిన కవితలోని చరణాలు అవి.
బాబ్‍డిలాన్‍ ఓ ప్రముఖ గాయకుడు. అతను పాటలు కూడా రచిస్తాడు. ఆయనని 2016లో సాహిత్యానికి గానూ నోబెల్‍ బహుమతికి ఎంపిక చేశారు. ఓ గాయకుడికి సాహిత్యంలో అవార్డు ఇవ్వడం చాలా మంది కనుబొమ్మలను ఎగరేపింప చేసింది.
నా పాటలు సాహిత్యానికి ఎలా సంబంధం అన్న ప్రశ్నని బాబ్‍డిలాన్‍ కూడా వ్యక్తపరిచి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు. తాను చదివిన క్లాసిక్స్ వల్ల తాను ఎలా ప్రభావితం అయినాడో బాబ్‍డిలాన్‍ నోబెల్‍ బహుమతిని స్వీకరించినప్పుడు వివరించినాడు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడు కోవడానికి కారణం-బాబ్‍డిలాన్‍ రాసిన ఈ కవితా చరణాలు కేరళ హైకోర్టు డివిజన్‍ బేంచి తన తీర్పులో ఉదహరించింది.
కేరళ ప్రభుత్వ లిక్కర్‍ పాలసీని సవాలు చేస్తూ దాఖలైన దరఖాస్తుని పరిష్కరిస్తూ కేరళ హైకోర్టులోని డివిజన్‍ బేంచి ఈ కవితను ఉదహరించింది.
జనవరి 6, 2017 రోజున కేరళ హైకోర్టులోని డివిజన్‍ బేంచి ఈ కవితని ఉదహరించింది. ఆ బేంచిలోని న్యాయమూర్తులు పి.ఆర్‍.రామచంద్ర మీనన్‍, దామా శేషాద్రినాయుడు. కేరళ ప్రభుత్వ లిక్కర్‍ పాలసీ వల్ల తన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని పెరంబవూర్‍ వాస్తవ్యుడు అనూప్‍ ఈ దరఖాస్తుని కేరళ హైకోర్టులో దాఖలు చేశాడు.


అనూప్‍ రబ్బర్‍ చెట్ల నుంచి ద్రవాన్ని తీస్తాడు. రోజూ 400 చెట్ల నుంచి అతను ద్రవాలని తీస్తాడు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాడు. సేద తీరడానికి అతను మందు తీసుకుంటాడు. రిటేల్‍ దుకాణాల నుంచి అతను లిక్కర్‍ కొనుక్కునేవాడు. కేరళ కోఆపరేటివ్‍ ఫెడరేషన్‍ అవుట్‍ లెట్‍ల నుంచి అతను తనకు కావల్సిన లిక్కర్‍ని కొనుక్కునేవాడు. కేరళ ప్రభుత్వం లిక్కర్‍ పాలసీలో మార్పులని తీసుకొని వచ్చింది. దాని వల్ల లిక్కర్‍ని ప్రభుత్వ అవుట్‍లెట్స్ నుంచి మాత్రమే కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఖరీదు ఎక్కువ. ఈ పాలసీని సవాలు చేస్తూ అతను కేరళ హైకోర్టులో రిట్‍ పిటీషన్ని దాఖలు చేశాడు.
తాగడమా తాగకపోవడమా అన్నది హమిల్టన్‍ డైలమా. తాగాలని అనూప్‍ అనుకున్నాడు. కొత్త పాలసీ తన జీవన విధానానికి, అదే విధంగా తన గుప్తతకి భంగం కలిగిస్తుందని అతను తన దరఖాస్తులో పేర్కొన్నాడు.
అయితే కేరళ హైకోర్టులోని డివిజన్‍ బేంచి అతని వాదనని మన్నించలేదు. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా సామూహిక ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొంటూ అతని దరఖాస్తుని కొట్టివేసింది.


ఈ కేసు 46 పేజీల తీర్పుని డివిజన్‍ బేంచి ప్రకటిస్తూ బాబ్‍డిలాన్‍ కవితా చరణాలని ఉదహరిస్తూ అనూప్‍కి ఇంకా అనూప్‍లాంటి వ్యక్తులకి ఓ ఆశని కల్పించింది. అక్కడితో వూరుకోలేదు. ఇంకా ఇలా అన్నది.
‘‘ఈరోజు నైతికంగా గర్వనీయ మైనదీ, సాంఘికంగా ఆమోదయోగ్యం కానిదీ అలాగే రేపు వుండాలని లేదు’’.
ఈ అభిప్రాయం చెప్పడానికి కేరళ హైకోర్టులోని డివిజన్‍ బేంచి బాబ్‍డిలాన్‍ కవితా చరణాలు పేర్కొంది.
అవును. కోర్టు చెప్పింది వాస్తవం. ‘నిన్న మొన్న నేడు రేపు’ అన్న కథలో చెప్పినట్టు మొన్న నేరం కాదు. నిన్న నేరం. ఈ రోజు నేరం కాదు. ఇదేమీ న్యాయమో ఆ కథలోని పాత్ర. ఎల్లారెడ్డికి అర్థం కాదు. ఆ కథ కూడా చంద్రబాబు కాలంలో మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసిన సందర్భాన్ని గురించి రాసిన కథ.
ధర్మం వేరు, న్యాయం వేరు. న్యాయం మారుతూ వుంటుంది. ఎమర్జెన్సీ కాలంలో దేశద్రోహులైన వ్యక్తులు ఆ తరువాత దేశభక్తులుగా పరిగణించబడ్డారు. ఇట్లా ఎన్నో ఉదాహరణలని చెప్పవచ్చు.
నేను న్యాయమూర్తిగా చేరిన కొద్దిలో అంటే 1992వ సంవత్సరంలో ‘శిక్ష’ అన్న కవిత రాశాను. అది ఇలాగే వుంటుంది.


నిన్నటి అన్యాయం / నేటి న్యాయంగా మారిపోతుంది
నిన్నటి దేశద్రోహి
నేటి స్వాతంత్య్ర సమరయోధుడు
నేటిన్యాయం
రేపటి అన్యాయం కావొచ్చు
న్యాయాన్యాయాల మధ్య
ధర్మానికి గ్రహణం పడుతుంది
సంశయాల మధ్య
ధర్మానికి గ్రహణం పడుతుంది
ఈ స్థితిలో
ఇదేమిటీ?
ఈ శిక్షేమిటీ
ఈ శిక్షలు వేసే శిక్ష నాకేమిటీ?


అంతే కదా? న్యాయం అనేది పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మార్పు చెందుతూ వుంటుంది.
ఏది న్యాయం?
ఏది ధర్మం?
ఏమో – సందర్భమే చెబుతుంది. అదే ఈ కేసులో జరిగింది.
మనుషులను బట్టి న్యాయం మారకపోతే అదే చాలు.
తీర్పులకి కూడా సాహిత్యం ఊతకర్రగా ఉపయోగపడుతుంది. ఏమైనా కవులూ, రచయితలూ క్రాంతిదర్శులు కదా!


మంగారి రాజేందర్‍ (జింబో),
ఎ : 944048300
1

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *