కనుమరుగవుతున్న చర్మకారులవృత్తి


చర్మసంబంధ వస్తువులు తయారు చేయువారిని చర్మకారులు అంటారు. ఈ వృత్తిని ఎక్కువగా మాదిగ కులానికి చెందినవారు చేస్తుంటారు. వ్యవసాయం, పాడిపంటలు, పశుసంపదతో విలసిల్లిన గ్రామీణ భారతం మనది. వీరిది గ్రామీణ జీవితంతో విడదీయలేని బంధం. రాంనారాయణ్‍రావత్‍ చర్మకారుల కులం చెప్పులవంటి జంతుసంబంధ వస్తువుల అవసరం పెరిగినప్పటి నుంచి ఆవిర్భవించినదనీ, అంతకుముందు వీరు కర్షకులే అని అంటారు. మాదిగవారు ప్రధానంగా తెలంగాణ, ఆంధప్రదేశ్‍, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‍గడ్‍, గుజరాత్‍, మధ్యప్రదేశ్‍ వంటి వివిధ రాష్ట్రాలలో జీవిస్తున్నారు. వీరిని వేరు వేరు ప్రాంతాలలో మాదిగ, మదిగ, ఆదిజాంబవ, మాతంగి, మక్కాలు, మాదిగారుగా, మాదార్‍, మాంగెలే, అంబుజ్‍, మాంగ్స్ యిలా వేరు వేరు పేర్లతో పిలుస్తున్నారు.
వీరి ఇళ్ళు ఊరికి కాస్త దూరంగా ఒకే చోట వుండటం పరిపాటి. వీటిని మాదిగ పల్లెలనీ, వాడలనీ పిలుస్తారు. వీరు జీతగాళ్లుగా, పాలేరులుగా, వెట్టివారిగా వ్యవసాయ పనులలో భాగస్వాములు. అంటరానివారుగా, అస్పృశ్యులుగా, అణచి వేయబడినవారిగా చరిత్రలోనూ భాగస్వాములు. ఇప్పటికీ ఉత్తర భారతదేశంలో ఈ వివక్ష కొనసాగుతున్నది.


వీరు చనిపోయిన పశు కలేబరాల నుండి తోలు వేరు చేసి, శుద్ధిచేసి ఆ తోలుతో చెప్పులు, డప్పులు, వ్యవసాయ ఉపయోగ వస్తువులు తయారు చేసే వృత్తిదారులుగా స్థిరపడినారు. ఈ పశు మాంసాన్నే తమ ఆహారంలో భాగం చేసుకున్నారు. ఉచితంగానూ, చౌకగానూ లభించడమే కాక బలమైన ఆరోగ్యాన్నిచ్చే ఆహారంగా వారి జీవన సంస్కృతిలో ఒక భాగమైంది. తోలును ఒలచడం, శుద్ధిచేయడం, దానితో వివిధ వస్తువులు తయారు చేయడం అతి సున్నితమైన, వైవిధ్యంతో కూడిన కళారూపాలుగా మార్చడం ఎంతో నైపుణ్యం, సృజనశీలత అవసరమైన కార్యకలాపం.


నైపుణ్యం వీరి సొత్తు :

వివిధ సైజులలో, శైలులలో కొత్తకొత్త నగిషీలతో చెప్పులు కుట్టటం, డప్పులు తయారు చేయడం, కమ్మరి కొలిమి తిత్తులు, ఎద్దులకు కవచాలు, ఎద్దుల మెడలో గజ్జెల పట్టెడలు, చెరువుల నుండి వ్యవసాయ భూములకి నీరుని పంపడానికి గోనెలు, ఏతం వేయడానికి త్రిభుజాకార బుట్టలు, నాయీబ్రాహ్మణుల కత్తెరాలు, రేజర్లు పదును పెట్టడానికి తోలు సారెలు, పశువులను అదిలించడానికి చేర్నాకోలలు గీతకార్మికులు చెట్లు ఎక్కడానికి, దిగడానికి నడుముకి, కాళ్లకి అవసరమైన మోకు త్రాళ్లు చేయడానికి కావాల్సిన నైపుణ్యం వీరి సొత్తు.


సాంస్కృతిక పరికరాలు :
తోలుబొమ్మలాటలో ఉపయోగించే పౌరాణిక పాత్రల చిత్రాలతో తోలుబొమ్మలు, వాయిద్య పరికరాలు డప్పులు, తబలా, డోలు, బుర్ర కథలో ఉపయోగించే బుర్రలు, నాట్యకళాకారులు ఉపయోగించే కాలిగజ్జెల పట్టడలు, కంజెరలు, శృతిలయిలను పలికించే మువ్వల దండలు వంటి కళాసాధనాలు అందించేది వీరే.


