వాణిజ్య పరంగా జీవాల్ని పెంచే విధానాలు
గొర్రెలు, మేకల ఫారాలు పెంపకం ప్రారంభించేముందు, వాటిని పెంచే విధానాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సాధారణంగా జీవాల పెంపకంలో ఎ. బ్రీడింగ్ ఫారాలు, బి. పొట్టేలు పిల్లల పెంపక ఫారాలు, సి. పునరుత్పత్తిక్తి ఉపయోగపడే పొట్టేళ్ళ పెంపక ఫారాలు. ప్రారంభించడానికి వీలుగా ఉంటుంది. వాటి వివరాలు..
ఎ. బ్రీడింగ్ (పునరుత్పత్తి) ఫారాలు :
పునరుత్పత్తి కోసం ఉపయోగపడే, సంవత్సరం వయస్సు పైబడిన గొర్రెలు లేదా మేకల్ని ఫారాల్లో ఫౌండేషన్ స్టాకులాగా కొని, పెంచడం జరుగుతుంది. వీటిలో ప్రతి 20-25 గొర్రెలు లేదా మేకలకు, ఒక పొట్టేలు చొప్పున ఉంచాలి. తద్వారా జీవాలు ఎదకొచ్చినపుడు, మందలో ఉండే పొట్టేళ్ళు దాటడం, తద్వారా జీవాలు పొర్లి, పిల్లల్ని కనడం జరుగుతుంది. తద్వారా మంద వేగంగా అభివృద్ధి చెందుతుంది. సంవత్సరాంతం వరకు, ప్రారంభంలో ఉన్న జీవాల సంఖ్య, సుమారుగా రెట్టింపు అవుతుంది. ప్రతిఏటా పిల్లలు జన్మించడం, ఫారంలో జీవాల సంఖ్య వృద్ధి చెందడం జరుగుతుంది. జీవాల పెంపకందార్లు మగ జీవాల్ని ప్రతి ఏటా ఎక్కువ సంఖ్యలో, ఆడజీవాల్ని తక్కువ సంఖ్యలో మార్కెటింగ్ చేసుకుంటూ ఉండేవారు. ఆశించేవిధంగా ఆదాయం పొందడం వీలవుతుంది. కోళ్ళ పెంపకంలో, ‘‘లేయర్’’ కోళ్ళలోలాగా, ఈ పద్ధతిలో జీవాల పెంపకాన్ని నిరంతరంగా కొనసాగించవచ్చును. సంవత్సరం పొడవునా జీవాల్ని మార్కెటింగ్ చేసికోవడానికి వీలుంటుంది.
బి. పొట్టేలు పిల్లల పెంపక ఫారాలు :
మాంసోత్పత్తికి ఉపయోగపడే పొట్టేలు పిల్లలను సుమారు 3-4 మాసాల వయస్సులో కొనుగోలు చేస్తారు. ఈ పిల్లలను 6 మాసాలపాటు పోషించి, 9-10వ మాసం వయస్సులో మాంసం కొరకు అమ్మివేస్తుంటారు. ఈ విధంగా 8 మాసాలపాటు మాత్రమే పొట్టేలు పిల్లల పెంపకం ఉంటుంది. కొనుగోలు చేసే పొట్టేళ్ళు 10-15 కిలోల శరీరబరువున్నవి, 10వ మాసం వచ్చేసరికి 30-35 కిలోల బరువు తూగుతాయి. ఈ పద్ధతిలో ప్రతి జీవంపై ప్రస్తుత మార్కెట్ రేట్లనుబట్టి కనీసం వేయి రూపాయల ఆదాయం, 6 మాసాల్లో పొందే వీలుంటుంది. ‘‘బ్రాయిలర్’’ కోళ్ల పెంపకంలోలాగా ఉండే, పొట్టేలు పిల్లల పెంపకంలో బ్యాచిలను సంవత్సరంలో కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ పెంచే వీలుంటుంది. ప్రతి 6 మాసాల కొకసారి మాత్రమే పిల్లల్ని మార్కెటింగ్ ఒకేసారి చేసుకొనే వీలుంటుంది. అందువల్ల పండుగలు, జాతరలను దృష్టిలో ఉంచుకుని, మార్కెట్ కనుగుణంగా పిల్లల్ని పెంచడం ప్రారంభించాలి.
సి. పొట్టేళ్ళు / పోతుల పెంపక ఫారాలు :
మంద అభివృద్ధికి దోహదపడేందుకు పొట్టేళ్ళు పోతులను శ్రేష్ఠమైన జాతి లక్షణాలున్న వాటిని ఎంపిక చేసుకుని, పోషిస్తుండాలి. ఇవి బ్రీడింగ్ ఫారాల్లో క్రాసింగ్‍కు వినియోగపడతాయి. పునరుత్పత్తికి ఉపయోగపడే పొట్టేళ్ళు/ పోతుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం, పొట్టేలు పిల్లల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం కంటే అధికంగా లభిస్తుంది.
బ్రీడింగ్ ఫారాలు, పొట్టేలు పిల్లల ఫారాలు ప్రారంభించే వారు, వారు పెంచే జీవాల సంఖ్య ప్రకారం పాకలు /షెడ్లు నిర్మించుకోవాలి. తిరిగేందుకు ఆరుబయట కొంత స్థలం వదలాలి. ఫారాల్లోపల, బయట మేత, నీటి తొట్లను ఏర్పాటు చేసి, అన్ని వేళలా మేత, నీరు అందుబాటులో ఉంచాలి. పశుగ్రాస్తాన్ని వేరు సాగు చేసి, పశుగ్రాసం, ఎండుమేతను చాఫ్‍కట్టర్‍తో ముక్కలు చేసి అందిస్తుండాలి. క్రమపద్ధతిలో టీకాలు వేయించడం, డివర్మింగ్ చేయించడం చేస్తుండాలి. కలుషిత ప్రాంతాలు, ఇతర అనారోగ్య మందలతో సంబంధం ఈ జీవాలకు లేనందున, ఫారాల్లో (పాక్షిక సాంద్రపద్ధతిలో) జీవాల్ని పెంచడం వల్ల, మరణాలు తక్కువగా ఉంటాయి. శరీర బరువు వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుంది. మందలో పిల్లల సంఖ్య అభివృద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది. తద్వారా గొర్రెలు, మేకల పెంపకం చేపట్టే ఔత్సాహికులు, పెంపకందార్లు మంచి ఆదాయం పొందగలుగుతారు.
ఆనబోయిన స్వామి,
ఎ : 9963 87 2222