చర్మ కళాకారులు :
లెదర్‍ చెప్పులు, బెల్టులు, షూస్‍, లెదర్‍ సూట్‍కేసులు, బ్యాగులు, మనీ పర్సులు వంటి కళాత్మక పరికరాలు తయారు చేసే ఈ చర్మకారులు హస్తకళానైపుణ్యం కలిగిన చర్మకళాకారులు. ఈ పనులన్నిటిలో మాదిగ మహిళలు భాగస్వాములే. ఈ వృత్తికళలు పరిణామ క్రమంలో పారిశ్రామిక వస్తువులుగా మారిపోయాయి. జీవన విధానంలో వచ్చిన పెనుమార్పులు ఈ గ్రామీణ వృత్తులను పారిశ్రామిక ఉత్పత్తులుగా మార్చివేశాయి.


మాదిగల ఆర్థిక స్థితి :

షెడ్యూల్డ్ కులాల జాబితాలో 32వ కులం మాదిగ. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల జనాభాలో 16 శాతం మాదిగలున్నారు. షెడ్యూల్డ్ కులంగా వర్గీకరించడం వలన వారి సాంఘిక – ఆర్థిక స్థితుల్లో మార్పులొచ్చాయి. విద్యావకాశాలు పెరిగాయి. రిజర్వేషన్ల వల్ల ఉద్యోగ అవకాశాలొచ్చాయి. కానీ అత్యధిక మాదిగలు యింకా నిరుపేదలుగానే ఉన్నారు. కుల వృత్తుల్ని కోల్పోయి నైపుణ్యం అక్కర్లేని రకరకాల వృత్తుల్లో జీవిస్తున్నారు. మాదిగ స్త్రీలు కూడా నిరంతర శ్రమజీవులే.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కులవృత్తుల రక్షణ ప్రధాన ధ్యేయంగా అనేక చర్యలు ప్రారంభమయ్యాయి. కార్పొరేషన్ల ఏర్పాటు జరుగుతుంది. గీతవృత్తిదారులకు, పశువుల పెంపకందార్లకు సబ్సిడీలతో అనేక సౌకర్యాలను కలిగిస్తున్నది. అలాగే తోలు పరిశ్రమ అభివృద్ధికీ చర్యలు చేపట్టింది.
1.73 లక్షల గొర్రెలు, మేకలు, 91 లక్షల పశువులు (గేదెలు, ఆవులు) సుమారు 360 కబేళాలతో రాష్ట్రం పెద్ద తోలు ఉత్పత్తి కేంద్రంగా ఉంది. తోలు ఉత్పత్తిలో ప్రస్తుతం రాష్ట్రంలో మూడు యూనిట్లు పనిచేస్తున్నాయి. ఇవి భువనగిరి జిల్లాలోని కొనూర్‍వద్ద ఉన్నాయి. చర్మాన్ని యితర రాష్ట్రాలకు ముఖ్యంగా తమిళనాడుకు ఎగుమతి చేస్తున్నారు. మాంసం వినియోగంలో తెలంగాణా యితర రాష్ట్రాలతో పోల్చుకుంటే అగ్రస్థానంలో ఉంది. స్కిన్‍ ప్రాసెసింగ్‍ యూనిట్లు లేదా టన్నరీలు తగిన స్థాయిలో ఏర్పాటు చేయాల్సి వుంది. శుద్ధికర్మాగారం (సిఐటిపి) వాడకాన్ని సులభతరం చేయడానికి యూనిట్లను అఫ్‍డేట్‍ చేయడం అవసరం. వీటి ద్వారా రసాయన అవశేషాలను సురక్షితమైన పద్ధతిలో ప్రాసెస్‍ చేయవొచ్చు.


కరీంనగర్‍ రుక్మాపూర్‍ లెదర్‍ పార్క్ :
తోలు పరిశ్రమపై ఆధారపడే ప్రజల ఉపాధికోసం లెదర్‍ పార్క్ ఏర్పాటు చేయాలని లెదర్‍ వర్కర్స్, వెల్ఫేర్‍ సొసైటీ కోరిక మేరకు కరీంనగర్‍ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్‍లో లెదర్‍పార్క్ మంజూరు చేయబడింది. 1000 మందికి తోలు వస్తువుల తయారీకి శిక్షణ యిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతివృత్తులను ప్రోత్సహించే అనేక చర్యలు చిత్తశుద్ధితో తీసుకుంటుంది. దీనిలో భాగంగా చర్మకారుల వృత్తుల పరిరక్షణతో చర్మకారుల కళానైపుణ్యాలను వినియోగంలోకి తెస్తుందని, వారికి ఉపాధి కల్పిస్తుందని ఆశిద్దాం.

దక్కన్‍న్యూస్‍, సెల్ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *